Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?

Published : Sep 04, 2026, 01:10 PM IST

అల్లరి నరేష్‌ తాజాగా `రంభ ఊర్వశి మేనక` అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. మళ్లీ తన కామెడీ జోనర్‌లో చేసిన చిత్రమిది. మరి మరోసారి ఆయన హిట్ అందుకున్నాడా? ఈ మూవీ ఎలా ఉందంటే?

PREV
16
రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ

ఒకప్పుడు కామెడీ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు అల్లరి నరేష్‌. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. అయితే కామెడీ సినిమాలు ఆడకపోవడంతో యాక్షన్‌ థ్రిల్లర్స్ వైపు టర్న్ తీసుకున్నాడు. ఇవి ఫర్వాలేదనిపించాయి. కానీ ఇటీవల అవి కూడా ఆడటం లేదు. దీంతో మళ్లీ తన కామెడీ జోనర్‌లోకి వచ్చాడు. ఇప్పుడు `రంభ ఊర్వశి మేనక` అనే చిత్రంలో నటించాడు. సురభి, రాశీ సింగ్‌, విష్ణు ప్రియా భీమనేని, ప్రిషా సింగ్‌ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్‌, నరేష్‌ వీకే, శ్రీనివాస్‌ రెడ్డి వంటి వారు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకాలపై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(సెప్టెంబర్‌ 4న) విడుదలైంది. మరి మూవీ ఎలా ఉంది? అల్లరి నరేష్‌కి హిట్‌ పడిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
రంభ ఊర్వశి మేనక మూవీ కథ

సూరి(అల్లరి నరేష్‌)కి చిన్నప్పట్నుంచి హీరో కావాలనే కోరిక ఉంటుంది. అది వాళ్ల నాన్న కోరిక. ఆయన హీరో కాలేక రంభ ఊర్వశి మేనకు డ్రామా కంపెనీ పెట్టి నాటకాలు వేస్తుంటాడు. దీంతో తాను హీరో అవ్వాలనుకుంటాడు సూరి. అయితే వాళ్ల ఇంట్లో వంశపారపర్యం ఒక మ్యాజిక్‌ బుక్ ఉంటుంది. దాంట్లో సరైన ముగ్గు వేస్తే రంభ ఊర్వశి మేనకు దిగి వస్తారని, వాళ్లు కోరిన కోరికలు తీరుస్తారని అంటారు. ఎవరికీ అది కలిసి రాలేదు. దీంతో సూరి దాన్ని నమ్ముకొని 25ఏళ్లుగా ముగ్గులు వేస్తుంటాడు. కానీ అది ఓపెన్‌ కాదు. దాని పేరు చెప్పి ఊర్లో అప్పులు చేస్తాడు. అప్పుల వాళ్లు రోజూ ఇంటిమీదికొస్తుంటారు. వారికి ఏదో మాయ మాటలు చెప్పి కాలం వెళ్లదీస్తుంటారు. ఇంతలో వాళ్ల ఊరిలోకి తన చిన్నప్పటి లవర్‌ చిన్ని(సురభి) వస్తుంది. ఆమె అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తుంటుంది. కానీ సూరి కోసమే వస్తుంది. అయితే వాళ్ల నాన్న(గోపరాజు రమణ)కి సూరి అప్పుల విషయం తెలిసి పెళ్లికి నో చెబుతాడు. నెల రోజుల్లో అప్పులన్నీ తీరిస్తే అమ్మాయిని ఇస్తానని కండీషన్‌ పెడతాడు. నెల కాదు ఐదు రోజుల్లో తీరుస్తానని సవాల్‌ విసురుతాడు సూరి. మళ్లీ రంభ ఊర్వశి మేనక విగ్రహాల వద్దకు వెళ్లి చివరి ప్రయత్నంగా మ్యాజిక్‌ బుక్‌పై ముగ్గువేయగా అది వర్కౌట్‌ అవుతుంది. నిజంగానే రంభ(రాశిసింగ్‌), ఊర్వశి(విష్ణు ప్రియా), మేనక(ప్రిషా సింగ్‌) వస్తారు. కానీ ఆ కంగారులో తన కోరికలు కోరలేకపోతాడు సూరి. రేపు రమ్మని చెప్పగా, వాళ్లు రేపు వస్తారు, కానీ ఈ విషయం ఇంద్రుడికి తెలిసి దేవకన్యలకు పవర్స్ ఉండే చేతి కడియాలు లేకుండా పంపిస్తాడు. దీంతో వాళ్లు సూరి కోరికలు తీర్చలేకపోతారు. తమకి పవర్స్ రావాలంటే చైత్ర పౌర్ణమి వరకు ఆగాల్సి వస్తుంది. మరోవైపు సూరి అమ్మ అరుదైన జబ్బుతో ఆసుపత్రి పాలవుతుంది. ఆమెని బతకాలంటే 60లక్షలు ఖర్చు అవుతుంది. దేవకన్యలు కోరికలు తీర్చలేరు, మరోవైపు అమ్మ ఆసుపత్రిలో ఉంటుంది. ఇంకోవైపు అప్పుల వాళ్ల బాధలు ఎక్కువవుతాయి. మరి సూరి ఏం చేశాడు? అప్పులవాళ్లంతా ఒక్కొక్కరుగా ఎందుకు చనిపోయారు? సూరి అమ్మ బతికిందా? సూరి కోరికలు తీరాయా? ఇంద్రుడుతో సూరికి గొడవేంటి? అనేది మిగిలిన కథ.

36
రంభ ఊర్వశి మేనక మూవీ విశ్లేషణ

ఇంద్రలోకం, దేవలోకం, యమలోకంతో ముడిపెడుతూ కామెడీ ప్రధానంగా చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఇది చాలా కాలం తర్వాత వచ్చిన మూవీ అని చెప్పొచ్చు. దేవకన్యలు రంభ ఊర్వశి మేనకలతో హీరో పాత్రకి లింక్‌ చేస్తూ కామెడీ ప్రధానంగా ఈ మూవీని రూపొందించారు. అల్లరి నరేష్‌ అంటే కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఈ మధ్య గ్యాప్‌ వచ్చిన నేపథ్యంలో మళ్లీ అలాంటి జోనర్‌లో ఈ మూవీ చేశాడు. చేస్తే చేశాడు కానీ, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా కామెడీ ఉండాలి, కానీ ఆయన తన ఇరవై ఏళ్ల క్రితం స్టయిల్‌ కామెడీతోనే రావడం, అదే ఫార్మాట్‌లో ఈ మూవీ చేయడం గమనార్హం. అల్లరి నరేష్‌.. ఏం చేసినా అలానే ఉంటాయా? లేక ఆయన అప్‌ డేట్‌ కాలేకపోతున్నారా? అనే సందేహం ఈ మూవీ చూశాక కలుగుతుంది. మళ్లీ ఇరవై ఏళ్లనాటి తన సినిమాలు చూసినట్టుగానే ఈ చిత్రం ఉంది. అదేస్టయిల్‌ కామెడీ, అదే స్టయిల్‌ యాక్టింగ్‌ తో ఈ సినిమాని తెరకెక్కించడం గమనార్హం. సినిమా ప్రారంభం నుంచి అల్లరి నరేష్‌ మార్క్ రొటీన్‌ కామెడీ డైలాగ్‌లు, సీన్లతో సాగుతుంది. సీన్లలో మ్యాటర్‌ లేదు, డైలాగ్‌ల్లో కామెడీ లేదు. పైగా నాయిస్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో నవ్వు రాదు కదా, చిరాకు తెప్పిస్తుంది. ఒక్కో సీన్‌ వచ్చిపోతుంటాయి. అల్లరి నరేష్‌, వీకే నరేష్‌, శ్రీనివాస్‌ రెడ్డి ముగ్గురు ఇందులో ఫ్రెండ్స్. వాళ్లు తాము పెద్ద వాళ్లం కావాలనే కలల్లో ఉంటారు. ఈ ముగ్గురు చేసే అల్లరి చిల్లర పనులు ఫన్నీగా ఉన్నా, కామెడీ పండలేదు. దీంతో డ్రైగా వెళ్తుంది. అదే సమయంలో చాలా సన్నివేశాలు సిల్లీగా ఉంటాయి. సీన్లలో క్వాలిటీ లేదు. అంతా ఊహించినట్టుగా, మరోవైపు రొటీన్‌గా నడుస్తుంటాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్ కొంత ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ అదే రొటీన్‌గా మారుతుంది. సెకండాఫ్‌ సైతం అదే నాయిస్‌తో, పేలవమైన కామెడీ సీన్లతో రన్‌ అవుతుంది. దేవతలను పట్టుకొంటే చనిపోవడమనేది కొత్తగా ఉంది. కానీ అందులోనూ ఫన్‌ పండలేదు. శవాలను దాచే సన్నివేశాలు కూడా ఓవర్‌గా ఉంటాయి. విలన్‌ పాత్ర అయిన తారక్‌ పొన్నప్పతో సవాల్‌ సీన్లలోనూ పస లేదు. అయితే చివర్లో మదర్‌ సెంటిమెంట్‌కి సంబంధించిన సీన్లు కొంత వరకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. అదే సమయంలో దేవకన్యలను అల్లరి నరేష్‌, శ్రీనివాస్‌ రెడ్డి, నరేష్‌ ముట్టుకునే సీన్‌లో వచ్చే పాటలు అలరిస్తాయి. ఇంద్రుడికి సంబంధించిన సీన్‌ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. ఓవరాల్‌గా క్లైమాక్స్ ఉన్నంతలో బెటర్‌గా ఉంటుంది. మిగిలిన సినిమా మొత్తం రొటీన్‌ రొడ్డకొట్టుడు, అరిగిపోయిన ఓల్డ్ ఫార్మాట్‌లో సాగే కామెడీ మూవీగా చెప్పొచ్చు.

