
Mazaka Review: సందీప్ కిషన్ చిత్ర పరిశ్రమలోకి వచ్చి, ఆయన హీరో అయి పదిహేనేళ్లు అవుతుంది. ఇప్పటికీ సరైన బ్రేక్ లేదు, యావరేజ్ సినిమాలతో నెట్టుకొస్తున్నాడు. ఇతర హీరోల సినిమాల్లోనూ సెకండ్ హీరోగా నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తనని తాను నటుడిగా నిరూపించుకుంటూ వస్తున్నాడు. మొన్నటి వరకు యాక్షన్ మూవీస్, థ్రిల్లర్స్ చేసిన ఆయన ఇప్పుడు సక్సెస్ కోసం రూట్ మార్చాడు.
వరుస దెబ్బల తగులుతున్న నేపథ్యంలో ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెద్ద పీఠ వేశాడు. ఇప్పుడు `మజాకా` అనే సినిమాలో నటించారు. శ్రీనాథ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించారు. రాజేష్ దండా నిర్మించిన ఈమూవీ మహాశివరాత్రి సందర్భంగా బుధవారం(ఫిబ్రవరి 26న) విడుదలైంది. మరి సినిమా ఎంటర్‌టైన్ చేసిందా? సందీప్ కిషన్‌కి ఈ సారైనా హిట్ పడుతుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
వెంకట రమణ(రావు రమేష్), కృష్ణ(సందీప్ కిషన్) తండ్రీకొడుకులు. కృష్ణ జన్మించగానే ఆయన తల్లి చనిపోతుంది. దీంతో రమణ మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటూ కొడుకుని చూసుకుంటాడు. ఇద్దరూ బ్యాచ్‌లర్ లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. కృష్ణ పెద్దయ్యాక పెళ్లి చేయాలనుకుంటాడు.
తన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టాలనుకుంటారు. కానీ ఇద్దరూ మగాళ్లు ఉన్న ఇంట్లోకి ఆడపిల్లను పంపించలేమని చాలా మంది రిజెక్ట్ చేస్తారు. ఈ క్రమంలో అనుకోకుండా వైజాగ్ బీచ్‌లో మీరా(రీతూ వర్మ) కృష్ణకి పరిచయం అవుతుంది. ఆమె డేర్ చూసి పడిపోతాడు కృష్ణ. ఆమె తన కాలేజీలోనే చదువుకుంటుందని తెలుసుకుని ఫాలో అవుతుంటాడు. మరోవైపు అదే సమయంలో బీచ్ రోడ్‌లో ఆంటీ యశోద(అన్షు)ని చూస్తాడు రమణ. తొలి చూపులోనే ఆమెకి పడిపోతాడు.
ఆ తర్వాత వెంటపడతాడు. కట్ చేస్తే ఆమె తన ఆఫీస్‌కే వీసా కోసం వస్తుంది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయంతో ఆమెని ఫాలో అవుతుంటారు. కృష్ణ లవ్‌లో పడ్డ విషయం రమణకి, రమణ ఆంటీతో లవ్ ట్రాక్ నడిపిస్తున్న విషయం కృష్ణకి తెలుస్తుంది. దీంతో మొదట్లో తిట్టుకున్న ఈ ఇద్దరు ఆ తర్వాత రాజీకి వచ్చి తమ లవర్స్ కి ప్రపోజల్ చేస్తారు. వాళ్లని పెళ్లి చేసుకోవాలనుకుంటారు.
లవర్స్ కోరిక మేరకు ఓ రోజు రాత్రి ఈ ఇద్దరు గొడలు దూకి వాళ్ల ఇంట్లోకి వెళ్తారు. కట్ చేస్తే ఇద్దరూ ఒకే ఇంట్లోకి వెళ్తారు. అప్పుడే తెలుస్తుంది మీరా, యశోద ఉండేది ఒకేఇంట్లో అని, వారిది ఒకే ఫ్యామిలీ అని. మరి మీరా ఇంట్లో యశోద ఎందుకుంది? మీరాకి యశోద ఏమవుతుంది? వీరిద్దరి మధ్య ఉన్న గొడవేంటి?
