Rohit Sharma: బీసీసీఐ సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవాలంటే తప్పనిసరిగా దేశవాళీ టోర్నమెంట్లు ఆడాలని స్పష్టం చేసింది. 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జట్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాలంటే, ఈ ఇద్దరు దిగ్గజాలు తప్పనిసరిగా దేశంలో జరిగే క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొనాలని బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం టెస్టులు, టీ20ల నుంచి విరామం తీసుకుని కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్న కోహ్లీ, రోహిత్‌ల ఆటతీరు, ఫిట్‌నెస్ ఏ మాత్రం తగ్గకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ కఠిన నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టు ఎంపిక ప్రక్రియ జరుగుతున్న వేళ, ఈ కొత్త నిబంధన చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.
25
సానుకూలంగా రోహిత్, కోహ్లీ పరిస్థితి ఏంటి.?
బీసీసీఐ ఆదేశాలపై రోహిత్ శర్మ సానుకూలంగా స్పందించారు. డిసెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేశాడు. అంతేకాకుండా, నవంబర్ 26న మొదలయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో కూడా ఆడేందుకు రోహిత్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు.
35
డొమెస్టిక్ క్రికెట్ తప్పనిసరి..
బీసీసీఐలోని ఓ అధికారి చెప్పిన వివరాల ప్రకారం, రెండు ఫార్మాట్ల నుంచి దూరంగా ఉండటం వల్ల ఆటగాళ్లు తమ చురుకుదనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే, ఆటలో నిత్యం పదును ఉండేందుకు దేశవాళీ క్రికెట్ ఆడడం చాలా అవసరమని బోర్డు భావిస్తోంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఇటీవల ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఆటగాళ్లు జాతీయ టోర్నమెంట్లకు దూరంగా ఉన్నప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడడం వల్ల వారి నైపుణ్యాలు తగ్గకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
గతంలో కూడా బీసీసీఐ ఇలాంటి ఆదేశాలు జారీ చేసినప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు రంజీ మ్యాచ్‌లలో పాల్గొన్నారు. ఇప్పుడు, 2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ పాత పద్ధతినే మళ్లీ అమలు చేస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. కోహ్లీ కూడా ఒక నామమాత్రపు మ్యాచ్‌లో 74 పరుగులు చేశాడు.
55
వెనక్కి తగ్గని క్రికెట్ బోర్డు
అయినప్పటికీ, క్రికెట్ బోర్డు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, సీనియర్ ఆటగాళ్లు కూడా దేశవాళీ క్రికెట్‌ను గౌరవించాలని, అందులో తప్పకుండా పాల్గొనాలని పట్టుబడుతోంది. ఈ కొత్త ఆదేశాలతో, ఈ ఇద్దరు దిగ్గజాలు 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఎంతకాలం కొనసాగుతారనేది వారి రాబోయే దేశవాళీ ప్రదర్శనలపైనే ఆధారపడి ఉంటుంది. యువ ప్రతిభకు అవకాశం కల్పించడంతో పాటు, సీనియర్ ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఫామ్‌ను నిరంతరం పర్యవేక్షించాలనే బీసీసీఐ ఆలోచన.