Scene Movie Review: సీన్‌ మూవీ రివ్యూ.. సూర్య హాట్రిక్‌ కొట్టాడా? సినిమా ఎలా ఉందంటే?

Published : Nov 06, 2026, 02:04 PM IST

Scene Movie Review: సూర్య ఇప్పటికే `వీరభద్రుడు`, `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` మూవీతో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు `సీన్‌` అనే చిత్రంలో నటించారు. మరి ఈ మూవీతో హ్యాట్రిక్‌ కొట్టాడా? లేదా అనేది చూద్దాం.

PREV
16
సూర్య సీన్‌ మూవీ రివ్యూ

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే హీరో సూర్య మరోసారి తనదైన శైలిలో కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు. తాజాగా `సీన్‌` అనే మూవీలో నటించారు. మలయాళంలో ‘రోమాంచం’, `ఆవేశం` వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జీతు మాధవన్ తెరకెక్కించిన చిత్రమిది. నజ్రీయా నజీమ్‌ హీరోయిన్‌గా నటించింది. సస్లెన్‌, లాల్‌ కీలక పాత్రలు పోషించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, డార్క్ కామెడీ, యాక్షన్ అంశాలను కలిపి రూపొందించిన ఈ సినిమా నేడు శుక్రవారం( నవంబర్ 6, 2026)న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో కనిపించే మూస ధోరణికి భిన్నంగా సూర్యను ఒక విచిత్రమైన, సరదాగా ప్రవర్తించే పోలీస్ ఆఫీసర్‌గా చూపించడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? సూర్య నటన ఎలా ఉంది? ఆయన హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
సీన్‌ మూవీ కథ

ప్రేమ్‌రాజ్‌ (సూర్య) డీఎస్పీ. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌. తనదైన పద్ధతిలో పనిచేసే ఆయనకు పోలీస్ శాఖలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అతన్ని చాలా మంది తిట్టుకుంటారు. కానీ పై ఆఫీసర్‌(లాల్‌), ఇతర కానిస్టేబుల్స్ ఆయన్ని ప్రశంసిస్తారు. సడెన్‌గా ప్రేమ్‌ రాజ్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. కానీ పై అధికారి కొత్త కేసుని విచారించమని బ్రతిమాలుతాడు. కానీ ఈ కేసులోని కొన్ని అంశాలు మళ్లీ ప్రేమ్‌ రాజ్‌ని ఈ కేసులోకి తీసుకొస్తుంది. పోలీస్‌ డీపార్ట్ మెంట్‌ నుంచి బయటకు వచ్చాక దీన్ని విచారిస్తాడు. అందుకు డిపార్ట్ మెంట్‌లోని అధికారులను సహాయం తీసుకుంటాడు. తనకు అసిస్టెంట్‌గా మాయ(నజ్రియా)ని ఎంచుకుంటారు. మరి ఆమెని తీసుకోవడం వెనుక ఉన్న రహస్యమేంటి? ప్రేమ్‌ రాజ్‌ పాత్రలోని ట్విస్ట్ ఏంటి? ఇందులో ఈశ్వరన్ (నస్లెన్) పాత్ర ఏంటి? అత్యంత క్లిష్టమైన ఈ కేసుని ప్రేమ్‌ రాజ్‌ ఎలా సాల్వ్ చేశాడు? అందుకు ఎవరెవరి హెల్ప్ తీసుకున్నారనేది మిగిలిన కథ.

36
సీన్‌ మూవీ విశ్లేషణ

క్రైమ్ థ్రిల్లర్ కథకు కామెడీని జోడించడం ఈ సినిమా ప్రధాన ప్రత్యేకత. దర్శకుడు జీతు మాధవన్ తనదైన విచిత్రమైన పాత్రలతో కథనాన్ని నడిపించడం ఈ సినిమాలో మరో స్పెషల్‌. సూర్య లాంటి స్టార్ హీరోను సాధారణ మాస్ పోలీస్ పాత్రలో కాకుండా, సరదాగా ప్రవర్తించే వ్యక్తిగా చూపించడం కొత్తగా అనిపిస్తుంది. ఆయన పాత్రల్లోని స్టయిల్‌, ఫన్‌ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆయన చుట్టూ పోలీస్‌ అధికారులు చేసే చర్చ, కామెంట్‌ నవ్వులు పూయిస్తుంది. అలాగే పై అధికారితో సూర్య చేసే ప్రవర్తన, కేసుని విచారించే క్రమంలో ఆయన చేసే పనులు నవ్విస్తాయి.

