పవన్ కల్యాణ్ జగన్ మాదిరిగా ఉడుంపట్టు పట్టలేరనే విషయం అందరికీ తెలిసిందే. అభిమానులు పెద్ద యెత్తున ఉన్నప్పటికీ వారికి మాత్రమే కాకుండా ప్రజలకు భరోసా కలిగించే విధంగా పవన్ కల్యాణ్ తన జనసేన ద్వారా ఏమీ చేయలేకపోయారు. గత ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది.
undefined
తన తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అనుకున్నారు. కానీ కాంగ్రెసు అధిష్టానం అందుకు అంగీకరించలేదు. కేంద్ర మంత్రి పదవి ఇస్తామని చెప్పింది. ఓదార్పు యాత్రను మానేయాలని ఆదేశించింది. అధిష్టానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను కొనసాగించాడు.
undefined
కాంగ్రెసు అధిష్టానాన్ని ధిక్కరిస్తూ ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని స్థాపించాడు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ఏర్పాటు చేసి దాని నిర్మాణాన్ని చేపట్టారు. మళ్లీ పోటీ చేసి బంపర్ మెజారిటీతో విజయం సాధించాడు. పులివెందుల నుంచి తన తల్లి విజయమ్మను గెలిపించుకున్నారు. పలువురు కాంగ్రెసు నాయకులు రాజీనామాలు చేసి జగన్ వైపు వచ్చారు.
undefined
జగన్ పై అంతలోనే అక్రమాస్తుల కేసు మెడకు చుట్టుకుంది. సిబిఐ దర్యాప్తునకు ఎదురొడ్డి నిలబడ్డాడు. సీబీఐ కేసులు ఉన్నప్పటికీ తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏ మాత్రం వెనకంజ వేయలేదు. అరెస్టయి 16 నెలలు జైలులో కూడా ఉన్నారు. అయినా తన రాజకీయాల్లో ఏ మాత్రం పదును తగ్గకుండా చూసుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాబట్టి తెలంగాణను దాదాపుగా వదిలేసుకున్నారు
undefined
తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమిని ఎదుర్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నించారు. కానీ ఫలితం దక్కలేదు. నరేంద్ర మోడీపై యువతలో ఉన్న ఆకర్షణ, చంద్రబాబు అనుభవంపై ప్రజలకు ఉన్న నమ్మకం, పవన్ కల్యాణ్ కు ఉన్న అభిమాన సంపద వెరసి జగన్ ను అధికారానికి దూరం చేశాయి.
undefined
ప్రతిపక్షంలో ఉంటూ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై నిరంతరం పోరాటం సాగించారు. సీనియర్ నాయకులు పలువురు పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరినా కూడా ఆయన నిరాశపడినట్లు కనిపించలేదు. ఉన్నవాళ్లతోనే ఆయన పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు.
undefined
జగన్ రాజకీయంలో పాదయాత్ర అత్యంత కీలకమైన ఘట్టం. ఓ వైపు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూనే రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. ఆ సందర్బంగా ప్రజలను కలుస్తూ వారికి తగిన హామీలు ఇస్తూ ముందుకు వెళ్లారు. ప్రజలకు హామీల వర్షం కురిపిస్తూ వచ్చారు. అధికారంలో ఉన్న చంద్రబాబు జగన్ హామీలను తన వరాల ద్వారా తిప్పికొట్టే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది
undefined
వైఎస్సార్ కాంగ్రెసుతో పొత్తుకు బిజెపి కూడా ప్రయత్నాలు చేసింది. అయితే, బిజెపికి సన్నిహితంగా ఉంటూనే ఆయన ఒంటరి పోరుకు సిద్ధపడ్డారు. 2019 ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసి అనూహ్యంగా 151 అసెంబ్లీ స్థానాలను, 22 లోకసభ సభ్యులను గెలిపించుకున్నారు. తన గమ్యాన్ని చేరుకునే విషయంలో జగన్ పక్క చూపులు చూసిన దాఖలాలు లేవు. మొండిగా తాను అనుకున్నట్లే ముందుకు వెళ్లి గమ్యాన్ని చేరుకున్నాడు.
undefined
గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ ను ఓడించడానికి శతవిధాలా ప్రయత్నించారు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ దుయ్యబట్టారు. అయినా కూడా ఆయన ముందుకే వెళ్లారు. ఎక్కడా తన మార్గం నుంచి వైదొలగలేదు.
undefined
వైఎస్ జగన్ ఉత్తమోత్తమ నాయకుడని గానీ ఉత్తమ నాయకుడని గానీ చెప్పలేం గానీ గమ్యాన్ని అందుకోవడంలో ఓ తెగువ ప్రదర్శించారు. అన్ని విధాలైన చిక్కులను, కష్టనష్టాలను ఎదుర్కున్నారు. తనకు అత్యంత సన్నిహితులైన ఎస్వీ సుబ్బారెడ్డిని, విజయసాయి రెడ్డిని పక్కన పెట్టుకున్నారు. తనను నమ్ముకుని పార్టీ వెంట ఉన్న ఎవరిని కూడా ఆయన విస్మరించలేదు. పోయినవారు పోయారే తప్ప ఉన్నవారికి మాత్రం జగన్ భరోసా ఇచ్చారు.
