
కొత్త నటులు శివకుమార్ కాసారం, శ్వేత లక్ష్మణ్ జంటగా నటించిన చిత్రం `సహ`. లైఫ్ ఆఫ్ సంజు అనేది ట్యాగ్ లైన్. నిశాంత్ దోటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సుమైరా స్టూడియోస్ పతాకంపై తేజ వెల్పుచర్ల నిర్మించారు. ఇందులో వ్రజనా పాండ్యా, మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘన సునీల్, బాంబే పద్మ, కోండా రెడ్డి, హర్ష వర్ధన్ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(సెప్టెంబర్ 4)న విడుదలైంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో సినిమా నచ్చకపోతే ఇష్టం వచ్చినట్టు తిట్టమని హీరో, అమీర్ పేట సెంటర్లో గుండు గీయించుకుంటానని హీరోయిన్ సవాల్ విసిరారు. మరి వాళ్లు చెప్పింది నిజమేనా? హీరోయిన్ గుండు గీయించుకోవాల్సిన అవసరం లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
సంజీవ్ కుమార్(శివ కుమార్ కాసారం)కి చిన్నప్పట్నుంచి సహస్త్ర(శ్వేత లక్ష్మణ్) అంటే ఇష్టం. చిన్నప్పట్నుంచి కలిసి చదువుకుంటారు. రోజూ ఆమెని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే హైస్కూల్‌లో కాంపిటీషన్ వస్తుంది. మరో ఇద్దరు ముగ్గురు కుర్రాళ్లు ఆమె కోసం ప్రయత్నిస్తుంటారు. దీంతో ఆమెకి మొదట ప్రపోజ్ చేయడానికి టాస్ వేయగా సంజుకి మొదట ఛాన్స్ వస్తుంది. అతను ఆమెకి ప్రపోజ్ చేయడం కాకుండా ఏకంగా ముద్దు పెడతాడు. ఆ తర్వాత ఆమె కొడుతుంది. కానీ మరోసారి ముద్దు పెడతాడు. ఇలా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎట్టకేలకు ఆమె ఇంటర్‌కి వెళ్లేసరికి లైన్‌లో పడుతుంది. ఆమెకోసం ఎంసెట్‌ని కూడా త్యాగం చేస్తాడు సంజు. బిటెక్ వచ్చేసరికి అతను ఎంసెట్ పాస్ కాలేకపోతాడు. దీంతో అక్కడే ఆగిపోతాడు. కానీ ఆమె కోసం దొంగ ఐడీ కార్డ్ తో రోజూ కాలేజీకి వెళ్తుంటాడు. కాలేజీలో వీరి లవ్ స్టోరీ బహిరంగం అవుతుంది. దొరికిపోతారు. ఇక పెద్దలకు తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుందని తెలిసి పెళ్లి చేసుకుంటారు. సహస్త్ర ప్రెగ్నెంట్ అయ్యాక ఆసుపత్రిలో ఆమె తండ్రి కంటపడుతుంది. కూతురు కనిపించడంతో తండ్రి కరిగిపోతాడు. ఇంటికి తీసుకెళ్లి చేరదీస్తారు. ప్రెగ్నెంట్ కావడంతో తన ఇంట్లోనే ఉంచుకొంటారు. సంజీవ్ సెలవు రోజు వచ్చిపోతుంటాడు. కానీ ఉన్నట్టుండి సంజు జాబ్ పోతుంది. దీంతో లైఫ్ అంతా తలక్రిందులవుతుంది. అత్తారింట్లో అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సంజు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు? తను సబ్ రిజిస్టార్ ఎలా అయ్యాడు? తన వైఫ్‌ని బాగా చూసుకున్నాడా? సంజు రోజూ తన భార్యతోనే ఫోన్‌లో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆమె ఇప్పుడు ఎక్కడుంది? సంజు లైఫ్ ఎలాంటి మలుపులు తీసుకుంది? చివరికి ఏం జరిగిందనేది సినిమా.
సాడ్ ఎండింగ్ తో ఇటీవల చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్నింటిని ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. `సహ` ఏ సైడ్ ఉంటుందనేది సస్పెన్స్. అయితే ఇదొక లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా. టీనేజ్‌లో ప్రేమలో పడటం, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చాక కుటుంబాన్ని పోషించాలన్నప్పుడు డబ్బులు లేక, జాబ్ లేక ఇబ్బంది పడటం, ఈ క్రమంలో ఎదురయ్యే అవమానాలు, చోటు చేసుకునే సంఘటనల సమాహారమే ఈ మూవీ. ఇందులో హీరో ఒక్కో సంఘటనతో తన గతంలోకి వెళ్లి తన మెమొరీస్‌ని రీకలెక్ట్ చేసుకుంటాడు. అయితే ఈ మూవీ క్లైమాక్స్ ఏంటో ప్రారంభంలోనే అర్థమయ్యేలా ఉంది. హీరో ఫోన్ మాట్లాడటంతోనే ఇది మరో `7/జి బృందావన కాలనీ` అవుతుందనిపిస్తుంది. చివరికి అదే జరిగింది. అయితే ఇందులో చిన్న మార్పు ఉంటుంది. సాడ్ ఎండింగ్ ఎమోషనల్‌గా ఉంటుంది. ప్రారంభంలో రెగ్యూలర్ లవ్ ట్రాక్‌తోనే సాగుతుంది. అమ్మాయికి ప్రపోజ్ చేసే విషయంలో టాస్ వేయడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ముద్దు పెట్టడం ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వెంటపడే సీన్లు, ఆమె అసహ్యించుకోవడం కామన్‌గానే సాగుతాయి. అనంతరం ఇంటర్ వచ్చాక ఆమె ప్రేమలో పడటం, దీన్ని ట్విస్ట్ లాగా చూపించడం ఓకే, కానీ ఆ ట్విస్ట్ వర్కౌట్ కాలేదు. ఊహించేలా ఉంది. సినిమాలో ప్రతిదీ ఊహించేలా సాగుతుంది. అదే సమయంలో రెగ్యూలర్‌గా సాగుతుంది. కాకపోతే ఆర్‌ఆర్ కొన్ని సీన్లని హైలైట్ చేసింది. కొంత వరకు ఆకట్టుకునేలా ఉంది. అయితే పొయెటిక్ సెన్స్ కోసమని ప్రతి సీన్‌ని డెటెయిలింగ్‌గా, సాగదీసినట్టుగా చూపించారు. దీంతో అవి బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇప్పుడు ఆడియెన్స్ మరీ ఇలాంటి పోయెటిక్ ని ఎంజాయ్ చేయడం కష్టమే, అంత ఓపిక జనాలకు లేదు. ఇక న్నపాటి సస్పెన్స్, ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఆ తర్వాత అది తేలిపోతుంది. వీరిద్దరు పెళ్లి చేసుకోవడం, లైఫ్‌ని ఎంజాయ్ చేయడం వరకు బాగానే ఉంది. ప్రెగ్నెంట్ తర్వాత హీరో జాబ్ పోవడంతో అసలు కష్టాలు స్టార్ట్ అవుతాయి. హీరో స్ట్రగుల్స్.. ఒక్కోటి రివీల్ అవుతుంది. దాన్ని మరీ డీటెయిలింగ్‌తో చూపించారు. దీంతో కథ ఎంత సేపు అక్కడక్కడే తిరుగుతుంది. ముందుకు అస్సలు కదలదు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సహ అనే మరో అమ్మాయి వచ్చినప్పుడు ఆమెకి సంబంధించిన సీన్లు కొంత వరకు ఆకట్టుకుంటాయి. అనంతరం క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉంటుంది. అది కూడా ఊహించినట్టే ఉంటుంది. కాకపోతే ఆయా సీన్లు కొంత వరకు హార్ట్ టచ్చింగ్‌గా ఉంటాయి.
సినిమాలో మెయిన్‌గా ఆర్టిస్ట్ ల నటన, సంగీతం, ఆర్‌ఆర్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్, స్క్రీన్ ప్లే బ్లెండ్ చేసిన తీరు బాగుంది. మిగిలినదంతా రొటీన్‌గానే అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్లు అంతగా వర్కౌట్ కాలేదు. నెక్ట్స్ ఏం జరుగుతుందనేది ముందే అర్థం కావడంతో కిక్ పోయింది. ట్విస్ట్ లు, మలుపులు, సస్పెన్స్ అంశాలు తేలిపోయాయి. అదే ఇందులో పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. స్లోగా సాగడం, కొంత రొటీన్ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ లేదు, దీంతో డ్రై ఫీలింగ్‌ని తెప్పిస్తుంది.
సంజీవ్ కుమార్ గా శివకుమార్ కాసారం అదరగొట్టాడు. నటుడిగా మెప్పించాడు. ప్రేమికుడిగా అలరించాడు. కొత్త సినిమా అయినా బాగా చేశాడు. అనుభవం ఉన్న నటుడిగా కనిపించాడు. ఎక్స్ ప్రెషన్స్ పరంగా కొంత రెగ్యూలర్‌గా అనిపించింది. ఎమోషనల్ సీన్లలో అదరగొట్టాడు. ఆయన పాత్ర సాగిన తీరు బాగుంది. ఇక సహస్రగా శ్వేత లక్ష్మణ్ సైతం బాగా చేసింది. ఆమె కూడా కొత్త అనే ఫీలింగ్ లేకుండా చేసి మెప్పించింది. వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. మరో సహస్త్రగా చేసిన వ్రజనా పాండ్య సైతం నటనతో మెప్పించింది. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.
టెక్నీకల్‌గా సినిమా బాగుంది. శేఖర్ చంద్ర సంగీతం ఆకట్టుకుంది. ఆర్‌ఆర్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. అదే సినిమాకి కొంత వరకు ప్రాణం పోసిందని చెప్పొచ్చు. ఎమోషనల్ టచ్ తెచ్చింది. ఇక కరుణాకర్ కొట్టేటి విజువల్స్ బాగున్నాయి. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. విజువల్స్ పరంగా చేసిన మ్యాజిక్ కూడా బాగుంది. తేజ వేల్పుచర్ల నిర్మాణ విలువలకు కొదవ లేదు. రాజీపడకుండా నిర్మించారు. నిశాంత్ దోటి ఎంచుకున్న కథ రెగ్యూలర్‌గానే ఉంది, కాకపోతే స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు. కవితాత్మకంగా మూవీని నడిపించాలనుకున్నారు. అదే ఇందులో మైనస్‌గా చెప్పొచ్చు. అది సీరియల్ ఫీలింగ్ ని తెప్పిస్తుంది. అంతేకాదు ట్విస్ట్ రివీల్ అయ్యేలా మూవీ సాగడం పెద్ద మైనస్. ఇప్పుడు ఆడియెన్స్ అంత ఓపిక చూసే పరిస్థితి లేదు. ఫీల్‌గుడ్ ఎమోషనల్ మూవీ తీయాలంటే ప్రారంభం నుంచే దాన్ని ఎస్లాబ్లిష్ చేయాలి. ఇందులో అది మిస్ అయ్యింది. స్లోగా నడిపించడంతో బోర్ తెప్పిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం మరో పెద్ద మైనస్. ఆర్‌ఆర్, ఆర్టిస్ట్ ల నటన, అక్కడక్కడ చిన్నపాటి మలుపులు కొంత వరకు ఫర్వాలేదనిపించాయి.
స్లోగా, ఊహించేలా సాగే లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా `సహ`. కొంత వరకు 7/జి బృందావన కాలనీని తలపిస్తుంది. హీరోహీరోయిన్లు సవాల్ విసిరి సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. కానీ అదే ఈ మూవీకి పెద్ద మైనస్.
రేటింగ్: 2.25