Sagileti Katha Review: `సగిలేటి కథ` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Oct 12, 2023, 11:46 PM IST

గ్రామీణ వాతవరణాన్ని ఆవిష్కరించే చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతుంది. `బలగం` అలానే పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు రాయలసీమ నేపథ్యంలో `సగిలేటి కథ` చిత్రం రూపొందింది. ఇది ఈశుక్రవారం విడుదలవుతుంది.సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

రూరల్‌ నేపథ్యంలో కల్చర్‌ని ఆవిష్కరించే చిత్రాలు ఇటీవల ఊపందుకుంటున్నాయి. పల్లెటూరి అందాలను, నేచర్‌ని, ఊరి కట్టుబాట్లని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు అప్‌కమింగ్‌ ఫిల్మ్ మేకర్స్. `బలగం` చిత్రం దీనికి పునాది వేసిందని చెప్పాలి. అలా వచ్చిన కొన్ని చిత్రాలు ఆదరణ పొందాయి, మరికొన్ని పరాజయం చెందాయి. బలమైన కంటెంట్‌ లేకపోతే ఏ సినిమా అయినా ఆదరణ పొందడం కష్టం. తాజాగా రాయలసీమ కల్చర్‌ని, అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, భావోద్వేగాలు, ఆవేశాలు, మనస్తత్వాలను ఆవిష్కరిస్తూ `సగిలేటి కథ` చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రాజశేఖర్‌ సుద్మూన్‌. హీరో నవదీప్‌ సమర్పణలో సీ స్పేస్‌, అశోక్‌ ఆర్ట్స్ , షేడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని అశోక్‌ మిట్టపల్లి, దేవి ప్రసాద్‌ బలివాడ నిర్మించారు. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో (Sagileti Katha Movie Review) రివ్యూలో చూద్దాం. 
 

కథః 
రాయలసీమలోని సగిలేరు గ్రామంలో జరిగే కథ ఇది. ఆ ఊరుకి కరువొస్తుంది. గంగాలమ్మకి జాతర చేయాలని ఊరు పెద్దలు నిర్ణయిస్తారు. పండగ కోసం విదేశాల నుంచి ఊరు పెద్ద సౌడప్ప(రాజశేఖర్‌ అనింగి) భార్య, కొడుకు కుమార్‌(రవి మహాదాస్యం) ఇంటికొస్తారు. ఈ ఇద్దరి ఇంట్లోకి ఆహ్వానించాలని హీరో నానమ్మ హారతి పడుతుంది. అంతలోనే కుప్పకూలిపోతుంది. ఊర్లో డాక్టర్‌ లేకపోవడంతో ఆయన కూతురు కృష్ణకుమారి(విషిక) మెడిసిన్‌ తీసుకుని వచ్చి ఓ మందు బిల్ల కుమార్‌ నాన్నమ్మ నోట్లో పెడుతుంది. కానీ అది పనిచేయదు, ఆమె ప్రాణాలు పోతాయి. అయితే డాక్టర్‌ కూతురు కృష్ణకుమారికి మొదటి చూపులోనే పడిపోతాడు కుమార్. ఆమె మాయలో పడి నానమ్మ పోయిందనే బాధ కూడా అతనిలో కనిపించదు. కుమార్‌ని మొదట్లో విసుక్కున్న కృష్ణకుమారి ఆ తర్వాత అతడి టచ్‌కి పడిపోతుంది. ఇద్దరు ఘాటు ప్రేమలో మునిగితేలుతుంటారు. ఇక ఊరు జాతర స్టార్ట్ అవుతుంది. ఊరు పెద్దలు సౌడప్పతోపాటు డాక్టర్‌ కూడా వస్తేనే పండగ స్టార్ట్ కావాలి. కానీ మంచి ముహూర్తం దాటిపోతుందని, డాక్టర్‌ రాకముందే సౌడప్ప మేకని గంగాలమ్మకి బలిచ్చి పంగడ ప్రారంభిస్తాడు. అంతలోనే డాక్టర్‌ వస్తాడు. తాను లేకుండా పండగ ప్రారంభించడంతో ఆయన ఫీల్‌ అవుతాడు. ఈ క్రమంలో సౌడప్పతో చిన్నపాటి గొడవ అవుతుంది. మాట మాట పెరిగి చంపుకునే వరకు వెళ్తుంది. ఆ ఆవేశంలో డాక్టర్‌ని చంపేస్తాడు సౌడప్ప. దీంతో అర్థంతరంగా పండగ ఆగిపోతుంది. తమ ప్రేమ విషయం చెప్పాలనుకున్న కుమార్‌, కృష్ణకుమారిల ప్లాన్‌  తలకిందులవుతుంది. ఆ తర్వాత కుమార్‌, కృష్ణకుమారి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? ఊర్లో రోషం రాజు చికెన్‌ కథేంటి? ఇంతకి ఊరు జాతర జరిగిందా? లేదా? డాక్టర్‌ని చంపినందుకు సౌడప్పపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనంతరం సగిలేరు కథ ఏ తీరం  (Sagileti Katha Movie Review) చేరిందనేది సినిమా. 
 

Latest Videos


విశ్లేషణః 
రాయలసీమ నేపథ్యంలో ఇప్పటి వరకు ఫ్యాక్షన్‌ సినిమాలే వచ్చాయి. నరకడాలు, చంపడాలు మాత్రమే చూపించారు. కమర్షియల్‌ చిత్రాలకే పెద్ద పీట వేశారు. కానీ అక్కడి వాస్తవికతని, పల్లెటూరు మనుషుల మనస్తత్వాలను, ఎమోషన్స్ ని, కల్చర్‌ని ఆవిష్కరించే చిత్రాలు రాలేదనే చెప్పాలి. `బలగం` సినిమా తెలంగాణ నేపథ్యంలో వచ్చి మంచి విజయం సాధించి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన నేపథ్యంలో రాయలసీమ కల్చర్‌ని ఆవిష్కరించే ఉద్దేశ్యంతో దర్శకుడు రాజశేఖర్‌ (Sagileti Katha Movie Review) `సగిలేటి కథ` చిత్రాన్ని రూపొందించారు. ఇందులో రాయలసీమ పల్లె వాతావరణాన్ని, మనుషుల మనస్తత్వాలను, భాష, యాస, కల్చర్‌, ఎమోషన్స్ ని ఈ చిత్రంలో చూపించేందుకు ప్రయత్నం చేశారు. కానీ పూర్తి స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయారు. 
 

సినిమాలో అక్కడి గ్రామస్తుల మనస్తత్వాలను, చిన్న విషయానికే ఆవేశ పడటం, చిన్న చిన్న ఆనందాలు, పరువుకి ప్రయారిటీ ఇవ్వడం వంటి అంశాలను చాలా సహజంగా వెండితెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. యాసకి సంబంధించిన ఒరిజినాలిటిని చూపించాడు. అయితే సినిమాని చాలా వరకు ఫన్‌ వేలో తీసుకెళ్లాడు. దానికి మధ్యలో అక్కడక్కడ ఎమోషన్స్ ని మేళవించాడు. మరోవైపు హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక్‌ని సైతం రియలిస్టిక్‌గా, ఊర్లో కుర్రాళ్లు ఎలా అయితే అమ్మాయి కోసం ప్రయత్నాలు చేస్తుంటారో అలానే చాలా  సహజంగా అనిపించాయి. అంతే సహజంగా తెరకెక్కించాడు. అవి బాగా కనెక్ట్ అవుతాయి. దీనికితోడు రోషం రాజు పాత్రతో కామెడీని పండించాడు. రోషం రాజు చికెన్ తినాలనే కోరిక నెరవేరకుండా ఉండిపోవడం, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో అడ్డంకి ఏర్పడుతూ ఆయన చికెన్‌ తినకుండా చేస్తుంది ఆయా సీన్లు నవ్వులు పూయిస్తుంటుంది. ఇక చివర్లో ఉండే ట్విస్ట్ ఊహంచిన విధంగా ఉంటుంది. షాక్‌కి గురి చేస్తుంది. 

అయితే సినిమాలో బలమైన కథ లేకపోవడం మైనస్‌. రాయలసీమ ప్రజల మనస్తత్వాలను చెప్పాలనుకోవడం బాగున్నా, దానికి ఎంచుకున్న నేపథ్యం, తీసుకెళ్లిన తీరు కనెక్టింగ్‌గా లేదు. సినిమాని నడిపించే బలమైన కథ లేకపోవడం, సీన్లని తీసుకెల్లే దారం లేకపోవడంతో ఓ ఫ్లో మిస్‌ అయ్యింది. ఇలాంటి సినిమాలకు ప్రధానంగా ఓ సోల్‌ ఉంటుంది. అది ఈ చిత్రంలో మిస్‌ అయ్యిందని చెప్పొచ్చు. దీంతో సీన్లుగానే మిగిలిపోతుంది. దీనికితోడు ఎంతసేపు కథ ముందుకు సాగదు, అక్కడక్కడే తిరుగుతుంటుంది. చిన్న చిన్న కారణాలకు ఆవేశానికి గురి కావడం, పండగ రోజు డాక్టర్‌ని చంపడం వంటి సీన్‌ కన్విన్సింగ్‌గా లేదు. చికెన్‌ వండే సీన్లు, నాన్‌ వెజ్‌కి సంబంధించిన సీన్లని పదే పదే (Sagileti Katha Movie Review) చూపించడం ఓవర్‌గా అనిపించింది. పైగా స్లో మోషన్‌ సీన్లు, దానికి తగ్గ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అంతగా నప్పేలా లేదు. రోషం పాత్ర ద్వారా ఫన్‌ జనరేట్‌ చేయాలని చూసినా, అది కూడా అంతగా వర్కౌట్‌ కాలేదు. కొన్ని సీన్లకే పరిమితమయ్యింది. లవ్‌ ట్రాక్‌లో డెప్త్‌ మిస్‌ అయ్యింది. కాకపోతే ఉన్నంతలో ఆ లవ్‌ ట్రాకే సహజంగా ఉండటంతో ఆకట్టుకుంటుంది. అదే సమయంలో రోషం రాజు పాత్రనే నవ్వులు పూయిస్తుంది. ఈ రెండు ఈచిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయి. కథపై దర్శకుడు మరింత వర్క్‌ చేసి సినిమాని తెరకెక్కించి ఉంటే ఫలితం ఇంకా బాగుండేది. 
 

