Vaazha 2 Review: వాలా 2 మూవీ తెలుగు రివ్యూ.. మలయాళంలో దుమ్ములేపుతున్న సినిమా ఎలా ఉందంటే?

Published : Apr 24, 2026, 09:06 AM IST

Vaazha 2 Review: మలయాళంలో బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తోన్న `వాలా 2` మూవీ ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మలయాళంలో రేంజ్‌లో మనల్ని ఆకట్టుకుంటుందా? 

PREV
16
వాలా 2 మూవీ రివ్యూ

మలయాళ సినిమాలు తెలుగు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రాలు విశేషంగా అలరిస్తున్నాయి. ఆయా సినిమాలను మన ఆడియెన్స్ కూడా ఆదరిస్తుంటారు. లేటెస్ట్ గా మలయాళంలో బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న మూవీ `వాలా 2`.(vaazha 2) అంతా కొత్త కుర్రాళ్లు నటించిన మూవీ. సావిన్‌ షా దర్శకత్వం వహించగా, మన తెలుగు నిర్మాత సాహుగారపాటి ఈ మూవీకి ఒక నిర్మాత కావడం విశేషం. ఏప్రిల్‌ 2న విడుదలైన ఈ మూవీ అక్కడ రెండు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఈ క్రమంలో ఈ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేశారు. నేడు శుక్రవారం(ఏప్రిల్‌ 24)న రిలీజ్‌ అయ్యింది. మరి మలయాళంలో బాక్సాఫీసుని షేక్‌ చేస్తోన్న ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ని అదే రేంజ్‌లో ఆకట్టుకుందా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
వాలా 2 మూవీ కథ

హషీర్‌, అలన్‌, అజిన్‌, వినాయక్‌ స్కూల్‌లో మంచి స్నేహితులు.  హషీర్‌కి అదే స్కూల్‌లో చదువుకునే షైనా(ఏంజెల్‌ మేరియా) ని ప్రేమిస్తుంటాడు. నోటితో చేసే వింత సౌండ్‌తో ఆమెకి లైన్‌ వేస్తుంటాడు. ఆమె తిరిగి చూడటం చూసి ఎంజాయ్‌ చేస్తుంటాడు. ఈ నలుగురు గ్యాంగ్‌ చిచ్చోర బ్యాచ్‌. స్కూల్‌లో గొడవలు, అల్లరి చేయడంలో ముందుంటారు. టీచర్స్ ని, పోలీసులను ఆటపట్టిస్తుంటారు. అదే సమయంలో సిగరేట్‌, మందు ఇలా అన్ని రకాల వ్యసనాలను అలవాటు చేసుకుంటారు. స్కూల్‌లో గొడవల కారణంగా తరచూ ప్రిన్సిపల్‌, టీచర్స్ ద్వారా తిట్లు తింటారు. వీరు చేసే అల్లరి పనుల వల్ల పేరెంట్స్ తలెత్తుకోలేకపోతారు. ఇంట్లో బుద్ధిగా ఉన్నట్టు కనిపించి, బయట మాత్రం అన్నీ ఎదవ పనులు చేస్తుంటారు.  ఓ సారి మాదక ద్రవ్యాలు కూడా తీసుకుంటారు. టీచర్స్ కి దొరికిపోతారు. అలన్‌ సిస్టర్‌ స్కూల్‌ ఎగ్గొట్టి సినిమాకి వెళ్లి దొరికిపోతుంది. దీంతో స్కూల్‌ ప్రిన్సిపల్‌ పేరెంట్స్ పిలిపించి నిలదీస్తారు. ఆ రోజు వారికి దారుణమైన అవమానం జరుగుతుంది. ఇది తట్టుకోలేక అలన్‌ సిస్టర్‌ సూసైడ్‌ చేసుకోవాలనుకుంటుంది. కానీ తండ్రి కాపాడతాడు. అల్లరి చేసిన ఇతర స్కూడెంట్స్ పై హషీర్‌ ఫ్రెండ్స్ దాడి చేస్తారు. దీంతో పెద్ద గొడవ అవుతుంది. రెండు వర్గాలుగా కొట్టుకుంటారు. ఈ క్రమంలో ఆపడానికి వచ్చిన టీచర్‌ తలపగులుతుంది. ఇది పెద్ద రచ్చ అయి పోలీసు కేసు వరకు వెళ్తుంది. మరి ఈ ఘటనతో  ఈ నలుగురు ఫ్రెండ్స్ లో వచ్చిన మార్పేంటి? పోలీస్‌ ఆఫీసర్‌ అటు స్టూడెంట్స్ కి, ఇటు టీచర్స్ కి, పేరెంట్స్ కి ఏం చెప్పాడు? నలుగురు ఫ్రెండ్స్ ఎందుకు విడిపోయారు? వినాయక్‌ జీవితంలో చోటు చేసుకున్న విషాదం ఏంటి? హషీర్‌, షైనా ప్రేమ ఎలాంటి ముగింపుని తీసుకుంది? ఆ తర్వాత ఈ కథ ఎలాంటి ఆసక్తికర పలుపులు తిరిగిందనేది మిగిలిన సినిమా.

