ఆ వీడియోలు చాలా చూసేవాడిని.. అందుకే నా బ్యాటింగ్ అలా ఉంటుందేమో: ఇషాన్ కిషన్

First Published Dec 20, 2022, 7:10 PM IST

Ishan Kishan: బంగ్లాదేశ్ తో  ఇటీవలే ముగిసిన  వన్డే సిరీస్ లో భాగంగా  మూడో వన్డేలో డబుల్ సెంచరీ బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు  టీమిండియా యువ సంచలనం ఇషాన్ కిషన్.  ఈ కుర్రాడి బ్యాటింగ్ లో దూకుడు వీరూను పోలి ఉంటుంది.. 

టీమిండియా యువ సంచలనం ఇషాన్ కిషన్  బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేసిన తర్వాత  ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అంతకుముందు ఐపీఎల్ తో  పాటు జాతీయ జట్టు తరఫున పలు కీలక ఇన్నింగ్స్ లు ఆడినా  రాని పేరు ప్రఖ్యాతులు ఇషాన్ కు డబుల్ సెంచరీ అందించింది.  

ఓపెనర్ గా బరిలోకి దిగే ఇషాన్ బ్యాటింగ్ శైలి, దూకుడు  టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను పోలి ఉంటుంది.  బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో  131 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసిన తర్వాత  కూడా చాలా మంది క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ఇదే విధంగా మాట్లాడుకున్నారు.  

తాజాగా ఇదే విషయమై ఇషాన్ స్పందించాడు.  అతడు మాట్లాడుతూ.. ‘నా చిన్నతనం నుంచి నేను వీరేంద్ర సెహ్వాగ్  ఆడిన చాలా మ్యాచ్ ల హైలెట్స్ చూసేవాడిని. బహుశా అందుకే నా బ్యాటింగ్ కూడా  వీరూలా ఉంటుందేమో.  బౌలర్ ఎవరన్నదీ సంబంధం లేకుండా  బాదడమే మంత్రంగా వీరూ ఆడే ఆట అందరినీ ఆకర్షిస్తుంది. 

తాను క్రికెట్ ఆడిన సమయంలో బ్రెట్ లీ, షోయభ్ అక్తర్ వంటి దిగ్గజాలను వీరూ భయం లేకుండా ఎదుర్కునేవాడు.   స్టేడియ నలుమూలలా  షాట్లు ఆడేవాడు. అతడిని, అతడి బ్యాటింగ్ ను పదే పదే అలా చూడటం వల్లే  నేను ఇప్పుడు ఇలా ఆడుతున్నానని అనిపిస్తుంది. అంతేగాక ఆడమ్ గిల్ క్రిస్ట్ బ్యాటింగ్ అంటే కూడా నాకు ఇష్టం..’ అని చెప్పాడు. 

ఇక గిల్ క్రిస్ట్, ధోని లలో  ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టమని ఇషాన్ ను అడగగా  అతడు తడుముకోకుండా ధోని పేరునే చెప్పడం గమనార్హం. ‘అందులో సందేహమే లేదు. నా ఫేవరేట్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని.  నాకు గిల్ క్రిస్ట్ బ్యాటింగ్, వికెట్ కీపింగ్ స్టైల్ నచ్చుతుంది. 

కానీ అంతకంటే ధోని భయ్యా ఆట అంతకంటే ఎక్కువ ఇష్టం. ఆన్ ది ఫీల్డ్, ఆఫ్ ది ఫీల్డ్ లో  ధోని ఇతరులతో వ్యవహరించే విధానం చూడముచ్చటగా ఉంటుంది. లైఫ్ లో అవి కూడా చాలా ముఖ్యమే.  అదీగాక ధోని భయ్యా నాకు  కెరీర్ పరంగానే గాక వ్యక్తిగా కూడా చాలా హెల్ప్ చేశాడు..’ అని  తెలిపాడు. 
 

ఇటీవలే తాను డబుల్ సెంచరీ చేయడం ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నానని  చెప్పుకొచ్చాడు ఇషాన్.. ‘కొన్నిసార్లు  ఆ విషయాన్ని (డబుల్ సెంచరీ చేయడం) నేనే నమ్మను.  నన్ను నేనే గిల్లుకుంటా. నేను మరిన్ని డబుల్ సెంచరీలు చేయాలనుకుంటున్నా. బంగ్లాదేశ్ పై డబుల్ సెంచరీ చేయగానే గర్వంగా అనిపించింది. వాస్తవానికి అక్కడ ట్రిపుల్ హండ్రెడ్ కూడా చేయాలనుకున్నా. కానీ కుదర్లేదు..’ అని వివరించాడు. 

click me!