OM Bheem Bush Review: `ఓం భీమ్‌ బుష్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Mar 22, 2024, 2:59 AM IST

శ్రీ విష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి నటించిన మూవీ `ఓం భీమ్‌ బుష్‌`. శ్రీ హర్షకొనుగంటి రూపొందించిన ఈ మూవీ నేడు విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

హీరో శ్రీవిష్ణు కంటెంట్‌ ఉన్న సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు.  ఆ మధ్య వరుస పరాజయాల అనంతరం గతేడాది `సామజవరగమన` చిత్రంతో హిట్‌ అందుకున్నారు. అదే సక్సెస్‌ జోరు కొనసాగించేందుకు ఇప్పుడు `ఓం భీమ్‌ బుష్‌` అనే చిత్రంతో వచ్చాడు. `హుశారు`, `రౌడీబాయ్స్` చిత్రాలతో అలరించిన శ్రీహర్ష కొనుగంటి దీనికి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషించగా, వీ సెల్యులాయిడ్‌ పతాకంపై సునీల్‌ బలుసు నిర్మించగా యూవీ క్రియేషన్స్ సమర్పించింది. నేడు శుక్రవారం(మార్చి 22న) సినిమా  విడుదలైంది. మరి మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

Poll: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

కథః 
క్రిష్‌(శ్రీ విష్ణు), మాధవ్‌(రాహుల్‌ రామకృష్ణ), వినయ్‌(ప్రియదర్శి) సైంటిస్ట్ లు అవ్వాలని ప్రొఫేసర్ రంజిత్‌(శ్రీకాంత్‌ అయ్యర్‌) వద్ద అసిస్టెంట్లుగా జాయిన్‌ అవుతారు. కానీ తమ కోతి పనులతో ఆయన ఆఫీసుని సర్వనాశనం చేస్తారు. డబ్బుల కోసం వస్తువులను, పుస్తకాలను అమ్మేస్తారు. తమ సైంటిస్ట్ తెలివితో ప్రయోగాలు, బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు సంపాదించి ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ విషయం తెలిసి ప్రొఫేసర్‌ రంజిత్‌ వీరిని బయటకు పంపించేస్తాడు. దీంతో ఓ వ్యాన్‌లో బైరవపురం అనే విలేజ్‌ కి వెళ్తారు. అక్కడ అఘోరాలు తమ మంత్ర శక్తులతో ఆ ఊర్లో లంకెబిందెలను వెలికి తీస్తూ, దెయ్యం పట్టిన వారిని దెయ్యం వదిలిస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్నారని తెలిసి తాము కూడా సైంటిస్ట్ తెలివి ఉపయోగించి డబ్బులు సంపాదించాలని ప్లాన్‌ చేస్తారు. వారి ప్రాబ్లెమ్స్ సాల్వ్ చేసి వారికి దగ్గరవుతారు. దీని కారణంగా ఊర్లో మాంత్రికులకు ఆదరణ తగ్గి వీరికి ఆదరణ పెరుగుతుంది. ఊరి జనం అంతా వీరిని దేవుళ్లుగా కొలుస్తుంటారు. దీంతో లాభం లేదని భావించిన మాంత్రికులు(అఘోరలు) ఊరు చివరన ఉన్న సంపంగి మహల్‌లో ఉన్న గుప్తనిధులు తీసుకురావాలని, అది తీసుకొస్తే వీరిని నిజమైన సైంటిస్ట్ లుగా నమ్ముతామని సవాల్‌ చేస్తారు. ఆ సవాల్‌ని స్వీకరిస్తారు క్రిష్‌, మాధవ్‌, వినయ్‌. అందుకు మూడు కండీషన్స్ పెడతారు. అందులో ఒకటి క్రిష్‌ ప్రేమించిన సర్పంచ్‌(ఆదిత్య మీనన్‌) కూతురు జలజ(ప్రీతి ముకుందన్‌)ని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని, రెండు గుప్తనిధుల్లో సగం తమకే ఇవ్వాలని, మూడు ఆ మాంత్రికుల గుండు గీయించాలని, అందుకు వారు కూడా ఒప్పుకుంటారు. ఇక ఆ సంపంగి మహల్‌లోకి ఈ ముగ్గురు వెళ్తారు. అందులోకి వెళ్లి తమ పరికరాలతో గుప్త నిధులను వెతుకుతుంటారు. ఈ క్రమంలో వీరిని దెయ్యం వెంటాడుతుంది. చుక్కలు చూపిస్తుంది. కొడుతుంది. మరి ఇంతకి ఆ దెయ్యం ఎవరు? దాని కథేంటి? అందులో గుప్తనిధులు దొరికాయా? సర్పంచ్‌ కూతురుని క్రిష్‌ పెళ్లి చేసుకున్నాడా? ఆ మహల్‌లో ఏం జరిగిందనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః 

`ఓం భీమ్‌ బుష్‌`.. సినిమా నో లాజిక్‌, ఓన్లీ మ్యాజిక్‌ అనే ట్యాగ్‌ని ప్రచారం చేస్తూ వచ్చింది యూనిట్‌. ఆ విషయంలో ముందుగానే జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. సినిమాని కూడా అలానే తెరకెక్కించారు. డార్క్ హర్రర్‌ కామెడీగా ఈ మూవీని తెరకెక్కించారు. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లని జోడించి ఎలాంటి లాజిక్‌ లేకుండా కేవలం కామెడీపై ఫోకస్‌ పెట్టి ఈ సినిమాని రూపొందించారు. సందర్భానుసారంగా వచ్చే కామెడీని నమ్ముకుని తీశారు. దాన్ని తెరపై వర్కౌట్‌ చేయడంలో దర్శకుడు తన బెస్ట్ చూపించాడు. ఆ కామెడీ వర్కౌట్‌ అయ్యేలా చేశాడు. కథగా చెప్పాలంటే సినిమాలో అసలు కథే లేదు. ఎక్కడో ప్రారంభమై ఎక్కడికో వెళ్తుంది. సంబంధం లేకుండా వెళ్తుంది. చివరగా మరో కొత్త కథ యాడ్‌ అవుతుంది. ఇంకో రకంగా ముగింపు పడుతుంది. అందుకే  కథగా లాజిక్కులు వెతికితే అంతా గజిబిజీగా ఉంటుంది.  
 

ప్రారంభంలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ వద్ద శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ట్రైనీ సైంటిస్ట్ లుగా పీ హెచ్‌డీ కోసం జాయిన్‌ అవుతారు. తమకు వచ్చిన ప్రయోగాలు చేసి ఆయన ఆఫీసుని పీకి పందిరేస్తారు. పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి ఆయన్నే గాయపరుస్తారు. ఈ క్రమంలో వచ్చే కామెడీ నవ్వించినా, ఏం జరుగుతుందో అర్థం కాక కన్‌ఫ్యూజన్‌ ఏర్పడుతుంది. ఇక ఏకంగా ప్రొఫేసర్‌ కూతురినే శ్రీవిష్ణు పడేయడం, రొమాన్స్ చేయడం హిలేరియస్‌గా ఉంటుంది. ప్రొఫేసర్‌ తరిమేయడంతో బైరవపురం వచ్చాక సినిమా మరింత హిలేరియస్‌గా మారుతుంది. అక్కడ వీరి వేషాలు, రత్తాలు బార్‌ షాప్‌లో ప్రియదర్శి రచ్చ, ఊర్లో సంపంగి వచ్చే సీన్లు.. ఈ క్రమంలో ఈ ముగ్గురు అమాయకంగా, తమకు నచ్చినట్టుగా ప్రవర్తించడం, వీరు మాట్లాడుకునే డైలాగ్‌లు నవ్వులు పూయిస్తారు. కొన్ని సీన్లలో `జాతిరత్నాలు` కామెడీని గుర్తు చేస్తుంది. ఫస్టాఫ్‌లో రెండు మూడు కామెడీ బ్లాక్‌లు బాగా రాసుకున్నాడు దర్శకుడు. అవి తెరపై అంతే బాగా పేలాయి. దెయ్యం ఎపిసోడ్‌, సర్పంచ్‌ ఇంట్లో రాత్రిళ్లు వచ్చే ఎపిసోడ్‌, ఓ వ్యక్తికి మగతనం వచ్చేలా చేసే సీన్ ఆద్యంతం నవ్వుకునేలా ఉంటుంది. 

ఇక సెకండాఫ్‌ సంపంగి మహల్‌కి వెళ్తుంది. అక్కడ ఈ ముగ్గురు నిధి కోసం అన్వేషించడం, ఈ క్రమంలో రాత్రి సమయంలో సంపంగి మౌళి వచ్చి భయపెట్టే సన్నివేశాలు ఆద్యంతం హిలేరియస్‌గా అనిపిస్తాయి. అంత వరకు సినిమా నాన్‌ స్టాప్‌గా నవ్వులు పూయిస్తుంది. కానీ దెయ్యం ఎవరో తెలిసాక సినిమాపై కిక్‌ పోయింది. ఆ దెయ్యం స్టోరీ చుట్టూ సినిమా తిరుగుతుంది. అది ఎమోషనల్గా ఉంటుంది. అదే సమయంలో ఒక్కసారిగా డౌన్‌ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. దాని చుట్టూతే క్లైమాక్స్ ఉంటుంది. దానితోనే ముగింపు పలికారు. అక్కడే సినిమా పూర్తిగా పడిపోయింది. అప్పటి వరకు హిలేరియస్‌గా నవ్వించగా, క్లైమాక్స్ వచ్చే సరికి దెయ్యం స్టోరీతో ఎమోషనల్‌ సైడ్‌ వెళ్తుంది. కానీ అందులోని డ్రామా పండలేదు. ఫీల్‌ లేదు. ఎమోషన్స్ లో బలం లేదు. దీంతో తేలిపోయింది. అప్పటి వరకు ఉన్న ఫన్‌, కామెడీ చివర్లో మిస్‌ కావడంతో ఒకరకమైన డిజప్పాయింట్ మెంట్‌ ఎదురవుతుంది. అంతకు ముందు వర్కౌట్‌ అయిన మ్యాజిక్‌ అక్కడ పనిచేయలేదు. నిజానికి అక్కడే దర్శకుడు మ్యాజిక్‌ చేయాల్సింది. కానీ ఆయనే లాజిక్‌ మిస్‌ అయ్యాడు. కామెడీకి సంబంధించి వచ్చే డైలాగులు, డబుల్ మీనింగ్‌ డైలాగ్‌లు కొంత వల్గర్‌గా అనిపిస్తాయి. సీన్లు కూడా అలాంటివే ఉంటాయి. మరోవైపు శృతి మించిన గ్లామర్ కూడా ఫస్టాఫ్‌లో చూపించారు. అక్కడక్కడ ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడే సీన్లు ఉండటం సినిమాకి పెద్ద మైనస్‌.  
 

నటీనటులుః 
శ్రీవిష్ణు.. క్రిష్‌ పాత్రలో ఇరగదీశాడు. అద్భుతంగా చేశాడు. ఇన్నోసెంట్‌గా ఫన్‌ చేసి నవ్వించాడు. ఆయనతోపాటు ప్రియదర్శి పాత్ర మరింత హిలేరియస్‌గా పేలింది. భయస్తుడిగా అతని ఎక్స్ ప్రెషన్స్, మహల్‌లో అతనికి, దెయ్యంకి మధ్యవచ్చే సీన్లు హిలేరియస్‌గా అనిపిస్తాయి. వీరికి రాహుల్‌ రామకృష్ణ కూడా యాడ్‌ అయ్యారు. ఈ ముగ్గురు కలిస్తే రచ్చ రచ్చే అనేట్టుగా సినిమా సాగింది. అదే స్థాయిలో కామెడీని పండించింది. వీరి తర్వాత రచ్చ రవి పాత్ర అలరించింది. నవ్వులు పూయించింది. అలాగే ఆయేషా ఖాన్‌ అందాలో ఎక్స్ ట్రా డోస్‌. హీరోయిన్ ప్రీతి ముకుందన్‌ పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదు. ఉన్నంతలో ఫర్వాలేదు. వీరితోపాటు ఆదిత్య మీనన్‌, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సునైనా ఓకే అనిపించారు. స్పెషల్‌ సాంగ్‌లో ప్రియా వడ్లమానిని దించారు. జస్ట్ ప్రారంభ సీన్‌లో చూపించి ఆమెని కట్‌ చేసేశారు. అది అసంపూర్తిగా ఉంది. 
 

టెక్నీకల్‌గాః 
సినిమాకి పాటల పరంగా సన్నీ ఏంఆర్‌ మ్యూజిక్‌ మైనస్‌. కానీ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం అదిరిపోయింది. బాగా ఇచ్చారు. సినిమాకి పిల్లర్‌లా నిలిపారు. రాజ్‌ తోట విజువల్స్ కూడా బాగున్నాయి. కెమెరా పనితనం కనిపిస్తుంది. మహల్‌లోగానీ, ఊర్లోగానీ, దెయ్యం ఎపిసోడ్స్ లోగానీ కెమెరా వర్క్ బాగుంది. విష్ణు వర్దన్‌ కావూరి ఎడిటింగ్‌ బెస్ట్ చేయాల్సింది. కొంత గజిబిజి ఉంది. నిర్మాణ విలువలు ఉన్నంతలో ఓకే. దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి.. ఆయన ఇప్పటి వరకు మూడు సినిమాలు చేస్తే మూడూ భిన్నమైనవి. దర్శకుడిగా ఆయన సక్సెస్‌ అయ్యాడు. కామెడీని పండించడంలో సక్సెస్‌ అయ్యాడు. కానీ ఓ కథగా చెప్పడంలో సక్సెస్‌ కాలేదు. బ్లాకులు బ్లాకులు కామెడీ చేశాడు, కానీ ఒక కథలో భాగంగా దాన్ని వర్కౌట్‌ చేయలేకపోయాడు. క్లైమాక్స్ విషయంలో ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఓవరాల్‌గా ఓకే అనిపించాడు. 

ఫైనల్‌గాః లాజిక్కులు లేని కామెడీ మూవీ. క్లైమాక్స్ లో మ్యాజిక్‌ మిస్సింగ్‌. 
రేటింగ్‌ః 2.75

నటీనటులః శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ప్రీతి ముకుందన్‌, ఆయేషా ఖాన్‌, కామాక్షి భాస్కర్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, రచ్చ రవి, ఆదిత్య మీనన్‌ తదితరులు. 

టెక్నీషియన్లుః
దర్శకుడుః శ్రీ హర్ష కొనుగంటి,
నిర్మాతః సునీల్‌ బలుసు
బ్యానర్‌ః వి సెల్యులాయిడ్స్
సమర్పణః యూవీ క్రియేషన్స్
సంగీతంః సన్నీ ఎంఆర్‌
కెమెరాః రాజ్‌ తోట
ఎడిటింగ్‌ః విష్ణు వర్దన్‌ కావూరి. 
 

Latest Videos

click me!