ధనుష్‌ `కెప్టెన్‌ మిల్లర్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published Jan 26, 2024, 1:13 AM IST

ధనుష్‌ హీరోగా నటించిన `కెప్టెన్‌ మిల్లర్‌` మూవీ తమిళంలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్బంగా తెలుగులో విడుదల అయ్యింది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

ధనుష్‌ తమిళ హీరో అయినా తెలుగులో మంచి మార్కెట్‌ ఏర్పర్చుకున్నారు. ఆయన `రఘువరణ్‌ బీ టెక్‌`తోనే తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ తెలుగులో స్ట్రెయిట్‌గా చేసిన `సార్‌` మూవీ మంచి విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ధనుష్‌ తెలుగు హీరోలా మారిపోయారు. తెలుగు హీరోలను కోలీవుడ్‌ ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోరు, సినిమాలను ఆదరించరు, కానీ తెలుగు ఆడియెన్స్ మాత్రం తమిళ హీరోలను అక్కున చేర్చుకుంటున్నారు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, విక్రమ్‌, సూర్య, కార్తి లా మాదిరిగానే ధనుష్‌ని, ఆయన మూవీస్‌ని ఆదరిస్తున్నారు. తాజాగా ధనుష్‌ `కెప్టెన్‌ మిల్లర్‌` మూవీతో వచ్చాడు. ఈ మూవీ సంక్రాంతికే తమిళంలో విడుదలైంది. యావరేజ్‌ టాక్‌ని తెచ్చుకుంది. ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ కీలక పాత్రల్లో మెరవడం విశేషం. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో రెండు వారాల గ్యాప్‌ తర్వాత నేడు(జనవరి 26న) గణతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైంది. మరి తెలుగు ఆడియెన్స్ ని మెప్పించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథః
ఇది స్వాతంత్ర్యం రాక ముందు, బ్రిటీష్‌ వాళ్లు భారత్‌ని ఆక్రమించుకుని నెమ్మదిగా ఒక్కో రాజ్యాన్ని, దొరలను తమ గుప్పిట్లోకి తీసుకుంటున్న రోజులవి. ఆ సమయంలో దొరలు పాలించే ఓ రాజ్యంలో దళితులు, పేదవాళ్లు కలిసి ఓ గుడిని నిర్మిస్తారు. దొర(జయప్రకాష్‌) ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణం జరుగుతుంది. కానీ ఆ గుడిలోకి ఆ ఊరి ప్రజలకు ప్రవేశం లేదు. దొర తమ పరిధిలోకి తీసుకుంటాడు. అక్కడి నుంచి తమ ఆధిపత్యాన్ని, దౌర్జన్యాలను కొనసాగిస్తుంటాడు. ఇది చూసిన అగ్ని అలియాస్‌ కెప్టెన్‌ మిల్లర్‌(ధనుష్‌) చలించిపోతాడు. ఆవేశంతో ఊగిపోతాడు. దొరకంటే బ్రిటీష్‌ వాళ్లు బెటర్‌ అని, తమకి గుర్తింపు, గౌరవం, ఆయుధం ఇస్తున్నారని చెప్పి, ఊరు జనాల మాటని, తన శివన్న(శివరాజ్‌కుమార్‌) మాటని కాదని బ్రిటీష్‌ సైన్యంలో చేరతాడు. కెప్టెన్‌ మిల్లర్‌ పేరుని తీసుకుంటాడు. కానీ తీరా అందులోకి వెళ్లాక.. బ్రిటీష్‌ వాళ్లు వీరిని ట్రైన్ చేసి, ఆయుధాలు ఇచ్చి స్వాతంత్ర్యం కోసం పోరాడే, తమకి ఎదురు తిరిగే అమాయక ప్రజలనే వీరి చేత కాల్చి చంపిస్తారు. దీంతో చలించిపోయిన అగ్ని బ్రిటీష్‌ సైన్యాధికారిని చంపి అక్కడి నుంచి పారిపోయి వస్తాడు. ఓ దొంగల ముఠాలో చేరతాడు. తమతో తమ వారినే చంపించే బ్రిటీష్‌ కుట్రలను తట్టుకోలేక వారిని అంతు చూసేందుకు సిద్ధమవుతాడు. దొంగలుగా, బందిపోట్లుగా చెలామణి అవుతున్న దళంలో చేరతాడు. తనదైన తెలివి, ధైర్యసాహసాలతో త్వరలో అందులో లీడర్‌ గా ఎదుగుతాడు. ఆ సమయంలోనే వీళ్లు నిర్మించి గుడిలో దేవుడిని బ్రిటీష్‌ సైన్యం దొర నుంచి తీసుకెళ్లిపోతుంది. దాన్ని తీసుకురావాలని, తెస్తే ఏదైనా ఇస్తా అని, అలాగే ఆలయంలోకి తమ ప్రజలకు ప్రవేశం కల్పిస్తా అని హామీ ఇస్తాడు. దీంతో ఆ నిధిని తెచ్చేందుకు తన సైన్యంతో వెళ్తాడు కెప్టెన్‌ మిల్లర్‌. మరి దాన్ని సాధించాడా? బ్రిటీష్‌ సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడు;? శివన్న కథేంటి? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ.  
 

విశ్లేషణః
స్వాతంత్ర్యం రాకముందు దొరల నియంతృత్వం, అణచివేత, బానిసలుగా చూసే సంస్కృతి ఉండేది. ఆ అంశాలను `కెప్టెన్‌ మిల్లర్‌` చిత్రంలో చూపించారు దర్శకుడు. చాలా సామాజిక అంశాలను ఇందులో వివరించే ప్రయత్నం చేశాడు. దీనికి బ్రిటీష్‌ ఆక్రమణ అనే అంశాలను జోడించి చేయడం గమనార్హం. అయితే ఈ మూవీకి అదే పెద్ద మైనస్‌. అప్పట్లో దొరల పాలన ఎలా ఉండేది, ఎంతగా అణచివేసేవారు, పేద కులాలను, దళితులను ఎంతగా అంటరాని వాళ్లుగా ట్రీట్‌ చేసే వాళ్లో చెబితే బాగుండేది, కానీ సంబంధం లేని బ్రిటీష్‌ ఆక్రమణ అనే అంశాలను జోడించి కథ డైవర్ట్ అయ్యేలా చేశాడు. అదే ఈ సినిమాలో పెద్ద మైనస్‌. మరోవైపు ఇది పాతకాలం నాటి కథ. దొరల అణచివేత, ధైర్జన్యాలు, దళితులను గుళ్లోకి రానివ్వకపోవడం వంటి అంశాలతో చాలా సినిమాలు వచ్చాయి. 2000కి ముందే ఇలాంటి కథలు వెండితెరపై సందడి చేశాయి. విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు కొత్త కాదు, ఇప్పుడు సందర్భం కాదు, కానీ ఈ మూవీలో చెప్పే ప్రయత్నం చేశాడు. దాన్ని కన్విన్సింగ్‌గా చెప్పడంలో విఫలమయ్యాడు దర్శకుడు. 
 

కథగా ఈ మూవీలో ఎంచుకున్న పాయింట్‌ చాలా బలమైనది. సరిగ్గా తీస్తే ఇప్పటి జనరేషన్‌కి తెలిసేలా ఉంటుంది, కనెక్ట్ అవుతుంది. కానీ అలా తీయలేదు. లేనిపోని ఎలిమెంట్లని పెట్టి కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేశాడు. అగ్ని కెప్టెన్‌గా మారడమనే అంశాలను బలంగా చూపించలేకపోయాడు. పైగా తను ఎవరికోసం పోరాడుతున్నాడో క్లారిటీ లేదు. ఆడియెన్స్ కి ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. సీన్ల పరంగా సినిమా బాగుంది. కొన్ని సీన్లు అదిరిపోయాయి. ఇంటర్వెల్‌లో వచ్చే ఫైట్‌ సీన్లు బాగుంది. హాలీవుడ్‌ మూవీ రేంజ్‌లో తీశారు. అంతేకాదు కెమెరా యాంగిల్స్ ని చూపించే విధానం, యాక్షన్‌సీన్లు, ధనుష్‌ పాత్రని ఆవిష్కరించిన తీరు నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. అక్కడ బీజీఎం కూడా అదిరిపోయింది. ఆ సీన్లు చూస్తే సినిమా నెక్ట్స్ లెవల్‌ అనే ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ సెకండాఫ్‌ వచ్చిక అనేక మలుపులు తిప్పారు. 
 

దేవుడిగుళ్లో దాచిపెట్టిన అతి ముఖ్యమైన, విలువైన దేవుడి నిధిని(విగ్రహాన్ని) బ్రిటీష్‌ వాళ్లు తీసుకుపోవడం, దాన్ని తిరిగి తెచ్చి ఇవ్వాలని హీరో వద్దకు దొర వెళ్లడం, తర్వాత వాళ్లు చేసే కుట్రలు కన్విన్సింగ్‌గా లేదు. అంతగా కనెక్ట్ అయ్యేలా తీయలేదు. ఆ సీన్లు పండితే సినిమా రేంజ్‌ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. పైగా ఎమోషన్స్ కూడా బలంగా లేవు. హీరో పాత్ర ఎలివేషన్లు, ఆయన ఎమోషన్‌ తప్ప, అతనిలో ఉన్న ఎమోషన్‌ని క్లారిటీగా తెరపై ఆవిష్కరించలేదు. దీంతో చాలా సీన్లు బాగున్నా, అంతగా కనెక్ట్ కాలేదు. సినిమాతో ట్రావెల్ కాలేం.పైగా వెబ్‌ సిరీస్‌ మాదిరిగా ఐదు ఛాప్టర్లు అంటూ అర్థం కానీ పేర్లు పెట్టి ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా కనెక్ట్ కాలేదు. కుల వివక్షని చెప్పాడు, కానీ దాని మీదే సినిమాని నడిపిస్తే బాగుండేది. 
 

కానీ సినిమాలో విజువల్స్ అదిరిపోయాయి. కెమెరా వర్క్ బాగుంది. కొన్ని ఫ్రేములు చూస్తుంటే జపాన్‌ డైరెక్టర్‌ అకీరా కురసోవా తీసిన షాట్లని తలపిస్తుంది. మరోవైపు మ్యూజిక్‌,బీజీఎం బాగుంది. ఇటీవల రొటీన్‌ రొట్ట కొట్టుడు కాకుండా కొత్తగా అనిపించింది. యాక్షన్‌ సీన్లు అదిరిపోయాయి. ఎమోషన్స్ పండలేదుగానీ, యాక్షన్‌ సీన్లు మాత్రం బాగున్నాయి. చాలా కష్టమైన సీన్లని ఈజీగా చేసినట్టుగా ఉంది. డైలాగులు కూడా అదిరిపోయాయి. టెక్నీకల్‌గా సినిమా చాలా బ్రిలియంట్‌గా ఉంది. కానీ సరైన విధంగా కథని డిజైన్‌ చేసుకుని, స్క్రీన్‌ ప్లేని రాసుకుని అంతే బాగా తెరకెక్కిస్తే సినిమా రేంజ్‌ వేరే లెవల్‌లో ఉండేది. మరోవైపు తమిళ(అరవ) ఛాయలు ఎక్కువగా ఉన్నాయి. భాష, యాస అలానే ఉంటుంది.కట్టుబొట్లు అలానే ఉన్నాయి. మరోవైపు అప్పట్లో అత్యాధునిక ఆయుధాలు వాడటమనేది కనెక్ట్ కాలేదు. సహజానికి భిన్నంగా ఉన్నాయి. అదే సమయంలో లాజిక్‌ లెస్‌గానూ ఉన్నాయి. దర్శకుడు అరుణ్‌ ఈ విషయాలపై ఫోకస్‌ పెట్టి బాగా చేస్తే మంచి సినిమా అయ్యేది. కానీ ఇప్పుడు ఇది తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ కావడం కష్టమనే చెప్పాలి. 

నటీనటులుః
అగ్ని, కెప్టెన్‌ మిల్లర్‌ పాత్రలో ధనుష్‌ అదరగొట్టాడు. తనదైన మాస్‌రోల్‌ని చేసుకుటూ వెళ్లాడు. పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్ చూపించాడు. అమాయక విలేజ్‌ కుర్రాడిగా, ప్రేమికుడిగా, తిరగబడే వీరుడుగా, పోరాడే యోధుడిగా ఇలా అన్ని రకాలుగా మెప్పించాడు. యాక్టింగ్‌ పరంగా మెప్పించాడు. శివ రాజ్‌ కుమార్‌ గెస్ట్ రోల్లో ఆకట్టుకున్నారు. ఆయన క్లైమాక్స్ ఎంట్రీ బాగుంది. మిగిలిన సీన్లకి పెద్దగా ప్రయారిటీ లేదు. సందీప్‌ కిషన్‌ పాత్రకి కూడా ప్రాధాన్యత దక్కలేదు. కానీ `జైలర్‌`లో మాదిరి చివర్లో అందరు ఎంట్రీ ఇచ్చా వాహ్‌ అనిపించారు. భానుమతిగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ ఆకట్టుకుంది. ఆమెకి మంచి పాత్ర పడింది. దొరగా జయప్రకాష్‌, రాజన్నగా ఎలగో కుమారవేల్‌, తానుగా నివేదితా సతీష్‌తోపాటు మిగిలిన పాత్రధారులు సైతం మెప్పించారు. నటీనటులు నటన సినిమాకి ప్లస్‌ అయ్యిందని చెప్పొచ్చు.
 

ఫైనల్‌గాః టెక్నీకల్‌గా బాగున్న ఔట్‌ డేటెడ్‌ స్టోరీ, కన్‌ఫ్యూజ్డ్ స్క్రీన్‌ప్లే.  తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ కావడం కష్టం.

రేటింగ్‌ః2.5
 

click me!