అయితే ఆయన పాత్రల్లోని ట్విస్ట్ సినిమా స్టార్ట్ అయిన కొద్ది సేపటికే తెలిసిపోతుంది. ఆ తర్వాతనే అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు కామెడీ ఉంటుంది. తనకు అసిస్టెంట్‌గా నజ్రియాని పెట్టుకున్నాక వచ్చే సీన్లు అలరించేలా ఉంటాయి. వీరి మధ్య సీన్లు కూడా నవ్విస్తాయి. పోలీస్‌ స్టేషన్‌లో హడావుడి, మాస్‌ ఎలిమెంట్లు అలరిస్తాయి. అదే సమయంలో కేసు విచారించే సమయంలో ఆయన ఫాలో అయ్యే మెథడ్‌ వాహ్‌ అనిపిస్తుంది. కేసుని తనకు అనుకూలంగా మల్చుకొని విచారించే తీరు మెప్పిస్తుంది. కానీ తన పాత్రలోని ట్విస్ట్ రివీల్‌ కావడంతో ఆయన ఉద్యోగం నుంచి బయటకు రావాల్సి వస్తుంది. కానీ తన తండ్రిని, తల్లిని, అసిస్టెంట్‌ నజ్రియాని ఉపయోగించుకొని కేసుని సాల్వ్ చేసేందుకు ఆయన చేసే ప్రయత్నం బాగుంది. ఆయా సీన్లు రేసీగా ఉంటాయి. కామెడీని పంచుతూనే మెప్పిస్తాయి.

ఓ వైపు కేసు, మరోవైపు పోలీసుల ఆయన గురించి చర్చ, ఇంకోవైపు విలన్లు హత్యకు చేసే ప్రయత్నాలు ఈ మూడు అంశాలను బ్యాలెన్స్ చేస్తూ ఏక కాలంలో నడిపించడం ఈ మూవీ ప్రత్యేకత. ఇందులో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. సెకండాఫ్‌ విలన్‌ ఎవరు? ఈ సీరియల్‌ కిల్లర్‌లాగా ఎందుకు చేస్తున్నారు అనే కోణంలో ఈ విచారణ జరుగుతుంది. అయితే సూర్య తల్లి, తండ్రి ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు, వారు ఒకే చోటకి చేరతారు. ఆ తర్వాత వారి మధ్య సీన్లు హిలేరియస్‌ గా ఉంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్‌ వరకు కథ రేసీగా వెళ్తుంది. ఈ క్రమంలో ట్విస్ట్ లు, టర్న్ లు వాహ్‌ ఫ్యాక్టర్‌ని ఇస్తాయి. మధ్య మధ్యలో సూర్య మార్క్ యాక్షన్‌ కూడా మేళవించిన తీరు బాగుంది.

46
సీన్‌ మూవీ ప్లస్‌, మైనస్‌ లు

సినిమాలో కామెడీ బాగుంది, సినిమా స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంది. డ్రామా ఓకే అనిపిస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య సీన్లు, పేరెంట్స్ మధ్య సీన్లు నవ్విస్తాయి. బీజీఎం ఫర్వాలేదు. హీరో పాత్ర అదిరిపోయింది. విలన్‌ని కూడా బాగానే చూపించారు. కానీ కొన్ని చోట్లు కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తుంది. సిల్లీగా కూడా ఉన్నాయి. సూర్య పాత్ర ప్రవర్తించే తీరు కొంత అసహజంగా ఉంటుంది. ఆయన పై అధికారులకు సంబంధించిన సీన్లు కూడా ఓవర్‌ కామెడీగా ట్రై చేసినట్టు ఉంటుంది. విలన్‌ని కనిపెట్టే విషయంలో హీరో అంత ఈజీగా కనిపెట్టడం కన్విన్సింగ్‌గా లేదు. విలన్‌ పాత్రని మరింత బలంగా పెట్టాల్సింది. అందులో కిక్‌ లేదు. కొన్ని పాత్రల్లో కామెడీ వర్కౌట్‌ కాకపోవడంతో బెడిసి కొట్టిన ఫీలింగ్‌ కలుగుతుంది. కేసుని సీరియస్‌గా తీసుకుంటారు, కానీ ఆ కేసుని అంత బలంగా చూపించకపోవడం పెద్ద మైనస్‌.

