విశ్వక్‌ సేన్‌ `మెకానిక్‌ రాకీ` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Nov 22, 2024, 12:56 PM IST

విశ్వక్‌ సేన్‌ తాజాగా `మెకానిక్‌ రాకీ` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మీనాక్షి చౌదరీ, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ చివరగా `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అది డిజప్పాయింట్‌ చేసింది. ఈనేపథ్యంలో ఇప్పుడు ఆయన పక్కా కమర్షియల్‌ మూవీతో వస్తున్నారు. `మెకానిక్‌ రాకీ` అనే సినిమాలో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరీ, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్‌ తల్లూరి నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం (నవంబర్‌ 22న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? విశ్వక్‌ సేన్‌కి హిట్‌ పడిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథః 

రాకేష్‌ అలియాస్‌ రాకీ(విశ్వక్‌ సేన్‌) కార్‌ గ్యారేజీని తండ్రి రామకృష్ణ(నరేష్‌)తో కలిసి నడుపుతుంటాడు. ఇద్దరికి ఎప్పుడూ పడదు. దీంతోపాటు డ్రైవింగ్‌ కూడా నేర్పిస్తుంటాడు రాకీ. ఓ రోజు మాయ(శ్రద్ధా శ్రీనాథ్‌) డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు వస్తుంది. ఆమెకి డ్రైవింగ్‌ నేర్పించే క్రమంలో తన గతం చెబుతాడు రాకీ. కాలేజీలో తన ఫ్రెండ్‌ చెల్లి ప్రియా(మీనాక్షి చౌదరీ)ని ప్రేమిస్తాడు.

కానీ ఓ రోజు కాలేజీలో ఫ్రెండ్‌ కోసం చేసిన తప్పు కారణంగా రాకీ బుక్కవుతాడు. ఇది చూసిన ప్రియా చీ కొడుతుంది. దీంతో బ్రేకప్‌. దీని కారణంగా కాలేజీ మానేసి గ్యారేజీ చూసుకుంటాడు రాకీ. తండ్రికి తీర్థయాత్రల పిచ్చి. ఫాదర్‌ కోసం టికెట్‌ కొనిస్తాడు రాకీ. ఆ ఆనందంలోనే చనిపోతాడు రామకృష్ణ. వీరి గ్యారేజీపై ఓ బ్రోకర్‌(సునీల్‌) కన్నుపడుతుంది. అధికారులతో కుమ్మక్కై గ్యారేజీని ఖాళీ చేయించే ప్రయత్నం చేశాడు. తనకు 50లక్షలు ఇస్తే కూల్చేయడం ఆపేస్తానని బెదిరిస్తాడు బ్రోకర్‌.

దీంతో ఆ మనీ కోసం ప్రయత్నిస్తుండగా, తండ్రి పేరుతో రెండు కోట్ల ఇన్సురెన్స్ ఉందని మాయ ద్వారా తెలుస్తుంది. దీంతో ఆ డబ్బులు బ్రోకర్‌కి చెల్లించి తన గ్యారేజీని తనవశం చేసుకోవాలనుకుంటాడు. ఈ గ్యాప్‌లో ప్రియా జీవితంలో  చాలా జరిగిపోతుంది. వాళ్ల నాన్న చనిపోతాడు. అన్నయ్య సూసైడ్‌ చేసుకుంటాడు. దానికి కారణం తనే అని ప్రియా నమ్ముతుంది. బాధపడుతుంది.

కుటుంబ బాధ్యత తనపై వేసుకుంటుంది. మళ్లీ ప్రియా, రాకీ కలుస్తారు. ఈ క్రమంలో పలు ట్విస్ట్ లు, టర్న్ లు చోటు చేసుకుంటాయి. ఆ ట్విస్ట్ లు ఏంటి? ప్రియా అన్నయ్య ఎందుకు చనిపోయాడు? రాకీ నాన్న నిజంగానే చనిపోయాడా? ప్రియా అన్నయ్య మరణానికి, రామకృష్ణ ఫాదర్‌ మరణానికి లింకేంటి? ఇందులో ఇన్సురెన్స్ పేరుతో కొందరు చేసే మోసాలేంటి? దీన్ని రాకీ తనదైన స్టయిల్‌లో ఎలా బయటకు తీసుకొచ్చాడనేది మిగిలిన కథ. 


