ఎవరి లెక్కలు వారివే: పార్టీల భవిష్యత్ తేల్చేది సాగర్ ఎన్నికనే...

First Published | Mar 31, 2021, 10:23 AM IST

నాగార్జునసాగర్ ఉపఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు అత్యంత కీలకం. అస్తిత్వం కోసం కాంగ్రెస్, ఎదురులేదు అనిపించుకోవడానికి తెరాస, ప్రధాన ప్రతిపక్షం తామే అని నిరూపించుకోవడానికి బీజేపీ పోటీపడుతున్నాయి. 

తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నికను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని రిపీట్ చేసి తమకు తిరుగులేదు అని తెరాస ప్రయత్నిస్తుండగా.... రాష్ట్రంలో అంపశయ్య మీదున్న పార్టీకి ఊపిర్లూదడానికైనా ఈ సీటును గెలిచితీరాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ సీటును కోల్పోయిన బీజేపీ... వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకొని ఇక్కడ కనీసం బలమైన పోటీ అయినా ఇవ్వాల్సిందే అని బరిలో నిలిచింది.
undefined
కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి బరిలో ఉండగా.... తెరాస నుంచి దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు భగత్ బరిలో ఉన్నారు. ఆఖరి నిమిషం వరకు యోచించి బీజేపీ తమ అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ నేత, జానారెడ్డి కుడి భుజం వంటి రవి నాయక్ ను బరిలోకి దింపింది. ఈ ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నప్పటికీ... పోటీ మాత్రం తెరాస వర్సెస్ కాంగ్రెస్ గా నడుస్తుంది.
undefined

Latest Videos


ఈ ఎన్నిక తెరాస, బీజేపీ, కాంగ్రెస్ లకు అత్యంత కీలకం. మరికొన్ని రోజుల్లో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల ముందర ఈ సీటును గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని కొనసాగించాలని తెరాస భావిస్తుంది. ఈ ఎన్నికలో కూడా గనుక విజయం సాధిస్తే ఒకింత దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో జరిగిన పరాభవాన్ని కొంతైనా తగ్గించడంతోపాటు క్యాడర్ లో జోష్ నింపడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో తమకు ఎదురులేదు అని ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది.
undefined
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే... జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో కూడా సరైన నాయకత్వం లేక ఇబ్బందులు పడుతుంది. పార్టీ నుంచి ఫిరాయింపులు, నాయకుల మధ్య సమన్వయ లోపం అన్ని వెరసి కాంగ్రెస్ పార్టీలో ఒక నిరాశాపూరితమైన వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పార్టీకి ప్రాణం పోయాలంటే ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి విరాజయం సాధించాల్సిందే. స్వతహాగానే బలమైన నాయకుడైన జానారెడ్డి... ఇక్కడ విజయం సాధిస్తాడని కాంగ్రెస్ ఆశిస్తుంది.
undefined
ఇక దుబ్బాక, ఆ తరువాత గ్రేటర్ ఎన్నికల్లో సాధించిన విజయంతో జోష్ మీదున్న బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు. ఒకవేళ వారి సిట్టింగ్ సీటును కాపాడుకొని ఉన్నాకూడా నేడు బీజేపీ హవా మామూలుగా ఉండేది కాదు. కానీ సరైన అభ్యర్థి దొరక్క ఇబ్బందిపడ్డ బీజేపీ ఇప్పుడు అక్కడ ఒక ఎస్టీ నేత రవి నాయక్ ను బరిలోకి దింపింది. ఇక్కడ ఇప్పుడు బీజేపీ ప్రస్తుత లక్ష్యం గెలవడం కన్నా కూడా రాష్ట్రంలో తమ స్థానాన్ని కాపాడుకోవడంగా కనబడుతుంది.
undefined
ఒకవేళ గనుక ఈ స్థానంలో కాంగ్రెస్ గెలిస్తే... రాష్ట్రంలో తామే ప్రధాన ప్రతిపక్షమని, కాంగ్రెస్ కి నూకలు చెల్లాయని బీజేపీ వారు చెప్పే మాటలకు అంతలా విలువ ఉండదు. కాంగ్రెస్ పార్టీ గనుక విజయం సాధిస్తే ప్రతిపక్షంగా కాంగ్రెస్ మరోసారి తెరమీదకు వచ్చే ఆస్కారం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాగైనా కాంగ్రెస్ గెలవొద్దు, ఒకవేళ గెలిచినప్పటికీ... అందుకు తెరాస సహకరించిందనే వాదనను తెరమీదకు తీసుకొస్తున్నారు. జానారెడ్డి, కేసీఆర్ మంచి మిత్రులు కాబట్టి జానాను గెలిపించడానికి కేసీఆర్ సహకరిస్తారని కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. మొత్తానికి ప్రచార కార్యక్రమాల్లో ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ... వాస్తవంగా ఎన్నికలు జరిగి ఎవరు గెలిచారో చూడాలంటే మాత్రం మే2వ తేదీ వరకు ఆగవలిసిందే..!
undefined
click me!