చిరంజీవి, పవన్‌‌తో ప్రధాని మోడీ అభివాదం.. ఏపీ సీఎం ప్రమాణ స్వీకారంలో అరుదైన ఘట్టం.. మెగా ఫ్యాన్స్‌ కి ట్రీట్‌

First Published Jun 12, 2024, 3:08 PM IST

ఆంధ్రప్రదేశ్‌ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లతో ప్రధాని మోడీ అభివాదం చేయడం హైలైట్‌గా నిలిచింది. 
 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. చంద్రబాబు సీఎంగా నేడు(బుధవారం) ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు మొత్తం 25 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ గెస్ట్ గా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగడం విశేషం. 
 

ఇందులో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానులు, టీడీపీ శ్రేణులు అరుపులతో హోరెత్తించారు. అనంతరం పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆ సభ ప్రాంగణం మొత్తం హోరెత్తిపోయింది. అభిమానులు అరుపులతో దద్దరిళ్లింది. 
 

పవన్‌ కళ్యాణ్‌ అనే నేను మాటతో అంతా అరుస్తూ నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఆ ప్రాంగణం అంతా దద్దరిళ్లిపోయిందని చెప్పొచ్చు. అనంతరం వరుసగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 
 

అయితే ఇందులో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. ఈ వేడుకలో సినీ తారలు హైలైట్‌గా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా ప్రత్యేక అతిథిగా ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. 
 

ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ కూడా పక్కనే ఉన్నారు. ఇలా రజనీ, చిరంజీవి, బాలయ్య, పవన్‌ కళ్యాణ్‌ ఒకే వేదికపై ఉండటం సినీ అభిమానులకు కనువిందు కలిగించే దృశ్యమని చెప్పొచ్చు.

వీరితోపాటు మెగా ఫ్యామిలీ, రామ్‌ చరణ్‌, నిఖిల్‌ వంటి వారు కూడా ఈ ఈవెంట్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  సినీ అభిమానులకు కనువిందుగా నిలిచిందీ సన్నివేశం. 
 

ఇవన్నీ ఓ ఎత్తైతే, మెగా ఫ్యాన్స్ గర్వపడే, పండగ చేసుకునే సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తన పార్టనర్‌ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తోపాటు మెగాస్టార్‌ చిరంజీవిని ఇద్దరిని దగ్గరకి తీసుకుని ముచ్చటించారు. 
 

కేవలం ముచ్చటించడమే కాదు, చిరు, పవన్‌లతో కలిసి మోడీ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేయడం హైలైట్‌గా నిలిచింది. దీంతో మరోసారి ఆ వేదిక మొత్తం హోరెత్తిపోయింది. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని చూసి రామ్‌ చరణ్‌ ఎమోషనల్‌ కావడం విశేషం. 
 

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంలో పవన్‌ భాగం అవుతున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. 

2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పవన్‌ కళ్యాణ్‌ జనసేన పోటీ చేసింది. వైసీపీ వ్యతిరేక ఓటుని తనవైపు తిప్పుకుని ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 175 సీట్లకు కూటమి 164 సీట్లు గెలవడం విశేషం. ఇందులో 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 21 స్థానాలు గెలిచింది. 
 

అలాగే రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 8 స్థానాలు, టీడీపీ 135 స్థానాలను గెలుచుకుంది. భారీ మెజారిటీతో ఎన్డీయే కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో పవన్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆయన కింగ్‌ మేకర్‌గా నిలిచారు. 
 

Latest Videos

click me!