విశ్లేషణః

ప్రస్తుతం సమాజంలో సైబర్‌ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. అలాంటి వాటిలో భాగంగానే ఇందులో ఇన్సురెన్స్ స్కామ్‌ గురించి చర్చించారు. ఇంట్లో పెద్ద వారు చనిపోతే కొందరు నేరగాళ్లు ఎలా అమాయకులను తమ వలలో వేసుకుంటారు అనేది. మిడిల్‌ క్లాస్‌ జనాలను టార్గెట్‌ చేసి ఎలా మోసాలు చేస్తారనేది చర్చించిన చిత్రంగా చెప్పొచ్చు. సందేశం పరంగా, జనాల్లో ఈ అవగాహన కల్పించే విషయంలో ఈ సినిమా తీసిన మేకర్స్ ని అభినందించాల్సిందే.

పెద్దగా ఇంకా బయటకు రాని, సైలెంట్‌గా జరుగుతున్న ఇలాంటి నేరాల గురించి అవేర్‌ కల్పించేలా ఆ పాయింట్‌తో ఈ మూవీని తెరకెక్కించడం అభినందనీయం. అయితే సినిమాగా ఇది మెప్పించేలా ఉందా అంటే మాత్రం పూర్తి స్థాయిలో కాదనే చెప్పాలి. చెప్పే అంశం బాగుంది. కానీ చెప్పిన తీరులో కొంత రియాలిటీకి దూరంగా ఉంది. దీని కోసం క్రియేట్‌ చేసిన డ్రామా కాస్త ఓవర్‌బోర్డ్ వెళ్లిన ఫీలింగ్‌ కలుగుతుంది. 
 

సినిమా ఫస్టాఫ్‌లో ఏదో సరదాగా సాగుతుంది. ఫస్టాఫ్‌ వరకు సినిమాలో ఏం జరుగుతుందో అర్థం కాదు,ఏ సీన్‌ ఎందుకు వచ్చిందో, హీరో అలా ఎందుకు చేస్తున్నాడు? అర్థం కాదు. తన గ్యారేజీలో జరిగే విషయాలకు సంబంధించి సహజత్వం లేదు. ఏదో ఒకదాని తర్వాత ఒక్కో సీన్‌ వచ్చిపోతుంటాయి. కథ లేకపోవడంతో సీన్లు మాత్రమే కనిపిస్తారు. పాటలు, ఫన్నీ సీన్లు ఇరికించినట్టుగానే ఉంటాయి.

అయితే కార్‌ ఛేజింగ్‌ సీన్‌ మాత్రం ఆకట్టుకుంది. ఫన్నీగా ఉంది. మరోవైపు కాలేజీ సీన్లు అంతగా వర్కౌట్‌ కాలేదు. తండ్రితో వచ్చే సీన్లు కూడా రొటీన్‌గానే ఉంటుంది. లవ్‌ ట్రాక్‌ కూడా ఆకట్టుకునేలా లేదు. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌ మొత్తం రెగ్యూలర్‌గా, పక్కా కమర్షియల్‌ సినిమాల్లో ఉండే అంశాలే ఉంటాయి. అలానే జరుగుతుంటాయి. దీంతో బోర్‌ ఫీలింగ్‌ తెప్పిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఫస్టాఫ్‌ అంతా పరమ రొటీన్‌. 
 

ఇక కథ అంతా సెకండాఫ్‌లో ఉంటుంది. ఇన్సురెన్స్ కంపెనీల పేరుతో కొందరు దుండగులు చేసే మోసాలను ఆటకట్టించేందుకు హీరోయిన్‌తో కలిసి హీరో వేసే స్కెచ్‌, ఈ క్రమంలో క్రియేట్‌ చేసిన డ్రామా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది. ఎంగేజ్‌ చేస్తుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ క్రియేట్‌ అవుతుంది. దీనికితోడు వచ్చే ట్విస్ట్ లు కూడా బాగున్నాయి.

అయితే ఓ దశకు వెళ్లాక ఏం జరగబోతుంది? ఇది డ్రామానే అనే విషయం అర్థమైపోతుంది. మాయ, ఇన్సురెన్స్ అధికారి, పోలీస్‌ పేరుతో జరిగే డ్రామా ఫేక్‌ అని ఆడియెన్స్ కి తెలిసిపోతుంది. ఆయా సీన్లలో సహజత్వం మిస్‌ అయ్యింది. అందులోనూ చాలా లాజిక్‌ లెస్‌గానూ ఉంటాయి. చాలా సీన్లు సిల్లీగానూ ఉంటాయి. అదే చాలా చోట్ల సీన్లు తేలిపోయేలా చేస్తాయి.

