సత్యం రాజేష్‌ `టెనెంట్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Apr 19, 2024, 4:07 PM IST

సత్యం రాజేష్‌ చివరగా `పొలిమేర 2`తో మెప్పించాడు. ఇప్పుడు ఆయన `టెనెంట్‌` చిత్రంతో వచ్చారు. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

సత్యం రాజేష్‌ కమెడియన్‌గా కెరీర్‌ని ప్రారంభించి ఇప్పుడు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన చివరగా `పొలిమేర2`తో అదరగొట్టాడు. ఇప్పుడు తనే మెయిన్‌ లీడ్‌గా `టెనెంట్‌` అనే చిత్రంలో నటించాడు. వై యుగంధర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్తేర్‌ కీలక పాత్రలో నటించగా, మేఘా చౌదరి, చందన పయ్యావుల హీరోయిన్లుగా చేశారు. మొగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఈ చిత్రం సత్యం రాజేష్‌కి హిట్‌ని అందించిందా? ఆడియెన్స్ ని మెప్పించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
అర్థరాత్రి గౌతమ్‌(సత్యం రాజేష్‌) తన భార్యని చంపి సూట్‌కేసులో పెట్టుకుని బెంగుళూరు ఔట్స్ కట్స్ లో ఓ ప్రాంతంలో ఆమెని పెట్రోల్‌ పోసి ఖననం చేస్తాడు. శవం పూర్తిగా కాలేంత వరకు అక్కడే ఉంటాడు. ఇంతలోనే పోలీసులు అక్కడికి చేరుకుని గౌతమ్‌ని అరెస్ట్ చేస్తారు. ఈ కేస్‌ని ఏసీపీ (ఎస్తేర్‌ నోర్హ) ఇన్విస్టిగేట్‌ చేస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఒక్కో విషయం బయటపడుతుంది. హైదరాబాద్‌లో ఓ కంపెనీలో పని చేసే గౌతమ్‌.. తన మరదలు సంధ్య(మేఘా చౌదరి)నే పెళ్లి చేసుకుంటాడు. బావ అంటే ఆమెకి ఎంతో ప్రేమ, తన మరదలు అన్నా అంతే ప్రేమ. పెళ్లైన కొన్ని రోజులకే గౌతమ్‌కి ఆఫీస్‌ ప్రాజెక్ట్ పనిమీద ఫారెన్‌కి వెళ్లే అవకాశం వస్తుంది. ఆ ఏర్పాట్లలో ఉంటారు. కట్‌ చేస్తే ఇద్దరి మధ్య గ్యాప్‌ ఏర్పడుతుంది. చాలా రోజులుగా ఇద్దరు మాట్లాడుకోరు. మరోవైపు రిషి గౌతమ్‌ ఉన్న ఫ్లాట్‌కి పక్కనే ఉంటాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి ఉంటారు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసే ఉంటారు. రిషికి ఊర్లో గర్ల్ ఫ్రెండ్‌ వైష్ణవి(చందన) కూడా ఉంటుంది. ఆమెకి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో రిషి కోసం హైదరాబాద్‌ వచ్చేస్తుంది. అంతా కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉంటారు. కట్‌ చేస్తే వైష్ణవి వచ్చిన రోజే బిల్డింగ్‌ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమెని చూసి రిషి దూకేస్తాడు. మరి వీరిద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? తన భార్యని గౌతమే చంపాడా? గౌతమ్‌ స్టోరీకి, రిషి స్టోరీకి ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః 
క్లైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాలు ఎంగేజింగ్‌గా తీస్తే మంచి ఆదరణ పొందుతాయి. కొత్త దర్శకులకు ఇది సేఫ్‌ జోన్‌ కూడా. కానీ దాన్ని అంతే రక్తికట్టించేలా ట్విస్ట్ టర్న్ లతో తీసుకెళ్తేనే ఆడియెన్స్ ని ఆకట్టుకోలదు. లేదంటే సేఫ్‌ గేమ్‌ కాస్త బెడిసి కొడుతుంది. `టెనెంట్‌` సినిమా విషయంలో అదే జరిగింది. ఈ సినిమా ద్వారా డ్రగ్స్, ఆల్కహాల్‌ జీవితాలను ఎలా నాశనం చేస్తాయి? ఆ మత్తు తమపై తామకి కంట్రోల్‌ కోల్పోయి ఎంతటి దారుణాలకు తెగబడతారు అనే విషయాన్ని చెప్పారు. ఎంచుకున్న ఆ చిన్న ఎలిమెంట్‌ బాగుంది. కానీ దాన్ని తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్‌ కాలేకపోయాడు. ఏమాత్రం ఆకట్టుకోలేని విధంగా, ఏమాత్రం ఎంగేజ్‌ చేయలేని విధంగా మూవీని తెరకెక్కించాడు. 
 

