Virupaksha Movie Review
సాధారణంగా చేతబడి లేదా బ్లాక్ మ్యాజిక్ తో కూడిన హారర్ కథ అనగానే మనకు ఓ చిన్న సినిమా కళ్ల ఎదురుగా కనిపిస్తుంది. లేదా రామ్ గోపాల్ వర్మ సినిమాలు ప్రత్యక్ష్యమవుతాయి. కానీ ఇలాంటి కాన్సెప్టుతో ఓ పెద్ద హీరో సినిమా చేయటం, అదీ ఓ స్టార్ డైరక్టర్ అండతో అంటే ధైర్యం చేసారనే చెప్పాలి. అంత ధైర్యం చేయదగ్గ కంటెంట్ ఏదో తమ దగ్గర ఉందని అర్దమవుతుంది. ఇంతకీ ఈ సినిమాలో అసలు కథ ఏమిటి.. “విరూపాక్ష”గా సాయి తేజ్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడా, సుకుమార్ స్క్రిప్టు ని ఎలా డిజైన్ చేసారు...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్:
ఈకథ 1979-91 మధ్యలో రుద్రవరం అనే ఊరిలో జరుగుతుంది. ఆ ఊరిలో క్షుద్రపూజలు చేస్తున్నారని ఒక జంటని సజీవ దహనం చేస్తారు. దాంతో ఆ ఊరు మొత్తం పుష్కర కాలంలో చనిపోతారని వాళ్లు శాపం పెడుతూ బూడిద అవుతారు. 1991కి మారుతుంది. పుష్కర కాలం దగ్గర పడుతోంది. వరస మరణాలు మొదలయ్యాయి. ఊరిని అష్ట దిగ్బంధనం చేసారు. ఆ టైమ్ లో ఆ ఊరికి జాతరకు వేరే చోట నుంచి వచ్చిన సూర్య ( సాయి ధరమ్ తేజ్) అక్కడ ఆగిపోవాల్సిన సిట్యువేషన్. దాంతో ఆ మరణాలని చూసి చలించిన పోయిన సూర్య..వాటిని ఆపాలని, ఆ సమస్యకు పరిష్కారం వెతకాలని డిసైడ్ అవుతారు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఊహించని అవాంతరాలు అతని సత్యాన్వేషణకి అడ్డం నిలుస్తాయి. అవేమిిట.. ఆ మరణాలకు కారణం అసలు కారణం ఏమిటి ? ఈ సమస్యకు పరిష్కారం దొరికిందా?ఈ మిస్టరీని ఎలా సూర్య సాల్వ్ చేశాడు అన్నది అసలు కథ…
విశ్లేషణ:
ఇలాంటి థ్రిల్లర్ కథలకు ఒకటే సూత్రం...సినిమా మొదలైంది మొదలు...క్లైమాక్స్ దాకా చూసే ప్రేక్షకుడుని ఉత్కంఠకు గురి చేస్తూ, మధ్య మధ్యలో భయపెడుతూ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ఇవ్వటమే. ఆ పని సమర్దవంతంగా చేయగలిగిన కార్తికేయ వంటి చిత్రాలకు మన జనం బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాతో ఆ పని ఈ దర్శకుడు మాగ్జిమం చేయగలిగాడనే చెప్పాలి. మామూలుగా హారర్,థ్రిల్లర్ కాన్సెప్టులు పెద్ద హీరో తో చేసేటప్పుడు ఖచ్చితంగా స్క్రీన్ ప్లే సమర్దవంతంగా ఉండాలి. లేకపోతే అటు హీరోయిజం ఇటు కాన్సెప్టు రెండు బ్యాలెన్స్ చేయటం కష్టమవుతుంది. రీసెంట్ గా వచ్చిన మసూదా సినిమాకు ఈ సమస్య లేదు. కానీ ఇక్కడ సాయి తేజ ఉండటంతో అతని వైపు నుంచి హీరోయిక్ గా కథ చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. కథలో అతను ఓ భాగం కాడు. కథ అతనితో భాగం పంచుకుంటుంది. ఇక స్క్రిప్టు విషయంలో ఈ సినిమా ఫస్ట్ సీన్ నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్లారు. షాకింగ్ ఫస్ట్ సీన్ తోనే సినిమా టోన్ ఫెరఫెక్ట్ గా సెట్ చేసేసారు. అలాగే పీరియడ్ లో కథను సెట్ చేయటం కూడా కలిసొచ్చింది. లేకపోతే ఈ రోజుల్లో ఇలాంటి విలేజ్ లు ఉన్నాయా...అనే డౌట్ తో అక్కడే ఆగిపోయేవాళ్లం. దానికి తగినట్లు విజువల్స్ కు , సౌండ్ మిక్సింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కరెక్ట్ గా బ్లెండ్ చేస్తూ సీన్స్ ని డిజైన్ చేసి తెరకెక్కించారు.