46
రంభ ఊర్వశి మేనక మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

సూరి పాత్రలో ఎప్పటిలాగే అల్లరి నరేష్‌ నటుడిగా ఆకట్టుకున్నాడు. కానీ ఆయన పాత్రలో కామెడీ ఏమాత్రం వర్కౌట్‌ కాలేదు. ఆయన యాక్టింగ్‌ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. కాకపోతే ఎమోషనల్‌ సీన్ లో, మదర్‌ సెంటిమెంట్‌ సీన్లలో మాత్రం ఇరగదీశాడు. అదే హైలైట్‌. ఇక చిన్ని పాత్రలో సురభి మెరిసింది. కనిపించిన కాసేపు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక రంభ ఊర్వశి మేనకలుగా రాశీ సింగ్‌, విష్ణు ప్రియా, ప్రిషా సింగ్‌ లు కూడా ఉన్నంతలో మెప్పించారు. అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. శ్రీనివాస్‌ రెడ్డి తనదైన కామెడీతో అలరించే ప్రయత్నం చేశాడు. వీకే నరేష్‌ నటన, కామెడీ నవ్విస్తుంది. ఇంద్రుడుగా వెన్నెల కిశోర్‌ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయనలో మార్పు ఆకట్టుకుంటుంది. సూరి తల్లిగా చేసిన నటి బాగానే మెప్పించింది. గోపరాజు రమణ ఆకట్టుకున్నాడు. ఎస్‌ఐగా నెగటివ్‌ రోల్‌లో తారక్‌ పొన్నప్ప మెప్పించే ప్రయత్నం చేశాడు. మిగిలిన వారు ఓకే అనిపించారు.

56
రంభ ఊర్వశి మేనక మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

చైతన్య భరద్వాజ్‌ మ్యూజిక్‌ రొటీన్‌గానే ఉంది. పాటలు ఆకట్టుకునేలా లేవు. ఆర్‌ఆర్‌ కూడా పరమ రొటీన్‌గా ఉంది. కెమెరా వర్క్ బాగుంది. విజువల్‌గా సినిమా కలర్‌ఫుల్‌గా ఆకట్టుకుంది. ఎడిటింగ్‌ పరంగా ఇంకా చేయడానికి ఏం లేదు. నిర్మాణ విలువలకు కొదవలేదు. రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ రాజీ లేకుండా నిర్మించారు. దర్శకుడు చంద్రమోహన్‌ చింతాడ ఎంచుకున్న కథ బాగానే ఉంది. కానీ దాన్ని తీసుకెళ్లిన తీరు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కామెడీని వర్కౌట్‌ చేయడంలో విఫలమయ్యారు. రొటీన్‌ అల్లరి నరేష్‌ కామెడీ ట్రాక్‌లో పడిపోయినట్టుగా ఉంది. ట్రెండీ డైలాగ్‌లు ఉన్నా, అవి థియేటర్లో పేలలేదు. సీన్లలో పసలేకపోవడంతో అవి తేలిపోయాయి. మదర్‌ సెంటిమెంట్‌ ని బాగానే వర్కౌట్‌ చేశారు. అది తప్ప సినిమాలో చెప్పుకోదగ్గది, ఎంటర్‌టైన్‌ చేసే అంశాలు ఇంకా ఏం లేకపోవడం పెద్ద మైనస్‌.

66
ఫైనల్‌గా

ఇది అల్లరి నరేష్‌ మార్క్ పరమ రొటీన్‌ కామెడీ సినిమా. నవ్వులు తక్కువ గోల ఎక్కువ. అల్లరి నరేష్‌ తన బలమైన గ్రౌండ్‌(కామెడీ)లోనూ సిక్స్ కాదు కదా, కనీసం ఫోర్‌ కూడా కొట్టలేకపోయారు.

రేటింగ్‌: 2

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories