75 వసంతాల భారతం: హాకీని జాతీయ క్రీడగా మార్చిన చంద్రుడు.. ధ్యాన్ చంద్‌కి భారతరత్న ఎందుకు ఇవ్వాలి...

First Published Aug 6, 2022, 6:04 PM IST

భారతదేశానికి జాతీయ క్రీడ ఏది? ఈ ప్రశ్నకు అందరూ ఠక్కున చెప్పే సమాధానం హాకీ... అయితే వాస్తవానికి రాజ్యాంగంలో భారతదేశానికి జాతీయ క్రీడగా ఏ క్రీడని ప్రస్తావించలేదు. అయితే అందరూ ఫీల్డ్ హాకీని భారతదేశ జాతీయ క్రీడగా భావించడానికి ప్రధాన కారణం ధ్యాన్ చంద్...

ఏ క్రికెటర్‌కైనా వరల్డ్ కప్‌ గెలవడమే పెద్ద అఛీవ్‌మెంట్. అలాగే మిగిలిన క్రీడలకు ఒలింపిక్స్ మెడల్ గెలిస్తేనే అది పెద్ద అఛీవ్‌మెంట్. ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత హాకీ జట్టు చెక్కుచెదరని రికార్డులను క్రియేట్ చేసింది... 1928, 1932, 1936, 1948, 1952, 1964, 1980... ఇలా ఒకటీ, రెండు కాదు... ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఏకంగా 8 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ సక్సెస్ కారణంగానే భారతదేశ జాతీయ క్రీడగా ఫీల్డ్ హాకీకి గుర్తింపు దక్కింది...

భారత హాకీ టీమ్‌ని ఎనలేని సేవలు అందించి, హాకీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తీసుకొచ్చిన లెజెండరీ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్. హాకీలో ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్లలో ధ్యాన్‌చంద్ పేరు టాప్‌లో ఉంటుంది...  ధ్యాన్‌ చంద్ ఎప్పుడైనా గోల్ మిస్ చేస్తే, మ్యాచ్ నిర్వాహకులను పిలిచి... గోల్ పోస్ట్ కొలతలను సరి చూసుకోవాల్సిందిగా సూచించేవారు. ఆయన కొట్టే షాట్‌పై ధ్యాన్ చంద్‌కి అంత నమ్మకం ఉండేది... 

1926 నుంచి 1949 వరకూ భారత హాకీ జట్టు తరుపున ఆడిన ధ్యాన్ చంద్, 185 మ్యాచుల్లో 570 అంతర్జాతీయ గోల్స్ సాధించారు.  ఓవరాల్‌గా దేశవాళీ టోర్నీల్లో కలిపి 1000కి పైగా గోల్స్ సాధించాడు ధ్యాన్ చంద్... 

స్వాతంత్య్రం రావడానికి ముందు, వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు భారత హాకీకి స్వర్ణ యుగం నడిచింది. ఇప్పుడు గల్లీలో క్రికెట్ ఆడుతున్నట్టుగా, ఆ సమయంలో పిల్లలు హాకీ స్టిక్స్ పట్టుకుని తిరిగేవాళ్లు. అలా హాకీని కుర్రాళ్ల నరాల్లో ఎక్కించారు ధ్యాన్ చంద్. అయితే రానురాను హాకీ వైభవం తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు హాకీ మ్యాచులను చూడడాన్ని కూడా ఏదో దేశ సేవ చేస్తున్నట్టుగా ఫీలైపోతున్నారు జనాలు..

భారత హాకీకి ధ్యాన్‌చంద్ చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం, 1956లో ‘పద్మభూషణ్’ అవార్డుతో సత్కరించింది. ధ్యాన్ చంద్ పుట్టినరోజైన ఆగస్టు 29ని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా నిర్వహిస్తారు. అలాగే గత ఏడాది రాజీవ్ ఖేల్‌రత్న అవార్డును ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం...

క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ని భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ అవార్డుతో గౌరవించింది ప్రభుత్వం. అలాంటిది మేజర్ ధ్యాన్ చంద్‌కి భారత రత్న అవార్డు ఇవ్వడానికి ఎందుకు ఇంతగా ఆలోచిస్తూ, ఇన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారనేది హాకీ ఫ్యాన్స్‌కి అంతుపట్టని విషయం...

Dhyan Chand

సచిన్ టెండూల్కర్‌కి ‘భారతరత్న’ అవార్డు ఇవ్వడం, అతనికి మనమిచ్చిన గౌరవం అయితే... ధ్యాన్‌చంద్‌కి ‘భారతరత్న’ అవార్డు ఇస్తే, అది ఆ అవార్డుకే గర్వకారణమంటారు భారత క్రీడాభిమానులు... 

Dhyan Chand

కేంద్రం గుర్తించినా, అవార్డు ఇచ్చి సత్కరించకపోయినా హాకీ లవర్స్‌కి ధ్యాన్ చంద్ భారతరత్నమే. ప్రపంచ క్రీడా వేదిక ఒలింపిక్స్‌లో ఒక్క స్వర్ణం గెలిస్తే తెగ సంబరపడిపోయే వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులు, 8 స్వర్ణాలు గెలిచామని చెప్పుకునేందుకు హాకీని నేషనల్ గేమ్‌ని మార్చిన క్రీడా రత్నమే...

Dhyan Chand

హాకీని మంత్రం దండంలా వాడుతూ ‘హాకీ మేజిషియన్’గా గుర్తింపు తెచ్చుకున్న ధ్యాన్ చంద్, జర్మనీ నిరంకుశ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ మన్ననలు కూడా అందుకున్నాడు. ధ్యాన్ చంద్ ఆటను చూసి, అతనికి అభిమానిగా మారిపోయిన హిట్లర్... భారత హాకీ కెప్టెన్‌తో డిన్నర్ చేయాలని ఆశపడ్డాడు..

click me!