బద్ద శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరిని కృష్ణ, రమణ ఎలా ఒప్పించారు? ఎవరి కోసం ఎవరు త్యాగం చేశారు? ఇందులో మీరా తండ్రి(మురళీ శర్మ) పెట్టిన కండీషన్ ఏంటి? అంతిమంగా వీరి ప్రేమ కథలు ఏ వైపు టర్న్ తీసుకున్నాయి? ఎలా ముగింపు పలికాయి? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
కామెడీ అనేది.. సినిమాల్లో సన్నివేశాల ద్వారా పుట్టాలి. యాక్టర్స్ యాక్టింగ్ వల్ల జెనరేట్ కావాలి? పంచ్ డైలాగ్‌లు ద్వారానైనా జనరేట్ కావాలి. ఏదైనా సహజంగా జరగాలి. అలా సహజంగా కామెడీ జనరేట్ అయితేనే ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది. కామెడీ కోసమే సన్నివేశాలు రాసుకుంటే, కామెడీ కోసమే సిచ్చువేషన్ క్రియేట్ చేస్తే, కామెడీ కోసమే యాక్ట్ చేస్తే అది కావాలని జోడించిన కామెడీ అవుతుంది.
అందులో సహజత్వం ఉండదు, జనాలకు కనెక్ట్ కాదు. `మజాకా` సినిమా విషయంలో అదే జరిగింది. కావాలని కామెడీ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. అయితే కథగా తీసుకున్న పాయింట్ బాగానే ఉంది. తండ్రి, కొడుకులు బ్యాచ్‌లర్‌గా ఉండటం, ఇంట్లో ఆడతోడు లేకపోవడం, ఒక ఫ్యామిలీ ఫోటో కావాలనుకోవడం అనే పాయింట్ బాగుంది.
ఈ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య గొడవలు, వాళ్లు చేసే అల్లరి పనులతో కామెడీ పుట్టేలా డిజైన్ చేశారు. ఫస్టాఫ్ మొత్తం తండ్రి కొడుకుల మధ్య రిలేషన్‌ని, వాళ్లు అమ్మాయి కోసం వెతకడం, అనంతరం ఇద్దరికి అమ్మాయిలు తగలడం, వారిని పడేసేందుకు వాళ్లు పడే బాధలు, చేసే కొంటె పనుల ప్రధానంగా సినిమా సాగుతుంది.
అయితే లవర్స్ విషయంలో ఎవరికి వారిని సెపరేట్‌గా చూపించి, ఆ తర్వాత ఇంటర్వెల్‌లో అందరూ ఒకే ఫ్యామిలీ అని చెప్పే సీన్ బాగుంది. ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. మరోవైపు మురళీ శర్మ సైకో రివేంజ్ కూడా నవ్వించేలా ఉంటుంది. ప్రారంభం నుంచి రొటీన్ సీన్లతో సాగినా, ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు నవ్వించేలా ఉంటాయి. కొంత రిలీఫ్‌నిస్తాయి.
ఇక సెకండాఫ్‌లో పెళ్లి గోల స్టార్ట్ కావడంతో అసలైన ఫన్ జనరేట్ కావాలి. కానీ ఇందులో అది రివర్స్ కొట్టింది. ఇంకా చెప్పాలంటే ఆ ఎపిసోడ్ బెడిసి కొట్టింది. మరీ బలవంతపు కామెడీ సీన్లతో విసుగు పుట్టించారు. దీనికితోడు రావు రమేష్, సందీప్ కిషన్ ల ఓవర్ యాక్షన్ ఓవర్ బోర్డ్ వెళ్లింది. అది ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేదు. లాజిక్‌కి అసలే అందడం లేదు.
చాలా కమర్షియల్ సినిమాలను, చాలా ఫ్యామిలీ డ్రామా సినిమాలను కలిపి డిజైన్ చేసినట్టుగా ఉంటుంది. పెళ్లి ఒప్పించడం కోసం వాళ్లు పడే పాట్లు ఓవర్‌గా ఉంటాయి. అవి ఏమాత్రం సహజంగా లేవు. కావాలని చేస్తున్నట్టుగానే అనిపిస్తాయి. అందుకే కామెడీ జనరేట్ కాలేదు. అక్కడే కథ రివర్స్ కొట్టింది. సెకండాఫ్ క్లైమాక్స్ లో సెంటిమెంట్, ఎమోషనల్ సీన్లు పెట్టారు. రావు రమేష్, రీతూ వర్మల మధ్య ఎమోషనల్ సీన్ బాగుంది.
కానీ సందీప్ కిషన్, అన్షు ల మధ్య సీన్ పెద్దగా పండలేదు. ఓవర్‌గానే ఉంటుంది. ఫైనల్‌గా క్లైమాక్స్ ముగింపు ఓకే అనిపిస్తుంది. కానీ అంత వరకు సినిమాని భరించాల్సిన పరిస్థితి. కేవలం కామెడీ సీన్ల కోసం, చిన్న ఎమోషనల్ సీన్ల కోసం ఈ మూవీని రాసుకున్నారా? అనిపిస్తుంది. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ ముందే అర్థమైపోతుంది. పైగా ఏదీ కొత్తగా లేదు, రొటీన్ రొడ్డకొట్టుడులా ఉంది.
ఫస్ట్ ఆఫ్‌లో ఓకామెడీ సీన్, సెకండాఫ్‌లో మరోటి, క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్లు ఇందులో ఆకట్టుకునే అంశాలు. అవి పక్కన పెడితే ఈ మూవీలో అసలు కథ లేదు, కథనం నవ్వించేలా లేదు. డైలాగ్‌లు పరమ రొటీన్‌గా ఉన్నాయి. మ్యూజిక్ లో కూడా కొత్తదనం లేదు. సినిమా స్కీన్ ప్లే రొటీన్‌గా సాగడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ మూవీ ఏమాత్రం కొత్తదనం లేదు.
నటీనటులుః
కృష్ణ పాత్రలో సందీప్ కిషన్ బాగా చేశాడు. పాత్రలో జీవించాడు. పేస్‌లో పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ చూపించలేకపోయినా, కామెడీని పండించడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే రమణ పాత్రలో రావు రమేష్ సైతం రెచ్చిపోయాడు. సందీప్ ని డామినేట్ చేస్తాడు. తన అనుభవాన్ని అంతా రంగరించాడు. కామెడీ పండించడంతోపాటు ఎమోషనల్ సీన్లలోనూ పిండేశాడు. సినిమా మొత్తం ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది.
తండ్రీకొడుకులుగా సందీప్, రావు రమేష్ ఇరగదీశాడు. చాలా చోట్ల ఓవర్ బోర్డ్ వెళ్లారు. వీరితోపాటు రీతూ వర్మ సైతం తన పాత్ర పరిధి మేరకు అకట్టుకుంది. అలాగే అన్షు కూడా రావురమేష్‌కి జోడీగా కనిపించి అదరగొట్టింది. సెకండాఫ్‌లో హైపర్ ఆది కాసేపు కనిపించారు. మిగిలిన నటీనటులు ఓకే అనిపించారు.
టెక్నీకల్‌గాః
టెక్నీకల్‌గా సినిమా బాగానే ఉంది. విజువల్ గా బాగుంది. కలర్‌ఫుల్‌గా ఉంది. కెమెరా పనితనం కనిపిస్తుంది. అలాగే ఎడిటర్ చాలా షర్ప్ గా కట్ చేశారు. మ్యూజిక్ కూడా రొటీన్‌గానే ఉంది. పాటలు,బీజీఎం సైతం రొటీన్ ఫీలింగ్‌నే తెప్పించాయి. ఏమాత్రం కొత్తదనం లేదు.
ఇక రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ రైటింగ్ ఆకట్టుకునేలా లేదు. సరైన కథ లేదు, దీంతో దాన్ని డీల్ చేయడం కూడా కష్టమే. రొటీన్ సీన్లతో బోర్ తెప్పించారు. డైలాగ్‌లు కూడా ఏమాత్రం కొత్తగా లేవు. చెప్పినవే చెప్పించి ఆడుకున్నారు.
దర్శకుడు థ్రినాథ రావు నక్కిన సినిమాని ఏమాత్రం హిలేరియస్‌గా తెరకెక్కించలేకపోయారు. ఆయన తీసిన ఈ సినిమాలో ఏమాత్రం ఎగ్జైటింగ్ చేసే సీన్లు లేవు. పరమ రొటీన్ కామెడీ సీన్లతో ఇంకా విసుగు ఎత్తించడం తప్పితే. సహజమైన కామెడీని రాసుకుని, మరింతగా కష్టపడితే సినిమా బాగుండేది.
ఫైనల్‌గాః `మజాకా` బలవంతపు కామెడీ, ఇరికించిన సెంటిమెంట్. పరమ రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్.
రేటింగ్‌ః 2.5