Vimanam Review: `విమానం` మూవీ రివ్యూ, రేటింగ్‌.. అనసూయ, సముద్రఖని అలరించారా?

First Published | Jun 9, 2023, 8:03 AM IST

సముద్రఖని మెయిన్‌ లీడ్‌గా తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌గా `విమానం` సినిమా రూపొందింది. శివ ప్రసాద్‌ యానాల దర్శకత్వం వహించారు. అనసూయ, రాహుల్‌ రామకృష్ణ, ధన్‌రాజ్‌, మీరా జాస్మిన్‌(రీఎంట్రీ) ప్రధాన పాత్రల్లో నటించారు.  ఈ చిత్రం నేడు శుక్రవారం(మే9న) విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

సముద్రఖని నటుడిగా తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు. అద్భుతమైన నటనతో మనలో ఒకరిగా మారిపోయారు. ఓ వైపు పవన్‌ కళ్యాణ్‌ తోనూ `బ్రో` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఆయన మరోవైపు నటుడిగానూ మెప్పిస్తున్నారు. సముద్రఖని మెయిన్‌ లీడ్‌గా తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌గా `విమానం` సినిమా రూపొందింది. శివ ప్రసాద్‌ యానాల దర్శకత్వం వహించారు. అనసూయ, రాహుల్‌ రామకృష్ణ, ధన్‌రాజ్‌, మీరా జాస్మిన్‌(రీఎంట్రీ) ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రం నేడు శుక్రవారం(మే9న) విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందో రివ్యూ(Vimanam Review)లో తెలుసుకుందాం. 
 

కథః 

2008 హైదరాబాద్‌లో జరిగే కథ ఇది. వీరయ్య(సముద్రఖని) వికలాండుగు, తనకి ఒక్కడే కొడుకు రాజు(మాస్టర్‌ ధృవన్‌). భార్య చనిపోయింది. దీంతో స్థానిక బస్తీలో వారసత్వంగా వచ్చిన సులభ్‌ (టాయిలెట్స్) కాంప్లెక్స్ ని నడిపిస్తూ కొడుకుని చదివించుకుంటాడు. రాజుకి విమానం అంటే పిచ్చి, విమానం కనిపించిందంటే అన్ని మర్చిపోతాడు. దాన్ని చూసేందుకు రోజూ ఎయిర్‌పోర్ట్ కి వెళ్తుంటాడు. తనని విమానం ఎక్కించు నాన్న అని ప్రతి రోజూ తండ్రిని అడుగుతుంటాడు. బాగా చదువుకుంటే పెద్దాయ్యక నువ్వే విమానం ఎక్కుతావని చెబుతుంటాడు వీరయ్య. ఈ క్రమంలో అనూహ్యంగా ఓ రోజు రాజు కళ్లు తిరిగి కిందపడిపోతాడు, ఆసుపత్రికి తరలించగా లుకేమియా(బ్లడ్‌ క్యాన్సర్‌) అని తేలుతుంది. దీంతో కొడుకు కోరికని నెరవేర్చాలని, విమానం ఎక్కించాలని నిర్ణయించుకుంటాడు. కానీ డబ్బు లేదు. అందుకోసం వీరయ్య ఏం చేశాడు? కొడుకుని విమానం ఎక్కించాడా? కొడుకు కోరిక తీర్చేందుకు వీరయ్య ఎలాంటి బాధలు పడ్డాడు? ఇందులో వేశ్య సుమతి(అనసూయ), కోటిగాడు(రాహుల్‌ రామకృష్ణ), ఆటోడ్రైవర్‌ డేనియల్‌(ధన్‌రాజ్‌) పాత్రలకు, వీరయ్యకి సంబంధం ఏంటి? చివరికి ముగింపు ఏంటనేది మిగిలిన కథ. Vimanam Review.
 

Latest Videos


విశ్లేషణః

తండ్రి కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో, కొడుకు చివరి కోరిక నెరవేర్చడం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. కానీ పూర్తిగా సినిమా మొత్తం ఆ రిలేషన్‌ షిప్‌ నేపథ్యంలో సాగే సినిమాలు ఇటీవల అరుదు. ఇది పూర్తిగా తండ్రి కొడుకుల మధ్య బాండింగ్‌ నేపథ్యంలో సాగుతుంది. అదే సమయంలో కొడుకు చివరి కోరిక తీర్చడం కోసం తండ్రి పడే పాట్ల నేపథ్యంలో సినిమా సాగుతుంది. అయితే ఇది చాలా వరకు ఎమోషనల్‌ రైడ్‌లా ఉంటుంది. కొడుక్కి సమస్య ఉందన్నప్పుడు తండ్రి పడే బాధ వర్ణించలేనిది, పైగా తల్లి లేకపోవడంతో ఆ బరువు మొత్తం తండ్రినే మోయాలి, దీనికితోడు ఆయన వికలాంగుడు. ఈ బాధలు తెరపై చూసినప్పుడు గుండె బరువెక్కిపోతుంది. కొడుకు కోరికలను నెరవేర్చలేని స్థితికి తండ్రి ఎంత బాధపడతాడో, థియేటర్లలో కూర్చొన్న ఆడియెన్స్‌ కూడా అంతే బాధగా ఫీలవుతారు. సినిమాలో తండ్రి బాధని థియేటర్లలో కూర్చొన్న మనం ఫీలవుతాం. అంతగా కనెక్ట్ అయ్యేలా దర్శకుడు శివ ప్రసాద్‌ ఈ సినిమాని నడిపించారు. ఆద్యంతం ఎమోషనల్‌ పంథాలో సినిమాని ముందుకు తీసుకెళ్లారు. దీంతో ఓ రోలర్‌ కోస్టర్‌లా సాగుతుంది.

సినిమాగా చూస్తే, మొదటి భాగం మొత్తం కథని, పాత్రలని ఎస్టాబ్లిష్‌ చేయడానికే ప్రయారిటీ ఇచ్చాడు దర్శకుడు. తండ్రి కొడుకుల అనుబంధానికి ఎక్కువ టైమ్‌ తీసుకున్నారు. దీనికితోడు ఇతర పాత్రలతో వీరయ్య పాత్రకు ఉన్న రిలేషన్‌షిప్‌, బస్తీలోని పరిస్థితులను కళ్లకి కట్టినట్టు చూపించారు. కాకపోతే దానికి ఎక్కవ టైమ్‌ తీసుకున్నారు. ఈ క్రమంలో కథ ఎంతకు ముందుకు సాగదు, స్లో అనే ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే మధ్య మధ్యలో రాహుల్‌ రామకృష్ణ, అనసూయకి మధ్య వచ్చే సన్నివేశాలతో కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యారు. వేశ్యగా అనసూయ వెయ్యి రూపాయలు ఇస్తే ఎవ్వడైనా నాకు ఓకే అంటూ చెప్పడం, వెయ్యి రూపాయల కోసం రాహుల్‌ రామకృష్ణ పాట్లు పడటం సరదాగా సాగుతుంది. ఎమోషనల్‌ రైడ్‌ నుంచి రిలీఫ్‌నిస్తుంది. మరోవైపు ధన్‌రాజ్‌ పాత్రతోనూ కొంత కామెడీ పండించాడు. ఈ పాత్రలకు ఎంటర్టైన్‌మెంట్‌ బాధ్యతలు తీసుకున్నాయి. అలాగే స్కూల్లో రాజు, అతని ఫ్రెండ్స్ మధ్య వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. 
 

ఇక సెకండాఫ్‌ మొత్తం ఎమోషనల్‌గా మారిపోయింది. కథ సీరియస్‌ గా మారుతుంది. వరుసగా వీరయ్యని కష్టాలు వెంటాడుతుంటాయి. అవి కొంత బాధ అనిపిస్తుంది, అదే సమయంలో కొంత అతి అనే ఫీలింగ్‌ కలుగుతుంది. డ్రామా ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. ఆ విషయంలో దర్శకుడు సినిమాటిక్‌ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు. క్లైమాక్స్ లో ఆ ఎమోషన్స్ ని పీక్‌లోకి తీసుకెళ్లారు. హార్ట్ టచ్చింగ్‌గా మార్చారు. క్లైమాక్స్ లోని అతిపెద్ద ట్వీస్ట్ గుండెల్ని బరువెక్కిస్తుంది. అయితే మొదటి భాగంలో కథని వేగంగా నడిపించి ఉంటే, ప్రీ క్లైమాక్స్ వరకు వినోదానికి ఎక్కువ స్కోప్‌ పెట్టి ఉంటే సినిమా మరింత బాగుండేది. దీనికితోడు క్లైమాక్స్ ఏంటనేది ముందే ఊహించినట్టుగా లీడ్‌ తీసుకోవడం సినిమాకి పెద్ద డ్రా బ్యాక్‌. ఇంటర్వెల్‌ వచ్చేసరికి ఆడియెన్స్ కి క్లైమాక్స్ అర్థమయ్యేలా ఉండటం మైనస్‌గా చెప్పొచ్చు. ఆ సస్పెన్స్ ని చివరి వరకు మెయింటేన్‌ చేయాల్సింది. 
 

నటీనటులుః
వీరయ్య పాత్రలో సముద్రఖని అద్భుతంగా చేశాడు. పాత్రలో జీవించారు. తండ్రిగా కళ్లలో, గుండెల్లో ఎన్నో బాధలు దిగమింగుకుని దాన్ని ఫేస్‌లో హవభావాలు పలికించిన తీరు సూపర్‌. ఆయన చాలా చోట్ల కన్నీళ్లు పెట్టిస్తాడు. తెలుగులో ఎక్కువగా విలన్స్ రోల్స్ తో మెప్పించిన ఆయన ఇందులో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. ఇక కొడుకు పాత్రలో ధృవన్‌ సైతం బాగా చేశాడు. అతని పాత్రకూడా ఆకట్టుకుంటుంది. హృదయాన్ని బరువెక్కిస్తుంది. కోటిగాడు పాత్రలో రాహుల్‌ రామకృష్ణ ఇరగదీశాడు. పాత్రకి ప్రాణం పోశాడు. అలాగే వేశ్య సుమతిగా అనసూయ సైతం పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. ఆమెని తప్ప ఆ పాత్రలో మరెవ్వరినీ ఊహించుకోలేం అనేట్టుగా ఆమె అదరగొట్టింది. కాకపోతే అంత అందమైన అమ్మాయి చిన్న బస్తీలో ఉండటమే కన్విన్సింగ్‌గా అనిపించదు. కానీ అనసూయ, రాహుల్‌ రామకృష్ణల మధ్య వచ్చే కామెడీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వీరితోపాటు ఆటో డ్రైవర్‌గా ధన్‌రాజ్‌ కామెడీ నవ్విస్తుంది. చివర్లో మీరా జాస్మిన్‌ రోల్‌ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఆమె రీఎంట్రీ బాగుంది.

టెక్నీషియన్ల పనితీరుః
మ్యూజిక్‌ సినిమాకి పెద్ద అసెట్‌. చరణ్‌ అర్జున్‌ పాటలు, బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాని నడిపిస్తుంది. దానితో ఆడియెన్స్ ని ట్రావెల్‌ చేయిస్తుంది. పాటలు కథలో భాగంగా వస్తూ ఆహ్లాదాన్ని పంచుతాయి. వివేక్‌ కాలేపు కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ గా సినిమా రిచ్‌గా ఉంటుంది. చిన్న సినిమా అనే ఫీలింగ్‌ లేకుండా చేస్తుంది. చాలా కెమెరా యాంగిల్స్ సహజత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఎడిటర్‌ మార్తాండ్‌ కె వెంకటేష్‌ సినిమాని మరికొంత షార్ప్‌ చేయాల్సింది. కిరణ్‌ కొర్రపాటి, జీ స్టూడియోస్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కొదవలేదు. ఇక అప్‌కమింగ్‌ డైరెక్టర్‌ శివ ప్రసాద్‌ యానాల దర్శకుడిగా సక్సెస్‌ అయ్యాడు. తాను అనుకున్న ఎమోషన్స్ ని, ఫీల్‌ని సినిమాలో క్యారీ అయ్యేలా చేశాడు. సినిమాని ఫీల్‌ గుడ్‌ ఎమోషనల్‌ రైడ్‌గా తెరకెక్కించాడు. కొంత ల్యాగ్‌, అతి డ్రామా తగ్గించి ఉంటే బాగుండేది. వినోదం పాళ్లు పెంచి, సినిమా ఆసాంతం ఎంటర్‌టైనింగ్‌గా నడిపించి, చివర్లో ఎమోషనల్‌గా మారిస్తే సినిమా నెక్ట్స్ లెవల్‌లో ఉండేది. 
 

ఫైనల్‌గాః ఫీల్‌గుడ్‌, ఎమోషనల్‌ రైడ్‌. 

రేటింగ్‌ః 2.75

నటీనటులు : స‌ముద్రఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధనరాజ్, రాజేంద్ర‌న్ తదితరులు
మాటలు : హను రావురి
ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు
పాటలు, సంగీతం : చరణ్ అర్జున్
నిర్మాణం : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి
రచన, దర్శకత్వం : శివ ప్రసాద్ యానాల
 

click me!