
ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. దేశంలో త్వరలోనే మునుపెన్నడూ చూడని విధంగా ఒక భయంకరమైన ఆర్థిక సునామీ రాబోతోందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి.
దిల్లీలోని ఇందిరా భవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన నేతల సమావేశంలో రాహుల్ ఈ సంచలన కామెంట్స్ చేశారు. మరో ఏడాదిలోపు మోదీ ప్రధాని సీటులో ఉండరని, ఇప్పటివరకు మోదీ కంట్రోల్‌లో ఉన్న వ్యవస్థలన్నీ లోపల లోపలే కుప్పకూలుతున్నాయని రాహుల్ జోస్యం చెప్పారు. దీనిపై అధికార బీజేపీ అంతే ఘాటుగా రియాక్ట్ అయింది. అసలు దేశంలో ఏం జరుగుతోంది? రాహుల్ ఆరోపణలు ఏంటి? బీజేపీ ఇచ్చిన కౌంటర్లు ఏంటి? ఎకనామిస్టులు ఏమంటున్నారు?
రాహుల్ గాంధీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న ధరలు కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించారు.
"ఒకవైపు భయంకరమైన ఆర్థిక సంక్షోభం రాబోతోంది, దాన్ని ఎవరూ ఆపలేరు. మరోవైపు దేశంలోని కీలక వ్యవస్థలలో అంతర్గత తిరుగుబాటు నడుస్తోంది. ఎన్నికల సంఘం, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు, న్యాయవ్యవస్థలోని సీనియర్లు అంతా లోపల జరుగుతున్న పరిణామాలపై స్వయంగా నాకే సమాచారం అందిస్తున్నారు" అని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు ప్రధాని మోదీ ఘనంగా నియంత్రించిన వ్యవస్థలే ఇప్పుడు అదుపు తప్పుతున్నాయని, రేపు రాబోయే ప్రజా ఆగ్రహాన్ని తట్టుకోలేక ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
भयंकर आर्थिक सुनामी आ रही है और नरेंद्र मोदी इसके बारे में न कुछ कर रहे हैं, न कर सकते हैं।
समझिए क्यों? pic.twitter.com/h2HKeh7Jp0— Congress (@INCIndia) June 3, 2026
రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. బీజేపీ నేత ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ఒక అరాచకవాదిగా అభివర్ణించారు. జార్జ్ సోరోస్‌తో కలిసి రాహుల్ దేశంలో ప్రజాస్వామ్య సంక్షోభాన్ని సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మనసులు గెలవలేక, ఇలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులే మాట్లాడుతూ.. రాహుల్ పగటిపూట కూడా పీడకలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. సంపన్న కుటుంబంలో పెరిగిన రాహుల్‌కు పేదరికం తెలియదని, ప్రధాని మోదీ ఉన్నంత కాలం దేశానికి ఎలాంటి ఢోకా లేదని, రాహుల్ తన సొంత పార్టీని కాపాడుకుంటే మంచిదని హితవు పలికారు.
BJP leader Pradeep Bhandari slams LoP Rahul Gandhi for his absurd statement on India's economy:
"Rahul Gandhi is an anarchist man. He wants to spread anarchy in the country at the direction of George Soros. The entire toolkit of India is anti-India and wants to create a… pic.twitter.com/OjaaQQXo8B— Megh Updates 🚨™ (@MeghUpdates) June 4, 2026
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్ లో రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు. ప్రజలను భయపెట్టి రాజకీయం చేయవద్దంటూ చురకలు వేశారు. 2011 నుంచి 2013 మధ్య కాంగ్రెస్ పాలనలోనే రూపాయి విలువ 36 శాతం కుంగిందని, విదేశీ మారక నిల్వలు 294 బిలియన్ డాలర్ల నుంచి 256 బిలియన్ డాలర్లకు పడిపోయాయని, అసలైన ఆర్థిక సునామీ అప్పుడే వచ్చిందని ఆయన కౌంటర్ ఇచ్చారు.
కోవిడ్ సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల షాక్‌లు తగిలినా తట్టుకునేలా మోదీ ప్రభుత్వం దేశాన్ని బలోపేతం చేసిందన్నారు. ప్రస్తుతం జీఎస్‌టీ ఇ-వే బిల్లులు, విద్యుత్ వినియోగం, వాహనాల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు.
అయితే, రాజకీయ పార్టీల మాటలు పక్కన పెడితే.. దేశ ఆర్థిక పరిస్థితిపై కొందరు ప్రముఖ ఆర్థికవేత్తలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. విశేషం ఏంటంటే.. ఒకప్పుడు మోదీ ప్రభుత్వ విధానాలను గట్టిగా సమర్థించిన వారే ఇప్పుడు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
పీఎం ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు సుర్జిత్ భల్లా మే 21న 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికలో లో "బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోంది కానీ ఆర్థిక వ్యవస్థను కోల్పోతోంది" అంటూ వ్యాసం రాశారు. ప్రస్తుతం ఎకానమీ మేనేజ్‌మెంట్ అల్పస్థాయికి చేరిందని విమర్శించారు.
మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్.. రూపాయి విలువ నిరంతరం పడిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఇరాన్ యుద్ధ ప్రభావం మాత్రమే కాదని, భారత ఆర్థిక భవిష్యత్తుపై వస్తున్న సందేహాలకు అద్దం పడుతోందని మే 26న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన కథనంలో పేర్కొన్నారు.
ఒకప్పుడు మోదీని ప్రశంసించిన మీడియా సలహాదారు సంజయ్ బారు.. ప్రస్తుతం దేశంలో ఇన్వెస్టర్లకు నమ్మకం లేని వాతావరణం ఉందన్నారు. మీడియా కూడా నిజాలు చెప్పడానికి భయపడుతోందని, భారత్ ఆర్థిక ర్యాంకింగ్స్‌లో వెనుకబడుతున్నా ఎవరూ ప్రశ్నించడం లేదని విశ్లేషించారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న ఇరాన్ యుద్ధ పరిణామాలు గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత్‌ను కూడా గట్టిగానే ప్రభావితం చేస్తున్నాయి. ముడి చమురు ధరలు పెరగడంతో, మే నెలలోనే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగు సార్లు పెంచాల్సి వచ్చింది. కమర్షియల్ సిలిండర్లు, సీఎన్‌జీ ధరలు కూడా పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా రూ.95.83 కు క్షీణించి సరికొత్త రికార్డులకు చేరింది.
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి.. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి ప్రజా రవాణాను వాడాలని, అనవసర విదేశీ ప్రయాణాలు చేయవద్దని, ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే మాజీ ఆర్థిక కార్యదర్శి అశోక్ ఝా లాంటి నిపుణులు మాత్రం.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసమే ప్రధాని అలా అన్నారని, పరిస్థితి మరీ అంత భయానకంగా ఏమీ లేదని చెప్తున్నారు. ఏదేమైనా.. స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో భారత్.. తైవాన్, దక్షిణ కొరియా కంటే వెనుకబడి 7వ స్థానానికి పడిపోవడం గమనార్హం.
మొత్తానికి, ఆర్థిక సునామీ రాబోతోందన్న ప్రతిపక్షాల విమర్శలు.. అంతా సవ్యంగానే ఉందన్న అధికార పక్షం వాదనల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ ఒక కీలకమైన పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటోందనేది మాత్రం వాస్తవమని నిపుణులు పేర్కొంటున్నారు.