మర్డర్‌ని, దాని సీరియస్‌ నెస్‌ని ఎస్టాబ్లిష్‌ చేయకుండానే పోలీసులు హడావుడి చేయడం అంతగా అనిపించలేదు. సూర్య, నస్లెన్‌ మధ్య సీన్లు అంతగా లేవు. అలాగే విచారించే అంశాలు కూడా ఇంట్రెస్టింగ్‌గా లేవు. ఇలాంటి కొన్ని అంశాలపై మరింత ఫోకస్‌ పెడితే బాగుండేది. మొత్తంగా ‘సీన్’ సూర్య అభిమానులకు ఒక కొత్త అనుభూతిని అందించే క్రైమ్ కామెడీ థ్రిల్లర్. విభిన్నమైన పాత్రలు, సూర్య నటన, నస్లెన్ పెర్ఫార్మెన్స్, కొన్ని ఆసక్తికరమైన ట్విస్టులు సినిమాకు ప్లస్ పాయింట్స్. అయితే బలహీనమైన ఇన్వెస్టిగేషన్ ట్రాక్, అక్కడక్కడా నెమ్మదించే కథనం, పూర్తిస్థాయిలో వర్కవుట్ కాని కామెడీ మైనస్‌లుగా నిలుస్తాయి.

56
ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

సూర్య ఈ సినిమాలో తన రెగ్యులర్ హీరో ఇమేజ్‌కు భిన్నంగా కనిపించారు. ప్రేమ్‌రాజ్‌ పాత్రలో ఆయన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. చాలా రోజుల తర్వాత పాత సూర్య కనిపించిన ఫీలింగ్‌ కలుగుతుంది. కామెడీనే కాదు, యాక్షన్‌, స్టయిల్‌తోనూ మెప్పించారు. ఒక స్టార్‌ హీరో ఇలాంటి పాత్ర చేయడం సాహసమనే చెప్పొచ్చు. నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో నస్లెన్‌ ఆకట్టుకున్నా, గొప్ప, బలంగా లేదు. ఆయన్ని విలన్‌గా చూడలేకపోతాం. కన్నింగ్‌ సీన్లు, తెలివిగా కనిపించే సీన్లలో మాత్రం బాగా చేశాడు. నటుడిగా మెప్పించాడు. సూర్యతో ఆయనకు ఎదురయ్యే సన్నివేశాలు సినిమాలో హైలైట్స్‌గా నిలుస్తాయి. మాయ పాత్రలో నజ్రియా నజీమ్ తనదైన ముద్ర వేస్తారు. ఆమె పాత్రకు కథలో ప్రాధాన్యం ఉండటం, కొన్ని కీలక సన్నివేశాల్లో తన ప్రతిభను ప్రదర్శించడం విశేషం. ఆనంద్ రాజ్, లాల్ తదితరులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు.

66
టెక్నికల్‌గా ఎలా ఉంది?

సినిమాటోగ్రాఫర్ వినీత్ ఆగస్టియన్ కెమెరా పనితనం కథలోని క్రైమ్, కామెడీ వాతావరణానికి అనుగుణంగా ఉంటుంది. సుషిన్ శ్యామ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా మార్చింది. అయితే పాటలు మాత్రం పెద్దగా గుర్తుండిపోయేలా లేవు. ఆర్‌ఆర్‌ ఫర్వాలేదు. అజ్మల్ సాబు ఎడిటింగ్ బాగున్నప్పటికీ, కొన్ని సన్నివేశాలను మరింత కత్తిరించి ఉంటే కథనం వేగంగా సాగేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది. పాయింట్‌ బాగుంది. కానీ క్లారిటీ విషయంలో గాడి తప్పింది. సూర్య పాత్రలోని లోపాన్ని, దాని చుట్టూ అంశాలకే ప్రయారిటీ ఇచ్చారు. కేసుకి సంబంధించిన అంశాలను లైట్‌గా చూపించారు. దీంతో దానిపై పోలీసులు చేసే హడావుడి ఆకట్టుకోలేకపోయింది. కానీ సూర్య నుంచి ఒక డిఫరెంట్‌ ప్రయత్నమని చెప్పొచ్చు.

ఫైనల్‌గా: సూర్య అభిమానులకు నచ్చే మూవీ. కొత్త తరహా నటన, డిఫరెంట్ క్రైమ్ కామెడీని ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు. రెగ్యూలర్‌ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌లో ఇది ఒకటిగానే మిగిలిపోతుంది.

రేటింగ్‌: 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories