సూర్య `కంగువా` మూవీ రివ్యూ, రేటింగ్

First Published | Nov 14, 2024, 12:55 PM IST

సూర్య, దిశా పటానీ జంటగా నటించిన `కంగువా` మూవీ నేడు విడుదలైంది. భారీ పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

విలక్షణ నటుడు సూర్య హీరోగా నటించిన మూవీ `కంగువా`. శివ అండ్‌ టీమ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్‌ నెగటివ్‌ రోల్‌ చేశారు. పీరియాడికల్‌, హిస్టారికల్‌, సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ప్రధానంగా రూపొందిన ఈ మూవీని జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. సూర్య తన సినిమాలన్నింటిని తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తూ ఇక్కడి ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నారు.

ఇప్పుడు మరోసారి `కంగువా`తో వచ్చారు. ఇది భారీ పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కడం విశేషం. ఈ మూవీ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు గురువారం(నవంబర్‌ 14న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
ఏక కాలంలో రెండు టైమ్‌ పీరియడ్‌లో జరిగే కథ ఇది. ఒకటి 2024 ప్రస్తుతం, మరోటి 1070 నాటి పీరియడ్‌ టైమ్‌. ఫ్రాన్సిస్‌(సూర్య) పోలీసుల వద్ద డబ్బులు తీసుకుని క్రిమినల్స్ ని పట్టిస్తుంటాడు. తన బ్రేకప్‌ లవర్‌ ఏంజెల్‌(దిశా పటానీ) కూడా సగం కమీషన్‌ డిమాండ్‌ చేస్తుంటుంది. ఇలా పోలీసుల కోసం ఓ క్రిమినల్‌ని పట్టించే క్రమంలో అతన్ని చంపేస్తాడు ఫ్రాన్సిస్‌. దీన్ని ఓ చిన్న కుర్రాడు జెటా చూస్టాడు. అతను రష్యాన్‌ ల్యాబుల్లో బ్రెయిన్‌ ప్రయోగాలు చేయబడ్డ కుర్రాడు.

ల్యాబ్‌ నుంచి తప్పించుకుని ఫ్రాన్సిస్‌ని వెతుక్కుంటూ గోవా వస్తాడు. జెటాకి ఫ్రాన్సిస్‌ బాగా కనెక్ట్ అవుతాడు. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ కూడా ఇప్పిస్తాడు. అతన్ని చూసినప్పుడు ఏదో రిలేషన్‌ ఫిలింగ్‌ కలుగుతుంటుంది. దీంతో అతన్ని వదులుకోలేడు ఫ్రాన్సిస్‌. అయితే జెటా కోసం ఏకంగా సైన్యమే వస్తుంది. అతన్ని గుర్తించి తీసుకెళ్తున్నారు. జెటాని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటాడు ఫ్రాన్సిస్‌. అతన్ని టచ్‌ చేయగా గతంలోకి వెళ్తుంది.

అది 1070 టైమ్‌. పంచ కోన దీవుల్లో స్థావరాన్ని ఏర్పర్చుకుని అఖండ భారతాన్ని ఆక్రమించుకునేందుకు రుమేనియా సైన్యం వస్తుంది. అందుకు ప్రణవాది కోన సరైన స్థావరంగా భావిస్తుంది. అయితే అక్కడ ఉన్నవాళ్లంతా వీరులు. వారిని ఎదుర్కోవడం కష్టమని చెప్పి, దేశ దిమ్మరి సహాయంతో కపాల కోన రాజు రుధిర(బాబీ డియోల్‌)తో చేతులు కలిపి ప్రణవాధి కోనని ఆక్రమించుకోవాలనుకుంటారు.

కానీ వారిని కంగువా(సూర్య) ఎదురిస్తాడు. వచ్చిన రుధిర కొడుకులను హతమారుస్తాడు కంగువా. దీంతో కంగువాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. మరి ఎలా ఎదురించాడు? కంగువా, రుధిర మధ్య ఎలాంటి పోరు జరిగింది. అందులో పులోమా ఎవరు? అతన్ని కాపాడటం కోసం కంగువా తన ప్రాణాలు ఎందుకు అడ్డు పెడుతుంటాడు? అతనికి ప్రస్తుతం కాలంలో జెటాకి ఉన్న సంబంధమేంటి? 1070 టైమ్‌కి, ఇప్పుటి టైమ్‌ కి ఉన్న లింకేంటి? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటనేది మిగిలిన కథ.
 


విశ్లేషణః
ప్రస్తుతం మాస్‌ యాక్షన్‌ మూవీస్‌, పీరియాడికల్‌ చిత్రాలు, అలాగే హిస్టారికల్‌ ఫిక్షన్‌ మూవీస్‌ బాగా ఆదరణ పొందుతున్నాయి. లార్జెర్‌ దెన్‌ లైఫ్‌ కథలను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి కథతోనే `కంగువా` సినిమా చేశారు సూర్య. భారీ పాన్‌ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కించారు. విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దారు. ఆడియెన్స్ కి ఓ కొత్త అనుభూతిని, ఓ కొత్త కథని చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా విజువల్‌గా, టెక్నికల్‌గా బ్రిలియంట్‌గా ఉంది.

యాక్షన్‌ పరంగానూ అదరగొట్టిందని చెప్పొచ్చు. తెరపై ఆడియెన్స్ కిది ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇలాంటి సినిమా తీయడం మామూలు విషయంకాదు. టెక్నీకల్‌గా చాలా క్లిష్టమైన మూవీ కూడా. ఆ రిస్క్ చేసిన మేకర్స్ ని అభినందించాల్సిందే. అయితే దాన్ని మరింత సరళంగా, మరింత క్లారిటీ, కథ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకుని చేస్తే ఇంకా బాగుండేది. ఇంకా చెప్పాలంటే సంచలనాత్మక మూవీ అయ్యుండేది. 
 

సినిమాగా చూసినప్పుడు ఇది ఏక కాలంలో రెండు టైమ్‌ పీరియడ్‌లో సాగుతుంది. ప్రస్తుత కాలం నుంచి ఈ మూవీ కథ ప్రారంభమవుతుంది. ల్యాబ్‌ నుంచి జెటా అనే కుర్రాడు తప్పించుకోవడం, అతను సూర్య వద్దకు రావడం, సూర్యనే చూస్తూ ఉండటం ఓ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. గతం తాలూకు ముందస్తు హింట్‌ని ఇస్తుంటుంది. అయితే పోలీసులకు క్రిమినల్స్ పట్టించే క్రమంలో సూర్య, యోగిబాబు చేసే రచ్చ ఓవర్‌గా ఉంటుంది. యూత్‌ఫుల్‌గా దాన్ని డిజైన్‌ చేసినా అది ఓవర్‌ గా అనిపిస్తుంది.

ఇక దిశా పటానీ పాత్ర అతికించినట్టుగానే ఉంటుంది. కాకపోతే గ్లామర్‌ పరంగా ఆమె న్యాయం చేసిందని చెప్పొచ్చు. జెటాని కాపాడే క్రమంలో సూర్య పడే స్ట్రగుల్స్, ఈ క్రమంలో 1070లోకి వెళ్లడం క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. ఆ సమయంలో రుమేనియన్‌ సైన్యం దేశాన్ని ఆక్రమించుకునే కుట్రలు చేయడం, అందులో భాగంగా కపాల కోన రాజు రుధిరతో చేతులు కలపడం, ఈ క్రమంలో ప్రణవాది కోన వీరులను మోసం చేయడం, దీనికి కంగువా ప్రతీకారం తీర్చుకోవడం, తన కుమారులను కంగువా చంపడంతో రుధిరకి, కంగువాకే యుద్ధం తలెత్తడం ఆసక్తికరంగా, ఎంగేజ్‌ చేసే అంశాలు.

ఆయా ఎపిసోడ్‌ గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంటాయి. అయితే అందులో అసలు కథ లేదు. దీని తాలుకూ కథని ఎస్టాబ్లిష్‌ చేయాల్సింది. కానీ దర్శకుడు చాలా వేగంగా కథనాన్ని నడిపించడంతో ఏం జరుగుతుందో అనేది కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది. ఓ సీన్‌ అర్థం చేసుకునే లోపు మరో సీన్‌ రావడంతో అంతా అలా వచ్చిపోతున్నట్టుగానే ఉంటుంది గానీ, ఆడియెన్స్ ఫీల్‌ అయ్యేలా లేదు. 
 

