`పురుషోత్తముడు` మూవీ రివ్యూ, రేటింగ్..

First Published | Jul 26, 2024, 2:26 PM IST

ఇటీవల వివాదాల్లో నిలుస్తున్న రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `పురుషోత్తముడు`. ఈ సినిమా నేడు శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

రాజ్‌ తరుణ్‌ ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. లావణ్యతో సహజీవనం, హీరోయిన్‌ మాల్వి మల్హోత్రాతో డేటింగ్‌ ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. ఈ క్రమంలో ఆయన హీరోగా నటించిన సినిమాలు థియేటర్లోకి వస్తుండటంతో ఆసక్తి నెలకొంది. వాటిలో ఆయన హీరోగా నటించిన `పురుషోత్తముడు` సినిమా ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. రామ్‌ భీమన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్‌ తరుణ్‌కి జోడీగా హాసినీ సుధీర్‌ హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్‌ రాజ్‌, మురళీశర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించడం విశేషం. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్‌ పతాకంపై డా రమేష్‌ తేజావత్‌, ప్రకాష్‌ తేజావత్‌ నిర్మించారు. నేడు(జులై 26)న విడుదలైన ఈ సినిమా ఆకట్టుకునేలా ఉందా? లేదా? ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
రామ్‌(రాజ్‌ తరుణ్‌) విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఇండియాకి వస్తాడు. ఆయన ఫ్యామిలీకి హైదరాబాద్లో ఇండస్ట్రీస్‌ ఉంటాయి. ఆ కంపెనీకి సీఈవో ఎంపిక ఘట్టం జరుగుతుంది. రచిత్‌ రామ్ కి, తన పెదమ్మ (రమ్యకృష్ణ‌) కొడుకు మధ్య పోటీ నెలకొంటుంది. రామ్‌ విదేశాల్లో పెరిగిన నేపథ్యంలో ఇక్కడ విషయాలు తెలియవు, అవగాహన లేదు, ఇంత పెద్ద పోస్ట్ కి అర్హుడు కాడనే ప్రతిపాధన వస్తుంది. సీఈవో కావాలంటే వంద రోజులు ఎవరికీ తెలియకుండా ఒక సాధారణ మనిషిలా బతకాలని, ఈ టైమ్ లో ఎవరూ తనని గుర్తించకూడని, ఒకవేళ అలా ఎవరైనా గుర్తిస్తే  సీఈవో పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన రామ్‌ అన్నీ వదులుకుని తన ఇంటిని, కంపెనీ వదిలేసి వెళ్లిపోతాడు. వైజాగ్‌ ట్రైన్‌ ఎక్కి మధ్యలో ఓ మారుమూల గ్రామానికి చేరతాడు. అక్కడ అమ్ములు(హాసినీ సుధీర్‌) తనని మోటర్ సైకిల్ తో గుద్దుతుంది. దీంతో అపస్పారక స్థితిలో పడిపోయిన రామ్‌ని తన ఇంటికి తీసుకెళ్తుంది. తనకు ఎవరూ లేరని, అనాథని అని చెప్పి ఆమె వద్ద వ్యవసాయం పనులు చేసేందుకు పనిలో చేరతాడు రామ్‌. ఈక్రమంలో అమ్ములతో ప్రేమలో పడతాడు. మరోవైపు ఈ ఊర్లో ఎక్కువగా పూలతోటల రైతులు ఉంటారు. మార్కెట్‌లో ఎమ్మెల్యే కొడుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుంటాడు. ఎదురుతిరిగినవారిని అంతం చేస్తుంటాడు. దీంతో వాళ్ల తరఫున నిలబడతాడు రామ్‌. అందుకోసం పెద్ద స్థాయిలో పోరాటం చేపడతాడు. మరి ఆ పోరాటం ఏంటి? రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లాడు? మరి వంద రోజులు ఎవరికీ తెలియకుండా ఉండాలనే నిబంధనని పాటించాడా? బ్రేక్‌ చేశాడా? చివరికి సీఈవో ఎవరు అయ్యారు? ఇందులో ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, ముఖేష్‌ ఖన్నాల పాత్రేంటనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః 
రాజ్‌ తరుణ్‌ సోలో హీరోగా సక్సెస్‌ లేక చాలా ఏళ్లు అవుతుంది. ఈ సంక్రాంతికి నాగార్జున `నా సామి రంగా`లో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు సోలో హీరోగా సక్సెస్‌ కొట్టేందుకు `పురుషోత్తముడు` చిత్రంతో వచ్చాడు. తన కంపెనీ బాధ్యతలు చేపట్టాలంటే కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా సాధారణ మనిషిలా బతకడం, ఆ తర్వాత అత్యంత నాటకీయ పరిణామాల అనంతరం హీరో కంపెనీ బాధ్యతలు తీసుకోవడమనే కాన్సెప్ట్ తో, ఓ పెద్ద కంపెనీ అధినేత కొడుకు మామూలు పల్లెటూరికి వచ్చి, ఊరి ప్రజల కోసం అండగా నిలవడం వంటి కాన్సెప్ట్ తో  ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఇది ఓ పది, పదిహేనేళ్ల క్రితం నాటి కాన్సెప్ట్. మహేష్‌ బాబు `శ్రీమంతుడు`, `బిచ్చగాడు`, `సాహో`, `పిల్ల జమిందార్‌` ఇలా చాలా సినిమాలు వచ్చాయి. ఆ కోవకి చెందిన మూవీనే రాజ్‌ తరుణ్‌ `పురుషోత్తముడు`. ఆయా కాన్సెప్ట్ లన్నీంటిని మిక్స్ చేసి సరికొత్తగా తయారు చేస్తే ఎలా ఉంటుందో `పురుషోత్తముడు` సినిమా అలానే ఉంటుంది. అన్ని సినిమాలను ఒకే తెరపై చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ సరికొత్త ఎమోషన్స్ తో సినిమాని నడిపించడం, రక్తికట్టించేలా డ్రామాని తెరకెక్కించడం ఇందులో ప్రత్యేక ఆకర్షణలు. 
 

ప్రారంభంలో రాజ్‌ తరుణ్‌ విదేశాల నుంచి ఇండియాకి రావడం, కంపెనీ బాధ్యతలు ఎవరు తీసుకోవాలనే పోటీ నెలకొనడం, కొత్త నిబంధన పెట్టడం, దాన్ని స్వీకరించి హీరో అన్నింటిని వదిలేసి వెళ్లిపోవడం చకచకా జరిగిపోతాయి. ప్రారంభంలో అది క్యూరియాసిటీ కలిగించినా ఆ తర్వాత ఇప్పటికే చూసేసిన కాన్సెప్ట్ చిత్రాలనే ఫీలింగ్ కలుగుతుంది. రాజ్‌ తరుణ్‌ గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామానికి వెళ్లేంత వరకు సీరియస్‌గా, ఎమోషనల్ సాగిన సినిమా, ఆ ఊరు వెళ్లాక, హీరోయిన్‌, కమెడియన్‌ ప్రవీన్‌ పాత్రలు ఎంట్రీ తర్వాత ఫన్నీవేలో సాగుతుంది. హీరోని చూసి హీరోయిన్‌ చేసే పనులు ఫన్నీగా, ఇంకాస్త రొమాంటిక్ గా ఉంటాయి. పనివాడిగా హీరో పడే బాధలు సైతం ఫన్నీగా అనిపిస్తాయి. ఇక ఇందులో ప్రవీణ్‌ చాలా రోజుల తర్వాత హిలేరియస్‌గా నటించాడు. కొబ్బరికాయల సీన్లు కడుపుబ్బా నవ్వుకోవచ్చు. అలాగే పాకలో రాజ్‌ తరుణ్‌ పడుకున్నప్పుడు చోటు చేసుకునే సీన్‌ నవ్వించింది. మరోవైపు హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్‌ సైతం ఆకట్టుకునేలా ఉంది. సెకండాఫ్‌లో కథ కాస్త సీరియస్ గా మారుతుంది. రాజ్‌ తరుణ్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం,  పూలతోటల రైతుల సమస్యలను పరిష్కరించేందుకు హీరో పాటుపడటం, వారికి అండగా నిలవడం, వారిలో చైతన్యాన్ని నింపడంతో కథ సీరియస్‌గా, వారి బాధలతో ఎమోషనల్‌గా మారుతుంది. అయితే మధ్య మధ్యలో ప్రవీణ్‌, హీరోయిన్ల కామెడీ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ పాత్రలు నవ్విస్తాయి. 

సినిమాలో చాలా వరకు డ్రామా పండింది, యాక్షన్‌ సీన్లలో రాజ్‌ తరుణ్‌ ఎలివేషన్లు అదిరిపోయాయి. కానీ ఆయన రేంజ్‌కి సరిపడే బీజీఎం, యాక్షన్‌ కాదు. పెద్ద మాస్‌ హీరో రేంజ్ ఎలివేషన్లు పెట్టడంతో వాటిలో రాజ్‌ తరుణ్‌ని చూడటం కన్విన్సింగ్‌గా అనిపించలేదు. మరోవైపు సినిమా ప్రారంభం నుంచి, ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ ఎక్కడో ఇతర సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అదే ఇందులో పెద్ద డ్రా బ్యాక్‌. కథ మొత్తం మూడు నాలుగు సినిమాలను తలపిస్తుంది. ఎక్కడా ఓరిజినాలిటీ లేదు. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇతర సినిమాలను చూసిన ఫీలింగ్ కలిగినా, ఎమోషన్స్ విషయంలో దర్శకుడు చాలా ఫోకస్‌ పెట్టాడు. వాటిని కొత్తగానే ప్రజెంట్ చేశాడు. అదే సినిమాకి ప్లస్ అవుతుంది. డ్రామాని పండించడంలో సక్సెస్ అయ్యాడు. చివరికి ప్రకాష్‌ రాజ్‌ పాత్రతో ఎమోషనల్ గా మార్చి అదరగొట్టాడు. క్లైమాక్స్ సీన్‌ సినిమాలో బాగా పేలింది. ఇక రాజ్‌ తరుణ్‌ ఎవరో తెలిసే సీన్, హీరోయిన్‌ సీన్లు చివర్లో ఆకట్టుకుంటాయి. రెగ్యూలర్‌గా అనిపించినా ఫర్వాలేదనిపిస్తాయి. అదే సమయంలో రైతుల సమస్యలు రొటీన్‌గా ఉన్నా, ఆలోచింప చేస్తాయి.   
 

నటీనటులుః 
రాజ్‌ తరుణ్‌ ధనవంతుడిగా, అనాథలా ఆయన రెండు రకాల వేరియేషన్స్ చూపించిన తీరు బాగుంది. ఆయన పాత్రని ఓవర్ ఇమేజ్‌తో చూపించడమే కన్విన్సింగ్‌గా లేదు. నటుడిగా ఎప్పటిలాగే మెప్పించాడు. అమ్ములుగా హాసినీ సుధీర్‌ ఆకట్టుకుంటుంది. చాలా సహజంగా నటించింది. కాకపోతే చూడ్డానికి పల్లెటూరి అమ్మాయిలా అనిపించలేదు. రమ్యకృష్ణ ప్రారంభంలో నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రగా కనిపించి, చివర్లో పాజిటివ్‌గా కనిపించిన తీరు బాగుంది. రెండు వేరియేషన్లలో మెప్పించింది. మురళీశర్మ తనకు కొట్టొచ్చిన పాత్రలో చేసుకుంటూ వెళ్లిపోయాడు. బ్రహ్మానందం కాసేపు మెరిసి నవ్వించాడు. బ్రహ్మాజీ సైతం అమాయక లాయర్‌గా అలరించారు. రచ్చ రవి పాత్ర ఆకట్టుకుంది. ఇక ప్రవీణ్‌ కామెడీ చాలా రోజుల తర్వాత బాగా వర్కౌట్‌ అయ్యింది. బాగా నవ్వించింది. పోలీస్ గా రాజా రవీంద్ర నెగటివ్‌ షేడ్‌ పాత్రలో కనిపించి మెప్పించాడు. ముఖేష్‌ ఖన్నా చివర్లో మెరిశాడు. ప్రకాష్‌రాజ్‌ పాత్ర కూడా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. సత్య, విరాన్‌ ముత్తంశెట్టి, ఇతర రైతులు సహజంగా చేసి ఆకట్టుకున్నారు. 
 

టెక్నీకల్‌గాః 
సినిమాకి మ్యూజిక్‌ పెద్ద అసెట్. గోపీసుందర్‌ తన మ్యూజిక్‌తో సినిమా రేంజ్‌ని మార్చేశాడు. సహజంగా రాజ్‌ తరుణ్‌ సినిమా అంటే చిన్న బడ్జెట్ మూవీ అనిపిస్తుంది. కానీ ఇందులోని మ్యూజిక్‌, బీజీఎం మాత్రం భారీ బడ్జెట్‌ మూవీ, పెద్ద స్టార్‌ హీరో సినిమా స్థాయిని ప్రతింబించేలా చేసింది. పాటలు సినిమాకి పెద్ద అసెట్‌. సినిమాకి హైలైట్‌ ఏదైనా ఉందంటే అది మ్యూజిక్కే. ఎడిటర్‌ మార్తాండ్‌ కె వెంకటేష్‌ సైతం బాగా కట్‌ చేశారు. సినిమా రొటీన్‌ కావడంతో ఆయన కూడా చేయడానికి ఏం లేదు. పీజీ విందా కెమెరా వర్క్ బాగుంది. చాలా ఫ్రేములు అందంగా ఉన్నాయి. రిచ్‌గా ఉన్నాయి. ఇలా పెద్ద టెక్నీషియన్లు పనిచేయడంతో సినిమా రేంజ్‌ కూడా పెరిగిందని చెప్పొచ్చు. నిర్మాణ విలువల విషయంలోనూ నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారని అర్థమవుతుంది. మరోవైపు దర్శకుడు రామ్‌ భీమన.. ఎంచుకునే కథనే ఓల్డ్. పైగా ప్రతి సీన్‌లోనూ గత సినిమాలే గుర్తుకు రావడం, స్క్రీన్‌ ప్లే కూడా సేమ్‌ అలానే రాసుకోవడం పెద్ద మైనస్‌. అయితే ఒకే టికెట్‌పై `శ్రీమంతుడు`, `బిచ్చగాడు`, `పిల్ల జమిందార్‌`, `సాహో` వంటి పలుసినిమాలను చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఆయా సినిమాల్లో రాజ్‌ తరుణ్‌ హీరో అయితే ఎలా ఉంటుందో అలా ఉండేలా దర్శకుడు ఈ `పురుషోత్తముడు` సినిమాని తెరకెక్కించాడు. కానీ సన్నివేశాల టేకింగ్‌లో మాత్రం తన మెచ్యూరిటీ చూపించాడు. కథ పాతదే అయినా టేకింగ్ మాత్రం బాగుంది. ఫన్‌, డ్రామా, ఎమోషన్స్ పండించడంలో సక్సెస్‌ అయ్యాడు. 
 

ఫైనల్‌గాః `పురుషోత్తముడు`.. ఒకే టికెట్‌పై నాలుగైదు సినిమాలు. 

రేటింగ్‌ః 2.5

నటీనటులు - రాజ్ తరుణ్, హాసినీ సుధీర్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, విరాన్ ముత్తంశెట్టి, ముకేష్ ఖన్నా, ప్రవీణ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సత్య తదితరులు
 
టెక్నికల్ టీమ్
ఎడిటింగ్ - మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ - పీజీ విందా
మ్యూజిక్ - గోపీ సుందర్
సాహిత్యం - చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్, బాలాజీ, పూర్ణాచారి
బ్యానర్ - శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్
నిర్మాతలు - డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్
రచన, దర్శకత్వం - రామ్ భీమన
 

Latest Videos

click me!