36
వాలా 2 మూవీ విశ్లేషణ

టీనేజ్‌ కుర్రాళ్ల జర్నీని తెలియజేసే మూవీ ఇది. స్కూల్‌ ఏజ్‌లో కుర్రాళ్లు ఎలా ప్రవర్తిస్తారు, వారి లవ్‌లు, గొడవలు, స్కూల్‌ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లడాలు, చదువుకుంటున్నామని చెప్పి చేసే ఎదవ పనులు ఇలా అన్నింటిని రియాలిటీకి దగ్గరగా ఆవిష్కరించిన మూవీ `వాలా 2`. సింపుల్‌గా స్కూల్‌ స్టూడెంట్స్ బయోపిక్‌ అని చెప్పొచ్చు. చిన్నప్పుడు ఇంట్లో ఉండే పరిస్థితులు, పేరెంట్స్ చెప్పే పనులు, ఇంట్లోనే అన్నదమ్ములు గొడవ పడటం, ఫ్రెండ్స్ కి ప్రయారిటీ ఇవ్వడం, ఫ్రెండ్స్ లవర్‌కి లైనేయడం, స్కూల్‌లో ఒకే అమ్మాయికి అందరు సైట్‌ కొట్టడం, అదే సమయంలో చిల్లర కామెంట్లు చేసుకోవడం, కొట్టుకోవడం, దీనికితోడు నెమ్మదిగా బీర్‌ వంటి ఆల్కహాల్‌కి, అలాగే సిగరేట్‌కి అలవాటు పడటం వంటివి ఇందులో రియాలిటికీ దగ్గరగా ఆవిష్కరించారు. సినిమాగా చూసినప్పుడు ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన హషీర్‌, అలన్‌, అజిన్‌, వినాయక్‌ చిన్నప్పుడు ఎదిగిన తీరుని చూపించారు. అదే సమయంలో కేరళాలోని కొన్ని కమ్యూనిటీల లైఫ్‌ స్టయిల్‌ని ఆవిష్కరించారు. వాళ్ల కల్చర్‌కి ప్రయారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో సినిమా కథని ఎస్టాబ్లిష్‌ చేయడానికి చాలా టైమ్‌ తీసుకున్నారు. చిన్నప్పుడు పిల్లలు తమకి తమ్ముడు పుడతాడని, చెళ్లి పుడుతుందని మాట్లాడుకోవడం ఫన్నీగా ఉంటుంది. స్కూల్‌కి వెళ్లాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. అక్కడ నచ్చిన అమ్మాయికి లైన్‌ వేయడానికి నానా తంటాలు పడే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఈ క్రమంలో వచ్చే డైలాగులు అలరించేలా ఉంటాయి. అదే సమయంలో ట్రెండీగా ఉంటాయి. జెన్‌ జీ కుర్రాళ్లకి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. మరోవైపు పిల్లల విషయంలో పేరెంట్స్ ఆలోచనలు కూడా ఇందులో వాస్తవానికి దగ్గరగా చూపించారు. ఆయా సన్నివేశాలు యమ క్రేజీగా ఉంటాయి. ఇక స్కూల్‌లో గొడవలు, బాత్‌ రూమ్‌లో ఇతర స్కూడెంట్స్ గురించి, లవర్స్ గురించి, టీచర్ల గురించి గోడలపై అసభ్య పదజాలం రాయడం, అదే సమయంలో థియేటర్లో పోలీసులను ఆటపట్టించడం వంటి మనకు స్కూల్‌ డేస్‌ని గుర్తు చేస్తుంటాయి. ఫస్టాఫ్‌ అంతా ఇలా అల్లరి చిల్లరగా, కామెడీగా సాగుతుంది. స్కూల్‌లో గొడవతో కథ మొత్తం మారిపోతుంది. సీరియస్‌గా మారుతుంది. అయితే అందులోనూ కామెడీ డైలాగ్‌లతో నవ్వించే ప్రయత్నం చేశారు. సెకండాఫ్‌లో చాలా వరకు ఎమోషనల్‌గా ఉంటుంది. నలుగురు ఫ్రెండ్స్ విడిపోతారు. ముగ్గురు ఫారెన్‌ వెళ్తారు. హషీర్‌ ఫెయిల్‌ అయి ఊర్లోనే ఉండిపోతాడు, కానీ  వారి ఇంట్లో చోటు చేసుకునే సంఘటనలు, ముఖ్యంగా వినాయక్‌ తండ్రి విషయంలో చోటు చేసుకున్న విషాదం కన్నీళ్లు పెట్టిస్తుంది. నలుగురు పడే బాధలు, సమస్యల్లో ఇరుక్కునే తీరు ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ క్రమంలో జీవితానికి సంబంధించిన నేర్పించిన పాఠాలు, గుణపాఠాలు ఆకట్టుకుంటాయి. హార్ట్ ని టచ్‌ చేస్తాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ముగుస్తుంది.

