
అభిషేక్ శర్మ... టీ20 వరల్డ్ కప్ 2026 లోకి భారీ అంచనాలతో అడుగుపెట్టిన ఆటగాడు. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ టీ20 బ్యాటర్ గా కొనసాగుతున్న అభిషేక్ కీలకమైన వరల్డ్ కప్ లో ప్రత్యర్థి బౌలర్లను షేక్ చేస్తాడని అభిమానులు భావించారు... కానీ ఇందుకు విరుద్దంగా అతడే షేక్ అవుతున్నాడు. ఇప్పటివరకు వరల్డ్ కప్ 2026 లో అసలు పరుగుల ఖాతానే తెరవకుండా వరుసగా మూడుసార్లు డకౌట్ అయ్యాడు. యూఎస్ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్ మూడు జట్లపై 0,0,0 సాధించాడు అభిషేక్.
టీ20 వరల్డ్ కప్ లో వరుసగా మూడు మ్యాచుల్లో 0 పరుగులకే డకౌట్ అయిన చెత్త రికార్డు అభిషేక్ ఖాతాలో చేరింది. ఇప్పటివరకు ఆశిష్ నెహ్రా, ఆండ్రూ ప్లెచర్, రోజర్ ముకాస ఇలా వరుస డకౌట్ల చెత్త రికార్డు కలిగివున్నాయి... వీరి సరసన అభిషేక్ చేరాడు. కేవలం నెలరోజుల్లో ఐదు టీ20 లలో 0 పరుగులకే ఔటైన అభిషేక్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు.
విధ్వంసకర బ్యాటింగ్ తో పరుగుల వరద పారించినప్పుడు పొగిడినవారే ఇప్పుడు అభిషేక్ ను తిడుతున్నారు. సోషల్ మీడియాలో అతడిపై నెగెటివ్ పోస్టింగ్స్ పెరిగిపోయాయి. చివరకు అభిషేక్ కుటుంబసభ్యులనూ నెటిజన్స్ వదిలిపెట్టడంలేదు. ఎప్పుడూ అతడి వెంటే ఉండే సోదరి కోమల్ శర్మ అయితే తీవ్రమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ ఫేలవ ఫామ్‌కు సోదరి కోమల్ శర్మనే కారణమంటూ సోషల్ మీడియాలో కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో అభిషేక్ సోదరిపై ఇలాంటి ట్రోలింగ్ వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అభిషేక్ ఎక్కడ ఆడితే కోమల్ అక్కడే ఉంటోందని… దీనివల్ల అతని ఏకాగ్రత దెబ్బతిని ఆట పాడవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియాలోని ఇతర ఆటగాళ్లకు కూడా సోదరీమణులు ఉన్నారు… కానీ వాళ్లెవరూ ప్రతి మ్యాచ్‌కూ స్టేడియానికి వచ్చి ఇలా అటెన్షన్ కోసం ప్రయత్నించరని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
అభిషేక్ ఏం చిన్నపిల్లాడు కాదు… అతడిని ఇంకా చేతిపట్టి నడిపించేందుకు… ఇకనైనా సోదరి అతడికి వదిలిపెడితే బాగుంటుంది… అప్పుడయినా అతడు ఆటపై శ్రద్ద పెట్టి ఫామ్ అందుకుంటాడేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అభిషేక్ ఆటతీరు అతడి కుటుంబసభ్యులను కూడా విమర్శలపాలు చేస్తోంది.
కోమల్ శర్మ వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్. అంతర్జాతీయ మ్యాచ్ అయినా, ఐపీఎల్ మ్యాచ్ అయినా అభిషేక్ శర్మ ఆడేటప్పుడు ఆమె గ్యాలరీలో కనిపిస్తుంటారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం, ఆటగాళ్ల కుటుంబ సభ్యులు మ్యాచ్‌లు చూడటానికి ఎలాంటి నిషేధం లేదు. సాధారణంగా ఇండియా మ్యాచ్‌లు దేశంలోనే ఎక్కువగా జరుగుతాయి కాబట్టి కుటుంబ సభ్యులు స్టేడియానికి వస్తుంటారు.
ఆటగాళ్ల పేలవ ప్రదర్శనకు వారి సోదరీమణులు, భార్యలను నిందించడం ఇదే మొదటిసారి కాదు. విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేనప్పుడు, స్టేడియానికి వచ్చిన అతని భార్య అనుష్క శర్మను కూడా ఇలాగే విమర్శించారు. కోహ్లీ వరుసగా విఫలమవుతున్నప్పుడు, సోషల్ మీడియాలో అనుష్క శర్మ కూడా ఇలాగే ట్రోల్స్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఒకసారి విరాట్ కోహ్లీనే దీనిపై స్పందించాడు. స్టేడియంలో కుటుంబ సభ్యులు ఉండటం మానసిక ధైర్యాన్ని ఇస్తుందని చెప్పాడు. మనం సరిగ్గా ఆడనప్పుడు విమర్శించేవాళ్లు, బాగా ఆడినప్పుడు వాళ్లను ఎందుకు అభినందించరంటూ కోహ్లీ ఆసక్తికర ప్రశ్న సంధించాడు.
ఇదిలా ఉండగా టీ20 ప్రపంచకప్‌లో నేటి నుంచి సూపర్-8 దశ మొదలవుతోంది. రేపు (ఫిబ్రవరి 22, ఆదివారం) టీమిండియా vs సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది…. ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఫామ్‌లో లేకపోవడం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. టీ20ల్లో ప్రపంచ నం.1 బ్యాట్స్‌మెన్‌గా ఉన్న అభిషేక్ వరుస డకౌట్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఓపెనర్లలో అభిషేక్ ఒకడిగా నిలిచాడు. ఈ చెత్త రికార్డులో పాకిస్థాన్‌కు చెందిన సయీమ్ అయూబ్ అగ్రస్థానంలో ఉన్నాడు. సయీమ్ ఆరుసార్లు డకౌట్ అయ్యాడు. అభిషేక్ శర్మ రెండో స్థానంలో (5 సార్లు) ఉన్నాడు. థాయ్‌లాండ్‌కు చెందిన చలోమ్‌వాంగ్, నేపాల్‌కు చెందిన కుశాల్, ఇండోనేషియా ఆటగాడు ధర్మ కెస్సుమా, బంగ్లాదేశ్‌కు చెందిన పర్వేజ్ హొస్సేన్ కూడా ఈ లిస్టులో ఉన్నారు.