Saindhav telugu Movie Review
తనకున్న ఫ్యామిలీ ఇమేజ్ ని ప్రక్కన పెట్టి యాక్షన్ జానర్ లోకి వచ్చి హిట్ కొడదామని వెంకటేష్ చేసిన సినిమా ఇది. 'హిట్' సీరిస్ తో హిట్ల ట్రాక్ లో ఉన్న యంగ్ డైరక్టర్ సాయింతో ఈ ప్రయత్నం చేసారు. మరి ధర్మ చక్రం, గణేష్, లక్షీ, తులసి సినిమాల తరహాలో యాక్షన్ సీక్వెన్సులు పండాయా. సినిమాని నిలబెట్టాయా. ఈ సంక్రాంతికి తన వాటా అందుకుంటాడా..సినిమా కథేంటి, ట్రైలర్ లో చూపించిన 17 కోట్లు ఇంజక్షన్ మ్యాటరేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
చంద్రప్రస్థలో పోర్ట్ లో పనిచేసుకుంటూ ,తన కూతురు గాయత్రి (సారా పాలేకర్) తో ప్రశాంతంగా,హ్యాపీగా ఉంటూంటాడు సైంధవ్ కోనేరు (వెంకటేష్). ఓ రోజు గాయత్రి ఉన్నట్లుండి పడిపోవటంతో డాక్టర్ దగ్గరకు వెళ్తే..పాపకు ఎస్ఎంఏ వ్యాధి ఉందని, బతకాలంటే రూ. 17 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ చేయాలని చెప్తారు. పోర్ట్ లో పనిచేసే ఓ సామాన్యమైన ఉద్యోగి అయిన సైంధవ్ ...ఆ ఇంజక్షన్ కొనే స్ధోమక ఉండదు. కానీ కూతురుని బ్రతికించుకోవాలి. ఇలాంటి పరిస్దితుల్లో సైంధవ్ ఉండగా.. మరో ప్రక్క ఆ పోర్ట్ లో డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణ బయిటపడుతుంది. కష్టమ్స్ అధికారి సీజ్ చేస్తే అతన్ని చంపటానికి విలన్స్ మిత్రా (ముఖేష్ రుషి), వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ), మైఖేల్ (జిష్షు సేన్ గుప్తా) బయిలుదేరతాడు. అప్పుడు ఊహించని విధంగా సైంధవ్ విలన్ మనుష్యులను చంపేసి కష్టమ్స్ ఆఫీసర్ ని సేవ్ చేస్తారు. అప్పుడు విలన్స్ ..తమకు అడ్డుపడింది ఎవరా అని ఆరాతీస్తే .. సైకో అలియాస్ సైంధవ్ కోనేరు అని తెలుస్తుంది. దాంతో సైకో మళ్లీ వచ్చారని వారంతా షాక్ అవుతారు. భయపడతారు. డ్రగ్స్,ఆయుధాల దందా నడిపే అంత పెద్ద విలన్స్ ....సైంధవ్ ని చూసి ఎందుకు ఉలిక్కి పడ్డారు. సైకో అని ఎందుకు పిలిచారు. సైంధవ్ తో వాళ్ల పరిచయం ఏమిటి...సైంధవ్ ప్లాష్ బ్యాక్ ఏమిటి...తన కూతురని సైంధవ్ రక్షించుకున్నాడా వంటి విషయాలతో కథ నడుస్తుంది. అలాగే మనోజ్ఞ (శ్రద్దా శ్రీనాథ్) కు సైంధవ్ ఎలా పరిచయం అవుతాడు. ఆ సబ్ ప్లాట్ ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ...
ఓ ప్రక్కన ప్రక్క రాష్ట్రంలో తన తోటి సీనియర్ హీరోలు విక్రమ్(కమల్) జైలర్(రజనీ) లతో హిట్లు కొట్టడం వెంకీని కలవరపెట్టినట్లున్నాయి. అసలే రీమేక్ లు అంటే ఇష్టపడే వెంకీ వెంటనే అలాంటి కథకు ఆర్డర్ వేయమని పురమాయించినట్లున్నారు. దాని ఫలితమే 'సైంధవ్' అనిపిస్తుంది. విక్రమ్ తన మనవడు కోసం, జైలర్ తన కొడుకు కోసం గన్ పట్టినప్పుడు తను తన కూతురు కోసం కష్టపడితే గన్ పడితే గెలిచేయచ్చు అనుకున్నారు. అయితే విక్రమ్ కు కలిసివచ్చింది లోకేష్ కనకరాజ్ స్క్రీన్ ప్లే, కమల్ మ్యాజిక్ అయితే జైలర్ ని నిలబెట్టింది రజనీ స్టైల్, నెల్సన్ స్క్రీన్ ప్లే,శివన్న, మోహన్ లాల్ ల ఎంట్రీ అన్నిటికన్నా ముఖ్యంగా అనిరిధ్ మ్యూజిక్. ఇవన్నీ కలిస్తే ఆ గన్ సౌండ్స్ వినసొంపుగా మారాయి. అంతే గాని అక్కడ గన్ లు పేలాయి కదా అని ఇక్కడా పెద్ద గన్ హీరో పట్టుకునే కలిసొచ్చిందేమీ లేదు.
ముఖ్యంగా కథలో ఎమోషన్ పండనప్పుడు ఏ గన్ పట్టుకున్నా కలిసొచ్చేదేమీ ఉండదు. గన్ పట్టుకోవటానికి ఓ కారణంగా పాప కనపడింది కానీ అంతకు మించి ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ కాలేకపోయింది. చాలా చోట్ల అది మెలోడ్రామాగా మారిపోయింది. అసలు వెంకటేష్ సినిమా నుంచి ఏ ఎలిమెంట్స్ ప్రేక్షకులు ఇష్టపడతారు. ఇన్నాళ్లు ఏవి ఆయన్ను స్టార్ ని చేసేవి అనేవి రిపీట్ కాదు కదా టచ్ కూడా చేయలేకపోయారు. దాంతో ఇదో సీరియస్ యాక్షన్ డ్రామాగా నడిచి, ఆయన సినిమాలకు వెళ్లే అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. స్క్రీన్ ప్లే సైతం ఎన్నో సార్లు చూసిన బాషా స్క్రీన్ ప్లేనే. కాంప్లిక్ట్ చూస్తే అటు పాప ఆరోగ్యమే పెద్దగా కనపడుతుంది కానీ విలన్స్ సైడ్ నుంచి వచ్చే కాంప్లిక్ట్ ఆనలేదు. దాంతో విలన్స్ కు మన హీరో సైకో అని తెలిసి,యాక్టివ్ గా మారేసరికి చాలా సినిమా అయ్యిపోవచ్చింది. ఇక్కడ ఏది మెయిన్ కాంప్లిక్ట్స్, ఏది సబ్ కాంప్లిక్ట్స్ అనే కంఫ్యూజన్ చివరిదాకా ప్లాట్ ని వెంటాడుతూనే ఉంది.
దృశ్యం లాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో కూడా ఫ్యామిలీలను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉండటం వల్లే అంత పెద్ద హిట్ అవ్వగలగింది. ఇక్కడ ఏ ఎపిసోడ్ కు ఆ ఎపిసోడ్ బాగున్నట్లు అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా చూస్తే ఏమీ చూసినట్లు అనిపించదు. అలాగే వెంకీ కూతురుకు వచ్చి ఎస్.ఎమ్.ఏ (స్పైనల్ మక్సులర్ అట్రోఫీ) అనే అరుదైన జబ్బుకి ఇంజక్షన్ ఖరీదు రూ.17 కోట్లు ఓకే ఉండచ్చు. నమ్మాం కానీ... అలాంటి జబ్బే ఒకే ప్రాంతంలో దాదాపు 350 మంది చిన్న పిల్లలకు ఉందని చెప్పడం కాస్త డైజస్ట్ కావటం కష్టమే అనిపిస్తుంది. ఇది చాలదన్నట్లు చిన్న పిల్లల్ని ఉగ్రవాదంలోకి దింపడం అనే మరో ట్రాక్ నడిపారు. అది కథకు ఎంతవరకూ కలిసొస్తుందో మనకు అర్దం కాదు.
ఉన్నంతలో ఫస్టాఫ్ లో అయినా ఎమోషన్ రిజిస్టర్ అవుతుంది. సెకండాఫ్ కు వచ్చేసరికి అదీ యాక్షన్ హోరులో బుల్లెట్ల సౌండ్ లో మాయమైంది. ఏదమైనా వెంకటేష్ లాంటి హీరో నేల విడిచి సాము చేయించిన ఫీలింగ్ వస్తుంది ఆ సీన్స్ చూస్తుంటే. పోనీ ఇదో థ్రిల్లర్ ఇలాగే ఇలాంటి సినిమా ఉండాలంటే హై మూమెంట్స్ ఏవి. ఉన్న ఒకటి రెండులో కిక్ లేదు. సినిమా స్టార్ట్ అయిన కొద్ది సేపటికే విషయం ఏమిటో అర్దం అయ్యి ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. పార్ట్ 2 కోసం కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వకుండా దాచి పెట్టారు. పార్ట్ 2 చేస్తారా అనే డౌట్ వస్తుంది ఇప్పుడు. ఈ సినిమా చూస్తూంటే కొన్ని సార్లు హాయ్ నాన్న అనే టైటిల్ పెడితే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకో మరి.
ఎవరెలా చేసారు...
వెంకటేష్ ఈ ఏజ్ లో ఎక్కడా తగ్గకుండా యాక్షన్ హీరోలా కనపడేందుకు ప్రయత్నించారు. సక్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధికీ విలనీ బాగుంది. హిందీ, తెలుగు మిక్స్ చేస్తూ ఆయన చెప్పే డైలాగులుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మరి ఓవర్ అయ్యాయేమో అనిపిస్తాయి. తమిళ హీరో ఆర్యది గెస్ట్ రోల్. శ్రద్ధా శ్రీనాథ్, ముఖేష్ రుషి, జిష్షు సేన్ గుప్తా, రుహానీ శర్మ, జయప్రకాశ్ వీళ్లంతా తమ అనుభవంతో చేసుకుంటూ పోయారు. అయితే కొత్తగా ఏమీ అనిపించదు.
టెక్నికల్ గా..
సినిమా స్టోరీ లైన్ కొత్తగా అనిపించినా అందుకు తగ్గ కథనం (స్క్రీన్ ప్లే)రాసుకోవటంలో డైరక్టర్, టీమ్ బాగా తడపడ్డారు. పెద్ద హీరోను సైతం అడవి శేషును తన సినిమాల్లో డీల్ చేసినట్లు చేస్తే ఎలా ... వెంకటేష్ ఇమేజ్ ని, ఫ్యాన్స్ ని ఎంతో కొంత దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇక సంతోష్ నారాయణన్ పాటలు గొప్పగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కడా ప్లస్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగా ఖర్చు పెట్టినట్లు అర్దమవుతున్నాయి. కెమెరా వర్క్ మాత్రం బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ బాగా చేసారు. ఎడిటింగ్ మాత్రం సెకండాఫ్ లో లింక్ లు సరిగ్గా చూసుకోవాల్సిందేమో అనిపించింది. ఫీల్ ని ఎస్టాబ్లిష్ చేసేలా లింక్ లు ఇవ్వలేకపోయారనిపించింది. ఎడిటింగ్ సైడ్ మ్యాజిక్ అయితే జరగలేదు.
ప్లస్ పాయింట్స్
స్టోరీ ఐడియా
వెంకటేష్ ఈజ్
యాక్షన్ సీన్స్
కెమెరా వర్క్
మైనస్ పాయింట్స్
విలన్స్ వల్ల కథలో పెద్దగా కలిసొచ్చేదేమీ లేకపోవటం
భాషా స్క్రీన్ ప్లే మరోసారి వాడటంతో బోర్ కొట్టడం
ఎమోషన్ ఉన్నాయి కానీ వర్కవుట్ కాకపోవటం
ఫైనల్ థాట్
ఏదైమైనా రీమేక్ లు రాణించినట్లుగా అనుకరణలు అలరించవు. అలంకరణలుగానే మిగిలిపోతాయి. వెంకటేష్ కు దృశ్యం లాంటి సినిమాలే బెస్ట్.ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యాన్ బేసే ఆయన శ్రీరామ రక్ష. లేకుంటే చూసేవాళ్ళకు శిక్ష.
--- సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.25
సంస్థ: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్,
నటీనటులు : వెంకటేశ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్ తదితరులు,
సంగీతం: సంతోష్ నారాయణన్,
కెమెరా: యస్.మణికందన్,
ఎడిటింగ్ : గ్యారీ BH
రన్ టైమ్ :2 Hrs 18 Min
నిర్మాత: వెంకట్ బోయనపల్లి,
రచన, దర్శకత్వం: శైలేష్ కొలను,
విడుదల: 13 జనవరి 2024