సత్య కామెడీ లేకుంటే ఖాళీ: నాగశౌర్య ‘రంగబలి’ రివ్యూ

First Published | Jul 7, 2023, 12:37 AM IST

హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

Rangabali

 
  నాగశౌర్య రంగబలి అంటూ వచ్చారు. టైటిల్ విభిన్నంగా ఉండటంతో పాటు, సత్య కామెడీ హైలెట్ అని ప్రచారం జరిగిన ఈ చిత్రంలో అసలు కథేంటి...ఆ డిఫరెంట్ టైటిల్ అర్దం ఏమిటి...టైటిల్ కు సినిమాకు సంభందం ఏమిటి... నాగశౌర్య తన కంఫర్ట్ జోన్ లోకి వెళ్లి  చేసిన ఈ సినిమా ఎలా ఫలితాన్ని ఇచ్చింది? ఓ టౌన్ లోని మెయిన్ సెంటర్  నేపధ్యంలో సాగిన రంగబలి  ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది?నాగశౌర్యకు ఈ సినిమా హిట్ ఇచ్చిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథ:

'బైట ఊర్లో బానిసగా బ్రతికినా పర్లేదు భయ్యా..కానీ సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలి' అనుకునే క్యారక్టర్  శౌర్య అలియాస్ షో (నాగ శౌర్య). దాంతో తన సొంతూరు రాజవరంలో చక్కగా ఫైటింగ్ లు చేసుకుంటూ హాయిగా బ్రతికేస్తుంటాడు.  ఇక శౌర్య ఉంటున్న ఆ ఊర్లో  రంగబలి అనే  సెంటర్‌ ఉంటుంది. అక్కడికి  వెళ్లినప్పుడల్లా బండిమీద నుంచి క్రిందకు పడిపోతూంటాడు శౌర్య. అదే సమయంలో శౌర్యకు ఆ ఊరి ఎమ్మెల్యే పరుశురామ్ (షైన్ టామ్ చాకో)తో మంచి ప్రెండ్షిప్ ఉంటుంది.   శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) మెడికల్ షాపును నడిపిస్తూ ఊర్లో గౌరవంగా బతుకుతుంటాడు. 


Rangabali

కథ:

శౌర్యకు తను నడుపుతున్న ఆ మెడికల్ షాపు బాధ్యతలు అప్పగించాలని అతని తండ్రి   వైజాగ్‌ మెడికల్ కాలేజీకు పంపిస్తాడు. అక్కడ సహజ (యుక్తి)తో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత ఆమె తండ్రి (మురళిశర్మ) దగ్గర పెళ్లి ప్రపోజల్ పెడితే ..ఆయన ఓకే అంటాడు. అయితే శౌర్య సొంతూరు ఏమిటో అడుగుతాడు. రాజవరం అని తెలుసుకుని...ఆ ఊరుకు తన కూతురుని పంపనని, నో చెప్పేస్తాడు. అందుకు కారణం ఆ ఊరిలో ఉన్న  రంగబలి సెంటర్ అని శౌర్యకు అర్దమవుతుంది. అసలు ఆ రంగబలి సెంటర్ ఓ ప్రేమ కథకు ఎలా అడ్డంకిగా మారింది?  ఆ సెంటర్‌కు రంగబలి అని పేరు ఎందుకు వచ్చింది? రంగబలి సెంటర్‌కు ఆ ఎమ్మెల్యేకు ఉన్న  సంభందం ఏంటి? చివరకు ఆ ప్రేమ కథ ఎలా ముగిసింది అన్నది అసలు సినిమా.

Rangabali

ఎనాలసిస్ : 

యాక్షన్ కామెడీలలో  యాక్షన్ వచ్చి కామెడీని, కామెడీ వచ్చి యాక్షన్ ని భక్షించకుండా చేయటం కత్తిమీద సామే. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ సినిమాని ఎవరూ రక్షించలేరు. అయితే ఆ సినిమాలో రెండు కలవకుండా ఫస్టాఫ్ కామెడీకు, సెకండాఫ్ యాక్షన్ కు విభజించినట్లుగా స్క్రిప్టు రాసుకున్నారు. అది నిజానికి పద్దతి కాకపోయినా ఈ సినిమాకు అదే బెస్ట్ ఏమో అనిపించింది. లేకపోతే ఫస్టాఫ్ లో యాక్షన్ సీన్స్ వచ్చి ఎంజాయ్ చేయటానికి వీల్లేకపోయేది. ఓ రకంగా చెప్పాలంటే సినిమాకు ఫస్టాఫ్ లో వచ్చిన సత్య కామెడీనే నిలబెట్టేసిందని చెప్పాలి. సెకండాఫ్ లో అసలు పాయింట్ లోకి వచ్చి ఓ ప్లాష్ బ్యాక్ వేసుకుని, హీరోకు వచ్చిన సమస్యను పరిష్కరించేందుకు ఓ రెండు సీన్స్ వేసుకుని ముగించేసారు. హీరో సమస్యలో పడటం ఇంట్రవెల్ లో బాగానే కాంప్లిక్ట్ లోకి తెచ్చినా సెకండాఫ్ లో దాని రెజిల్యూషన్ కు మాత్రం ఎక్కువ సమయం కేటాయించలేదు. 
 

Rangabali


 హీరోకు వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకుంటాడు అనే దానికోసమే మనం సినిమా సెకండ్, థర్డ్ యాక్ట్ లలో ఎదురుచూస్తూంటాం. అది తక్కువైతే మిగతా సినిమాలో తేలిపోయినట్లు అనిపిస్తుంది. అలాంటి పరిస్తితే ఇక్కడా ఏర్పడినా కామెడీతో పాయింటాఫ్ ఇంట్రస్ట్ తో లాగే ప్రయత్నం చేసారు.అందులో చాలా వరకూ సక్సెస్ అయ్యారు. స్క్రిప్టు మరింత  జాగ్రత్తగా చేసి ఉంటే నెక్ట్స్ లెవిల్ లో సినిమా ఉండేది. ఎందుకంటే ఇప్పటిదాకా సినిమాల్లో రాని ప్రెష్ పాయింట్ ని దీంట్లో ఎంచుకోవటం కలిసొచ్చిన అంశం.  అదే సమయంలో విలన్ క్యారక్టర్ ని బిల్డప్ చేసినంత స్ట్రాంగ్ గా తర్వాత వాడుకోలేదు. హీరోకు, విలన్ కు మద్య వచ్చే సీన్స్ మరింత బాగా చేసి ఉండాల్సింది. అలాగే చివర్లో క్లాస్ లు పీకినట్లు కాకుండా ఫన్ తో  ముగించారు. మరీ సినిమాటెక్ గా కన్వీన్సింగ్ గా ఇక సినిమా ముగించాలి కాబట్టి ముగించాం అన్నట్లు ఉంది. లేకపోతే అన్నాళ్లుగా మారని జనం హీరో ఏవో నాలుగు మాటలు చెప్పగానే మారటం ఏమిటి..కామెడీ కాకపోతే..? అలాగే మురళి శర్మ తండ్రిగా శరత్ కుమార్ ని చూపెట్టడం కూడా అన్యాయమే...అసలు ఊహించుకోలేము.  శరత్ కుమార్ ఎలా ఉంటాడు..మురళిశర్మ ఆయన కుమారుడు అంటే నమ్మగలమా..అలాంటివి కాస్త చూసుకుని ఉండాల్సింది. 

Rangabali


టెక్నికల్ గా  చూస్తే...

దివాకర్ మణి, ఎఎస్ ప్రకాష్ లాంటి మంచి టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేసారు. కాబట్టి అవుట్  ఫుట్ బాగుంది. దర్శకుడు కొత్తవాడు అయినా మాస్ సీన్స్ బాగా డీల్ చేసారు. అలాగే ఫన్ ని బాగా పండించారు. అయితే ఎమోషన్స్,డ్రామా అంతలా పండలేదు. ఇక సినిమాటోగ్రఫీ  డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండును అనిపించింది. ఫన్ డైలాగ్స్ ఈ సినిమాకి ప్ల‌స్ పాయింట్.  పాటలు మాత్రం చెప్పుకోదగనివి లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. యాక్షన్ సీన్స్ బాగానే డిజైన్ చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.  

Rangabali

ఫెరఫార్మెన్స్ విషయానికి వస్తే..

నాగశౌర్య  గోదావరి యాస తో కూడిన కామెడీ టైమింగ్ బాగుంది. , ఫన్ స్టోరీల‌పై దృష్టి పెడితే మ‌ళ్లీ ట్రాక్ లోకి రావటం కష్టమేమీ కాదు. త‌న క్యారెక్ట‌రైజేష‌న్‌, కామెడీ టైమింగ్ ని ఫెరపెక్ట్ గా పండించాడు.అదే  ఈ సినిమాకి బ‌లం. సినిమా అంతా మాస్ గా, హుషారుగా న‌టించాడు.   హీరోయిన్ చూడటానికి బాగున్నా నటన పెద్దగా లేదు. అందుకు అవకాశమిచ్చే సీన్స్ లేవు.  విలన్ గా కనపడ్డ చాకో ..బిల్డప్ రాజానే. ఏదో చేసేస్తాడేమో అనుకుంటే ఏమీ చేయడు. ఇక ఈ సినిమాలో మ‌రో హీరో.. సత్య.. త‌న కామెడీ టైమింగ్, ఎక్సపీరియన్స్  అంతా గుమ్మరించేసాడు.సప్తగిరి, బ్రహ్మాజీ పాత్రలు అతిగా ఉన్నాయి. పండలేదు. మురళి శర్మ పాత్ర గెస్ట్ రోల్ కు ఎక్కువ. క్యారక్టర్ రోల్ కు తక్కువ అన్నట్లు సాగింది.   గోపరాజు రమణ తండ్రి పాత్రలో మరో సారి అదరకొట్టారు . శుభలేఖ సుధాకర్, శరత్ కుమార్ ఎప్పటిలాగే చేసుకుంటూ పోయారు.

Rangabali

ఫైనల్ థాట్: 

సత్య లేకపోతే సినిమా బలే. అంతలా సినిమాకు కాపు కాసాడు సత్య  మాగ్జిమం సత్య  కామెడీతో చాలా భాగం టిక్కెట్టు గిట్టుబాటు అవుతుంది.  మిగతా భాగాన్ని నాగశౌర్య, విలన్ ,హీరోయిన్ అందరూ తలో కాస్తా  పంచుకున్నారు.

సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5

Rangabali


బ్యానర్: ఎస్ ఎల్ వి సినిమాస్
నటీనటులు: నాగ శౌర్య, యుక్తి తరేజ, సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో తదితరులు.
 సంగీతం: పవన్ సిహెచ్
డీవోపీ: దివాకర్ మణి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
రచన, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
Run time:2 Hrs 17 Min
విడుదల తేదీ: జూలై 7,2023

Latest Videos

click me!