Telangana RTC Jobs : తెలంగాణ ఆర్టిసి గుడ్ న్యూస్ తెలిపింది. అసలు విద్యార్హతలతో సంబంధమే లేకుండా కేవలం తెలుగు చదవడం, రాయడం వస్తేచాలు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్దమయ్యింది ఈ ప్రభుత్వ సంస్థ. పాఠశాల విద్యకే పరిమితమై ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా ఇబ్బందిపడుతున్నవారికి ఇది మంచి అవకాశం. ఇలా టిజిఎస్ ఆర్టిసి ఏకంగా 1500 ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది... ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ చేసారు.
అయితే ఈ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతిలో చేపడుతోంది ఆర్టిసి సంస్థ. అంటే ఈ ఉద్యోగాలు పర్మనెంట్ కాదన్నమాట... ఇప్పుడున్న అవసరాన్ని తీర్చుకోడానికి తాత్కాలికంగా నియమించుకుంటున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికయినవారు నిర్ణీత కాలానికే (నాలుగు నెలలు) పనిచేయాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఆర్టిసి అధికారులు కాంట్రాక్టును పొడిగిస్తారు.
ప్రస్తుతం ఆర్టిసిలో డ్రైవర్ల కొరత ఉంది... చాలాకాలంగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, ఉన్నవారిలో చాలామంది రిటైర్ అవుతుండటంతో ఈ సమస్య ఏర్పడింది. ప్రతినెలా సగటున 50 మంది డ్రైవర్లు రిటైర్ అవుతున్నారట. దీంతో మొదటిసారి ఆర్టిసి ఔట్ సోర్సింగ్ పద్దతిలో డ్రైవర్లను నియమించుకుంటోంది.