రాఘవా లారెన్స్ 'రుద్రుడు' రివ్యూ

First Published | Apr 14, 2023, 2:57 PM IST


రాఘవా లారెన్స్ (Raghava Lawrence) కొంత విరామం తర్వాత హీరోగా నటించిన సినిమా 'రుద్రుడు' (Rudhrudu Movie). ప్రచార చిత్రాలు చూస్తే పక్కా మాస్ కమర్షియల్ తమిళ సినిమా అని తెలుస్తూ ఉంది. 

Rudrudu Movie Review

డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన లారెన్స్ కు మాస్ హీరోగా నిలబడాలని ఎప్పటినుంచో కోరిక. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్స్  లో ఒకడిగా నిలిచినా ఆ కోరిక మాత్రం తీరలేదు. అంతేకాదు డాన్స్ మాస్టర్ గానే కాకుండా, డైరెక్టర్ గా అనేక సూపర్ హిట్ సినిమాలు తీసి తన సత్తా ఏంటో బాక్స్ ఆఫీస్ కి చూపించాడు.   అయితే ఈ మధ్యన కాస్త గ్యాప్ తీసుకుని... కేవలం యాక్టర్ గానే ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే రుద్రుడు (Rudrudu) అనే సినిమాలో హీరోగా నటించాడు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది...చిత్రం కథేంటి,లారెన్స్ ని పూర్తి మాస్ హీరోగా నిలబెట్టే చిత్రమేనా వంటి విషయాలు చూద్దాం.
 

Raghava Lawrence Rudrudu


స్టోరీ లైన్:


తన తండ్రి లా బిజినెస్ లోకి రావటం ఇష్టపడని రుద్ర (లారెన్స్‌)  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరతాడు. అక్కడ పరిచయమైన అనన్య (ప్రియాభవాని శంకర్‌)ను పెళ్లి చేసుకుంటాడు.  తన తండ్రి చనిపోవటం, అప్పులు ఉండటంతో వేరే దారి లేని స్థితిలో తన కంపెనీ ద్వారా అమెరికా వెళతాడు రుద్ర. అక్కడ నుంచి డబ్బులు పంపిస్తుంటాడు. భార్య, తల్లి ఇండియాలోనే వుంటారు. ఓసారి తన భార్య అమెరికా వస్తుంది. తల్లిని ఒంటరిగా వదిలి వచ్చావేమిటి అని అడిగి రెండు రోజులు తర్వాత తిరిగి అనన్యను ఇండియా పంపిస్తాడు రుద్ర. ఇక ఆ తర్వాత అనన్య కనిపించకుండా పోతుంది. తల్లి చనిపోతుంది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ఇండియా వచ్చిన రుద్రకు షాకింగ్‌ నిజాలు తెలుస్తాయి. 

దాంతో రుద్ర...  విశాఖలో ఎదురులేని  క్రిమినల్  భూమి (శరత్ కుమార్) ఎటాక్ స్టార్ట్ చేస్తాడు.   అటువంటి భూమి మనుషులను రుద్ర చంపేస్తాడు. ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రుద్ర...ఎందుకు హంతకుడు అయ్యాడు?  తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అనన్య (ప్రియా భవానీ శంకర్) ఏమైంది? రుద్ర జీవితంలో ఏం జరిగింది? రుద్రుడిగా మారి ఎందుకు రక్త చరిత్ర రాశాడు?  రుద్ర, భూమికి సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

Latest Videos


కథా, కథన విశ్లేషణ

నిజానికి ఇందులో ఓ కొత్త పాయింట్ ఉంది. ఎన్నారైల తల్లి,తండ్రులు చాలా మంది ఇక్కడ ఒంటిరిగా ఉంటున్నారు. వారిని చంపేసి లేదా భయపెట్టి ఇక్కడ వారి ఆస్దులును కొంతమంది సంఘ విద్రోహ శక్తులు రాయించుకుంటున్నాయి. ఆక్రమిస్తున్నాయి. ఈ పాయింట్ తీసుకుని కథ చేసారు. కానీ కేవలం ఈ పాయింట్ వరకే కొత్త గా ఉంటుంది. మిగతాదంతా  పరమ రొటీన్ స్టోరీ లైనే. ఓ విలన్ ..హీరో కుటుంబానికి హాని తలపెట్టాడు. దాంతో హీరో రెచ్చిపోయి విలన్ అంతం చూస్తూంటాడు. ఇలాంటివి మనం బోలెడు చూసి ఉన్నాం. అయితే ఇంత రొటీన్ కథను కూడా వైవిధ్యంగా చెప్పగలిగితే బాగుండేది. అలా కాకుండా 'రుద్రుడు' మొదటి షాట్ నుంచి  శుభం కార్డు పడే వరకూ... ఒకటే పద్దతిలో వెళ్తూంటాడు. కమర్షియల్ మీటర్ చూసుకుంటూ సీన్స్ వెళ్లిపోతూంటాయి.  హీరో ఇంట్రడక్షన్, ఆ తర్వాత  హీరోయిన్ ని లైన్ లో పెట్టే ట్రాక్, మధ్యలో మధ్యలో తల్లితో ఎమోషనల్ సీన్స్,  విలన్ ఇంట్రడక్షన్...హీరో కుటుంబాన్ని వేసేయటం..అక్కడ నుంచి హీరో అపర రుద్రుడై పగ తీర్చుకోవటం.. లారెన్సే స్వయంగా ఇలాంటి కథలు చేసాడు. పోనీ ఎంత రొటీన్ కథ అనుకున్నా విలన్ పాత్ర స్ట్రాంగ్ గా ఉండి ..ఎమోషన్స్ రైజ్ చేయగలిగితే బాగుండేది. అలాంటిదేమీ జరగదు. పొరపాటున కూడా  ఎక్కడ కొత్తదనం లేకుండా జాగ్రత్త పడ్డారు. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఇలాంటి సినిమాలు ఈ మద్యకాలంలో ఎవరూ చేయటం లేదు. దాంతో సినిమా మధ్యలో మనం వేరే ఆలోచనలోకి వెళ్లి కొన్ని సీన్స్ మిస్సైనా... కన్ఫూజ్ అయ్యేదేమీ అనిపించదు. ముఖ్యంగా సినిమాలో ట్విస్ట్ లు అన్నీ మాగ్జిమం సగటు సిని ప్రేక్షకుడు ఊహించేస్తాడు. కొత్తలేని ఈ కథకు కొత్తగా స్క్రీప్లే రాసేదేముంది అనుకున్నారేమో పూర్తిగా వదిలేసారు. లాజిక్ అనే మాటను ఈ సినిమాలో వెతక్కూడదని ఫిక్స్ అయ్యినట్లున్నారు.
 


టెక్నికల్ గా...

ఈ సినిమాలో డైరక్టర్ కన్నా ఎక్కువ కష్టపడింది ఫైట్స్ కొరియోగ్రాఫర్. వరస పెట్టి ఫైట్స్ చేసుకుంటూ వెళ్లిపోవటమే అన్నట్లు సీన్స్ వచ్చి పోతూంటాయి. మనకు అలవాటైన ఓ స్టార్ హీరోనే అలా అర్దం పర్దం లేకుండా ఫైట్స్ చేస్తే బోర్ అంటాం. అలాంటిది మాస్ హీరో ఇమేజ్ లేని లారెన్స్ చేస్తూంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. దానికి తోడు ఈ ఫైట్స్ కు  తగ్గేదేలే అన్నట్లు  జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం.అలాగే పాటలు బాగున్నాయి. లారెన్స్ డాన్స్ మాస్టర్ కావటంలో పాటల్లో మంచి గ్రేస్ కనపడింది. అలాగే  ప్రొడ్యూసరే డైరక్టర్ కావటంతో బాగానే ఖర్చు పెట్టారు. విలన్ హీరోల మధ్య  సీన్స్  రక్తికట్టలేదు. లవ్ ట్రాక్ అంతంత మాత్రమే.  కెమెరా వర్క్, ఎడిటింగ్ ...బాగున్నా..వాటికి ఇలాంటి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు ఏమి రాదు. డైరక్షన్ గురించి ఏం చెప్పుకుంటాం. 


నటీనటుల్లో ...

లారెన్స్ కు ఒక స్టయిల్ వుంది. ముని, కాంచన సీరిస్ లలో వచ్చిన  కథలు ఆ స్టయిల్ వర్క్ అవుట్ అవుతుంది కానీ ఇలాంటి కథలకు అస్సలు నప్పదు. అతని బాడీ లాంగ్వేజ్ ఇలాంటి మాస్ సీన్స్ కు అతకక అతిగా ఉంది.   హీరోయిన్ ప్రియాభవాని శంకర్‌అందంగా వుంది కానీ ఆమెకి పెద్దగా సీన్స్ లేవు.   తండ్రి పాత్ర లో నాజర్, తల్లిగా పూర్ణిమ ఆకట్టుకుంటాడు. శరత్ కుమార్  విలన్ చేశారు కానీ క్యారక్టర్ లో డైలాగులు తప్ప స్టఫ్ లేదు.  మిగతానటులు అంతా పరిథి మేర కనిపించారు.

Rudhran 2

 
ఫైనల్ థాట్

మాస్ సినిమాలు చేయటానికి చాలా మంది స్టార్ హీరోలు తెలుగు,తమిళంలో ఉన్నారు. లారెన్స్  వంటి వారు ఏదన్నా కొత్తగా, వెరైటీగా చేస్తేనే చూస్తారు. కాలం చెల్లిన ఇలాంటి కథలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.లేకుంటే జనమే దూరం పెట్టేస్తారు.

Rating:2

rudhran


నటీనటులు : రాఘవా లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు
ఛాయాగ్రహణం : ఆర్.డి. రాజశేఖర్
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
రచన, దర్శకత్వం, నిర్మాణం : కతిరేశన్!
తెలుగులో విడుదల : 'ఠాగూర్' మధు 
విడుదల తేదీ: ఏప్రిల్ 14, 2022

click me!