#AAGMC:సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' రివ్యూ

First Published | Sep 16, 2022, 12:27 PM IST

సుధీర్ బాబు, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో గతంలో వచ్చిన  సమ్మోహనం యావరేజ్ అనిపించుకున్నా తర్వాత  టీవీలో, ఓటీటీలో క‌ల్ట్ స్టేట‌స్ తెచ్చుకుంది. ఈ క‌ల‌యిక‌లో ఇంకో సినిమా అన‌గానే అంద‌రిలోనూ ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది.   మంచి అంచనాలు ఏర్పడ్డాయి.  ఈ నేపధ్యంలలో  సుధీర్ బాబు -  కృతి శెట్టి జంటగా నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా, ఈ నెల 16వ తేదీన థియేటర్లకు  వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉంది...వర్కవుట్ అవుతుందా

Aa Ammayi Gurinchi Meeku Cheppali Review


 సినీ పరిశ్రమ చుట్టూ తిరిగే కథలతో తీసే  సినిమాలు వర్కవుట్ కావు అనే సెంటిమెంట్ సినిమా వాళ్లకు ఉంది. కానీ దాన్ని సమ్మోహనం బ్రేక్ చేసింది. క్లాస్ సినిమాగా వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు అదే దర్శకుడు, హీరో ..అదే నేపధ్యంలో మరో చిత్రం తీసి వదిలారు. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఉప్పెనతో కుర్రాళ్ల మనస్సుల్లో తిష్ట వేసిన కృతి శెట్టి ఈ సినిమాకు ప్లస్ అయ్యిందా...డిఫరెంట్ టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం కథేంటి,సుధీర్ బాబు కెరీర్ కు ప్లస్ అయ్యిందా.....వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


కథాశం:

నవీన్ (సుధీర్ బాబు) తెలుగు ఫీల్డ్ లో మరో  రాజమౌళి. వరసగా అన్నీ హిట్సే. డబుల్ హాట్రిక్  కొట్టి కెరీర్ లో దూసుకుపోతున్న డైరక్టర్. అయితే అతను తన చివరి చిత్రం మిస్సైల్ తో విమర్శలు ఎదుర్కొంటాడు. దాంతో ఈ సారి కొత్తగా వెళ్దామనుకుంటాడు. కొత్త స్టోరీ లైన్ కోసం  వెతుకుతూంటాడు. అప్పుడు రోడ్డు మీద ఓ పాడైన రీల్ దొరుకుతుంది. ఇంకా ఈ రోజుల్లో రీల్ దొరకటం ఏమిటని దాన్ని ల్యాబ్ లో కడిగించి చూస్తే ఓ అందమైన అమ్మాయి (కీర్తి శెట్టి) షో రోల్ అది. అది చూసి మనవాడు మనసు పారేసుకుంటాడు. ఎలాగైనా ఈమెను ఒప్పించి సినిమా చెయ్యాలనుకుంటాడు. కానీ ఆమె ఎక్కడ ఉంది..ఏం చేస్తుంది...అని వెతకటం మొదలెడతాడు. ఎక్కడున్నావమ్మా అని చేస్తున్న అన్వేషణ ఫలించి ...ఆమె పేరు అలేఖ్య అని ఆమె ఓ కంటి  డాక్టర్  అని తెలుస్తుంది. ఆమె చాలా మూడీ ఫెలో. ఆమెను ఒప్పించి తన సినిమాలో నటింప చేయటానికి ఎప్రోచ్ అవుతాడు. కానీ ఆమె ఓ పట్టాన లొంగే ఘటం కాదని అర్దమవుతుంది. 
 

Latest Videos



ఏం చెయ్యాలి..వాట్ టుడు అని అని ఆమె అడిగితే ఆమెకు సినిమాలంటే ఇష్టం లేదని..అదీ   కమర్షియల్ సినిమాలు అంటే ఎవర్షన్ అని అంటుంది. ఆమె తల్లి,తండ్రులు కూడా సినిమా వాళ్లంటే దూరం...దూరం కనపడకండి అంటూంటారు. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కళ్లూ రీల్స్, ఇనిస్ట్రా పోస్ట్ లలో రెచ్చి పోతూ తమలోని నటులను బయిటపెట్టుకుంటూంటే ఈమె ఏంటి రివర్స్ లో ఉంది,రూట్ కాజ్ ఏమిటి  అని తీవ్రంగా సినిమా స్క్రిప్టు రాస్తున్న స్దాయిలో  ఆలోచించి..చేస్తున్న ఎంక్వైరీలో ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు ఆ రీల్ లో ఉన్నది అలేఖ్య కాదు..మరెవరు... అంటే ఆమె సోదరి..సినిమా పిచ్చితో జీవితం కోల్పోయిన అమ్మాయి అని. అందుకే ఆమె ఫ్యామిలీ మొత్తం సినిమా అంటే అసహ్యం పెంచేసుకున్నారని తెలుసుకున్న డైరక్టర్ ఏం చేసాడు.  తన ప్రయత్నం వదులుకున్నాడా...లేక ఆమెను ఒప్పించి సినిమా పట్టాలు ఎక్కించాడా...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

 
ఎలా ఉందంటే..

ఐడియా లెవిల్ లో ఈ సినిమా బాగుంది. ఓ నావెల్టీగా ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది. అయితే ఈ కథలో వచ్చే సమస్య... ఓ లెవిల్ కు వెళ్లాక అంటే ప్లాష్ బ్యాక్ తెలిసిపోయాక ఇంక ప్రెడిక్టబుల్ గా మారిపోతుంది. అప్పుడు వేరే దారి లేక ఎమోషన్స్ పై ఆధారపడాల్సిందే. అదే ఈ సినిమాకు జరిగింది. దాంతో కథని,పాత్రలను సెటప్ చేయటానికే ఎక్కువ సమయం తీసుకున్నారు దర్శక,రచయిత అయిన ఇంద్రగంటి. ఇంటర్వెల్ ట్విస్ట్ దాకా కథలో ఏమీ జరిగినట్లు అనిపించదు. ఓ అమ్మాయి కనపడింది..ఆమెను ఒప్పిస్తాడా లేదా అన్నట్లు మాత్రమే కథ జరుగుతుంది. మరి ఇలాంటి నేరేషన్ ఇలాంటి ఓటిటి రోజుల్లో ఓకేనా అంటే దర్శకుడు మీద నమ్మకంతో ఓకే అని జనం ..ఏదో మ్యాజిక్ జరగకపోతుందా అని ఎదురుచూస్తారు. అలాగే ఈ దర్శకుడుకి స్లో మేకింగ్ నేరేషన్ లో కథ చెప్తాడు అని తెలుసు కాబట్టి అదీ సరే అనుకుని ప్రిపేర్ అయ్యిపోయి చూస్తూంటారు. 


అయితే కథలో అసలు పాయింట్ తెలిసిపోయాక...సీట్లో అసహనంగా కదలటం మొదలవుతుంది. ఎందుకంటే అక్కడ కథలో కదలిక ఆగిపోతుంది. అలాగే ఆ ప్లాష్ బ్యాక్ విన్నాక ..ఇది మామూలు విషయమే...ఏదో చెప్తాడు అనుకుంటే ఏదో ఉందేంటి అనిపిస్తుంది.అంటే ప్రిమైజ్ బాగున్నంత మాత్రాన ప్రతీ సీన్ బాగుండాలని రూల్ లేదని చెప్పటానికి తీసినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో ఎక్కడా చెప్పుకోదగ్గ వావ్ మూమెంట్స్, కానీ హై ఇచ్చే సీన్స్ కానీ ఉండవు. సర్లే ఇలాంటి సీరియస్ సినిమాల్లో ఇది కామనే అని పెట్టుకుని సెకండాఫ్ లోనూ అదే పరిస్దితి. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా తీయాలని ఫిక్సై  తీసినట్లున్నారు. ఆ ప్రాసెస్ లో అసలు ఏ ఎలిమెంట్స్ లేకుండా మాయమైపోయాయి. క్లాస్ సినిమాలకే క్లాస్ తీసుకునే సినిమా లా తయారైంది. ఉన్నంతలో ప్లాష్ బ్యాక్ ఎమోషన్స్ కాస్త వర్కవుట్ అయ్యాయి. క్లైమాక్స్ హార్ట్ టచ్చింగ్ గా ఉంది.


టెక్నికల్ గా ...

ఈ సినిమా స్టోరీ లైన్ గా నావెల్టీ ఉన్నా దాన్ని స్క్రీన్ ప్లే రాసుకుని తెరకెక్కించే విషయంలో ఇంద్రగంటి తడబడ్డాడు. అయితే సినిమా కలర్ ఫుల్ గా ఉంది. అందుకు సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇలాంటి సినిమాలకు అవసరమైన సాంగ్స్ మాత్రం లేవు. ‘మీరే హీరో లాగ’జస్ట్ ఓకే, ‘మీరే హీరో లాగ’పాట మెలోడి. విజువల్స్ బాగున్నాయి. ఐటం సాంగ్ బాగోలేదు. డైలాగ్స్  అక్కడక్కడా కొన్ని  బాగున్నాయి. ఇంద్రగంటి స్పెషలైజ్ అయిన సెటిల్డ్ హ్యూమర్ పండించే ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ..సెకండాఫ్ లో ల్యాగ్ లను వదిలేసింది. ఇంకాస్త ట్రిమ్ చెయ్యిచ్చేమో అని ఫీల్ కలిగించింది. సినిమాలో ఫ్రేమ్స్ రిచ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
 

నటీనటుల్లో ..

సినిమా అంటే పేషన్, ఏటిట్యూడ్ ఉన్న డైరక్టర్ గా సుధీర్ బాబు ఫెరఫెక్ట్ గా  కనిపించాడు.   సుధీర్ బాబులో ఎంత మంచి న‌టుడున్నాడో చూపెట్టడానికే ఈ సినిమా తీసారా అనిపిస్తుంది.  కృతి శెట్టి కూడా సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో డీసెంట్ గా చేసింది.రైటర్ క్యారక్టర్ లో కనిపించిన రాహుల్ రామకృష్ణ సెటిల్డ్ రోల్ పర్ఫార్మ్ చేశారు.  వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ ఎప్పటిలాగే బాగుంది కానీ ఆ సీన్స్ మరింత పెంచితే బాగుండేది. హీరోయిన్  తండ్రి పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ నటన సినిమాకు బాగా ప్లస్. అవసరాల మరోసారి తన మార్క్ చూపించారు. 

బాగున్నవి: 
సుధీర్ బాబు, కృతి పెయిర్ 
ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎమోషన్స్
ఇంట్రవెల్, క్లైమాక్స్ 
కెమెరా వర్క్

బాగోలేనివి: 
ఎంటర్టైన్మెంట్ సీన్స్ లేకపోవటం పెద్ద మైనస్
వీక్ ప్లాట్
నత్తనడక నడిపించే స్క్రీన్ ప్లే
డల్ గా సాగే ఫస్టాఫ్
 

Aa Ammayi Gurinchi Meeku Cheppali

 
ఫైనల్ థాట్ :

ఇలాంటి అమ్మాయి కథలు మనకు కొత్తేమీ కాదు. 'స‌మ్మోహ‌నం' మ్యాజిక్ రిపీట‌్ కాలేదు.  అలాగే మత్తుగా థియేటర్ లో  నిద్రపోవాలనుకునేవాళ్లకు ఈ సినిమా డిస్ట్రబ్ చెయ్యదు.
Rating:2.25

--సూర్య ప్రకాష్ జోశ్యుల
 

Aa Ammayi Gurinchi Meeku Cheppali


బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్
నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ,   శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్  తదితరులు.
 సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: పీజీ విందా
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్
కో-డైరెక్టర్: కోట సురేష్ కుమార్
రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
సమర్పణ:  గాజులపల్లె సుధీర్ బాబు
నిర్మాతలు: బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి
Run Time: 2 Hrs 25 Mins 
విడుదల తేదీ :16-09-2022

click me!