Viduthala Part 1
ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ కథను చెప్పడంలో ఆయన ఎంచుకునే విధానం క్లాసిక్ గా ఉంటుంది. అందుకే ఆయనకు తమిళనాడులో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన డైరక్ట్ చేసిన తాజా చిత్రం “విడుతలై_1” పేరుతో మార్చి 31న విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ షోస్ తో రన్ అవుతున్నది. దీంతో ఈ సినిమాపై అల్లు అరవింద్ ఫ్యాన్సీ రేటుకు సినిమా డబ్బింగ్ హక్కులను తీసుకుని రిలీజ్ చేసారు. ఈ సినిమా ఎలా ఉంది..అసలు కథేంటి ..తెలుగు వారికి నచ్చే కంటెంట్ ఉందా?
స్టోరీ లైన్:
నిజాయితీ, భావోద్వేగం,మానవత్వం ఇంకా మిగిలి ఉన్న పోలీస్ ఉద్యోగి కుమరేశన్ (సూరి). పోలీస్ డిపార్ట్ మెంట్ లో డ్రైవర్ గా పని చేసే అతనికి ఓ వివాదస్పద ప్రదేశంకు ట్రాన్సఫర్ అవుతుంది. అక్కడ ప్రజాదళందే పై చేయి. ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను 'ప్రజా దళం' వ్యతిరేకిస్తూ... ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకుంటుంది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో గనుల వెలికితీతను నిరసిస్తూ బాంబుల ద్వారా రైలును పేల్చేస్తుంది. పోలీస్ లు ఎనకౌంటర్లు అక్కడ కామన్ అయ్యిపోతాయి. ఈ క్రమంలో ఎలాగైనా ప్రజా దళం నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ని పట్టుకోవడానికి పోలీస్ లు ప్రయత్నిస్తూంటారు. స్పెషల్ ఆఫీసర్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఆంధ్వర్యంలో 'ఆపరేషన్ గోస్ట్ హంట్' పేరుతో పోలీసులు రాత్రింబవళ్లూ వెతుకుతూంటారు.
అక్కడకు డ్రైవర్ గా వెళ్లిన కుమరేశన్ (సూరి) పోలీసులకు భోజనం క్యారేజీలు ఇవ్వటం, తేవటం చేస్తూ ఉంటాడు. ఈలోగా పెరుమాళ్ ఆచూకి కోసం ... పోలీసులు కొండ ప్రాంతం లో వున్న పురుషులు, మహిళలు అందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పడేసి చిత్రహింసలు పెట్టడం మొదలెడతారు. అందులో కుమరేశన్ ఇష్టపడే అమ్మాయి కూడా ఉంటుంది. వాళ్ళకి పెట్టె చిత్రహింసలు చూడలేక కుమరేశన్ తనకి పెరుమాళ్ళు మాస్టర్ ఎక్కడున్నాడో తెలుసు, చూపిస్తా, అయితే ఆ కొండ ప్రజలందరినీ విడిచి పెట్టాలనే షరతు పెడతాడు. ఇంతకీ అసలు ఈ పెరుమాళ్లు ఎవరు, ఎక్కడుంటాడు, కుమరేశన్ నిజంగానే చూపెడతాడా , ఏమవుతుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
కల్ట్ కంటెంట్ తో సామాజిక మూలలలోకి వెళ్లి కథలని తెర పై ఆవిష్కరించటంలో వెట్రిమారన్ కు తిరుగులేదు. సామాజిక అంశాలతో కూడిన కథలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టే దర్శకుడిగా వెట్రిమారన్ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారనటంలో అతిశయోక్తి లేదు. దాంతో ఖచ్చితంగా ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే సిని అభిమానుల్లో అంచనాలు ఉంటాయి. అంతర్లీనంగా సమాజంలో అణచివేయబడుతున్న ఒక వర్గం వేదనను తన సినిమాల్లో ప్రతిబింబించే ఆయన భావజానికి వాళ్లు, వీళ్లు అనే తేడా లేకుండా అందరూ కనెక్ట్ అవుతూంటారు. ఈ విషయం మనకు ధనుష్ తో చేసిన ఆడుకాలం, వడా చెన్నై, అసురన్ సినిమాలు చూస్తే అర్దమవుతుంది. తెలుగులోనూ కొందరు దర్శకుడు వెట్రిమారన్ స్టైల్ ని అనుకరించే ప్రయత్నిస్తూంటారు అంటేనే ఆయన సత్తా ఏంటి అనేది పూర్తిగా అర్ధమైపోతుంది. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. వెట్రిమారన్ చేసే సినిమాలు తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ అయిన కూడా తెలుగు ప్రేక్షకులకి అస్సలు కనెక్ట్ కావటం లేదు. అందుకు ప్రాంతీయను ఎక్కువగా చూపించే వెట్రిమారన్ మేకింగ్ స్టైల్ తో కూడిన కథలు ఓ కారణం కావచ్చజు. తెలుగులో కమర్షియల్ హంగులు హీరోయిజం ఎక్కువగా ఉండాలి అవి... డ్రామా ప్రధానంగా నడిచే వెట్రిమారన్ సినిమాల్లో కనపడకపోవచ్చు. ఈ క్రమంలో వచ్చిన విడుదలై పై అందరి దృష్టీ పడింది. అయితే అందరినీ ఆకట్టుకునే సినిమాలా మాత్రం అనిపించటం లేదు.
viduthalai shooting spoot
తమిళనాట ప్రముఖ రచయితగా పేరుగాంచిన బి.జయ మోహన్ రాసిన ‘తునైవన్’ అనే చిన్న కథ ఆధారంగా ఈ సినిమా తీసారు. జయమోహన్ ఈ సినిమాకు వెట్రిమారన్ తో కలిసి స్క్రీన్ ప్లే సైతం రాసారు. హక్కు, బాధ్యత మధ్య ఎంతటి సంఘర్షణ ఉంటుందో ఈ కథ ద్వారా జయమోహన్ చెప్పే ప్రయత్నం చేసారు. అయితే షార్ట్ స్టోరీని పెద్ద సినిమాకు స్క్రీన్ ప్లే గా రాసేందుకు చాలా కసరత్తు చేయాలి. అందులోనూ రెండు భాగాల సినిమా ఇది. ఈ క్రమంలో జరిగిందేమిటంటే..ఇప్పుడు మనం చూసిన ఫస్ట్ పార్ట్ లో ఏమి జరగదు. మనం ఎవరికోసం అయితే సినిమాకు వెళ్తామా ఆ విజయసేతుపతి గెస్ట్ రోల్ కు ఎక్కువ ప్రధాన పాత్రకు తక్కువ అన్నట్లుగా ఉంటుంది. సెకండ్ పార్ట్ కోసం దాచేరామో. ఎక్కడా ప్రధాన పాత్రలు సూరి, విజయసేతుపతి ల మధ్య కాంప్లిక్ట్స్ ఎస్టాబ్లిష్ కాదు. నో కాంప్లిక్ట్స్ ..నో డ్రామా కదా. దాంతో ఎవరి దోవ వాళ్లదన్నట్లు కథ నడుస్తూంటుంది. తమిళవాళ్లకు పరిచయం ఉన్న సూరి కాబట్టి అతన్ని ఫాలో అవుతూంటారు వాళ్లు. కానీ మనం మనకు తెలుసున్న విజయ్ సేతుపతి ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తూంటాము. సినిమాలో అతని పాత్ర పెద్దగా లేకపోయేసరికి పెద్ద నిట్టూర్పి విడిచి థియేటర్ నుంచి బయిటకు వస్తాము. సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తామా అంటే చెప్పలేం. మొన్న పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 పరిస్దితి లాంటిది. తెలిసిన ఆర్టిస్ట్ లు అయినా తెలియని చరిత్రను డైజస్ట్ ఎలా చేసుకోలేమో ..ఇక్కడ అసలేమీ జరగక..వెట్రిమారన్ కోసం విజయ్ సేతపతి కోసం వచ్చి చూసి అలిసిపోతాము. ఏదైమైనా వెట్రి మారన్ తీసేది ప్రతీది 'అసురన్' కాదు...తమిళం నుంచి డబ్బింగై 'విడుదల' అయ్యే ప్రతీ సినిమా గొప్పదీ కాదు అనిపిస్తుంది.
viduthalai
టెక్నికల్ గా...
నేటివిటి ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని తమిళం సినిమా అని చూస్తే గొప్పగా తీసారు అనిపిస్తుంది. లేకపోతే ఆ నేటివిటి ఇబ్బంది పెడుతుంది. ఇక వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ మనని ఎనభైల్లోకి తీసుకెళ్ళటంలో సఫలీకృతమైంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం గొప్పగా కథతో కలిసి ప్రయాణిస్తుంది.కాకపోతే ఉన్న రెండు పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథలో కలిసిపోయి ప్రయాణించింది. విడిదా ఇది బాగుంది అని గుర్తించలేనంతగా. క్లైమాక్స్ యాక్షన్ సీన్లు స్పెషల్ గా డిజైన్ చేసారు. బాగున్నాయి. ఎడిటింగ్ కాస్త స్లోగా ప్రయాణిస్తున్న ఫీల్ తెచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. వెట్రిమారన్ డైరక్షన్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది.
నటీనటుల్లో....
ఇన్నాళ్లూ సూరిని కమిడియన్ గా చూసిన మనం ఆశ్చర్యపోతాం. విజయ్ సేతుపతి కనపడేది అతి తక్కువ సేపు. కానీ ఎదురుచూపులుకు తగ్గ ఫలితం లభించింది. హీరోయిన్ భవానీ శ్రీ ఫెరఫెక్ట్. డీఎస్పీగా గౌతమ్ మీనన్ గతంలో చేసిన పాత్రలకు ఎక్సటెన్షన్.
viduthalai shooting spoot
ఫైనల్ థాట్:
ఈ సినిమా టైటిల్ ..సూరిని కామెడీ ఇమేజ్ నుంచి 'విడుదల' చేసాను అని చెప్పటానికి పెట్టారేమో.
రేటింగ్ :2.5
---సూర్య ప్రకాష్ జోశ్యుల