ఇక క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించేలా ఉంటుంది. దీంతో ఆ కిక్‌ పోయింది. దీంతో రొటీన్‌ మూవీ అయ్యింది. చెప్పిన అంశం బాగుంది. సెకండాఫ్‌ డీల్‌ చేసిన విధానం బాగుంది. కానీ ముందు, క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రం రొటీన్‌ గా ఉంటాయి. ట్విస్ట్ లు బాగానే ఉన్నా, అవి పేలకపోవడం పెద్ద మైనస్‌. సినిమాలో మెయిన్‌గా ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. అదే పెద్ద మైనస్‌. మొదటి భాగం, ట్విస్ట్ లు మరింత ఎలివేట్‌ అయ్యేలా చేసి, క్లైమాక్స్ ని మరింత రసవత్తరంగా డిజైన్‌ చేస్తే సినిమా అదిరిపోయేది. 
 

నటీనటులుః

రాకీగా విశ్వక్‌ సేన్‌ అదరగొట్టాడు. ఫస్ట్ లో కామెడీ కూడా బాగా చేశాడు. మంచి ఈజ్‌తో నటించాడు. సెకండాఫ్‌ తన గ్యారేజ్‌ కూల్చే ఎపిసోడ్‌లో మాత్రం అదరగొట్టాడు. డాన్సులు, ఫైట్లు బాగా చేశాడు. గత సినిమాలతో పోల్చితే ఇంకా బాగా చేశాడని చెప్పొచ్చు. ప్రియాగా మీనాక్షి చౌదరీ పాత్ర ఉన్నంతలో పర్వాలేదు. కానీ శ్రద్ధా శ్రీనాథ్‌ పాత్ర ముందు తేలిపోయింది. నెగటివ్‌ షేడ్‌ ఉన్నపాత్రలో శ్రద్ధా ఇరగదీసింది.

హీరోని మోసం చేసినట్టుగానే థియేటర్లలో ఆడియెన్స్ ని తన నటనతో మాయచేసింది. నరేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముందు, తనదైన స్టయిల్‌లో చేసుకుంటూ వెళ్లాడు. హర్ష నవ్వించే ప్రయత్నం చేశారు. హైపర్‌ ఆదిని సరిగా వాడుకోలేదు. నటుడు హర్షవర్థన్‌ తన మార్క్ మరోసారి చూపించాడు. మిగిలిన నటీనటులు ఫర్వాలేదనిపించారు.
 

టెక్నీషియన్లుః 
సినిమాలో సంగీతం బాగుంది. జేక్స్ బిజోయ్‌ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఓ పాట అయితే చాలా రోజులు వినపడుతుంది. మిగిలిన పాటలు కూడా తెరపై బాగున్నాయి. ఆకట్టుకునేలా ఉన్నాయి. బీజీఎం కమర్షియల్‌ సినిమాలను తలపిస్తుంది. ఎడిటర్‌ అన్వర్‌ అలీ ఇంకా కొన్ని సీన్లు ట్రిమ్‌ చేయాల్సింది. ఇక కెమెరా వర్క్ సూపర్‌. మనోజ్‌ రెడ్డి కాటసాని విజువల్స్ కలర్‌ఫుల్‌గా,రిచ్‌గా ఉన్నాయి.

నిర్మాతలు కాస్టింగ్‌కే ఎక్కువ ఖర్చుచేశారు. ప్రొడక్షన్‌కి పెద్దగా ఖర్చుచేసినట్టు లేరు. లొకేషన్లు మూడు, నాలుగే పదే పదే రిపీట్‌ అవుతుంటాయి. ప్రొడక్షన్‌ పరంగా దులిపేసినట్టు అనిపిస్తుంది. కానీ కెమెరా మ్యాజిక్‌ చేసింది. ఇక దర్శకుడు రవితేజ ముళ్లపూడి రాసుకున్న కథ బాగుంది, చెప్పాలనుకున్నవిషయం బాగుంది.

కానీ కంప్లీట్‌ సినిమాని అంతే ఎంగేజింగ్‌గా, కొత్తగా తీయడంలో సక్సెస్‌ కాలేకపోయాడు. ఇన్సురెన్స్ ఫ్రాడ్‌కి సంబంధించిన సీన్లు పక్కన పెడితే సినిమాలో అసలేం లేదు. అందులో దర్శకుడి మార్క్‌ గొప్పగా లేదని చెప్పొచ్చు. ఎమోషన్స్ ని డీల్‌ చేయడంలో వెనకబడిపోయాడు. కానీ సెకండాఫ్‌ని బాగా డీల్‌ చేశాడు. ట్విస్ట్ లు బాగారాసుకున్నాడు. దాన్ని అంతే ఎఫెక్టివ్‌గా తెరపై ఆవిష్కరిస్తే సినిమా మరింత బాగుండేది. 

ఫైనల్‌గాః సందేశం కోసం మాత్రమే.
రేటింగ్‌ః 2.5 
 

Latest Videos

click me!