మరో ఎన్నికల పరీక్ష: ఆ తర్వాత కేటీఆర్ కు పట్టం ఖాయం?

First Published | Sep 26, 2020, 1:20 PM IST

గ్రేటర్ ఎన్నికలు తెరాస కు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకొని తెరాస అధినేత కేసీఆర్ కూతురు కవితను ఓడించి షాక్ ఇచ్చిన బీజేపీకి గ్రేటర్ పరిధిలో బలం ఎక్కువ. 

తెలంగాణాలో నిన్న తీగల వంతెన ప్రారంభమయింది. హైదరాబాద్ నగర సుందరీకరణ పనుల్లో భాగంగా, భాగ్యనగరానికి మరో తలమానికంగా ఈ వంతెన ప్రారంభమయింది. ఈ వంతెన ఒక్కటే కాదు హైదరాబాద్ లో ఈ మధ్యకాలంలో పనులు చాలా వేగవంతమయ్యాయి.
బస్తీల్లో బస్తి దావఖానాలు మొదలు, ఫాగింగ్, రోడ్లపై గుంతలను పూడ్చడం, స్వచ్చ్ హైదరాబాద్ అంటూ యాక్టీవ్ గా మారిన బల్దియా అధికారులు, అన్నిటికి మించి మంత్రి కేటీఆర్ నగరమంతా చుట్టేయడం. ఆయన యాక్టివ్ గా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ అంతా కలియతిరుగుతూ ఓపెనింగులను చేసేస్తున్నారు.

ఇక దీనితో గ్రేటర్ ఎన్నికలకు త్వరలో తెర తీయబోతున్నారనే సంకేతం అందుతుంది. గ్రేటర్ ఎన్నికలు తెరాస కు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకొని తెరాస అధినేత కేసీఆర్ కూతురు కవితనుఓడించి షాక్ ఇచ్చిన బీజేపీకి గ్రేటర్ పరిధిలో బలం ఎక్కువ.
గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్త చాటి తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం తామే అని అనిపించుకోవడంతోపాటుగా.... తెరాస కు ప్రత్యామ్నాయం తామే అని చాటి చెప్పాలనే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. సంస్థాగతంగా బీజేపీకి జంటనగరాల పరిధిలో బలముంది. వారు ఇక్కడి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను చాలాసార్లు గెలిచారు.
ఇక గత ఎన్నికల్లో తెరాస బ్రహ్మాండ విజయం సాధించి 99 సీట్లను గెలిచినప్పటికీ.... ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. బీజేపీ బలం పుంజుకుంది. తెలంగాణపై బీజేపీ అధిక ఫోకస్ పెట్టింది. జిహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పరిస్థితులను గమనించిన తెరాస అందుకు తగ్గ వ్యూహాలను రచిస్తోంది.
గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. ఈసారి 100 సీట్లలో విజయ ఢంకా మోగించాలని చూస్తుంది తెరాస. ఇందుకోసం యువరాజు కేటీఆర్ రంగంలోకి దిగారు కూడా. ఈసారి కూడా గత దఫా మాదిరే గెలుపు బాధ్యతలను తన భుజానికెత్తుకున్నాడు. అలసత్వం ప్రదర్శించకూడదని కార్యకర్తలకు నాయకులకు హితోపదేశం చేసిన కేటీఆర్ వారిని బస్తీలవెంట పరుగులు పెట్టిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికలకు వాస్తవానికి ఇంకొంత సమయం ఉంది. ఫిబ్రవరి వరకు ప్రస్తుత పాలకవర్గానికి సమయం ఉంది. కానీ ప్రత్యర్థులు పూర్తి స్థాయిలో బలం పుంజుకునేకన్నా ముందే గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలని యోచన చేస్తుంది తెరాస. ఇందుకోసం ముందస్తు ఎన్నికల కు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ముందస్తు ఎన్నికలు అంటే కనీసం మూడు నెలల ముందే ఎన్నికలకు వెళ్ళాలి. అందుకే ఈ డిసెంబర్ లోనే ఎన్నికలకు వెళ్లాలని సంకల్పిస్తుంది తెరాస.
బీహార్ ఎన్నికలకు కూడా నగారామోగడంతో.... ఇక ఎన్నికలను నిర్వహించే వీలుంటుందని భావిస్తుంది తెరాస. గ్రేటర్ ఎన్నికల పరిధిలో సోషల్ మీడియా ఎఫెక్ట్ అధికంగానే కనబడుతుంది. ఇందుకోసం సోషల్ మీడియా టీంలతో కూడా కేటీఆర్ చర్చిస్తున్నట్టుగా సమాచారం. పార్టీకి సంబంధించిన ప్రచారాన్ని ఆన్ లైన్ లో కూడా విస్తృతంగా నిర్వహించేందుకు ప్లాన్స్రచిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికలతోపాటుగా ఎమ్మెల్సీ ఎన్నిక, దుబ్బాక ఉప ఎన్నికలపై కేటీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. గ్రేటర్ పరిధిలో మత పెద్దలతో కూడా చర్చించి వారికి అవసరమైన కమ్యూనిటీ హాల్స్, స్మశాన వాటికలను కట్టించడానికి సమాలోచనలు జరుపుతున్నారు.
ఇక ఈ ఎన్నిక తరువాత ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న యువరాజు పట్టాభిషేకం కార్యక్రమం ఉండబోతుందంటూ చర్చ జరుగుతోంది. కేసీఆర్ సైతం జాతీయ రాజకీయాలవైపు చూస్తున్న వేళ యువరాజుకు ఇక్కడ బాధ్యతలను అప్పగించి ఆయన కేంద్రంలో చక్రం తిప్పాలని అనుకుంటున్నారట. కేంద్రంలో చక్రం తిప్పాలనేది కేసీఆర్ ఆశ. చూడాలి... ఈసారైనా యువరాజు పట్టాభిషేకం వార్తలు నిజమవుతాయా లేదో..!

Latest Videos

click me!