Itlu Arjuna Movie Review: ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. కొత్త కుర్రాడు అనీష్‌ హీరోగా సక్సెస్‌ అయ్యాడా?

Published : Nov 13, 2026, 08:04 AM IST

Itlu Arjuna Movie Review: ఈ వారం విడుదలతున్న చిత్రాల్లో `ఇట్లు అర్జున` ప్రామిసింగ్‌ మూవీ. బిగ్‌ స్టార్స్ సపోర్ట్ చేసిన ఈ చిత్రం నేడు విడుదలైంది. ఆ రేంజ్‌ లో ఉందా? కొత్త కుర్రాడు సక్సెస్‌ అయ్యాడా? అనేది చూస్తే,

PREV
17
ఇట్లు అర్జున మూవీ రివ్యూ

కొత్త హీరోలతో సినిమాలు చేయడం, కొత్త కథలను ప్రేక్షకులకు పరిచయం చేయడం టాలీవుడ్‌లో ఎప్పుడూ జరుగుతున్నదే. అలాంటి ప్రయత్నంతో వచ్చిన సినిమానే 'ఇట్లు అర్జున'. సాయి అనీష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. 'ఛలో', 'భీష్మ' వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మించడం విశేషం. మహేష్‌ ఉప్పల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి నాగార్జున సమర్పకులుగా వ్యవహరించడం విశేషం. ఆయనతోపాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇది నేడు శుక్రవారం(నవంబర్‌ 13న) విడుదలైంది. మరి ఈ సినిమా అంచనాలను ఎంతవరకు అందుకుంది? కొత్త కుర్రాడు ఆకట్టుకున్నాడా? మూవీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
ఇట్లు అర్జున మూవీ కథ

అర్జున్ (సాయి అనీష్) పుట్టుకతోనే మాటలు రాని కుర్రాడు. తండ్రితో కలిసి చిన్నతనం నుంచి దొంగతనాలు చేస్తుంటాడు. చివరి దొంగతనం అనుకున్న సమయంలో పోలీసులకు దొరికిపోతాడు. ఆ సమయంలోనే తండ్రిని కోల్పోతాడు. మాటలు రాకపోయినా తన భావాలను వ్యక్తపరిచే వ్యక్తిత్వం అతనిది. ఈ క్రమంలో తన చిన్ననాటి ప్రేమికురాలు కీర్తి (అనస్వర రాజన్) జీవితంలోకి వస్తుంది. ఆమెను ప్రేమించే అర్జున్ తన మనసులోని మాటను ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటాడు.

మరోవైపు హైదరాబాద్ పాతబస్తీలో పెద్దన్న (ముఖేష్ రిషి) తన చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంటాడు. తన కుమారుడి రాజకీయ ప్రవేశం కోసం వెయ్యి కోట్ల రూపాయలను హవాలా మార్గంలో తెప్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో తాను ప్రాణాలు కోల్పోతాడు. అయితే ఈ డబ్బుకు సంబంధించిన పెన్‌డ్రైవ్, పాస్‌వర్డ్ అర్జున్‌కి ముడిపడి ఉంటుంది. దీంతో ప్రేమకథ కాస్తా యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా మారుతుంది. ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి అర్జున్, కీర్తి ఎలా బయటపడ్డారు? తన ప్రేమను అర్జున్ ఎలా వ్యక్తపరిచాడు? అనేదే మిగతా కథ.

37
ఇట్లు అర్జున మూవీ విశ్లేషణ

ఇటీవల కాలంలో హీరోకి ఒక లోపం ఉండటం ట్రెండ్‌గా మారింది. `రంగస్థలం` నుంచి ఈ ట్రెండ్‌ ఊపందుకుంటోంది. అయితే వాటిలో కొన్ని మాత్రమే ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా `ఇట్లు అర్జున` మూవీలో హీరోకి మాటలు(మూగ) రాకపోవడం గమనార్హం. ఈ విషయంలో దర్శకుడు మహేష్ ఉప్పల ఎంచుకున్న ప్రధాన పాయింట్ ఆసక్తికరంగా ఉంది. హీరోకు మాటలు రాకపోవడం, అయినప్పటికీ ప్రేమను వ్యక్తపరచాలనే తపనను కథలో మెయిన్‌ ఎమోషన్‌గా మూవీని నడిపించడం విశేషం. ముఖ్యంగా అర్జున్, కీర్తి మధ్య సాగే సన్నివేశాలు యూత్‌ను ఆకట్టుకునేలా ఉంటాయి. లవ్‌ ట్రాక్‌ కొత్తగా ఉంది. అలరించేలా ఉంది.

ఫస్టాఫ్‌లో ఎక్కువగా హీరోహీరోయిన్ల ప్రేమకథపైనే దృష్టి పెట్టారు. మధ్య మధ్యలో వెయ్యి కోట్ల హవాలా వ్యవహారం, పెన్‌డ్రైవ్, పాస్‌వర్డ్ అంశాలను జోడిస్తూ కథలో ఆసక్తిని పెంచారు. ఇటు లవ్‌ ట్రాక్‌, అటు ఆ వెయ్యి కోట్ల వెనుక ఉన్న క్రైమ్‌ ఇలా రెండూ ప్యారలల్‌గా నడుస్తుంటాయి. అయితే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తాయి. ప్రేమకథకు మరింత బలమైన సన్నివేశాలు జోడించి ఉంటే మొదటి భాగం ఇంకాస్త మెరుగ్గా ఉండేది. సినిమాలో కామెడీ ఆశిస్తారు. కానీ ఎక్కడా కామెడీ వర్కౌట్ కాలేదు.

సెకండాఫ్‌లో కథనం వేగం పుంజుకుంటుంది. హవాలా డబ్బు చుట్టూ తిరిగే పరిణామాలు, మాఫియా గ్యాంగ్‌తో హీరో ఎదుర్కొనే పరిస్థితులు ఉత్కంఠను పెంచుతాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి జాతర నేపథ్యంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే మీద పెట్టిన శ్రద్ధ కథలోని లాజిక్‌పై కూడా పెట్టి ఉంటే బాగుండేది. క్లైమాక్స్‌లో ప్రేమకథకు ఇచ్చిన ముగింపు బాగున్నప్పటికీ, ఎండింగ్‌లో కొన్ని అంశాలకు మరింత స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేది.

47
సినిమాలో ప్లస్‌, మైనస్‌లు

సినిమాలో ప్లస్‌, మైనస్‌లు చూస్తే, కథా నేపథ్యం బాగుంది. యాక్షన్‌ సీన్లు బాగున్నాయి. అలాగే హీరో డాన్సులు బాగున్నాయి. కొత్త కుర్రాడు అయినా అదరగొట్టాడు. నటన పరంగానూ మెప్పించాడు. ఎక్స్ ప్రెషన్స్ పరంగా బాగా వర్కౌట్‌ చేయాలి. హీరోయిన్‌ బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి. బీజీఎం కొన్ని చోట్ల ఆకట్టుకుంటుంది. ఇక మైనస్‌ల విషయానికి వస్తే, ఓ దశ తర్వాత రొటీన్‌ స్టోరీగా మారుతుంది. డ్రామా రొటీన్‌గా ఉంటుంది. అదే సమయంలో సాగదీసినట్టుగా ఉంటుంది. కామెడీ ఏమాత్రం వర్కౌట్‌ కాలేదు. ఆ లోటు కనిపిస్తుంది. చాలా సీన్లు, ఎలిమెంట్లు లాజిక్ లెస్‌గా ఉంటాయి. అసహజంగా ఉంటాయి. థమన్‌ ఓజీ, సాహో వంటి చిత్రాల బీజీఎం దించేశాడు. ఎడిటింగ్‌ పరంగా ఇంకా వర్క్ చేయాలి. కొన్ని సీన్లు లెంన్తీగా ఉంటాయి. ట్విస్ట్ లు పెద్దగా వర్కౌట్‌ కాలేదు.

57
ఇట్లు అర్జునలో నటీనటులు ఎలా చేశారంటే

హీరో సాయి అనీష్ కొత్త వాడైనా బాగా చేశాడు. డాన్సుల్లో ఇరగదీశాడు. నటనపరంగానూ మెప్పించాడు. చాలా హోంవర్క్ చేశాడు, కష్టపడ్డాడని చెప్పొచ్చు. మాటలు రాని యువకుడి పాత్రలో తన హావభావాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో మెప్పించాడు. మరీ ఇమేజ్‌, ఎలివేషన్లకి పోకుండా డీసెంట్‌గా, రియాలిటీకి దగ్గరగా చేసే ప్రయత్నం చేశాడు. తొలి సినిమాతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అనస్వర రాజన్ కీర్తి పాత్రలో అందంగా కనిపించడంతో పాటు తన నటనతోనూ మెప్పించింది. వెన్నెల కిషోర్ తన కామెడీ వర్కౌట్‌ కాలేదు. బ్రహ్మాజీ, రఘుబాబు, గెటప్ శ్రీను తమ పాత్రల పరిధిలో వినోదాన్ని పంచారు. ముఖేష్ రిషి విలన్‌గా కనిపించినప్పటికీ ఆయన పాత్రను మరింత బలంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. మిగిలిన నటీనటులు ఓకే అనిపించారు.

67
ఇట్లు అర్జున టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సినిమా టెక్నీకల్‌గా బాగానే ఉంది. తమన్ అందించిన పాటలు ఓకే అనిపించాయి. నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు బలాన్ని ఇచ్చింది. బీజీఎం ఇతర సినిమాల నుంచి కాపీ కొట్టడం గమనార్హం. రాజా మహాదేవన్ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్, లొకేషన్ల చిత్రీకరణ బాగున్నాయి. విజువల్స్ సినిమాకి మరో ఆకర్షణ.

కోటి కె. ఎడిటింగ్ కథనాన్ని సాధ్యమైనంత వేగంగా నడిపించే ప్రయత్నం చేసింది. రామ్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్, నిర్మాణ విలువలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. వెంకీ కుడుముల నిర్మాతగా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించిన విధానం అభినందనీయం. ఆ గ్రాండియర్‌ తెరపై కనిపిస్తుంది.

77
ఫైనల్‌గా

'ఇట్లు అర్జున' ఒక కొత్త హీరోను పరిచయం చేస్తూ ప్రేమ, యాక్షన్, క్రైమ్ అంశాలను కలిపిన ఎంటర్‌టైనర్. కొత్త హీరోల ప్రయత్నాలను ప్రోత్సహించే ప్రేక్షకులకు, యాక్షన్‌తో కూడిన ప్రేమకథలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఒకసారి చూడగలిగే మూవీ అవుతుంది.

రేటింగ్‌: 3

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories