`మార్కెట్‌ మహాలక్ష్మి` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published Apr 19, 2024, 1:48 AM IST

`కేరింత` చిత్రంతో నవ్వులు పూయించిన పార్వతీశం.. చాలా గ్యాప్‌తో ఇప్పుడు `మార్కెట్‌ మహాలక్ష్మి` అనే చిత్రంతో వచ్చాడు. శుక్రవారం విడుదలైన మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

సమ్మర్‌ అంటే పెద్ద సినిమాల జోరు ఉండేది. కానీ ఈ ఏడాది అదిలేదు. వచ్చిన ఒకటి రెండు సినిమాలు ఆడే పరిస్థితి లేదు. పైగా ఎన్నికలు, ఐపీఎల్‌ సీజన్‌ కారణంగా పెద్ద సినిమాలు రావడం లేదు. దీంతో చిన్న చిత్రాలు పండగ చేసుకుంటున్నాయి. ఒకేసారి నాలుగైదు మూవీస్‌ రిలీజ్‌ అవుతున్నాయి. ఈ వారం కూడా నాలుగైదు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అందులో ఒకటి `మార్కెట్‌ మహాలక్ష్మి`. `కేరింత` చిత్రంతో పాపులర్‌ అయిన నూకరాజు అలియాస్‌ పార్వతీశం చాలా గ్యాప్‌తో ఇప్పుడు `మార్కెట్‌ మహాలక్ష్మి` చిత్రంలో నటించాడు. ఆయనకు జోడీగా ప్రణీకాన్వికా హీరోయిన్‌గా నటించింది. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. వీఎస్‌ ముఖేష్‌ దర్శకుడు. బి2పి స్టూడియోస్ బ్యానర్ పై అఖిలేష్‌ కలారు నిర్మించిన ఈ చిత్రం నేడు శుక్రవారం(ఏప్రిల్‌ 19)న విడుదలైంది. మరి నూకరాజు కమ్‌ బ్యాక్‌ అనిపించుకున్నాడా, సినిమా మెప్పించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
పార్వతీశం సాఫ్ట్ వేర్ జాబ్‌ చేస్తుంటాడు. కొడుకుని సాఫ్ట్ వేర్‌ చేసేందుకు తండ్రి కేదార్‌ శంకర్‌ బాగా ఖర్చు చేస్తాడు. ఆ ఖర్చు మొత్తం రాబట్టేందుకు కొడుక్కి మంచి డబ్బున్న అమ్మాయితో పెళ్లి చేయాలనుకుంటాడు. తాను పెట్టిన ఖర్చంతా వచ్చే కోడలితో తిరిగి రాబట్టుకోవాలని ప్లాన్‌ చేస్తాడు తండ్రి. కానీ పార్వతీశం అందుకు భిన్నంగా ఆలోచిస్తుంటాడు. ఆయన ఆలోచనలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ క్రమంలో అతను మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మి(ప్రణీకాన్విక)ని ప్రేమిస్తాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మహాలక్ష్మి తండ్రకి పక్షవాతం, అన్న తాగుడుకి బానిస అవుతాడు. దీంతో ఆమెనే తన కుటుంబ బాధ్యతలు తీసుకుంటుంది. మహలక్ష్మి చిన్నప్పట్నుంచి రెబల్‌గా పెరుగుతుంది. దీంతో ప్రేమ గీమా ఆమె దగ్గర పనిచేయవు. అలాంటి అమ్మాయిని పార్వతీశం ఎలా పడేశాడు? ఆమెనే పెళ్లి చేసుకున్నాడా? తండ్రి కోరికకి వ్యాల్యూ ఇచ్చి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడా? ఆ తర్వాత ఏం జరిగింది? ఎలాంటి ట్విస్ట్ లు టర్న్ లు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన కథ. 
 

