OM Movie Review: ఓం మూవీ రివ్యూ.. ధనుష్‌, మమ్ముట్టి ల మూవీ ఎలా ఉందంటే?

Published : Nov 20, 2026, 12:25 PM IST

ధనుష్‌, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `ఓం`. అమరన్‌ దర్శకుడు రాజ్‌ కుమార్‌ పెరియసామి రూపొందించిన ఈ తమిళ చిత్రం ఎలా ఉందంటే ?

PREV
16
ఓం మూవీ రివ్యూ

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తొలిసారి కలిసి నటించిన చిత్రం 'ఓం'. సాయి పల్లవి, శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్లు ఇందులో కీలక పాత్రలు పోషించారు. `అమరన్` సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వండర్‌ బార్‌ ఫిల్మ్స్, ఆర్‌ టేక్‌ స్టూడియోస్‌ పతాకాలపై ధనుష్‌, శ్రద్ధా అగర్వాల్‌, అజ్మత్‌ జాగమగ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నేడు శుక్రవారం(నవంబర్‌ 20)న తెలుగులో కూడా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
ఓం మూవీ కథేంటంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవస్థ విస్తరిస్తుంది. ఈ స్మగ్లింగ్ వెనుక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తుంటుంది. దాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పోలీసు బృందాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపడతాయి.

ఈ ఆపరేషన్‌లో భాగంగా తమిళనాడు పోలీసు విభాగానికి చెందిన అధికారి పళనివేల్ (ధనుష్) రహస్యంగా స్మగ్లింగ్ ముఠాలోకి ప్రవేశిస్తాడు. కూలీగా మారువేషంలో అడవుల్లోకి వెళ్లి, ముఠా సభ్యుల నమ్మకాన్ని సంపాదిస్తాడు. మరోవైపు ఈ మొత్తం అక్రమ వ్యాపారాన్ని వెనుక నుంచి నడిపించే బర్మా కార్తికేయన్ (మమ్ముట్టి). ఆయనంటే కడప జిల్లాలో హడల్‌. ఆయన వద్ద నమ్మకస్తుడిగా తిరు అనే మారుపేరుతో పనిలో చేరతాడు పళనివేల్‌.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహించే ఐపీఎస్ అధికారి నిత్యారెడ్డి (సాయి పల్లవి) ఈ ఆపరేషన్‌ను ముందుండి నడిపిస్తుంది. ఈ క్రమంలో పోలీసులకు, స్మగ్లింగ్ ముఠాకు మధ్య పోరు తీవ్రరూపం దాలుస్తుంది. అసలు ఈ స్మగ్లింగ్ సామ్రాజ్యం వెనుక ఎవరున్నారు? పళనివేల్ తన అసలు గుర్తింపును దాచుకుంటూ మిషన్‌ను ఎలా పూర్తి చేశాడు? బర్మా కార్తికేయన్‌తో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఇందులు అబ్దుల్‌ (నసీరుద్దిన్‌ షా), చైతన్య జొన్నలగడ్డ పాత్రలు ఏంటి? అనేది మిగతా కథ.

36
ఓం మూవీ ఎలా ఉందంటే?

ధనుష్‌, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల వంటి వారు నటించిన మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను అందుకుందా అంటే కొంత వరకే అని చెప్పొచ్చు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఎంచుకున్న పాయింట్ ఆసక్తికరంగా ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్ అనే పాయింట్‌ని కేవలం పోలీస్ వర్సెస్ క్రిమినల్స్ కథగా కాకుండా, దాని వెనుక ఉన్న నేర సామ్రాజ్యం, రాజకీయ సంబంధాలు, స్నేహం వంటి అంశాల మేళవింపుగా ఎమోషనల్‌గా తీసుకెళ్లడం విశేషం.

ముఖ్యంగా ధనుష్ అండర్‌కవర్ ఆపరేషన్‌లోకి వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాలు ఉత్కంఠను గురి చేస్తాయి. ఎంగేజింగ్‌గా ఉంటాయి. మమ్ముట్టి పాత్రలోని గ్రే షేడ్స్ కథను మరో స్థాయికి తీసుకొస్తాయి. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అదే సమయంలో తన భార్యతో ధనుష్‌ ఫేస్‌ చేసే సీన్లు, విడాకుల వ్యవహారం కామెడీగా ఉంటుంది. మమ్ముట్టి, ధనుష్‌ పాత్రల మధ్య బాండింగ్‌ స్నేహాన్ని, నమ్మకాన్ని ఆవిష్కరిస్తాయి. మరోవైపు ఫ్యామిలీ ఎలిమెంట్లు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి.

సినిమా మెయిన్‌గా నాటకీయంగా సాగుతుంది. కార్తికేయన్‌ని పోలీసులు తమ ట్రాప్‌లో వేసుకునేందుకు, ఆయన ద్వారా ఈ స్మగ్లింగ్‌ ప్రపంచాన్ని కూకటి వేళ్లతో లేపేయాలని చేసే ప్లాన్‌ నాటకీయంగా సాగుతుంది. ఇంటర్వెల్‌ మాత్రం ఎమోషనల్‌గా ఉంటుంది. ధనుష్‌ తండ్రి పాత్రలోని ట్విస్ట్, ఎన్‌కౌంటర్‌ అదిరిపోయింది. హృదయాన్ని కదిలిస్తుంది. ఆ తర్వాత రివేంజ్‌ క్రైమ్‌ డ్రామాగా మారుతుంది. సెకండాఫ్‌పై అంచనాలను పెంచింది. కానీ ఆ స్థాయిలో లేదు. చాలా స్లో అయిపోయింది. కథ అక్కడక్కడే తిరుగుతుంది. కూలీవాళ్ల ఎన్‌కౌంటర్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ తర్వాత కథ చిన్న చిన్న ట్విస్ట్ లు, టర్న్ లతో వెళ్తుంది. కానీ అవి పెద్దగా వర్కౌట్‌ కాలేదు. క్లైమాక్స్ తేలిపోయింది.

ప్లస్‌, మైనస్‌లు

కథ బాగున్నా, కథనం చాలా వీక్‌గా ఉంది. స్లోగా వెళ్తుంది. సెకండాఫ్‌ మరీ దారుణంగా ఉంది. ముగ్గురు పెద్ద స్టార్స్ ఉన్నా సినిమా ఎంతకు ముందుకు సాగదు. అక్కడ ఏం చేయాలో దర్శకుడికి అర్థం కాలేదనే ఫీలింగ్‌ కలుగుతుంది. మమ్ముట్టి వంటి పెద్ద స్టార్‌ని పెట్టుకొని ఏమాత్రం వాడుకోలేకపోయారు. ఆయన్ని పప్పులా మార్చేయడం కనెక్టింగ్‌గా లేదు. చివరికి సాడ్‌ ఎండింగ్‌ ఇవ్వడం కూడా బాగాలేదు. సెకండాఫ్‌ తేలిపోయిందంటే, క్లైమాక్స్ మరింతగా నీరసంగా సాగింది. అదే సమయంలో ఊహించేలా సీన్లు ఉండటం కూడా మరో మైనస్‌గా చెప్పొచ్చు. ఒకే కథలో రెండు మూడు స్టోరీస్ ని మిక్స్‌ చేసినట్టు ఉంది. కాకపోతే కొన్ని యాక్షన్‌ సీన్లు, బీజీఎం, ఎమోషనల్‌ సీన్లు, ఆకట్టుకుంటాయి. స్నేహానికి సంబంధించిన అంశాలు కూడా మెప్పిస్తాయి. అందులోనూ రియాలిటీ లేదు. ఆయా సీన్లు అంతగా పండలేదు. చాలా చోట్ల ఎమోషన్స్ కూడా రియాలిటీకి దూరంగా ఉండటం పెద్ద మైనస్‌.

46
నటీనటుల పనితీరు

ధనుష్ ఈ సినిమాలో మరోసారి తన నటనా ప్రతిభను చూపించారు. అండర్‌కవర్ పోలీస్ అధికారిగా రెండు విభిన్న కోణాల్లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన నటన బాగుంది. విభిన్నమైన ఎమోషన్స్ ని పలికిస్తూ సెటిల్డ్ గా నటించిన తీరు బాగుంది.

మమ్ముట్టి ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. లోకల్‌ స్మగ్లింగ్‌ లీడర్‌ కార్తికేయన్ పాత్రలో అదరగొట్టారు. బాడీ లాంగ్వేజ్, కళ్లతోనే భావాలను పలికించే విధానం బాగుంది. ఆయన పాత్రని పాజిటివ్‌గా, నెగటివ్‌గా ఆవిష్కరించడం కూడా బాగుంది. కానీ చివర్లో ఆయన్ని డల్‌ చేయడం బాగా లేదు. అది మైనస్‌ గా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఆయన ఈ పాత్ర ఎందుకు చేశాడనేది ప్రశ్న.

పోలీస్‌ ఆఫీసర్‌, అండర్‌కవర్‌ ఆపరేషన్‌ లీడ్‌ నిత్యారెడ్డి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఎమోషనల్‌ సీన్లలోనూ మెప్పించింది. కానీ ఆమె పాత్ర ఎండింగ్‌ డిజప్పాయింట్‌ చేస్తుంది. శ్రీలీల రోజా పాత్రలో తనదైన ముద్ర వేసింది. కొంత కామెడీగానూ ఉంటుంది. నజీరుద్దీన్‌ షా, దయానంద్‌, శివాజీ రాజా ఇతర పాత్రధారులు ఫర్వాలేదనిపించారు.

56
టెక్నీషియన్ల పనితీరు

సినిమాలో ఎజిల్ అరసు సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్‌గా ఆకట్టుకుంటుంది. సాయి అభ్యంకర్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది. ఈ మొత్తం మూవీకి ఇదే మెయిన్‌ హైలైట్‌గా చెప్పొచ్చు. యాక్షన్‌ సీన్లని ఎలివేట్‌ చేస్తుంది. ఆర్. కళైవాణన్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ, నిడివిని మరికొంత తగ్గించి ఉంటే సినిమా మరింత వేగంగా సాగేది. నిర్మాణ విలువలు కూడా రిచ్‌గా ఉన్నాయి.

దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి ఎంచుకున్న కథ, స్మగ్లింగ్‌ నేపథ్యంలో బాగుంది. కానీ దాన్ని అంతే బాగా తెరకెక్కించడంలో విఫలమయ్యింది. ఫస్టాఫ్‌ రేంజ్‌లో సెకండాఫ్‌ని డీల్‌ చేయలేకపోయారు. మమ్ముట్టి పాత్రలు, సాయిపల్లవి పాత్రలను ఇంకా బాగా రాసుకోవాల్సింది. క్లైమాక్స్ విషయంలో ఫెయిల్‌ అయ్యారు. ట్విస్ట్ లు, టర్న్ లు కూడా పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఎమోషనల్‌ సీన్లలోనూ డెప్త్ తగ్గింది. ఇలాంటి విషయాల్లో దర్శకుడు మరింత కేర్‌ తీసుకోవాల్సింది.

66
ఫైనల్‌గా..

'ఓం' స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే క్రైమ్‌ యాక్షన్‌ డ్రామా. కొంత వరకు మెప్పించే మూవీ అవుతుంది. మరికొంత డిజప్పాయింట్‌ తప్పదు.

రేటింగ్‌ : 2.5

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories