వైఎస్ జగన్ పక్కా ప్లాన్: అనాలోచిత చర్య, చంద్రబాబుకు కుప్పంలోనే ఎసరు

First Published Sep 21, 2021, 11:29 AM IST

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బతీసి అధికారంలోకి వచ్చిన వైసిపి ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇలాకాలో పాగా వేయాలన్న పక్కా వ్యూహంతో ముందుకువెళుతోంది. ఇటీవలి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఘోరమైన ఫలితాలను చవిచూడటం అందులో భాగంగానే కనిపిస్తోంది. 

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలోనే నూకలు చెల్లకుండా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు అధినేత వైఎస్ జగన్ ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. చంద్రబాబును కుప్పంలో దెబ్బ తీయాలని ఆయన పక్కా ప్రణాళిక రచించినట్లు చెబుతున్నారు. ఇటీవలి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఘోరమైన ఫలితాలను చవి చూసింది. వైసీపీ కుప్పం నియోజకవర్గంలో పాగా వేసింది.

గతంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బ తిన్నది. ఆ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే, చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తూ పోటీకి తమ అభ్యర్థులను దించారు. అలా పోటీకి దిగిన ప్రాంతాల్లో కూడా టీడీపీ పెద్దగా సాధించిందేమీ లేదు. ఈ స్థితిలో పరిషత్తు ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆనాలోచితమైందిగా భావిస్తున్నారు. చంద్రబాబు బహిష్కరణకు పిలుపునిచ్చినా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కొన్ని చోట్ల పోటీ చేసింది. అయినా ఫలితాలు తగిన విధంగా రాలేదు. 

 అయినప్పటికీ చంద్రబాబు తీరు మారలేదనే విమర్శలు వస్తున్నాయి. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా సాగకుండా ఆయన జగన్ మీద విరుచుకుపడుతున్నరనే మాట వినిపిస్తోంది. తాము బహిష్కరించిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించినట్లు ప్రకటించుకోవడం ఏమిటని ఆయన అడుగుతున్నారు. పైగా, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని జగన్ ను డిమాండ్ చేశారు. ఈ పరిస్థితిలో కూడా ఆయన పునరాలోచన చేయకుండా గతానుగతిక పద్ధతినే అవలంబిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు 44 ఎంపీటీసీ సీట్లకు పోటీకి దిగారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 66 స్థానాలు ఉండగా, టీడీపీ 3 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఒక్క జడ్పీటీసీ కూడా టీడీపీకి రాలేదు. చంద్రబాబు బహిష్కరణ నిర్ణయం వల్ల అది జరిగిందని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ టీడీపీ మాత్రం కుప్పం నియోజకవర్గంలో బలహీనపడుతుందని చెప్పడానికి అంతకన్నా మరో నిదర్శనం ఉండదు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టి టీడీపీని దెబ్బ తీశారనే మాట స్థానికంగా వినిపిస్తోంది. 

జగన్ మాత్రం కుప్పంలో ఎట్టి పరిస్థితిలోనూ చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో దెబ్బ తీయాలనే వ్యూహంతో సాగుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును కుప్పం నియోజకవర్గంలో బలహీనపరిచే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించినట్లు చెబుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చక్రం తిప్పుతున్నారు. 

గత సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో చంద్రబాబు మొదటి రెండు రౌండ్లు వెనకబడ్డారు. ఇది అందరినీ అశ్చర్యపరిచింది. కుప్పం నుంచి ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాను నియోజకవర్గానికి వెళ్లకుండా అప్రపతిహతంగా విజయం సాధిస్తూ వచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు ఫలితాలు సాధించింది. 89 పంచాయతీల్లో వైసీపీ 74 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ 14 పంచాయతీల్లో మాత్రమే గెలిచింది. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. 

చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో మకాం వేశారు. కార్యకర్తలను, నేతలను కలిశారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ప్రతినిధులుగా మనోహర్, శ్రీనివాస్ పనిచేస్తున్నారు. మనోహర్ ను మార్చాలని స్థానిక కార్యకర్తలు ఆ సందర్భంలో చంద్రబాబుకు మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. వారి వినతిపై ఆలోచన చేయకుండా మనోహర్ లేకపోతే ఎవరు వ్యవహారాలు చూస్తారని చంద్రబాబు ఎదురు ప్రశ్న వేసినట్లు చెబుతున్నారు. ఆలాంటి చంద్రబాబు వైఖరి వల్ల టీడీపీ కార్యకర్తలు స్తబ్దంగా మారిపోయినట్లు సమాచారం. వారు చంద్రబాబు తీరు పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. 

అదే సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రంగంలోకి దిగి కుప్పంలో టీడీపీ నుంచి వైసీపిలోకి పెద్ద యెత్తున వలసలను ప్రోత్సహించారు. కుప్పం నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉదారంగా వ్యవహరిస్తూ వచ్చారు. అందుకు వైఎస్ జగన్ రామచంద్రారెడ్డికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం ఆపరేషన్ లో మునిగి తేలుతున్నట్లు చెబుతున్నారు.

అదే సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రంగంలోకి దిగి కుప్పంలో టీడీపీ నుంచి వైసీపిలోకి పెద్ద యెత్తున వలసలను ప్రోత్సహించారు. కుప్పం నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉదారంగా వ్యవహరిస్తూ వచ్చారు. అందుకు వైఎస్ జగన్ రామచంద్రారెడ్డికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం ఆపరేషన్ లో మునిగి తేలుతున్నట్లు చెబుతున్నారు. 

వచ్చే సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కుని టీడీపీ ఏ మేరకు నిలబడుతుందనేది సందేహంగానే ఉంది. చంద్రబాబు తగిన ప్రణాళికలు రచించి ముందుకు సాగడంలో విఫలమవుతున్నారు. నిత్యం జగన్ మీద వ్యక్తిగతంగానూ, జగన్ ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తే తాము చేసే కార్యక్రమాలను ప్రజల ముందు పెట్టి వారికి భరోసా కల్పించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో టీడీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, కుప్పంలోనే చంద్రబాబుకు తీవ్రమైన ఎదురు దెబ్బ తగలవచ్చుననే అంచనాలు సాగుతున్నాయి. 

click me!