
ధనుష్ హీరోగా యాక్షన్ సినిమాలతో అలరిస్తున్నారు. కానీ ఆయన చిత్రాలు సక్సెస్ కావడం లేదు. ఇటీవల వరుసగా పరాజయాలు చవిచూస్తున్నాయి. దర్శకుడిగా చేసిన మూవీ సైతం బోల్తా కొట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు రూట్ మార్చాడు. దర్శకుడిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.
`జాబిలమ్మ నీకు అంత కోపమా`(Nilavuku En Mel Ennadi Kobam) అనే యూత్‌ఫుల్ కంటెంట్‌తో వచ్చాడు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని `జాబిలమ్మ నీకు అంత కోపమా`(Jaabilamma Neeku Antha Kopama Movie Review) పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కొత్త కుర్రాడు, ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా పరిచయం కాగా, అనిఖా సరేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు.
మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్, శరణ్య పోన్‌వన్నన్, శరత్ కుమార్, ఆడుకాలం నరేన్ ఇతర పాత్రలు పోషించారు. ప్రియాంక మోహన్ గెస్ట్ గా సాంగ్‌లో మెరిసింది. ఈ సినిమా నేడు శుక్రవారం(ఫిబ్రవరి 21)న విడుదలైంది. మరి తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
ప్రభు(పవిష్ నారాయణ్) చెఫ్‌గా పనిచేస్తుంటాడు. ఏజ్ చిన్నదే, కానీ పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఫోర్స్ చేస్తుంటారు. పేరెంట్స్ టార్చర్ భరించలేక ఎట్టకేలకు మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఓ సంబంధాన్ని చూడటానికి వెళ్తారు. అక్కడ అమ్మాయిని(ప్రియా ప్రకాష్ వారియర్)ని చూసి షాక్ అవుతాడు. ఆమె కూడా ఆశ్చర్యపోతుంది.
ఎందుకంటే వీరిద్దరు ఒకప్పుడు క్లాస్ మేట్స్. కలిసి చదువుకున్న వీరు పెళ్లి చేసుకోవాలనే సరికి ఇద్దరూ ఇబ్బంది పడుతుంటారు. అలా ఊహించుకోలేరు. అయితే వారం రోజులు కలిసి ట్రావెల్ చేసి, ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాక నిర్ణయం తీసుకుందామనుకుంటున్నారు. ఈ క్రమంలో కలిసి ట్రావెల్ చేసే చివరి రోజు నీలా(అనిఖా సురేంద్రన్) పెళ్లి కార్డ్ చూస్తాడు ప్రభు. దీంతో కుంగిపోతుంటాడు.
తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అడగడంతో (Jaabilamma Neeku Antha Kopama Movie Review) తన లవ్ స్టోరీ రివీల్ చేస్తాడు. ప్రభుకి రవి(వెంకటేష్ మీనన్), రాజేష్(మాథ్యూ థామస్) మంచి ఫ్రెండ్స్. రవి శ్రేయా(రబీనా ఖాటూన్)తో ప్రేమలో ఉంటాడు. వీరి లవ్ యానివర్సరీ పార్టీకి ప్రభు, రాజేష్ చెఫ్‌లుగా వ్యవహరిస్తారు. ఆ పార్టీలోనే నీలాని చూస్తాడు ప్రభు. ఆమెకి ఫిదా అవుతాడు.
ప్రభు వంటలకు ఆమె కూడా పడిపోతుంది. ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్న క్రమంలో ప్రేమలో పడతారు. తమ ప్రేమ విషయాన్ని ప్రభు ఇంట్లో చెబుతాడు. పేరెంట్స్ ఓకే అంటారు. అలాగే నీలా కూడా తనప్రేమ విషయం తండ్రి(శరత్ కుమార్)కి చెబుతుంది. ఆయన పెద్ద రిచెస్ట్ పర్సన్. ప్రభుని చూసి అసహ్యించుకుంటాడు. డబ్బు కోసం ప్రేమించాడని నింద వేస్తాడు.
తాను ఒప్పుకోవాలంటే కొంత కాలం కలిసి ట్రావెల్ చేయాలనే కండీషన్ పెడతాడు. ప్రభు, నీలా ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. వారిని ఇబ్బంది పెడుతుంటాడు. ఓ రోజు ఆసుపత్రికి వెళ్లినప్పుడు నీలా ఫాదర్‌కి క్యాన్సర్ అని, ఆయన ఆరు నెలల్లో చనిపోతాడనే విషయం ప్రభుకి తెలుస్తుంది. దీంతో నీలాని దూరం పెడతాడు ప్రభు? ఇద్దరూ బ్రేకప్ చెబుతారు.
