డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన హిమాదాస్... చిన్ననాటి కల నెరవేరిందంటూ...

First Published | Feb 27, 2021, 8:59 AM IST

భారత యంగ్ స్ప్రింటర్ హిమాదాస్‌కి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సూపరిండెంట్‌ పదవిని ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. అథ్లెట్‌గా భారత జట్టుకి మూడు స్వర్ణపతకాలు, ఓ రజత పతకం సాధించిన హిమాదాస్, అస్సాంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించింది. 2018లో ‘అర్జున’ అవార్డు అందుకున్న హిమాదాస్, 21 ఏళ్ల వయసులోనే పోలీసు ఉన్నతాధికారి పదవిని అధిరోహించడం విశేషం...

అస్సాంలోని సరూసజయ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో హిమాదాస్‌ను డిప్యూటీ సూపరిండెంట్‌గా నియమిస్తూ, అపాయింట్‌మెంట్ లెటర్‌ను అందించింది అస్సాం పోలీసు శాఖ...
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిమాదాస్ కళ్లల్లో సంతోషం కనిపించింది. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి శర్భనంద సోనోవాల్, హిమాదాస్‌కి నియామక పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం డీజీపీ పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు...

అథ్లెట్ హిమాదాస్‌తో పాటు అస్సాంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్లుగా ఎన్నికైన 597 మంది అధికారులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించారు అస్సాం ముఖ్యమంత్రి సోనోవాల్...
వెనకబడిన రాష్ట్రంగా ఉన్న అస్సాం నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి భారత జట్టుకి పతకాలు అందించిన హిమాదాస్ లాంటి యువ క్రీడాకారులను ప్రోత్సాహించేందుకే ఆమెకు పోలీసు శాఖలో ఉన్నత పదవిని ఇచ్చినట్టు తెలిపారు ముఖ్యమంత్రి...
‘నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది కల. చిన్నప్పుడు స్కూల్‌లో కూడా పెద్దయ్యాక ఏం అవుతారు అని టీచర్ అడిగితే పోలీస్ అని చెప్పేదాన్ని. మా అమ్మకి కూడా నన్ను పోలీసుగా చూడాలనేది కోరిక. నా ఆట కారణంగా నా జీవితంలో అనుకున్నవన్నీ సాధించాను’ అని చెప్పుకొచ్చింది హిమాదాస్.

Latest Videos

click me!