Sophie Devine : 4, 4, 6, 6, 6, 6 అమ్మబాబోయ్ ఏం కొట్టుడు.. ఒక్క ఓవర్‌లో 32 రన్స్

Published : Jan 11, 2026, 11:08 PM IST

Sophie Devine : డబ్ల్యూపీఎల్ 2026లో సోఫీ డివైన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఢిల్లీ బౌలర్ స్నేహ రాణా వేసిన ఒకే ఓవర్‌లో వరుసగా 4, 4, 6, 6, 6, 6 బాది 32 పరుగులు పిండుకుంది. తన అద్భుతమైన ఆటతో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది.

PREV
16
డబ్ల్యూపీఎల్‌లో నయా రికార్డ్: స్నేహ రాణాను ఉతికారేసిన సోఫీ డివైన్

నవీ ముంబైలో ఆదివారం (జనవరి 11) జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మ్యాచ్‌లో రికార్డుల మోత మోగింది. డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ జెయింట్స్ (GG) మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన విందును అందించింది.

ముఖ్యంగా గుజరాత్ జెయింట్స్ స్టార్ బ్యాటర్ సోఫీ డివైన్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది. ఢిల్లీ బౌలర్ స్నేహ రాణా వేసిన ఒకే ఓవర్‌లో సోఫీ డివైన్ ఏకంగా 32 పరుగులు రాబట్టి డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్‌గా రికార్డు సృష్టించింది. ఇదే మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్ నందిని శర్మ హ్యాట్రిక్ తీయడం మరో విశేషం.

26
ఒకే ఓవర్‌లో 32 పరుగులు.. సోఫీ బౌండరీల వర్షం

ఈ పరుగుల సునామీ గుజరాత్ ఇన్నింగ్స్ పవర్ ప్లే చివరి ఓవర్‌లో చోటుచేసుకుంది. ఢిల్లీ బౌలర్ స్నేహ రాణా వేసిన ఆరో ఓవర్‌లో సోఫీ డివైన్ విరుచుకుపడింది. ఈ ఓవర్ లో వరుసగా 4, 4, 6, 6, 6, 6 పరుగులు వచ్చాయి. మొదటి రెండు బంతుల్లో రాణా లెంగ్త్ మిస్ అవ్వగా, డివైన్ వాటిని లెగ్ సైడ్, కట్ షాట్ల ద్వారా బౌండరీలు బాదింది.

ఆ తర్వాత డివైన్ గేర్ మార్చింది. మూడో బంతికి క్రీజ్ నుంచి బయటకు వచ్చి లాంగ్-ఆన్ మీదుగా భారీ సిక్స్ కొట్టింది. ఆ తర్వాతి బంతికి మరో అద్భుతమైన స్టాండ్-అండ్-డెలివర్ సిక్స్ బాదింది. ఇక ఐదో బంతికి మోకాలిపై కూర్చొని కౌ కార్నర్ మీదుగా మరో సిక్సర్ కొట్టింది. ఒత్తిడిలో ఉన్న రాణా చివరి బంతిని ఫుల్ టాస్‌గా వేయగా, డివైన్ దానిని కూడా సిక్సర్‌గా మలిచింది. దీంతో ఆ ఓవర్‌లో మొత్తం 32 పరుగులు వచ్చాయి. అంతకుముందు దీప్తి శర్మ పేరిట ఉన్న 28 పరుగుల చెత్త రికార్డును స్నేహ రాణా తిరగరాసింది.

36
పవర్ ప్లేలో గుజరాత్ జెయింట్స్ రికార్డు స్కోరు

సోఫీ డివైన్ విధ్వంసంతో గుజరాత్ జెయింట్స్ పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో నమోదైన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. మరో ఎండ్‌లో బెత్ మూనీ ఉన్నప్పటికీ, డివైన్ దూకుడుతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

కేవలం 25 బంతుల్లోనే సోఫీ డివైన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని ఆమె చెలరేగిపోయింది. తొమ్మిదో ఓవర్‌లో శ్రీ చరణి బౌలింగ్‌లో కూడా మూడు సిక్సర్లు బాదింది. గుజరాత్ జట్టు తమ ఇన్నింగ్స్‌లో మొత్తం 13 సిక్సర్లు బాదడం గమనార్హం.

46
మరోసారి ఊరించిన సెంచరీ.. 90లలోనే అవుట్

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సోఫీ డివైన్ డబ్ల్యూపీఎల్ చరిత్రలో మొదటి సెంచరీ నమోదు చేస్తుందని అంతా భావించారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె 90లలోనే అవుట్ అయ్యింది. 42 బంతుల్లో 95 పరుగులు చేసిన డివైన్, నందిని శర్మ వేసిన స్లో బంతిని అంచనా వేయడంలో విఫలమైంది. షార్ట్ ఫైన్ లెగ్ వద్ద శ్రీ చరణికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.

గతంలో 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ గుజరాత్ జెయింట్స్ పైనే 99 పరుగుల వద్ద అవుట్ అయిన డివైన్, ఈసారి 95 పరుగుల వద్ద అవుట్ కావడంతో నెర్వస్ 90s ఆమెను మరోసారి వెంటాడినట్లయింది. ఆమె ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి.

56
నందిని శర్మ సంచలనం.. హ్యాట్రిక్‌తో 5 వికెట్లు

బ్యాటింగ్ విధ్వంసం ఒకవైపు జరిగితే, బౌలింగ్‌లో ఢిల్లీ బౌలర్ నందిని శర్మ మ్యాజిక్ చేసింది. 20వ ఓవర్‌లో ఆమె హ్యాట్రిక్ వికెట్లు తీసి గుజరాత్ ఇన్నింగ్స్‌కు తెరదించింది. ఓవర్ రెండో బంతికి కాశవీ గౌతమ్‌ను అవుట్ చేసిన నందిని, ఆ తర్వాత 4, 5, 6వ బంతుల్లో వరుసగా వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేసింది.

నందిని శర్మ తన 4 ఓవర్ల కోటాలో 33 పరుగులు ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది. ఇందులో కీలకమైన సోఫీ డివైన్ వికెట్ కూడా ఉంది. శ్రీ చరణి, షినెల్ హెన్రీ చెరో రెండు వికెట్లు తీశారు. షెఫాలీ వర్మకు ఒక వికెట్ దక్కింది. గుజరాత్ జెయింట్స్ జట్టు చివరికి 209 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ ముందు 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

66
మ్యాచ్ వివరాలు, టాస్, తుది జట్లు

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ బ్యాటర్లు ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 209 పరుగులు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ కూడా దుమ్మురేపే ప్రదర్శనలో ఆకట్టుకుంది. చివరి ఓరకు సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. 4 పరుగుల తేడాతో గుజరాత్ గెలిచింది.

తుది జట్లు:

గుజరాత్ జెయింట్స్: ఆష్లే గార్డ్నర్ (కెప్టెన్), బెత్ మూనీ, సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్, అనుష్క శర్మ, భారతి ఫూల్‌మాలి, కనికా అహూజా, కాశవీ గౌతమ్, తనుజా కన్వర్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్.

ఢిల్లీ క్యాపిటల్స్: జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, లారా వోల్వార్డ్ట్, లిజెల్ లీ, మారిజాన్ కాప్, నికీ ప్రసాద్, షినెల్ హెన్రీ, స్నేహ రాణా, మిన్ను మణి, ఎన్ శ్రీ చరణి, నందిని శర్మ.

Read more Photos on
click me!

Recommended Stories