మరి ప్రభు.. నీలాని ఎందుకు దూరం పెట్టాడు? నీలా తండ్రి చివరి కోరిక ఏంటి? ప్రభు నీలా పెళ్లికి వెళ్లాడా? ఆ పెళ్లిలో ఏం జరిగింది? ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? వీరి గజిబిజి లవ్ స్టోరీ ఏ తీరం చేరింది? తన ఫ్రెండ్స్ లవ్ స్టోరీలోని ట్విస్ట్ లేంటి? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
ధనుష్ ఇటీవల వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. అవి అంతగా ఆకట్టుకోవడం లేదు, దర్శకుడిగా, హీరోగానూ సేమ్ రిజల్ట్ ని చవిచూశాడు. ఈ క్రమంలో ఆయన రూట్ మార్చి `జాబిలమ్మ నీకు అంత కోపమా` అనే యూత్‌ఫుల్ కంటెంట్‌తో వచ్చాడు. ఇప్పుడు ఇలాంటి బోల్డ్ కంటెంట్‌ని ఆడియెన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలే ఆడుతున్నాయి. అందుకే ధనుష్ ఈ రూట్‌ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది.
సినిమా పూర్తి లవ్, రొమాన్స్ తో సాగుతుంది. అయితే అలాగని మరీ వల్గారిటీగా కూడా ఉండదు, బాగా డబ్బున్న రిచ్ ఫ్యామిలీస్ కల్చర్‌ని ప్రతిబింబించేలా, సిటీ కల్చర్‌ని రిఫ్లెక్ట్ చేసేలా సాగుతుంది. రిచ్ ఫ్యామిలీ పిల్లలు చేసే పనులు, వారి లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయనేది ఇందులో (Jaabilamma Neeku Antha Kopama Movie Review) చూపించారు ధనుష్.
హీరోయిన్, వారి ఫ్రెండ్స్ ని రిచ్ ఫ్యామిలీస్‌గా తీసుకుని, హీరోని మిడిల్ క్లాస్ అబ్బాయిగా చూపించాడు. ఏ సెంటర్ ఆడియెన్స్ ని మాత్రమే కాదు, బీ సెంటర్ ఆడియెన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమా ఫస్టాఫ్ మొత్తం లవ్, పార్టీలు, ఎంజాయ్‌మెంట్ అనేలా సాగుతుంది. ఫన్, లవ్, కొంత రొమాన్స్ ఉంటుంది.
క్రేజీగా ఉండే డైలాగులు, వాళ్లు చేసే క్రేజీ పనులు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఆడియెన్స్ కి పిచ్చెక్కించేలా ఉంటాయి. అదే ఇందులో బిగ్గెస్ అసెట్. ఫ్రెండ్ లవ్ స్టోరీని సెట్ చేస్తూ, హీరోహీరోయిన్లు ప్రేమలో పడటం క్రేజీగా ఉంటుంది. ఇక హీరోయిన్ తండ్రిని హీరో ఎదురిస్తూ, యాటిట్యూడ్ చూపించే తీరు, తమతోపాటు హీరోయిన్ తండ్రి వచ్చినప్పుడు అతను పడే ఇబ్బంది ఫన్నీగా ఉంటాయి. నవ్వులు పూయిస్తాయి. అంతలోనే సాడ్‌న్యూస్ తెలిసి గుండె బరువెక్కించేలా ఉంటుంది.
ఇక సెకండాఫ్ అంతా హీరోయిన్ పెళ్లి వేడుకగా వేదికగా సాగుతుంది. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంటే అది చూడటం ఒక అబ్బాయికి ఎంత నరకంగా ఉంటుందో ఇందులో చూపించారు. అయితే దాన్ని సీరియస్‌గా, సాడ్ కోణంలో కాకుండా చాలా ఫన్నీగా డిజైన్ చేసిన తీరు బాగుంది.
అదే ఇందులో హైలైట్. ఫ్రెండ్ రాజేష్‌తో కలిసి చేసే రచ్చ వేరే లెవల్‌లో ఉంటుంది. ఇద్దరు ప్రేమ కథలు చెప్పుకుంటూ బాధపడుతూ, మందేస్తూ క్రేజీగా బిహేవ్ చేస్తూ ఆడియెన్స్ ని అలరించారు, హిలేరియస్‌గా నవ్వించారు. ఇక క్లైమాక్స్ లో ట్విస్ట్ లు, ఎమోషనల్ సీన్లతో కాస్త సీరియస్‌గా అనిపించినా, అందులోనూ ఫన్ క్రియేట్ చేసిన తీరు బాగుంది. ఫినిషింగ్ మరింత క్రేజీగా ఉంటుంది.
సినిమా రెండో భాగం చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఒకే టెంపోలో, ఎక్కడా తగ్గకుండా హిలేరియస్‌గా తీసుకెళ్లిన తీరు బాగుంది. అయితే ఈ మూవీ చాలా వరకు ఏ సెంటర్ (సిటీ, అర్బన్) ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. బీ, సీ సెంటర్ ఆడియెన్స్ కి అంతగా ఎక్కకపోవచ్చు, ఎందుకంటే ఆ కల్చర్ కొత్తగా ఉంటుంది.
అయితే యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ కావడం, క్రేజీ సీన్లు ఉండటంతో కొంత వరకు నచ్చే అవకాశం ఉంది. ఫన్ మాత్రం అందరికి నచ్చేలా ఉంటుందని చెప్పొచ్చు. కామెడీ విషయంలో లాజిక్స్ చూడొద్దు అంటారు, ఇందులోనూ చాలా లాజిక్స్ తప్పాయి. కానీ కామెడీ వర్కౌట్ కావడంతో అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు.
నటీనటులుః
సినిమా మొత్తం యంగ్ కుర్రాళ్ల చుట్టూనే సాగుతుంది. వారి నటనే హిలేరియస్‌గా అనిపిస్తుంది. ప్రభు పాత్రలో ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ అదరగొట్టాడు. ఫేస్‌లో ఎక్స్ ప్రెషన్స్ అంతగా పలకకపోయినా తన క్రేజీ పనులతో ఆకట్టుకున్నాడు, నవ్వులు పూయించాడు. నీలా పాత్రలో అనిఖా సురేంద్రన్ చాలా బాగా చేసింది. రిచ్ అమ్మాయిగా అదరగొట్టింది. ప్రేమికురాలిగా మెప్పించింది. చాలా హుందాగానూ కనిపించింది.
ఆమెతోపాటు పెళ్లిచూపుల్లో కలిసిన అమ్మాయిగా ప్రియా ప్రకాష్ వారియర్ కాసేపు (Jaabilamma Neeku Antha Kopama Movie Review) మెరిసింది. ఆమెది ఎక్స్ టెండెడ్ కోమియో అని చెప్పొచ్చు. ప్రభు స్నేహితుడు రాజేష్ పాత్రలో మాథ్యూ ఇరగదీశాడు. అతని కామెడీనే సినిమాకి పెద్ద అసెట్. మిగిలిన అన్ని పాత్రలకంటే అతని పాత్రనే హైలైట్ అయ్యింది.
అనిఖా తండ్రిగా శరత్ కుమార్ తనదైన రోల్‌లో మెప్పించాడు. ప్రభు మరో ఫ్రెండ్ రవి పాత్రలో వెంకటేష్ మీనన్ నవ్వించాడు. ఆయన ప్రియురాలు శ్రేయా పాత్రలో రబీనా ఖాటూన్ ఆకట్టుకుంది. ఇక ప్రభు పేరెంట్స్ గా ఆడుకాలం నరేన్, శరణ్య లు కూడా అదరగొట్టారు. మిగిలిన పాత్రదారులు ఓకే అనిపించారు.
టెక్నీకల్‌గాః
సినిమా టెక్నీకల్‌గా చాలా బ్రిలియంట్‌గా ఉంది. లియోన్ బ్రిట్టో కెమెరా వర్క్ అదిరిపోయింది. ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్‌లా ఉంటుంది. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. బిజీఎం ఇంకా బాగుంది. సినిమాకి పెద్ద అసెట్ తెలుగు అనువాదం, తెలుగు డైలాగులు. చాలా సహజంగా ఉంది. తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది.
గతంలో వచ్చిన `ప్రేమలు`, `మంజుమేల్ బాయ్స్` కూడా ఇలానే వచ్చాయి. హిట్ అందుకున్నాయి. ఈ మూవీ విషయంలో కూడా అదే కేర్ తీసుకున్నారు, అంతేబాగా తెలుగు డైలాగులు రాశారు. అవి ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఇక మైనస్ ఏదైనా ఉందంటే అది టైటిలే, ఈజీగా కనెక్ట్ అయ్యేలా లేదు. దర్శకుడు ధనుష్ యూత్‌ని, సీటీ కల్చర్‌ని టార్గెట్ చేస్తూ చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పొచ్చు.
కల్చర్ ఏదైనా దాన్ని ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా, రొమాంటిక్‌గా తెరకెక్కించిన తీరుబాగుంది. అదే సినిమాకి బ్యాక్ బోన్‌గా నిలిచింది. క్రేజీ సీన్లు, క్రేజీ పనులు, హిలేరియస్ కామెడీ సినిమాకి మెయిన్ అసెట్. అయితే అన్ని రకాల ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేసి ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది.
ఫైనల్‌గాః క్రేజీ హిలేరియస్ ట్రెండీ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్.
రేటింగ్‌ః 3