విశ్లేషణః
మహిళా సాధికారతకు ప్రయారిటీ ఇస్తూ, మహిళప్రాధాన్యత తెలియజేస్తూ తెరకెక్కించిన చిత్రమిది. జనరల్‌గా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లోనే ఇలాంటి అంశాలను చూపిస్తుంటారు. చాలా తక్కువ సమయంలోనే హీరోహీరోయిన్లు ఉన్న సినిమాల్లో ఆ ప్రయారిటీ ఉండదు. హీరోయిన్ల పాత్రకి ప్రయారిటీ ఉంటుందని, కానీ మహిళా సాధికారత అనే అంశం కనిపించదు. ఆ రెండు ఉండటం చాలా అరుదు. దర్శకుడు వీఎస్‌ ముఖేష్‌ ఇందులో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. కమర్షియల్‌ అంశాల కంటే కంటెంట్‌ని నమ్ముకుని చేశారు. ఆ విషయంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్‌ అయ్యాడు. అయితే ఆ విషయాన్ని ఆకట్టుకునేలా, ఎంగేజ్‌ చేసేలా చెప్పడంలో కాస్త ఇబ్బంది పడినట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా సరదాగా కథని చెబుతూనే చివరికి ఒక ఎమోషనల్‌ అంశాలను టచ్‌ చేశాడు. ఉమెన్‌ ఎంపావర్‌మెంట్‌ని డైరెక్ట్ చెబితే జనాలకు అర్థం కాదు, నెమ్మదిగా స్లో ప్లాయిజన్‌ లాగా ఎక్కిస్తూ ఉండాలి. అప్పుడే ఆడియెన్స్ వాటిని రిసీవ్‌ చేసుకుంటారు. 
 

ఈ మూవీలోనూ దర్శకుడు అలానే ట్రై చేశాడు. ప్రారంభం నుంచి సరదాగా కథని నడిపించాడు. క్రమ క్రమంగా తాను చెప్పాలనుకున్న విషయాలన్ని రివీల్‌ చేస్తూ వచ్చాడు. డబ్బుకి పెద్దవాళ్లు ఇచ్చే ప్రయారిటీ, ప్రేమకి నేటితరం ఇచ్చే ఇంపార్టెన్స్ ని సినిమాలో బ్యాలెన్స్ చేశాడు. కాకపోతే అది మహిళా కోణంలో హీరోయిన్‌ పాత్ర రూపంలో చెప్పుకొచ్చారు. సినిమాలోని పాత్రలను ఎస్టాబ్లిష్‌ చేయడానికి ఎక్కువ టైమ్‌ పడుతుంది. ఈ క్రమంలో సినిమా ప్రారంభంలో కొంత స్లోగా అనిపిస్తుంది. ఆ తర్వాత లవ్‌ సీన్లు, అమ్మాయి పాత్రలోని స్ట్రగుల్స్ ని చూపిస్తూ ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తూ వచ్చాడు. తండ్రి చూపించిన ధనవంతుల అమ్మాయిని పెళ్లి  చేసుకుని అమ్మాయి తెచ్చే కట్నానికి అమ్ముడుపోయి బతకడం కంటే ఇండిపెండెంట్‌గా బతికే ఒక ఆడపిల్లను పెళ్లి చేసుకుంటే.. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా తను చూసుకుంటుందనే భరోసా ఉంటుందని హీరో భావించడంలో నేటితరం ఆలోచనలను అద్దం పడుతుంది. 

డైరెక్టర్ ముఖేష్ తన ఫ్రెండ్ లైఫ్‌లో జరిగిన స్టోరీని తీసుకుని ఈ సినిమా కథ రాశారు. తను తీసుకున్న పాయింట్‌ను ప్రేక్షకులకు అర్థమయ్యేలా కన్విన్సీగా చెప్పడంలో డైరెక్టర్ పాస్‌ అయ్యాడు. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించడంతో కథ ట్రాక్‌ తప్పినట్టు అనిపిస్తుంది. రియాలిటీకి దగ్గరగా ఉండే డైలాగ్‌లు, కామెడీ సీన్లు సినిమాకి పెద్ద అసెట్‌గా నిలిచాయి. కానీ కొన్ని లాజిక్‌ లెస్‌ సీన్లు, కొన్ని పస లేని సీన్లు తారస పడుతూనే ఉంటాయి. హర్ష వర్ధన్ క్యారెక్టర్ ద్వారా హీరో పాత్రకు గీతోపదేశం చేయించడం బాగుంది. మరోవైపు పెళ్లైయ్యాక అమ్మాయి అబ్బాయి ఇంటికే ఎందుకు వెళ్లాలి, అబ్బాయే అమ్మాయి ఇంటికి ఎందుకు రాకూడదూ అనే ప్రశ్నని లేవనెత్తిన తీరు బాగుంది. అయితే ప్రేమ సన్నివేశాల్లో కనెక్ట్ కావు, అవి చాలా సినిమాటిక్‌గా ఉంటాయి. మరోవైపు ఎమోషన్స్ వీక్‌గా ఉంటాయి. కామెడీని పూర్తిగా వాడుకోలేదు. కొంత స్లోనెస్‌, రొటీన్‌ గా సాగడం మైనస్‌గా చెప్పొచ్చు. అవన్నీ పక్కన పెడితే మంచి ఆలోచింప చేసే, సందేశాన్ని ఇచ్చే చిత్రమవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే మూవీ అవుతుంది.  
 

నటీనటులు పెర్ఫామెన్స్:

`కేరింత` మూవీ ఫేమ్‌ హీరో పార్వతీశం చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ చిత్రంలో మెరిశాడు. తనదైన ఫన్నీ పాత్రలో జీవించాడు. అయితే ఈ సారి సెటిల్డ్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్ ప్రణికాన్విక మహాలక్ష్మి పాత్రలో ఆకట్టుకుంది. ఆమె ఇండస్ట్రీ కి కొత్త అయినా బాగా చేసింది. తనని నడిపించడంలో ఆమె పాత్ర చాలా ఉంది. హీరో ఫ్రెండ్‌గా చేసిన ముక్కు అవినాష్ సీన్స్ తక్కువే అయ్యినప్పటికీ ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ అన్నగా చేసిన మహబూబ్ బాషా తాగుబోతు సీన్లలో మెప్పించాడు. ‘సలార్’ తర్వాత ఇందులో కసక్ కస్తూరి పాత్రలో నటించిన పూజా విశ్వేశ్వర్ తనదైన మేనరిజంతో మార్కెట్ లో పని చేసే  గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసింది. ఇక హర్షవర్ధన్, కేదార్ శంకర్, జయ, పద్మ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం: 
ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తో మెప్పించిన దర్శకుడు ముకేష్ ఈ మూవీని బాగా డీల్‌ చేశాడు. కాకపోతే సిల్వర్‌ స్క్రీన్‌లో చేయాల్సిన మ్యాజిక్‌ విషయంలో కాస్త తడబాటు కనిపిస్తుంది కానీ మంచి విషయాన్ని అంతే సీన్సియర్‌గా, జెన్యూన్‌గా చెప్పాడు. ఆ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. ఆయన అనుభవం సినిమాల్లో కనిపిస్తుంది. సురేంద్ర చిలుముల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. జో ఎన్మవ్ ఇచ్చిన సంగీతం ఓ మేరకు పర్వాలేదు అనిపించినా, ఆశించిన స్థాయిలో లేదు. కాకపోతే, సాఫ్ట్ వేర్ పొరగా అంటూ సాగే సాంగ్ ఆకట్టుకుంది. సృజన శశాంక బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాత అఖిలేష్ కలారు కొత్తవాళ్లను నమ్మి సినిమా చేయడంతో మూవీస్ పై తనకున్న ఫ్యాషన్  అర్ధమవ్వుతుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
 

ఫైనల్‌గాః `మార్కెట్‌ మహాలక్ష్మి`.. సందేశాత్మక, ఫ్యామిలీ, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌.
రేటింగ్‌ః 2.5

నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, తదితరులు.... 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లోకేష్. పి
కొరియోగ్రఫీ: రాకీ
ఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి
బ్యాగ్రౌండ్ స్కోర్: సృజన శశాంక
సంగీతం: జో ఎన్మవ్  
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
ప్రొడ్యూసర్: అఖిలేష్ కలారు
ప్రొడక్షన్ హౌస్: బి2పి స్టూడియోస్ 
రచన & దర్శకత్వం: వియస్ ముఖేష్
 

click me!