అలాగని మరీ ఒళ్లు జలదరించే సీన్స్, అదిరిపోయే థ్రిల్స్ ఉంటాయని ఊహించవద్దు. కథను అటు హారర్ వైపు పూర్తిగా వెళ్లకుండా జాగ్రత్తపడుతూ థ్రిల్ చేద్దామనుకున్నారు. అది కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యింది. క్లైమాక్స్ లాంటి చోట తేలిపోయింది. రుద్రవరం విలేజ్ ని చూపెట్టే తీరులోనూ, క్యారక్టర్స్ గెటప్స్ ఛేంజ్ చేసి చూపించటం లోనూ తీసుకున్న జాగ్రత్తలు క్రాఫ్ట్ మీద డైరక్టర్ పట్టుని చెప్తాయి. అలాగని అన్నీ హైలెట్ కాలేదు. ఫస్టాఫ్ లో వచ్చే లవ్ సీన్స్ తేలిపోయాయి.అయితే ఆ టైమ్ లో ప్రేక్షకులు సైతం ఓ హారర్ థ్రిల్లర్ చూడటానికి వచ్చామని ఆ సీన్స్ కోసం వెయిట్ చేస్తూంటే ప్రేమ సీన్స్ రొటీన్ గా వస్తే ఎంత బాగున్నా ప్రక్కన పెట్టేయాలనిపిస్తుంది. ఇక ఇలాంటి కథలకు అథి ముఖ్యమైన ఎపిసోడ్...అసలు ఎందుకు ఇదంతా జరుగుతోందనే ప్రేక్షకుడు ప్రశ్నకు సమాధానంగా వచ్చే ప్లాష్ బ్యాక్. అది ఏ మాత్రం రొటీన్ గా అనిపించినా పెదవి విరిచేస్తారు. ఆ ఛాలెంజ్ ని డైరక్టర్ బాగానే దాటేసాడు. కొన్ని చోట్ల ప్రెడిక్టబుల్ గా , ఫార్ములగా అనిపించే సీన్స్ తగ్గిస్తే ఈ జానర్ కు మరింత న్యాయం చేసినట్లు అనిపించేది. అయితే మెయిన్ విలన్ ఎవరనే ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. అలాగే రూపంలేని కన్నును విరూపాక్ష (శివుడి మూడో కన్ను) అంటారు. ఈ సినిమాలో రూపంలోని శక్తితో పోరాటం చేస్తారు కాబట్టి మూవీకి ‘విరూపాక్ష’ టైటిల్ పెట్టినట్లున్నారు.
టెక్నికల్ యాస్పెక్ట్స్
డైరక్టర్ కార్తీక్ తనకు టెక్నికల్ గా మంచి గ్రిప్ ఉందని ప్రూవ్ చేసుకున్నారు. ఆడియెన్స్ ని మెల్లిగా ఎంగేజ్ చేస్తూ కథను నడిపాడు.సుకుమార్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉంది . థ్రిల్లర్ ఎలిమెంట్స్ సెకండాఫ్ బాగా వర్కవుట్ అయ్యాయి. అందుకు సినిమాటోగ్రఫీ వర్క్ బాగా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ ఫెరఫెక్ట్.`కాంతార` ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద అసెట్ . ఇక విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ గానీ, టెక్నికల్‌గానూ సినిమా బాగుంది. వీటిన్నటినీ సమకూర్చిన నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
నటీనటుల్లో...
క్యాస్టింగ్ నీట్ గా సెట్ అయ్యింది. సూర్య పాత్రలో సాయి ధరమ్ తేజ్ ఫెరఫెక్ట్ . బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పాలి. సంయుక్త మీనన్ కు మరో సారి పవర్ ఫుల్ రోల్ దొరికింది. చాలా గ్లామర్ గా కనిపించింది. మిగితా కీలక పాత్రల్లో సునీల్,అజయ్ ,బ్రహ్మజీ,సాయి చంద్ వారి పాత్రలకు న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్:
సాయి ధరం తేజ్ పెర్ఫార్మెన్స్
సౌండ్ ఎఫెక్ట్స్
స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
బోర్ కొట్టే లవ్ ట్రాక్
ఫస్టాఫ్ లో లాగ్ లు
స్లో పేస్,
లూజ్ ఎండ్స్
ఫైనల్ థాట్:
అద్బుతం కాదు అలాగని అబ్బే అని ప్రక్కన పెట్టేసేది కాదు...తెలుగులో ఓ మంచి థ్రిల్లర్. పేరున్న హీరోలు ఇలా విభిన్న కథలు ఎంచుకుంటే కొత్తదనంతో కూడిన సినిమాలు చూడగలం. థియేటర్స్ కాస్త కళకళ్లాడతాయి.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
రేటింగ్ : 2.75/5
గమనిక: క్షుద్ర పూజలు, మరణాలు వంటి అంశాల కారణంగా ఈ సినిమాకు పిల్లలని కాస్త దూరంగా ఉంచటమే బెస్ట్.
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్, సోనియా సింగ్, సాయి చంద్, సునీల్, బ్రహ్మాజీ, అజయ్, రాజీవ్ కనకాల, రవి కృష్ణ తదితరులు
స్క్రీన్ ప్లే : సుకుమార్
ఛాయాగ్రహణం : ష్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం : బి. అజనీష్ లోక్ నాథ్
నిర్మాణ సంస్థలు : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్
సమర్పణ : బాపినీడు .బి
నిర్మాత : బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్
కథ, దర్శకత్వం : కార్తీక్ దండు
విడుదల తేదీ: ఏప్రిల్ 21, 2022