Sabarimala Ayyappa Temple : చాలామంది అయ్యప్ప మాలవేసి కఠిన నియమాలను పాటిస్తారు. ఎముకలు కొరికే చలికాలంలో ఆ అయ్యప్పపై భక్తితో మాల ధరించి చన్నీటి స్నానం చేస్తారు, అహార నియమాలను పాటిస్తారు, నేలపై నిద్రిస్తారు... ఇలా ఎంతో ఓపికగా ఆ స్వామి ఆశిస్సులు పొందేందుకు ప్రయత్నిస్తారు. తమ భక్తితో ఆ మణికంఠుడిని ప్రసన్నం చేసుకునే మాలధారులు సైతం శబరిమలలో స్వామివారిని తనివితీరా చూసుకోలేకపోతున్నారు.
శబరిమల ఆలయానికి వెళ్లే మాలధారులు, సాధారణ భక్తులు ఆ ఆయ్యప్పను కనులారా చూసి తరించాలని అనుకుంటారు. కానీ వారికి ఆ అవకాశం దక్కడంలేదు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఆ స్వామిచెంతకు చేరితే కేవలం కొన్ని సెకన్లపాటు కూడా దర్శించుకోలేని పరిస్థితి. కొందరు అసలు స్వామిని చూడకుండానే వెనుదిరగాల్సిన వస్తోంది.
దీంతో అయ్యప్ప భక్తులు శబరిమల ఆలయ నిర్వహకులకు తమ బాధను చెప్పుకుంటూ ఈ-మెయిల్స్, లేఖలు రాసారు. సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేసారు. ఇలా చాలా ఫిర్యాదులు రావడంతో ట్రావెన్ కోర్ దేవస్థానం ట్రస్ట్ స్పందించింది... భక్తులకు మరింత మెరుగైన దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రయోగాత్మకంగా కొత్త మార్గంలో ఆ అయ్యప్పస్వామి దర్శనాన్ని కల్పించనున్నట్లు... ఇది సక్సెస్ అయితే ఇకపై ఈ మార్గంలోనే ఎప్పటికీ దర్శనాలుంటాయని ట్రావెన్ కోర్ బోర్డ్ స్పష్టం చేసింది.
శబరిమల అయ్యప్ప దర్శనానికి కొత్త మార్గం ఇదే :
గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుచుకునే కేరళ అనేక ప్రాచీన దేవాలయాలకు నిలయం. అందులో ప్రముఖమైనది శబరిమల అయ్యప్ప ఆలయం. దట్టమైన అడవుల్లో వెలిసిన ఆ మణికంఠుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఆ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.
ఇలా వందల కిలోమీటర్లు ప్రయాణించి, కష్టతరమైన మార్గంలో శబరిమల ఆలయానికి చేరుకుంటే ఆ అయ్యప్ప స్వామిని కనీసం కనులారా చూసుకోలేకపోతున్నామనేది భక్తుల ఆవేదన. ప్రస్తుతం ఆలయంలోకి పంపించే మార్గం సరిగ్గా లేదని... దీనివల్లే స్వామిని ఎక్కువసేపు చూసే అవకాశం లేకుండాపోతోందని భక్తులు వాపోతున్నారు. స్వామి భక్తుల బాధను ట్రావెన్ కోర్ బోర్డ్ అర్థం చేసుకుంది.
ఈ క్రమంలోనే శబరిమాల ఆలయంలో 18 మెట్లు ఎక్కగానే ప్రస్తుతం పంపిస్తున్న మార్గంలో మార్పులు చేపట్టినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ (TDB) అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ ప్రకటించారు.మార్చి 15 నుండి కొత్తమార్గంలో అయ్యప్ప దర్శనం కల్పిస్తామని... కొన్నిరోజులు ఇలాగే ప్రయోగాత్మకంగా దర్శనాలుంటాయని తెలిపారు.
ప్రస్తుతం 18 మెట్లు ఎక్కగానే ఓ వంతెనవైపు భక్తులను పంపుతారు. అక్కడినుండే క్యూలైన్ లో భక్తులపై అయ్యప్ప కొలువైన ప్రధాన ఆలయంలో పంపుతారు. అయితే ఈ మార్గంలో అయ్యప్పను ఎక్కువసేపు దర్శించుకోలేం. అందువల్లే కొత్తమార్గంలో దర్శనాలకు ఏర్పాట్లు చేసారు.
ఆలయ ప్రధాన పూజారి, ఇతర పండితుల సలహాలు, సూచనలు తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రశాంత్ తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడుతూనే భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనభాగ్యం కల్పించాలన్నదే తమ ఉద్దేశమన్నారు.
గతంలో కేవలం ఐదారు సెకన్లపాటు స్వామిని దర్శించుకునే అవకాశం ఉండేదని...కొత్త మార్గంలో దాదాపు 20 నుండి 25 సెకన్లపాటు ఆ అయ్యప్ప దివ్యమంగళరూపాన్ని కనులారా చూడవచ్చని టిడిబి అధ్యక్షుడు ప్రశాంత్ వెల్లడించారు.
టిడిబి నిర్ణయంపై అయ్యప్ప భక్తులు హర్షం :
తమ బాధను అర్థం చేసుకుని శబరిమల ఆలయ నిర్వహకులు అయ్యప్ప దర్శనానికి కొత్త మార్గం ఏర్పాటుచేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో స్వామివారిని ఎక్కువసేపు చూడవచ్చనే మాటే తమను ఎంతగానో ఆకట్టుకుంటోందని... ఇక ఈ మార్గంలో దర్శనం చేసుకుంటే ఇంకెలా ఉంటుందోనని అంటున్నారు.
ఎంతో భక్తితో శబరిమలకు వచ్చే తాము కనీసం 20-30 సెకన్లు ఈ మంగళరూపాన్ని చూడాలని కోరుకుంటామని... ఇప్పుడు అది నిజం కాబోతోందని అంటున్నారు. ఇకపై కూడా ఇలాగే ఎక్కువసేపు అయ్యప్పస్వామిని చూసుకునే అదృష్టం కల్పించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డును భక్తులు కోరుకుంటున్నారు.