పులోమా కోసం కంగువా అంతగా తపించడం, అతని కోసం తన ప్రాణాలను లెక్కచేయకపోవడం అనేది అంతగా కన్విన్సింగ్‌గా అనిపించలేదు. అయితే వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తాయి. చిన్న పిల్లాడి కోసం తన రాజ్యాన్ని వదిలేయడం అనేది అంతగా పండలేదు. దీంతో కథ ట్రాక్‌ తప్పిందా అనిపిస్తుంది. అలాగే బాబీ డియోల్‌ పాత్రని కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయారు.

దీంతో ఇది సూర్య వన్‌ మేన్‌ షో అయిపోయింది. సినిమాకి ఎమోషన్స్ ప్రధానం. ఇందులో ఆ ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. కొన్ని చోట్ల మాత్రమే అది వర్కౌట్‌ అయ్యింది. మరోవైపు ప్రస్తుత కాలానికి, 1070కి కనెక్షన్‌ ని కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. దీనికితోడు కేవలం యాక్షన్‌ సీన్ల కోసమే పీరియాడికల్‌ ఎలిమెంట్లు పెట్టారా? అనేలా ఉంటుంది.

ఈ విషయంలో క్లారిటీ, ఇంకొంత బలంగా కథని చెప్పాల్సి ఉంది. కథని మరింతగా ఎస్టాబ్లిష్‌ చేస్తే సినిమా వేరే లెవల్‌లో ఉండేది. అదే సమయంలో యాక్షన్‌ సీన్లు, ఆ కల్చర్‌ మన ఆడియెన్స్ కి కొంత ఓవర్‌ బోర్డ్ అనిపిస్తాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అదిరిపోయే సినిమా అయ్యేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

నటీనటులుః
సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా దమ్మురేపుతారు. ఇందులో ఫ్రాన్సిస్‌గా, అలాగే కంగువాగా రెండు పాత్రల్లో ఇరగదీశారు. కంగువా గా అయితే విశ్వరూపం చూపించారు. దిశా పటానీ గ్లామర్‌కే పరిమితం. బాబీ డియోల్‌ని ఉన్నంత సేపు ఆకట్టుకున్నారు. కానీ ఆయన్ని సరిగ్గా వాడుకోలేదు. ఇక పులోమా గా నటించిన కుర్రాడు బాగా చేశాడు. కే ఎస్‌ రవికుమార్‌ కాసేపు మెరిశారు. యోగాబాబు పాత్ర నవ్వించలేకపోయింది. మిగిలిన పాత్రలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే గుర్తుపట్టేలా లేవు. 

టెక్నీషియన్లుః 
సినిమాకి మ్యూజిక్‌ పెద్ద అసెట్‌. పాటలు జస్ట్ ఓకే. బీజీఎం ఫర్వాలేదు. యాక్షన్‌ సీన్లలో బాగుంది. కానీ ఓవర్‌ సౌండింగ్‌లా అనిపిస్తుంది. మ్యూజిక్‌లో ఓ రిథమ్‌ మిస్‌ అయ్యింది. ఫీల్‌ మిస్‌ అయ్యింది. వెట్రి ఫలని స్వామి కెమెరా వర్క్ అద్భుతమని చెప్పాలి. ఆయన సినిమాకి మరో హీరో అయ్యారు. సినిమాని విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దడంలో సక్సెస్‌ అయ్యారు.

దర్శకుడు శివ సినిమాని బాగా తీశాడు, కానీ బలమైన కథని రాసుకోవడంలో సక్సెస్‌ కాలేకపోయాడు. ఎమోషన్స్ ని ఎస్టాబ్లిష్‌ చేయడానికి ప్రయారిటీ ఇవ్వాల్సింది. మరింత క్లారిటీగా, మరింత బలంగా కథని రాసుకుంటే బాగుండేది. ఇవి పక్కన పెడితే ఈ మూవీ ద్వారా పీరియాడికల్‌ విజువల్‌, యాక్షన్‌ ట్రీట్‌ని ఇచ్చారని చెప్పొచ్చు. 
 

ఫైనల్‌గాః సూర్య విశ్వరూపం, పీరియాడికల్‌ యాక్షన్స్, విజువల్స్ కోసం మాత్రమే.

రేటింగ్‌ః 2.75

read more; రజినీ vs అజిత్: 6 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ వార్

Latest Videos

click me!