46
వాలా 2 మూవీలో మైనస్‌లు

అయితే సినిమా కేరళా నేపథ్యం మనకు కొంత నచ్చకపోవచ్చు. అక్కడ కమ్యూనిటీలకు ప్రయారిటీ ఇచ్చారు. అవి మన తెలుగు వారికి ఎక్కవు. మలయాళ నెటివిటీ ఎక్కువగా ఉండటం మైనస్‌. పైగా ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు తెలుగులో వస్తున్నాయి. ఆ మధ్య వచ్చిన `యూత్‌` ఇలాంటిదే. దీంతో ఇదేమీ కొత్తగా అనిపించదు. సినిమాలో ప్రతిదీ డీటెయిల్‌గా చూపించే ప్రయత్నం చేశారు, అది మనకు కొంత బోర్‌గా, ల్యాగ్‌ అనే ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. సెకండాఫ్‌ ప్రారంభంలో డ్రైగా ఉంటుంది. చివర్లో ఎమోషనల్‌గా ఉంటుంది. కొన్ని సీన్లు అసహజంగా అనిపిస్తాయి. ఇలాంటి కొన్ని మైనస్‌లు పక్కన పెడితే సినిమాని యూత్‌ ఎంజాయ్‌ చేస్తారని చెప్పొచ్చు. కాకపోతే మలయాళ ఆడియెన్స్ రేంజ్‌లో మన వాళ్లకి కనెక్ట్ కావడం కష్టమే.

56
వాలా 2 మూవీ ఆర్టిస్టుల నటన

నలుగురు కుర్రాళ్లు హషీర్‌, అలన్‌, అజిన్‌, వినాయక్‌ తమ పాత్రల్లో జీవించారు. వారిలో మనల్ని చూసుకోవచ్చు. ఒకప్పటి మన జీవితాన్ని తమ అద్భుతమైన నటనతో ఆవిష్కరించారు. సహజమైన నటనతో మెప్పించారు. సినిమాని విజయతీరానికి చేర్చారు. అలన్‌ సిస్టర్‌గా వేద శంకర్‌ బాగా చేసింది. అలాగే అజిన్‌ బ్రదర్‌గా దేవరాజ్‌ ఆకట్టుకున్నారు. అతని పాత్ర మెప్పిస్తుంది. వినాయక్‌ తండ్రి పాత్ర చేసిన బిజుకుట్టన్‌ కన్నీళ్లు పెట్టిస్తాడు. హషీర్‌ లవర్‌ షైనాగా ఏంజెల్‌ మారియా నటన ఆకట్టుకుంది. అందంగానూ ఉంది. హషీర్‌ తమ్ముడిగా సబరి, మనోజ్‌ సర్‌గా అజు వర్గేసే, పీఈటీ సర్‌గా విజయ్ బాబు నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన అందరు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

66
వాలా 2 మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే

దర్శకుడు సావిన్‌ షా ఎంచుకున్న కథ బాగుంది. తెరకెక్కించిన తీరు బాగుంది. అయితే మలయాళ నేపథ్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మన తెలుగు వారికి కొంత మైనస్‌గా చెప్పొచ్చు. మతం, కమ్యూనిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మనకు మైనస్‌. దర్శకుడిగా సినిమాని ఎంగేజింగ్‌గా, కామెడీగా, ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యారు. ఇక అఖిల్‌ లైలాసురన్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. కనువిందు చేస్తాయి. పాటలు సినిమాకి ప్లస్‌, బీజీఎం అదిరిపోయింది. కన్నన్‌ మోహన్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. టెక్నీకల్‌గా మూవీ చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు.

ఫైనల్‌గా

 టీనేజ్‌(స్కూల్‌, కాలేజీ) కుర్రాళ్ల బయోపిక్‌. వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు. 

రేటింగ్‌ 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories