Abhishek Sharma: యువ క్రికెటర్ అభిషేక్ శర్మ దూకుడు బ్యాటింగ్ తీరుపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. కేవలం దూకుడు మాత్రమే కాదని షాట్ల ఎంపికలో జాగ్రత్త అవసరమని అభిషేక్‌కు సూచించారు.
భారత క్రికెట్‌లో ఓపెనర్ గా అదరగొడుతున్న యువ ఆటగాడు అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీజ్ లోకి వచ్చాడంటే తనదైన షాట్లతో బౌలర్లపై విరుచుకుపడే అభిషేక్ దూకుడును ఆసిస్ బౌలర్లు వైవిధ్యభరితమైన బంతులతో కొంత కట్టడి చేయగలిగారు. అయినప్పటికీ ఆసిస్ తో జరిగిన ఐదు టీ ట్వంటీ సిరీస్ లో అభిషేక్ శర్మనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో, దూకుడు అన్నిసార్లు పనికిరాదంటూ ఇర్ఫాన్ పఠాన్ అభిషేక్ కు హెచ్చరిక జారీ చేశారు.
25
భయం కనపడని బ్యాటింగ్
అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో భయం కనపడదని, దూకుడు ప్రదర్శిస్తూ భారీ షాట్లు ఆడతాడని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్నవి ద్వైపాక్షిక సిరీస్ లు మాత్రమేనని, ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లలో జట్లు చాలా సన్నాహాలతో వస్తాయని గుర్తు చేశారు. ప్రపంచకప్ వంటి వేదికలపై అభిషేక్ ప్రతి బంతిని క్రీజ్ వదిలి బయటకు వచ్చి ఆడాలనుకుంటే, ప్రత్యర్థి జట్టు బౌలర్లు దీనిపైనే దృష్టి పెడతారని పఠాన్ స్పష్టం చేశారు.
35
షాట్స్ ఎంపికలో మరింత జాగ్రత్త
అందువల్ల, అభిషేక్ షాట్ల ఎంపికలో మరింత జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. టీమ్ మేనేజ్మెంట్ కచ్చితంగా దీనిపై దృష్టి పెడుతుందని తాను అనుకుంటున్నానని తెలిపారు. అలాగే, అతని వ్యక్తిగత కోచ్ యువరాజ్ సింగ్ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలని ఇర్ఫాన్ పఠాన్ కోరారు. "యువితో నేను మాట్లాడతా. ఆ దూకుడు అన్నిసార్లు పనిచేయదు. అందరి బౌలింగ్ లో ఇన్నింగ్స్ తొలి బంతికే ముందుకు వచ్చి భారీ షాట్ ఆడటం కష్టం" అని ఇర్ఫాన్ పఠాన్ హెచ్చరించారు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 వర్షం కారణంగా రద్దైన మ్యాచ్ లోని ఒక సంఘటనను ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా 4.5 ఓవర్లు ఆడింది. ఈ ఇన్నింగ్స్ లో 13 బంతుల్లో 23 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, రెండుసార్లు ఆసిస్ ఫీల్డర్ల సులువైన క్యాచ్ లు వదిలేయడంతో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
55
హై రిస్క్ క్రికెట్ వద్దు
ఈ విషయంపై కూడా ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ, ఐదో టీ20లో రెండుసార్లు అభిషేక్ కు లైఫ్ వచ్చిందని, అందులో ఏ ఒక్క క్యాచ్ పట్టినా అతడి ఇన్నింగ్స్ ముగిసేదని పేర్కొన్నారు. అతడు హై రిస్క్ క్రికెట్ ఆడుతూనే ఉంటాడని, అది ఎప్పటికైనా ప్రమాదమేనని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు.