గోల్డెన్ గుడ్డు రికార్డును లేపేసిన మెస్సీ... వరల్డ్ కప్ గెలిచిన వీరుడికి ఇన్‌స్టా దాసోహం...

First Published | Dec 21, 2022, 11:19 AM IST

లైక్స్, షేర్స్, కామెంట్స్... సోషల్ మీడియా సమాజంలో వీటికి ఉండే విలువే వేరు. అడ్డుకునేవాడిని ఓవర్‌నైట్‌‌లో స్టార్‌ని చేయాలన్నా, అట్టర్‌ఫ్లాప్ సినిమాలోని ‘జారు మిఠాయ’ సాంగ్‌ని ట్రెండ్ సెట్టర్‌గా మార్చాలన్నా.. ఆఖరికి ఓ గుడ్డు ఫోటోకి వరల్డ్ రికార్డు కట్టబెట్టాలన్నా అది కేవలం సోషల్ మీడియా వల్లే సాధ్యమైంది. తాజాగా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ... ఆ గుడ్డు రికార్డును లేపేశాడు...

బంగారు వర్ణంలో ఓ గుడ్డును ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తే, దానికి 57 మిలియన్ల లైకులు వచ్చాయి. ఇన్‌స్టా ప్రపంచంలో అత్యధిక లైకులు పొందిన పోస్టుగా ‘వరల్డ్ రికార్డు’ క్రియేట్ చేసింది ఈ గోల్డెన్ ఎగ్. మూడేళ్లుగా ఈ ఎగ్ రికార్డు చెక్కుచెదరలేదు. అయితే మెస్సీ ఆ ‘గుడ్డు’ రికార్డును పగలకొట్టేశాడు...

Lionel Messi

ఫిఫా వరల్డ్ కప్ 2022 గెలిచిన తర్వాత ట్రోఫీతో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు లియోనెల్ మెస్సీ. ఈ పోస్టుకి మూడు రోజుల్లో 68 మిలియన్ల లైకులు వచ్చేశాయి. అంటే గోల్డెన్ ఎగ్ రికార్డును తొక్కి పట్టి, బ్రేక్ చేసేశాడు మెస్సీ...


మెస్సీ రికార్డు కొట్టాడంటే రొనాల్డో ఫ్యాన్స్ తట్టుకోలేరు. దీంతో చాలామంది రొనాల్డో అభిమానులు, ఆ గోల్డెన్ ఎగ్ పోస్టుకి లైక్ చేసి, మళ్లీ మెస్సీ పోస్టును వెనక్కి నెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయితే మెస్సీకి ఫుట్‌బాల్ ప్రపంచం నుంచి దక్కుతున్న ఆదరణతో ఆ ఒంటరి గుడ్డు, మెస్సీతో పోటీపడలేకపోతోంది...

ఫిఫా వరల్డ్ కప్ 2022 ఆరంభానికి ముందు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో కలిసి చెస్ ఆడుతున్నట్టుగా పోస్ట్ చేసిన ఫోటోకి 43 మిలియన్ల లైకులు వచ్చాయి.  అత్యధిక లైకులు దక్కించుకున్న స్పోర్ట్స్ పర్సన్ పోస్ట్‌గా రికార్డు క్రియేట్ చేసింది ఈ మెస్సీ- రొనాల్డో ఫోటో. ఈ రికార్డును కూడా మెస్సీ లేపేశాడు...

lionel messi

1978, 1986 ఫిఫా వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచిన అర్జెంటీనా, 36 ఏళ్ల తర్వాత మూడో ప్రపంచ కప్ గెలిచింది. ‘నా ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటే ఇప్పటికే నమ్మలేకపోతున్నా. నాకు అండగా నిలిచిన నా కుటుంబానికి, నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ, నన్ను నమ్మిన నావారికి థ్యాంక్యూ సో మచ్...’ అంటూ ఈ పోస్టులో రాసుకొచ్చాడు లియోనెల్ మెస్సీ.. 

ఫ్రాన్స్‌తో హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 4-2 తేడాతో పెనాల్టీ షూటౌట్‌లో గెలిచింది అర్జెంటీనా. ఫైనల్‌లో రెండు గోల్స్ చేసిన లియోనెల్ మెస్సీ.. ‘గోల్డెన్ బాల్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు...

Latest Videos

click me!