Sanju Samson : గ్రౌండ్‌లో సంజు, గ్యాలరీలో చారు.. ఇది కదా అసలైన కెమిస్ట్రీ..! స్టార్ క్రికెటర్ క్యూట్ లవ్ స్టోరీ

Published : Mar 06, 2026, 09:44 AM ISTUpdated : Mar 06, 2026, 10:01 AM IST

భారత క్రికెటర్ సంజు శాంసన్, అతని భార్య చారులత రమేష్‌లది ఒక అందమైన ప్రేమకథ. సంజు క్రికెట్ కెరీర్ మాదిరిగానే అతడి ప్రేమ ప్రయాణం అభిమానులను ఆకట్టుకుంటుంది.

PREV
14
సంజు-చారు లవ్ స్టోరీ..

Sanju Samson : టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ పేరు ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ సూపర్-8 లో వెస్టిండిస్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో అతడు ఎంత అద్భుతంగా (97 పరుగులు) ఆడాడో అందరూ చూశారు. ఇక సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై కూడా (89 పరుగులు) మరోసారి చెలరేగి టీమిండియాను ఫైనల్ కు చేర్చాడు. ఇలా వరుస మ్యాచుల్లో అదరగొట్టిన సంజు శాంసన్ ను టీమిండియా అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి ప్రొఫెషనల్ లైఫ్ గురించే కాదు వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి అతడి క్యూట్ లవ్ స్టోరీ గురించి ఎంతమందికి తెలుసు..?

24
సంజు శాంసన్ ప్రేమకథ...

టీమిండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్, అతని భార్య చారులత రమేష్‌లది అందమైన ప్రేమకథ. కేరళలోని మారుమూల గ్రామంనుండి భారత క్రికెటర్ గా ఎదిగాడు సంజు… ఈ ప్రయాణంలో చారులత పాత్ర కూడా మరువలేనిది. ఎప్పుడూ అతనికి వెన్నంటే ఉండి నడిపిస్తోంది.

సంజు శాంసన్, చారులత ఇద్దరూ తిరువనంతపురంలోని మార్ ఇవానియోస్ కాలేజీలో క్లాస్‌మేట్స్. సంజు క్రికెట్‌పై దృష్టి పెట్టిన సమయంలోనే, చారులతపై మనసు పడ్డాడు. ఓవైపు ప్రేమ, మరోవైపు క్రికెట్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఇద్దరు క్లాస్ మేట్స్ ను ఫేస్‌బుక్‌ కలిపింది… సోషల్ మీడియా పుణ్యాన స్నేహం కాస్త ప్రేమగా మారింది. సంజు, చాారు ఐదేళ్లపాటు గాఢంగా ప్రేమించుకున్నారు. 

సంజు శాంసన్ క్రిస్టియన్ కుటుంబానికి చెందినవాడు కాగా, చారులత హిందూ (నాయర్) కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇద్దరూ జీవితంలో స్థిరపడటంతో వారి అభిప్రాయాలను గౌరవించి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో 2018 డిసెంబర్ 22న తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ప్రత్యేక వివాహ చట్టం కింద వీరి పెళ్లి నమోదైంది. ఈ పెళ్లి ఎలాంటి ఆడంబరాలు లేకుండా జరిగింది... క్రికెటర్లలో సంజు మాజీ కోచ్, మెంటార్ రాహుల్ ద్రవిడ్ ఒక్కరే హాజరయ్యారు.

34
సంజుకు అండగా నిలిచిన చారులత..

సంజు భార్య చారులత రమేష్ హ్యూమన్ రిసోర్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్, అలాగే ఒక వ్యాపారవేత్త కూడా. భర్త పూర్తిగా క్రికెట్ పై ఫోకస్ చేసేందుకే ఆమె వ్యాపారంలో అడుగుపెట్టింది… ఆర్థిక కష్టాలు లేకుండా కుటుంబపోషణ భారాన్ని చూసుకుంటోంది. సంజు కెరీర్ గురించి ఆందోళన లేకుండా ముందుకు సాగడానికి చారులత పాత్ర చాలా కీలకమైంది అని చెప్పవచ్చు.

సంజు టీమిండియాలో చోటు కోసం కష్టపడుతున్నప్పుడు… ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు చారు అతనికి ఎంతో మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. ఇటీవల సంజు ఆడుతున్నప్పుడు గ్యాలరీ నుంచి చారు ప్రోత్సహిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సంజు సెంచరీ చేసినప్పుడు, ఒత్తిడిలో ఆడుతున్నప్పుడు ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను కదిలిస్తున్నాయి. 

ప్రస్తుతం భారత టీ20 జట్టులో సంజు కీలక ఆటగాడిగా మారాడు… మరీముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ 2026 లో అంచనాలు లేకుండా బరిలోకి దిగి అదరగొడుతున్నాడు. అతని ఎదుగుదలకు చారు సపోర్ట్ ప్రధాన కారణమని అంటారు. ఈ జంట ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

44
సంజు వ్యక్తిగత జీవితం...

సంజు శాంసన్ 1994, నవంబర్ 11న కేరళలో జన్మించారు. తిరువనంతపురం జిల్లా విజింజం సమీపంలోని పుల్లువిలా అతడి స్వగ్రామం. మళయాళీ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన శాంసన్ విశ్వనాథ్, లిజీ దంపతుల రెండో సంతానం సంజు. తండ్రి డిల్లీలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేయడంతో సంజు క్రికెట్ కెరీర్ అక్కడే ప్రారంభమయ్యింది... తర్వాత అతడు కేరళకు మారాడు. కొడుకు కెరీర్ కోసం తండ్రి శాంసన్ విశ్వనాథ్ తన పోలీస్ ఉద్యోగాన్ని త్యాగం చేశాడు. 

Read more Photos on
click me!

Recommended Stories