సినిమా ఆద్యంతం సీరియల్‌ని తలపిస్తుంది. సీన్లు మాత్రమే కాదు, మ్యూజిక్‌ కూడా అంతే దారుణంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడొస్తున్న చాలా సీరియల్స్ చాలా క్వాలిటీగా, మంచి మ్యూజిక్‌, బీజీఎంలతో వస్తున్నాయి. దర్శకుడు ఈ మూవీ విషయంలో ఆ స్థాయిలో కూడా తీయలేకపోయాడు. సినిమా మొత్తం తిప్పి కొడితే పది సీన్లు కూడా ఉండవు. సీరియల్‌ కంటే స్లోగా సినిమాని నడిపించడం పెద్ద మైనస్‌. ఎస్తర్‌ ఎలివేషన్లకి ఇచ్చిన ప్రయారిటీ కేస్‌ ఇన్వెస్టిగేషన్‌లో లేదు. విచారించేందుకు గౌతమ్‌ని కూర్చోబెట్టి ఏసీపీగా ఏం జరిగిందో వెంటనే చెప్పేస్తుంది. ఎందుకు చంపావు అంటే ఓ కొత్త కథ తీసుకువస్తారు. ఆ కథకి దీనికి సంబంధమేంటో అర్థం కాదు. ఇన్వెస్టిగేషన్‌లో ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్లలో ఏమాత్రం దమ్ములేదు. ఏమాత్రం ట్విస్ట్ లు పండలేదు, అవి ట్విస్ట్ లు అని చెప్పడానికి కూడా లేదు. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో రిషి స్టోరీ చూపిస్తారు. మరోవైపు గౌతమ్‌ తన ఇంట్లో తాను, వైఫ్‌ సైలెంట్‌గా ఉన్న సీన్లనే చూపిస్తుంటాడు. అవి చాలా చిరాకు పెడతాయి. 
 

ఇక పాత్రల బిహేవ్‌ కూడా చాలా అసహజంగా అనిపిస్తుంది. కెమెరా ముందు యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ ఆడియెన్స్ కి తెలిసిపోతుంది. డైలాగ్‌లు కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. పైగా అనవసరమైన సీన్లు వస్తుంటాయి. రిషి ఫ్రెండ్‌ ఒకడు జోస్యం చెబుతుంటాడు. దానికి లాజిక్‌ ఏంటో అర్థం కాదు. సంధ్యకి జరిగిన అన్యాయానికి ఆమె చేసిన పని, ఆమె తీసుకున్న నిర్ణయం ఓకే, కానీ చివరగా గౌతమ్‌ తీసుకున్న నిర్ణయంలోనూ అర్థంలేదనిపిస్తుంది. రిషి పాత్ర కోమాలోకి వెళ్లిపోతాడు, కరెక్ట్ గా తనకు సంబంధించిన స్టోరీ చెప్పి మరణించడం ఏమాత్రం కనెక్టింగ్‌గా లేదు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏమాత్రం ఆసక్తి కలిగించే ఒక్క సీన్‌ లేకపోవడం గమనార్హం. సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నారనేదాంట్లోనూ క్లారిటీ లేదు.టెక్నీకల్‌గానూ ఈ మూవీ క్వాలిటీ లెస్‌గా ఉండటం ఆశ్చర్య పరుస్తుంది. ఈ మూవీలో హైలైట్‌ ఏదైనా ఉందంటే అది సినిమా నిడివి మాత్రమే. రెండు గంటలు కూడా లేకపోవడం విశేషం. 
 

నటీనటులుః
గౌతమ్‌ పాత్రలో సత్యం రాజేష్‌ సెటిల్డ్ గా కనిపించాడు. కొన్ని సీన్లలో యాక్ట్ చేశాడు. మరికొన్ని సీన్లలో యాక్ట్ చేయాల్సిన అవసరమే రాలేదు. కానీ ఓ డిఫరెంట్‌ యాంగిల్‌ని చూపించాడు. ఆయన భార్య పాత్రలో మేఘా చౌదరి ఫర్వాలేదనిపించింది. రిషిగా భరత్‌ కాంత్‌ ఆకట్టుకున్నాడు. ఆయన ఫ్రెండ్స్ కూడా ఓకే అనిపించారు. చందూ జ్యోస్యం చెబుతూ కాసేపు కేక అనిపించాడు. రిషి లవర్‌గా చందన అందంతో మెప్పించింది. కళ్లతో కట్టిపడేసింది. మిగిలిన పాత్రలో జస్ట్ ఓకే. 
 

టెక్నీషియన్లుః 
సినిమాకి సాహిత్య సాగర్‌ సంగీతం అందించారు. ఆయన మ్యూజిక్‌ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బీజీఎం సైతం నీరసంగా ఉంది. తన మార్కుచూపించడంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ విఫలమయ్యాడు. సినిమా నిడివి గంటన్నర ఉంటుంది. అయినా ఎడిటింగ్‌ చేయడానికి చాలా ఉంది. అదే చేస్తే షార్ట్ ఫిల్మ్ అవుతుంది. జెమిన్‌ జోం అయ్యనీత్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్‌ కాస్ట్ పెద్దగా ఏం లేదు. కాస్టింగ్‌కి పారితోషికాలు తప్ప ప్రొడక్షన్‌ కాస్ట్ పెద్దగా ఏం లేదు.  దర్శకుడు చెప్పాలనుకున్న కథ బాగుంది. కానీ దాన్ని సినిమాగా చెప్పడంలో విఫలమయ్యాడు. ఆసక్తికరంగా, రక్తికట్టించేలా చెప్పలేకపోయాడు. సీరియల్‌ మాదిరిగా సాగదీసి సాగదీసి చెప్పడంతో సినిమా బోరింగ్‌గా సాగింది. 
 

ఫైనల్‌గాః `టెనెంట్‌` ఏమాత్రం ఆకట్టుకోలేని, ఆసక్తి కలిగించని సినిమా. సీరియల్‌ని తలపించే మూవీ. 

రేటింగ్‌ః 1.5

నటీనటులుః సత్యం రాజేష్‌, మేఘా చౌదరి, భరత్ కాంత్‌, చందన పయ్యావుల, తేజ్‌ దిలీప్‌, ఆడుకాలం నరేన్‌, ఎస్తేర్‌, ధనా బాల, చందు, అనురాగ్‌, రమ్య పొందూరి, మేగ్న తదితరులు. 

కెమెరాః జెమిన్‌ జోం అయ్యనీత్‌
ఎడిటర్‌ః విజయ్ ముక్తవరపు
మ్యూజిక్‌ః సాహిత్య సాగర్‌
దర్శకత్వంః వై యుగంధర్‌
నిర్మాతః మొగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి 
 

Latest Videos

click me!