ముక్కోటి ఏకాదశి రోజు ఈ వ్రతం తప్పకుండా ఆచరించాలి

First Published | Jan 9, 2025, 11:38 AM IST

ముక్కోటి ఏకాదశి రోజు అందరూ విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారు కదా. అందరూ ఇలా దర్శనం చేసుకోవడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. కాని ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించే వ్రతం ఒకటుంది. ఆ వ్రతం ఏమిటి? ఎలా ఆచరించాలి? పూజా విధానం ఏమిటి? ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
 

ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించే వ్రతాన్ని వైకుంఠ ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం అత్యంత పవిత్రమైనది. ఈ వ్రతం ద్వారా పాప విమోచనం పొందుతూ మోక్షాన్ని అందుకోవచ్చని భక్తులు నమ్ముతారు. ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పాటించడానికి ముఖ్యంగా ఈ విధానం అనుసరించాలి.
 

వైకుంఠ ఏకాదశి వ్రత విధానం

1. ఉపవాసం:

సాధారణంగా వ్రతం అంటే ఓ ప్రత్యేక పూజ. కాని వైకుంఠ ఏకాదశి వ్రతం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కొన్ని నియమాలు పాటిస్తూ ఆ రోజు గడపడం. ఇందులో ప్రధాన భాగం ఉపవాసం. అంటే నిష్ఠగా ఫాస్టింగ్ చేయాలి. దీని కోసం మీరు ఉదయం పూట స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకోవాలి. లేదా ఉతికి శుభ్రం చేసిన బట్టలు కూడా ధరించవచ్చు. 

ఉపవాసంలో గోధుమ రవ్వ, పండ్లు, పాలు లాంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మీకు శక్తి ఉంటే ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తే మరింత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. అయితే అనారోగ్య సమస్యలు ఉన్న వారు కటిక ఉపవాసాలు చేయడం మంచిది కాదని కూడా పండితులు చెబుతున్నారు. భగవంతుడి ధ్యానం, భజన, స్తోత్ర పఠనం చేయడానికి అవసరమైన శక్తిని మీరు కలిగి ఉండేలా ఉపవాసం చేయాలని సూచిస్తున్నారు. అందుకే ఎవరి శక్తి మేరకు వారు ఆహార నియమాలు పాటిస్తూ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని కోరుతున్నారు. రాత్రి భోజనం చేయకుండా, జాగరణ చేయడం మరింత ఉత్తమ ఫలితాలను అందిస్తాయట. 


2. విష్ణు పూజ:

శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా ఫోటోను శుభ్రంగా ఉంచి పూలు, దండలతో అలంకరించాలి. సుదర్శన చక్రం లేదా తులసి మాల ధరించిన శ్రీ మహావిష్ణువు రూపాన్ని పూజించడం శ్రేయస్కరం. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. విష్ణు సహస్రనామ పారాయణం లేదా భగవద్గీత చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయట.

3. తులసి సమర్పణ:

పూజలో తులసి దళాలను ఉపయోగించడం అత్యంత ముఖ్యమైన విషయం. స్వామి వారికి తులసి దళాలంటే చాలా ఇష్టమట. అందువల్ల వైకుంఠ ఏకాదశి నాడు తులసి దళాలు, దండలు సమర్పిస్తే తొందరగా స్వామి వారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా విష్ణు మూర్తికి తులసి పూలమాలలు సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి.

4. ఆలయ సందర్శన:

వైకుంఠ ద్వార దర్శనం పొందడం వ్రతంలో ముఖ్య భాగం. ఆ రోజు విష్ణాలయానికి వెళ్లి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారంలోంచి వెళ్లి స్వామి వారిని దర్శిస్తే మోక్షం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. 

5. దానం:

వైకుంఠ ఏకాదశి రోజు ఆహారం, వస్త్రాలు, లేదా ధనాన్ని దానం చేయడం పుణ్యఫలాలను అందిస్తుందట. మీరు ఏది దానం చేస్తున్నా భగవంతుని స్మరించుకుంటూ ఇవ్వాలని పండితులు చెబుతున్నారు.
 

6. రాత్రి జాగరణ:

రాత్రి నిద్రపోకుండా భగవంతుని కీర్తనలు పాడుతూ, మంత్ర జపం చేస్తూ ఉండాలి. ఈ విధంగా వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి నారాయణుడి కృప కలుగుతుందని భక్తుల నమ్మకం. 

వైకుంఠ ఏకాదశి వ్రత ఫలితం కారణంగా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయట. విష్ణు కృపతో మోక్షం లభిస్తుందట. భక్తి భావన పెరిగి, జీవితం పవిత్రంగా మారుతుందని పురాణాల్లో ఉంది. 

గమనిక:

వ్రతం అనేవి భక్తి, నమ్మకంతో పాటిస్తే మరింత ఫలప్రదమవుతుంది. మీరు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మీ ఆరోగ్యం, శరీరం సహకరించే విధంగానే చేయాలి. కఠిన నియమాలు పాటించి ఆరోగ్యం పాడుచేసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యం, భక్తి, శ్రద్ధ లేకుండా చేసే ఏ పూజా ఫలితాలనివ్వవని పండితులు చెబుతున్నారు. 

Latest Videos

click me!