
శ్రీ విష్ణు సినిమాలంటే కామెడీ పక్కా అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. నెమ్మదిగా మంచి కాన్సెప్ట్ చిత్రాలతో, కామెడీ చిత్రాలతో అలరిస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు. హీరోగా మంచి ఇమేజ్‌ని, మార్కెట్‌ని పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన `విష్ణు విన్యాసం` అనే చిత్రంలో నటించాడు. నయన సారిక హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి యుదాంత్ మారుతీ రావు దర్శకత్వం వహించారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ నాయుడు జి నిర్మించారు. హేమ అండ్ శాలిని సమర్పకులు. ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 27న) విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉంది? ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? శ్రీవిష్ణు నవ్వించడంలో సక్సెస్ అయ్యారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
విష్ణు(శ్రీవిష్ణు) జూ. లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. ఆయనకు జాతకాలంటే పిచ్చి. ఏం చేయాలన్నా జాతకాలను ఫాలో అవుతాడు. అదే కాలేజీకి ఫ్యాకల్టీగా వస్తోంది మనీషా(నయన సారిక). ఆమెకి అసిస్టెంట్‌గా విష్ణుని నియమిస్తారు. ఆమె చాలా బోల్డ్. సిగరేట్, మందు అలవాటు కూడా ఉంటుంది. పరిచయం అయిన ఫస్ట్ డేనే ఇవన్నీ చెబుతుంది. విష్ణుతో కలిసే తీసుకుంటుంది. ఆల్కహాల్ తీసుకున్నాక విష్ణుని ముద్దు అడుగుతుంది. దీంతో ఇదేదో తేడా బ్యాచ్ అనుకుంటాడు విష్ణు. అయితే మనీషాకి పెళ్లికాదు, ఎవరూ చేసుకునేందుకు ముందుకు రారు. తనని ఎవరూ అర్థం చేసుకోరు. కానీ విష్ణు తనపై పాజిటివ్‌గా ఉండటం, అర్థం చేసుకోవడంతో హ్యాపీ అవుతుంది మనీషా. ఆ విషయాన్ని చెప్పడంతో విష్ణు కూడా పడిపోతాడు. ఇద్దరు ప్రేమలో పడతారు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో తన జాతకంలో ఉన్న దోశం గురించి చెబుతుంది మనీషా. తనకు రెండు పెళ్లిళ్ల గండం ఉందని, మొదట పెళ్లి చేసుకున్న వాడు ఆరు నెలల్లో చనిపోతాడని చెబుతుంది. దీంతో షాక్ తిన్న విష్ణు.. ఆమెపై ప్రేమతో, ఆమెకే ఫిక్స్ అవుతాడు. పెళ్లి చేసుకుంటాడు. మరి ఆరు నెలల్లో విష్ణు చనిపోయాడా? పెళ్లి తర్వాత ఏం జరిగింది? మనీషా కోసం విష్ణు ఏం చేశాడు? ఇంతకి మనీషా అసలు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె జాతకం వెనుక దాగున్న కుట్ర ఏంటి? చివరికి ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది మిగిలిన కథ.
శ్రీవిష్ణు మంచి కామెడీ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇప్పుడు కూడా మంచి ఫన్ ఉన్న సబ్జెక్ట్ తోనే వచ్చాడు. విష్ణు పాత్ర చేసే విన్యాసాన్ని బెస్ చేసుకుని ఈ మూవీని రూపొందించారు. కథ కంటే సందర్భాను సారంగా జనరేట్ అయ్యే కామెడీని నమ్ముకుని తెరకెక్కించిన చిత్రం అని చెప్పొచ్చు. జాతకాల నేపథ్యంలో సాగుతుంది. అందులో దాగున్న మోసాలను చెబుతుంది. ఈ క్రమంలో దాని చుట్టూ అల్లుకున్న సంఘర్షణ, డ్రామానే సినిమా. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది. కామెడీని ప్రధానంగా చేసుకుని సినిమా రన్ అవుతుంది. మెయిన్‌గా శ్రీవిష్ణు పాత్ర చేసే కామెడీనే సినిమాకి హైలైట్. ఆయనే తన భుజాలపై నడిపించాడు. అయితే ఫన్ కోసం ఆయన చాలా కష్టపడ్డాడని చెప్పొచ్చు. సినిమా ఫస్టాఫ్ మొత్తం హీరోయిన్ పెళ్లి కాకపోవడం, ఆమె రివర్స్ గా పెళ్లి చేసుకోవాలని కలిసిన ప్రతి ఒక్కరిని అడగడం, మరోవైపు విష్ణు ఏం చేసిన లెక్క ప్రకారం చేయడం, ఈ ఇద్దరు కాలేజీలో కలవడంతో సినిమా ఎలా సాగబోతుందనేది చూపించారు. ఇద్దరు కలిశాక హీరోయిన్ చేసే చేష్టలు చాలా క్రేజీగా ఉంటాయి. అవి విష్ణుకి షాకిచ్చేలా ఉంటాయి. వాటిని తట్టుకుని, ఆయన కూడా మరింత క్రేజీగా రియాక్ట్ కావడం, విచిత్రమైన చేష్టలు చేయడం ఆకట్టుకుంది. ముఖ్యంగా విష్ణు చేసే కామెడీ క్రేజీగా ఉంటుంది. హిలేరియస్‌గా నవ్విస్తుంది. ఇంటర్వెల్ వరకు వీరిద్దరు ప్రేమ జర్నీని చూపించారు. ఇంటర్వెల్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్ కి విష్ణుకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. సెకండాఫ్‌లో తమ రిలేషన్‌ని నిలబెట్టుకునేందుకు తపించడం, ఈ క్రమంలో చేసే పనులు, నవ్వించేలా, ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయి. క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్‌గా ఉంటుంది. ఆలోచింప చేసేలా ఉంటుంది. పాత సినిమాల డైలాగ్‌లు, ఆర్పీ పట్నాయక్ పాటలు, ట్రెండీ డైలాగ్ తో విష్ణు చేసే విన్యాసం అదిరిపోయిందని చెప్పొచ్చు. దీనికితోడు ఇన్నోసెంట్‌గా హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ లు మరింత ఆకట్టుకుంటాయి. అయితే చాలా చోట్ల కామెడీ అంత సహజంగా వర్కౌట్ కాలేదు. బలవంతంగా ఇరికించినట్టుగా ఉంటుంది. శ్రీవిష్ణు చేసే విచిత్రమైన సౌండ్స్, డైలాగులు కొంత ఇబ్బందిగా ఉంటాయి. అలాగే కథ ఎంత సేపు అక్కడక్కడే తిరుగుతుంది. లాజిక్స్ వదిలేశారు. కొన్ని చోట్ల సీన్ల పరంగా క్లారిటీ మిస్ అయ్యింది. క్లైమాక్స్ మాత్రం బాగుందని చెప్పొచ్చు. కొన్ని సీన్లు అర్థంకాకుండా ఉంటాయి. ఇలాంటి కొన్ని మైనస్‌లు పక్కన పెడితే మంచి టైమ్ పాస్ నవ్వుకునేలా సినిమా అవుతుంది.
విష్ణు పాత్రలో శ్రీవిష్ణు ఇరగదీశాడు. విచిత్రమైన హవభావాలతో ఆకట్టుకున్నారు. నవ్వించారు. అదే సమయంలో ఆయన చేసే కొన్ని కామెడీ ట్రాక్‌లు పక్కదారి పట్టినట్టుగా ఉన్నాయి. మనీషాగా నయన సారిక చాలా బాగా చేసింది. ఇన్నోసెంట్‌గా అదరగొట్టింది. ఈ మూవీతో ఆమె పెద్ద రేంజ్‌కి వెళ్తుందని చెప్పొచ్చు. లుక్ పరంగా కట్టిపడేసింది. ఇక సత్య కామెడీ హైలైట్ అవుతుంది. అదే సమయంలో శ్రీనివాస్ రెడ్డి కూడా బాగా చేశాడు. మురళీ వర్మ సిద్ధాంతిగా కనిపించిన కాసేపు ఆకట్టుకున్నారు. సత్యం రాజేష్ పాత్ర మెప్పిస్తుంది. గోపరాజు రమణతోపాటు ఇతర పాత్రధారులు ఫర్వాలేదనిపించారు.
టెక్నీకల్‌గా మూవీ బాగానే ఉంది. రథన్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. పాటలు ఫర్వాలేదు. ఆర్ఆర్ మాత్రం అదిరిపోయింది. చాలా చోట్ల ఆర్‌ఆర్ కామెడీని హైలైట్ చేసింది. సాయి శ్రీరామ్ కెమెరా విజువల్స్ బాగున్నాయి. కనువిందు చేసేలా ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా లోపాలు కనిపిస్తున్నాయి. కథలో, సినిమా స్క్రీన్‌ప్లేలో క్లారిటీ మిస్ అయ్యింది. వెనకా ముందు అనేలా ఉంది. అలాగే దర్శకుడు యదునాథ్ మారుతీ రావు తీసుకున్న కథ చిన్నగా ఉంది. ఏం చెప్పాలనుకున్నారనేది క్లారిటీ లేదు. కాకపోతే కామెడీ ట్రాక్‌ని బాగానే రాసుకున్నారు. శ్రీవిష్ణు ఎక్కువ ఫ్రీడమ్ తీసుకుని చేసినట్టుంది. అయినప్పటికీ చాలా చోట్ల ఫన్ బాగానే వర్క్ అయ్యింది. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాణ విలువలకు కొరత లేదు.
`విష్ణు విన్యాసం`.. సరదాగా టైమ్ పాస్ కి నవ్వుకునే మూవీ. నవ్విస్తూ, హార్ట్ టచ్ చేస్తుంది.
రేటింగ్: 2.75