Naa Saami Ranga Review: `నా సామి రంగ` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Jan 14, 2024, 12:33 PM IST

నాగార్జున ఏ ప్రయత్నం చేసినా లాభం లేదని సంక్రాంతి వంటకంతో వచ్చాడు. `నా సామిరంగ` అనే చిత్రంతో ఈ పొంగల్‌కి తన అదృష్టాన్ని పరీక్షించేందుకు వచ్చాడు. మరి `నా సామిరంగ` మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

నాగార్జునకి థియేటర్‌ హిట్‌ లేక చాలా కాలం అవుతుంది. `సోగ్గాడే చిన్ని నాయన` తర్వాత ఆయన నటించిన ఏ మూవీ ఆడలేదు. దీంతో మళ్లీ అలాంటి పండగ కంటెంట్‌తో వస్తున్నాడు. `నా సామి రంగ` అనే చిత్రంలో నటించారు. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని దర్శకత్వం వహించిన ఈ మూవీలో అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మించింది. ఇది మలయాళంలో రూపొందిన `పొరింజు మరియం జోస్‌` అనే చిత్రానికి రీమేక్‌. ఈ మూవీ నేడు(జనవరి 14న) ఆదివారం విడుదలైంది. రీమేక్‌లు ఇటీవల ఆడటం లేదు. మరి ఈ మూవీ ఆడియెన్స్ ని మెప్పించిందా? నాగార్జునకి హిట్‌ పడిందా ? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః

క్రిష్ణయ్య(నాగార్జున) అనాథ. అంజి(అల్లరి నరేష్‌) అమ్మ చేరదీస్తుంది. ఇద్దరిని పెంచుతుంది. కానీ ఆమె సడెన్‌గా కన్నుమూస్తుంది. దీంతో క్రిష్ణయ్య, అంజి ఒంటరవుతారు. ఆ సమయంలో ఊరి పెద్దాయన(నాజర్‌) వారిని చేరదీస్తాడు. అమ్మ చేసిన అప్పుని తీరుస్తాడు. దీంతో పెద్దాయన వద్దే ఇద్దరు పెరుగుతారు. చిన్నప్పట్నుంచే వరాలు(ఆషికా రంగనాథ్‌) అంటే క్రిష్ణయ్యకి ప్రేమ. ఆ ప్రేమని వ్యక్తం చేయాలనుకునే సమయంలోనే ఓ పెద్దాయన ఆపదలో ఉండటంతో ఆ విషయం చెప్పకనే వెళ్లిపోతాడు. ఆ తర్వాత వరాలు వేరే ఊరికి వెళ్తుంది. పదేళ్ల తర్వాత మళ్లీ ఇంటికొస్తుంది. అంజి పెళ్లికి వస్తుంది. ఆ సమయంలో వరాలుని చూసిన క్రిష్ణయ్యకి తనలో దాచుకున్న ప్రేమ తన్నుకొస్తుంది. వరాలని కలవాలని, ఆమెకి ప్రేమ విషయం చెప్పాలని తపిస్తుంటాడు. ఎట్టకేలకు ఒకరికొకరు తమ ప్రేమని వ్యక్తం చేసుకుంటారు. పెళ్లికి సిద్ధపడతారు. అంతలోనే వరాలుని పెద్దాయన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు వరాలు తండ్రి( రావు రమేష్‌). ఈ ఇద్దరు ప్రేమించుకున్న విషయం తెలిసి తండ్రి కుమిలిపోతాడు. ఇంట్లో ఊరేసుకుని చనిపోతాడు. దీంతో క్రిష్ణయ్యకి దూరమవుతుంది వరాలు. ఆమె పిలుపు కోసం, ఆమె అంగీకారం కోసం వెయిట్‌ చేస్తూనే ఉంటాడు. ఇంతలో పెద్దాయన చిన్న కొడుకు(షబీర్‌ కల్లరక్కల్‌) విదేశాల నుంచి ఊరొస్తాడు. వరాలని డిస్ట్రర్బ్ చేస్తుంటాడు. అంజిని కొట్టి క్రిష్ణయ్యతో గొడవ పెట్టుకుంటారు. మరి ఈ గొడవ ఎంత దూరం వెళ్లింది. వరాలు.. క్రిష్ణయ్యకి ఓకే చెప్పిందా లేదా?, ఇందులో రాజ్‌ తరుణ్‌ పాత్రేంటి? ఆయన ప్రేమకి, ఊరు గొడవకి సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః
`నా సామిరంగ` మూవీ మలయాళంలో విజయం సాధించిన `పొరింజు మరియంజోస్‌` చిత్రానికి రీమేక్‌. ఇందులో పండగ ఎలిమెంట్లు ఉండటంతో నాగ్‌ ఈ చిత్ర హక్కులు తీసుకుని సంక్రాంతి పండగ టార్గెట్‌గా రీమేక్‌ చేశారు. `నా సామిరంగ` అనే మాస్‌ టైటిల్‌తో వచ్చాడు. నాగార్జునకి సంక్రాంతి బాగా కలిసి వస్తోంది. `సోగ్గాడే చిన్ని నాయన` చిత్రంతో కెరీర్‌లోనే బిగ్‌ హిట్‌ని అందుకున్నారు. ఇప్పటికీ అదే ఆయన పెద్ద హిట్‌ మూవీ. ఆ తర్వాత ఏ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ మధ్య వచ్చిన `బంగార్రాజు` కూడా ఇలాంటి పండగ ఎలిమెంట్లతో విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. అది యావరేజ్‌గా నిలిచింది. సంక్రాంతికి పండగ లాంటి సినిమాతో వస్తే హిట్‌ గ్యారంటీ అని నమ్మి ఈ మూవీని చేశాడు నాగార్జున. 
 

సంక్రాంతి పండక్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్లని జోడించి ఈ మూవీని తెరకెక్కించాడు. మలయాళ మాతృకలోనూ అలాంటి ఎలిమెంట్లు ఉండటంతో ఇందులోనూ మరింతగా జోడించి రంగరించారు. అయితే కథ పరంగా చెప్పాల్సి వస్తే ఇదొక రొటీన్‌, రెగ్యూలర్‌ కమర్షియల్‌ కథ. ఊరు పెద్దాయన ఒక్కన్ని చేరదీయడం, తన కొడుకులాగా పెంచడం, చివరికి తన ఫ్యామిలీ వరకు వచ్చే సరికి కొడుకులాంటి వాడిని చంపేయడం అనే కథ తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. బాగా అరిగిపోయిన ఫార్ములా కూడా. సినిమా కథ కూడా 1988లో సాగుతుంది. ఆనాటి కథ అని చెప్పకనే చెప్పేశాడు. తెలుగు ఆడియెన్స్ కి కావాల్సిన ఐదు పాటలు, ఐదు ఫైట్లు జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. మధ్యలో కొన్ని కామెడీ సీన్లు, నాగార్జున, ఆషికా రంగనాథ్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ని మేళవించి లాగించేశారు. మొదటి భాగం మొత్తం నాగార్జున, ఆషికాల మధ్య లవ్‌ ట్రాక్‌ ఉంటుంది. మధ్యలో అంజి పెట్టి, రాజ్‌ తరుణ్‌ లవ్‌ ఎలిమెంట్లు ఉంటాయి. మధ్యలో ఒకటి రెండు ఫైట్లు పెట్టి, పాటలు పెట్టి ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసేలా ప్రయత్నించారు. 
 

ఇక రెండో భాగంలో పెద్దాయన కొడుకు రావడంతో క్రిష్ణయ్య, అంజిలతో గొడవ పడటం, హీరోయిన్‌ని ఇబ్బంది పెట్టడం, దీంతో అతనిపై హీరో తిరగబడటం, వార్నింగ్‌లు ఇచ్చుకోవడం, చివరికి క్రిష్ణయ్య, అంజిలను చంపాలని అతను ప్లాన్‌ చేయడం ఇలా అంతా ఊహించినట్టుగానే సాగుతుంది. పైగా రీమేక్ కావడంతో అవే ఎలిమెంట్లని కాస్త అటు ఇటుగా చూపించారు. అల్లరి నరేష్‌ ఫస్ట నైట్‌లో నాగార్జునతో వచ్చే కామెడీ సీన్లు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. ఇక హీరోయిన్‌ రాత్రి(బూతు) సినిమాలు చూడాలను కోరడం, నాగార్జున ఆమెని థియేటర్‌కి తీసుకెళ్లడం, థియేటర్లలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఆ తర్వాత ఇద్దరి లవ్‌ ట్రాక్‌ రొటీన్‌గా, బోరింగ్‌గా అనిపిస్తుంది. బాగా లాగినట్టు ఉంటుంది. సెకండాఫ్‌ మొత్తం యాక్షన్‌ ట్రాక్‌లోకి సాగుతుంది. అక్కడ కూడా రెండు పాటలు పెట్టి సినిమాని మరింతగా లాగుకుంటూ వెళ్లారు. రెండు ఊర్ల మధ్య గొడవలో కాస్త డ్రామా క్రియేట్‌ చేశాడు. క్లైమాక్స్ యాక్షన్‌తో ముగించారు. అయితే అంజి పాత్రకి సంబంధించిన కామెడీగానీ, ఎమోషన్స్ గానీ నవ్విస్తాయి, చివర్లో ఏడిపిస్తాయి. మిగిలిన సీన్లు అన్నీ రొటీన్‌గానే సాగుతాయి. కాకపోతే సంక్రాంతి పండగకి కావాల్సిన ఎలిమెంట్లు జోడించడం సినిమాకి ప్లస్‌ పాయింట్స్. 

Naa Saami Ranga

నటీనటులుః
క్రిష్ణయ్య పాత్రలో నాగార్జున ఒదిగిపోయాడు. తనకు నచ్చిన పాత్ర కావడంతో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. కొంత కామెడీ చేశాడు. ఎమోషన్స్ సీన్లలో తేలిపోయాడు. లవ్‌ సీన్లలో ఆకట్టుకున్నా, ఎక్కువ సేపు ఉండటంతో బోర్‌ తెప్పించాడు. డాన్సులు మాత్రం నెట్టుకొచ్చాడు. ఇక అంజి పాత్రలో అల్లరి నరేష్‌ బాగా చేశాడు. నవ్వించి నవ్వించి ఏడిపించాడు. రాజ్‌ తరుణ్‌ ఓకే అనిపించాడు. ఇంకా చెప్పాలంటే ఆయనది గెస్ట్ రోల్‌. ఆషికా రంగనాథ్‌ అదరగొట్టింది. అందంతో మెస్మరైజ్‌ చేసింది. నాజర్‌ కొట్టిన పిండి పాత్ర. రావు రమేష్‌ కాసేపైనా తన స్టయిల్‌లో రచ్చ చేశాడు. విలన్‌గా షబీర్‌ బాగానే నటించాడు. కానీ కాస్త ఓవర్‌గా అనిపించింది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయని చెప్పొచ్చు. 

టెక్నీషియన్లుః 
కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని ఈ మూవీతో దర్శకుడిగా మారారు. నాగార్జున ఎంతో మంది దర్శకులను పరిచయం చేసి, లైఫ్‌ ఇచ్చాడు. ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్‌కి కూడా లైఫ్‌ ఇచ్చాడని చెప్పొచ్చు. దర్శకుడిగా విజయ్‌ బిన్ని అదరగొట్టాడు. తానేంటో నిరూపించుకున్నాడు. దర్శకుడిగా తొలి సినిమా అయినా పెద్ద దర్శకుడు రేంజ్‌లో తెరకెక్కించాడు. కాకపోతే రొటీన్‌ కథ కావడమే ఇందులో మైనస్‌. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త ట్రిమ్‌ చేస్తే బాగుండేది. ఆస్కార్‌ విన్నర్‌ ఎంఎం కీరవాణి మ్యూజిక్‌ ఫర్వాలేదు. రొటీన్‌గానే ఉన్నా ఓకే అనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు ఓకే అనిపించాయి. 

ఫైనల్‌గాః రొటీన్‌ కమర్షియల్‌ మూవీ. సంక్రాంతి కోసమే వడ్డించిన వంటకం. 

రేటింగ్‌ః 2.5


నటీనటులు: నాగార్జున అక్కినేని, అషికా రంగనాథ్, అల్లరి నరేష్, మిర్నా మీనన్, రాజ్ తరుణ్, రుక్సర్ థిల్లాన్, రవి వర్మ, నాజర్, రావు రమేష్, షబీర్‌, తదితరులు. 
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ బిన్ని, 
మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, 
కథ: అభిలాష్ ఎన్ చంద్రన్ 
సినిమాటోగ్రఫి: దాశరథి శివేంద్ర,
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్‌.
మ్యూజిక్: ఎంఎం కీరవాణి 
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ 

Latest Videos

click me!