నటీనటులుః

కుమార్‌ పాత్రలో రవి మహాదాస్యం చాలా సహజంగా చేశాడు. పల్లెటూరి కుర్రాడిలా ఒదిగిపోయాడు. ప్రేమకి సంబంధించిన సీన్లలోనే మెప్పించాడు. ఓ మిడిల్‌ క్లాస్‌ కుర్రాడిలా బాగా బిహేవ్‌ చేశాడు. అలాగే కృష్ణకుమారి పాత్రలో విషిక కూడా ఆకట్టుకుంది. పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయింది. అదే సమయంలో సహజంగా అందాలను ఆవిష్కరిస్తూ మెప్పించింది. డీ గ్లామర్‌ లుక్‌ కూడా బాగుంది. ఇక సౌడప్పగా రాజశేఖర్‌ బాగా చేశాడు. సినిమాలో మరో హైలైట్‌ అయ్యే పాత్ర ఇది. ఇక రోషం రాజు (Sagileti Katha Movie Review) పాత్రలో నరసింహ ప్రసాద్‌ పాత్ర సినిమాకి మరో బలం. చికెన్‌ తినాలనే కోరిక తీరక అతను పడే బాధ, తన భార్య చిన్న చూపు చూడటం, అప్పిచ్చేవాడు చేసే కామెంట్లు, చికెన్‌ ప్రతి సారి మిస్‌ కావడం వంటి సీన్లలో చాలా బాగా చేశాడు. అలాగే హీరో తల్లి పాత్ర కూడా ఆకట్టుకునేలా ఉంది. ఊరి పెద్ద పాత్ర బాగుంది. మిగిలిన పాత్రధారులు విలేజ్‌కి తగ్గట్టు బాగా సెట్‌ అయ్యారు. తెరపై అంతే సహజంగా కనిపించారు. 
 

టెక్నికల్‌గాః 
ఇలాంటి విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ చిత్రాలకు సంగీతం ప్రధానం. మ్యూజిక్‌ డైరెక్టర్‌ జస్వంత్‌ పసుపులేటి ఆ స్థాయిలో మ్యూజిక్‌ ఇవ్వలేదు. వెరైటీగా ఇచ్చే ప్రయత్నం చేశాడు, కానీ అది కనెక్ట్‌ కాలేదు. కెమెరా వర్క్ పరంగానూ ఇంకా క్వాలిటీ మెయింటేన్‌ చేయాల్సింది. దర్శకుడే సినిమాటోగ్రాఫర్‌ కావడం కారణమా? ఏమో. ఎడిటింగ్‌ పరంగానూ ఇంకా కేర్‌ తీసుకోవాలి. దర్శకుడు రాజశేఖర్‌ ఎంచుకున్న పాయింట్‌, చెప్పాలనుకున్న విషయం మంచిదే. అభినందనీమైంది. క్రియేటివ్‌ పరంగా మెచ్చుకోదగినది. కానీ దాన్ని అంతే బాగా తెరకెక్కించడంలో (Sagileti Katha Movie Review) ఆయన పూర్తి శాతం సక్సెస్‌ కాలేకపోయాడు. కథని బలంగా రాసుకుని, ఎంటర్‌టైన్‌మెంట్స్ పై మరింత ఫోకస్‌ పెట్టి తేస్తే బాగుండేది. మొత్తానికి ఇదొక కొత్త ప్రయత్నంగా చెప్పాలి.

ఫైనల్‌గాః కొత్త ప్రయత్నం `సగిలేటి కథ`. 
రేటింగ్‌ః 2.5

 

click me!