PBKS vs GT : ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన 4వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్‌తో చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో పంజాబ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే కూపర్ కానోలీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్ తమ హోమ్ గ్రౌండ్‌లో ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించడం విశేషం.
25
కానోలీ అరంగేట్రంలోనే విధ్వంసం
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు కూపర్ కానోలీ దుమ్మురేపాడు. తన ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే ఈ 22 ఏళ్ల ఆస్ట్రేలియన్ ప్లేయర్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కేవలం 43 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో వచ్చిన సిక్సర్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. ఐపీఎల్ అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ సాధించిన 25వ బ్యాటర్‌గా కానోలీ రికార్డు సృష్టించాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతికే ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు.
35
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కీలక భాగస్వామ్యం
లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (7) త్వరగానే అవుట్ అయ్యాడు. అయితే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కూపర్ కానోలీ కలిసి రెండో వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రభ్‌సిమ్రాన్ 24 బంతుల్లో 37 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో రబడా వేసిన ఒకే ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది పంజాబ్ స్కోరును పరుగులు పెట్టించారు.
ఒక దశలో పంజాబ్ విజయం నల్లేరుపై నడకలా కనిపించింది. స్కోరు 110/2 వద్ద ఉన్నప్పుడు గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ విజృంభించాడు. అతను వేసిన 13వ ఓవర్ మొదటి బంతికే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (18)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత వరుసగా నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ తక్కువ పరుగులకే వెనుదిరగడంతో పంజాబ్ 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ తన కోటా 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి గుజరాత్‌ను మ్యాచ్‌లోకి తెచ్చాడు.
55
ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం
చివరి ఓవర్లలో కూపర్ కానోలీ, జేవియర్ బార్ట్లెట్ సంయమనంతో ఆడారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్‌లో బార్ట్లెట్ ఒక సిక్సర్ బాదగా, కానోలీ ఒక ఫోర్ కొట్టాడు. ఆ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు రావడంతో పంజాబ్ విజయానికి చేరువైంది. చివరి ఓవర్‌లో పంజాబ్ గెలుపునకు కేవలం 2 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. వాషింగ్టన్ సుందర్ వేసిన తొలి బంతికే ఫోర్ బాదిన కానోలీ పంజాబ్ కింగ్స్‌కు 3 వికెట్ల తేడాతో విజయాన్ని ఖాయం చేశాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తమ ఖాతాను తెరిచింది.