(--- Review By సూర్య ప్రకాష్ జోశ్యుల) ఇన్విస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ కు అభిమానులు ఎక్కువే. అందుకే ఆ తరహా డిటెక్టివ్ పుస్తకాలు, సినిమాలు బాగా పాపులర్ అవుతూంటాయి. ఇక ఇన్విస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ జానర్ ఫిల్మ్ అనగానే తెరపై జరిగే ఓ పజిల్ ని స్వయంగా సాల్వ్ చేయటమే. హీరోతో పాటు జర్నీ చేస్తూ...అతని ప్రక్కనే ఉంటూ ... ఆ పజిల్ విప్పుతూంటాడు. అది ఓ రకంగా మెదడుకి మేత. పొరలు పొరలుగా ఉన్న సస్పెన్స్ .... సీన్స్ లో పొగమంచు వీడుతున్నట్లు ఓపెన్ అవుతూంటే లీనమై చూసేవారికి ఆ అనుభూతి అద్బుతమే. మధ్య మధ్యలో ప్రేక్షకుడు ఊహకు అందని మలుపులు వస్తే అవి.. మరింత కిక్ పెంచుతాయి... ఇవన్నీ ఫెరఫెక్ట్ ఇన్విస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ లక్షణాలు.తాజాగా వచ్చిన ఈ చిత్రం వాటినన్నిటినీ మూటగట్టిందా? థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ ఇచ్చిందా...అసలు ఈ థ్రిల్లర్ లో జరిగే క్రైమ్ ఏమిటి...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి : విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్) ఓ ఇన్విస్టిగేటివ్ ఆఫీసర్. క్రైమ్ రేటు తగ్గించే హోమిసైడ్ ఇంటెర్వెన్షన్ టీమ్(హిట్)లో సభ్యుడు. అయితే అతను గత కొంతకాలంగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్ డీ) బాధపడుతూంటాడు. అతన్ని బాధాకరమైన కొన్ని జ్ఞాపకాలు వెంటాడుతూ ఇబ్బంది పెడుతూంటాయి. దాంతో అతని గర్ల్ ఫ్రెండ్, ఫోర్శనిక్ ఆఫీసర్ అయిన నేహా (రుహానీ శర్మ) రెస్ట్ తీసుకోమని ఒత్తిడి చేస్తుంటుంది. అతను కూడా ఆరు నెలలు శెలవు పెడతాడు. అయితే ఈ లోగా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ప్రీతి(సాహితి) అనే కాలేజ్ అమ్మాయి మిస్ అవుతుంది. ఈ మిస్సింగ్ డిపార్టమెంట్ కు ఛాలెంజ్ గా మారుతుంది. ఈ ఇన్విస్టిగేషన్ లో ఉండగానే ఈ కేసు డీల్ చేస్తున్న నేహా (రుహానీ శర్మ) సైతం కనిపించకుండా పోతుంది.
అయితే డిపార్టమెంట్ లో కొందరు నేహా మాయమవటం వెనక విక్రమ్ హస్తం ఉందని అనుమానిస్తూంటాడు. శెలవు కాన్సిల్ చేసుకుని రంగంలోకి దిగిన విక్రమ్ ...ఈ రెండు మిస్సింగ్ కేసులు వెనక లింక్ ఏదో ఉందని పసిగడితాడు. ఇన్విస్టిగేషన్ ముమ్మరం చేస్తాడు. డాట్స్ ని కలపటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రీతి ప్రెండ్, అమ్మానాన్నలు ఇలా ప్రతీ ఒక్కర్నీ అనుమానిస్తారు. ఈ క్రమంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తాయి. అవి ఏమిటి.. విక్రమ్ ఫైనల్ గా ఈ కేసుని ఎలా సాల్వ్ చేసాడు. నేరస్దుడు ఎవరు...అసలు నేహా ఏమైంది...ఆమె మిస్ అవటానికి, ప్రీతి మిస్సింగ్ కు లింక్ ఉందా..విక్రమ్ ని అనుమానించాల్సిన పరిస్దితులు డిపార్టమెంట్ లో ఏమి వచ్చాయి..అసలు విక్రమ్ కు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ రావటానికి కారణం ఏమిటి..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది.. : క్రైమ్ థ్రిల్లర్ లకి పెద్దగా కథ అవసరం ఉండదు. ఓ సాధారణమైన కథకి కొన్ని అసాధారణమైన ట్విస్ట్ లు జోడించిన థ్రిల్లర్‌గా రూపొందిస్తూంటారు. రీసెంట్ గా వచ్చిన రాక్షసుడు, అశ్వద్దామ అలాంటి కథలే. ఓ సైకో… కిడ్నాప్ డ్రామా.. వాడ్ని పట్టుకోవడానికి హీరో రంగంలోకి దూసి చేసే సాససాలు. కాబట్టి ఇవన్నీ చూసేవారికి రొటీన్ అంశాలే. కాకపోతే.. ఈ సారి హీరో...విలన్ ని ఎలా పట్టుకున్నాడు. ఏ విధమైన విభిన్నత మిగతా కథలతో ఉన్నది అన్నదే.. ప్రతీ కథలోనూ సేలబుల్ పాయింట్. ఈ విషయం ఇటువంటి జానర్స్ డీల్ చేసే దర్శకులకు తెలుసు. అందుకే ఈ కథలోనూ కొన్ని చిక్కుముడులు వేసాడు. అయితే వాటిని ఎంత తెలివిగా సాల్వ్ చేశాడన్న విషయం కన్నా ఎలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తూ డీల్ చేసాడన్నది చూపెట్టారు. దాంతో చూసేవారి మేథస్సుకు సెకండాఫ్ లో కొంతమేరకు సహన పరీక్ష ఎదురైంది.
ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లటం దాకా బాగానే చేసాడు. అలాగే తనతో పాటు కొంతసేపు పరిగెట్టించాడు. కానీ ఆ తర్వాతే ప్రేక్షకుడుకి తనకు పడ్డ బ్రహ్మముడి ని విదిలించేసుకున్నాడు. చూసేవాడి ఇంటిలిజెన్స్ లెవల్స్ డిస్ట్రబ్ చెయ్యటం మొదలెట్టాడు. దాంతో క్లైమాక్స్ లో చిక్కుముడులన్నీ విప్పగలిగినా జస్ట్ ఓకే అనిపించింది. ఏదైమైనా ఇలాంటి మర్డర్స్ మిస్టరీకు ఎండ్ సస్పెన్స్ ఫార్ములా... సినిమాని, అందులో హీరోని ప్యాసివ్ గా మార్చేస్తుందనే విషయం మర్చిపోకూడదు.
నిజంగా ఇలాంటి కథల్లో దర్శకుడికి అదే పెద్ద టాస్క్. ఇవన్నీ పర్‌ఫెక్ట్‌గా ఎంతవరకూ వర్కవుట్ అవుతూయి అనేదానిపైనే సక్సెస్ స్దాయి ఆధారపడి ఉంటుంది. నిజానికి ఈ సినిమాకు దర్శకత్వం వహించి, కథ, స్క్రీన్ ప్లే అందించిన రచయితకే ఇలాంటి కథల్లో మార్కులన్నీ పడిపోతాయి.కానీ అది కాస్త వీక్ గా ఉండటంతో విశ్వక్ సేన్ నటన హైలెట్ గా మారింది.
దేనికి ఓటు..? : విశ్వక్..న్యాచురల్ ఫెరఫార్మెన్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, అక్కడక్కడ వచ్చే ట్విస్ట్ లు
ఏది పోటు..? :ప్లాట్ నేరేషన్, చెప్పుకోదగ్గ హై మూవ్ మెంట్స్ లేకపోవటం, నీరసంగా ముగిసిన క్లైమాక్స్, సినిమాలో చూపెట్టిన క్రైమ్ లకు సరైన జస్టిఫికేషన్ లేకపోవటం, మైల్డ్ సెకండాఫ్, ఎమోషనల్ కనెక్టవిటీ లేకపోవటం
దర్శకత్వం,మిగతా విభాగాలు : ముందుగా ఈ సినిమాలో విక్రమ్ గా చేసిన విశ్వక్ సేన్...సెటిల్ట్ ఫెరఫార్మెన్స్ ని మెచ్చుకోవాలి. మంచి ఫైర్ ఉన్న నటుడు. ఖచ్చితంగా నెక్ట్స్ లెవిల్ కు వెళ్తాడు. ఇక ఇంతలా విశ్వక్ ని చూపించిన దర్శకుడు శైలేష్ కొలను సైతం సమర్దుడే అనిపిస్తుంది. అయితే అతను డిటేలింగ్ కు ఇచ్చిన ఫ్రిఫరెన్స్ ప్రేక్షకుడు పాయింటాఫ్ వ్యూకు ఇవ్వలేదు. దాంతో చాలా చోట్ల సినిమా నెమ్మిదించింది. మనకు తెలిసిందంతా లేదా రీసెర్చ్ చేసిందంతా సినిమాలో పెడితే డాక్యుమెంటరీలు తయారు అవుతాయి. ఎంత తెలుసుకున్నాం అని కాదు..ఎంత తక్కువ ఇన్ఫర్మేషన్ వాడి ఎక్కువ ఇంపాక్ట్ తెచ్చామన్నది ముఖ్యం అని తెలుసుకుంటే తెలుగుకు మరో మంచి డైరక్టర్ మిగులుతాడు. అలాగే చిలసౌ` ఫేమ్ రుహానీ శర్మ చేయటానికి పెద్దేమీలేదుకానీ కనపడినంతసేపు బాగుంది. మిగతా పాత్రల్లో చేసిన సీనియర్స్ ..ఎప్పటిలాగే నటించుకుంటూ పోయారు.
టెక్నికల్ గా చూస్తే.. : ఇలాంటి సినిమాలకు అవసరమేన సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్..రెండూ కలిసి వచ్చాయి. క్రైమ్ మూడ్ ని ఎలివేట్ చేస్తూ సాగిన కొన్ని విజువల్స్ సినిమాలో మరింత లీనమయ్యేలా చేసాయి. నిర్మాతగా నాని మంచి స్టాండర్డ్స్ ఉండేలా ఖర్చుపెట్టారు. ఎడిటర్ ..ఫస్టాఫ్ ..పస్ట్ క్లాస్ గా ఫాస్ట్ పేస్ తో నడిచేలా వర్క్ చేసినా, సెకండాఫ్ కు వచ్చేసరికి మైల్డ్ గా డల్ గా నత్త నడకనడుస్తన్నట్లు కట్ చేసాడు. మిగతా డిపార్టమెంట్స్ ..సినిమా స్దాయికి తగినట్లు బాగున్నాయి.
ఫైనల్ థాట్ : థ్రిల్లర్స్ అప్పుడప్పుడైనా థ్రిల్స్ ఇవ్వకపోతే ప్రేక్షకుల పాలిట అది పెద్ద క్రైమే.