undefined
పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి కొన్నాళ్లే అయినప్పటికీ స్థిరంగా ఓ మార్గంలో నడిచిన దాఖలాలు కనిపించవు. మాటల్లో చూపించిన తెగువ చేతల్లో కనిపించలేదు. పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేయకుండా టీడీపీ, బిజెపి కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ తర్వాతి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. తాజాగా ఆయన బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని చెబుతున్న పవన్ కల్యాణ్ వైఎస్ జగన్ ను అధికారంలోకి రానీయకుండా గతంలో, అధికారంలోంచి దించేయడానికి ఇప్పుడు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారే తప్ప తాను గెలిచి ఉత్తమ పాలనను అందించగలననే భరోసాను ప్రజలకు అందించలేకపోతున్నారు.
undefined
రాజకీయాల కోసం సినిమాలను వదులుకున్న పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల వైపు చూస్తున్నారు. పింక్ సినిమా తెలుగు సేతలో ఆయన నటించేందుకు సిద్ధపడ్డారు. త్వరలో ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మరో సినిమాలో కూడా నటించేందుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. స్థిరంగా తాను రాజకీయాల్లో ఉంటాననే నమ్మకాన్ని కూడా ప్రజలకు కలిగంచలేకపోతున్నారు.
undefined
ఎదురు దెబ్బ తింటామని తెలిసి కూడా కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ కచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించారు. తాను కాపు రిజర్వేషన్లను అమలు చేయలేనని ఎన్నికలకు ముందు చెప్పారు. దానివల్ల కాపు సామాజిక వర్గం ఆయనకు దూరమవుతుందని భావించారు. అలా ప్రకటించడం వల్ల జగన్ తాను చేయగలిగే హామీలనే ఇస్తున్నట్లు చెప్పారు. తద్వారా ఆయన ఇచ్చిన హామీలకు ప్రజల్లో విశ్వసనీయత ఏర్పడింది.
undefined
పవన్ కల్యాణ్ ఏ ఒక్క విషయంపై కూడా నిర్దిష్టమైన విధానాన్ని ప్రటించిన దాఖలాలు లేవు. కాపు రిజర్వేషన్ల వంటి అతి ముఖ్యమైన అంశంపై ఆయన దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. తాను అధికారంలోకి వస్తే ప్రజలందరినీ బాగు చేస్తానని చెప్పారే గానీ ఏ విధంగా వారికి మేలు చేయగలననే విషయాన్ని నిర్దిష్టంగా చెప్పలేకపోయారు. మొత్తంగా జనసేనకు ఏ విషయంలోనూ ఒక్క విధానమంటూ లేకుండా పోయింది.
undefined
అదే సమయంలో తన ప్రత్యర్థుల ఎంపికలోనూ పవన్ కల్యాణ్ కచ్చితంగా వ్యవహరించలేకపోయారు. చంద్రబాబును, ఆయన ప్రభుత్వాన్ని తొలుత వెనకేసుకొచ్చిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత ఆయనపై, ఆయన ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను కొంత మందిని ఎంపిక చేసుకుని వారికి హెచ్చరికలు కూడా చేశారు.
undefined
చంద్రబాబు లేదా టీడీపీ వ్యతిరేక విధానాన్ని పవన్ కల్యాణ్ కొనసాగించలేదు. ఆ తర్వాత చంద్రబాబును వెనకేసుకొస్తున్నట్లు కనిపిస్తూ వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇద్దరినీ సమానంగా ఎదుర్కోవడంలో, ఇద్దరినీ సమానంగా తప్పు పట్టడంలో ఆయన కచ్చితమైన వైఖరిని ప్రదర్శించలేకపోయారు.
undefined
వైఎస్ జగన్ మాత్రం కచ్చితంగా ఓ వైపు పవన్ కల్యాణ్ ను, మరోవైపు చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో మర్యాదను దాటి కూడా పవన్ కల్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా వారిద్దరిని సమానంగా ఎదుర్కునే వ్యూహాన్ని ఆయన అనుసరించారు. దానికితోడు, ఆ పార్టీల నాయకులపై ఎప్పటికప్పుడు విరుచుకుపడే ఆ జట్టును జగన్ తయారు చేసుకున్నాడు.
undefined
జనసేనను వ్యవస్థీకృతం చేయడంలో పవన్ కల్యాణ్ విఫలమయ్యారు. ఆ దిశగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి. ఆయన కొంత మందికి కొన్ని పార్టీ పదవులు అప్పగించడం, కొన్ని కమిటీలు వేయడం చేశారు గానీ తన ప్రత్యర్థులను ఎదుర్కునే విషయంలో వారికి సరైన దిశానిర్దేశం చేయలేకపోయారు.
undefined
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ప్రజాకర్షణ గల నాయకుడిగా బిజెపికి ఉపయోగపడవచ్చు. కానీ కార్యాచరణ విషయంలో ఆయన జగన్ కు మాత్రమే కాదు, చంద్రబాబుకు కూడా ఏ మాత్రం ధీటు రాకపోవచ్చు. ఈ ముగ్గురు నాయకుల్లో ఎవరు పవిత్రులు, ఎవరు అవినీతిపరులు, ఎవరు మంచి నాయకులు అనే విషయాల జోలికి వెళ్లకుండా చూస్తే పవన్ కల్యాణ్ రాజకీయంగా వేస్తున్నవి తప్పటడుగులు మాత్రమేనని అర్థమవుతుంది
undefined