
యంగ్ హీరో మౌళి ఒక్కో మూవీతో తానేంటో నిరూపించుకుంటున్నాడు. హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. `90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్`, `లిటిల్ హార్ట్స్` తో ఆకట్టుకున్నాడు. `లిటిల్ హార్ట్స్`తో థియేట్రికల్‌గా పెద్ద హిట్‌ని అందుకున్నాడు. ఈ క్రమంలో అతని నుంచి వచ్చే సినిమాలపై ఆసక్తి, అంచనాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగా ఆయన ఇప్పుడు `దొంగ నా కొడుకు` అనే వెరైటీ టైటిల్‌తో వస్తున్నాడు.
ఇందులో సుష్మిత శెట్టి హీరోయిన్గా నటించింది. అలీ, రజిత, రఘుబాబు, భద్రం, గుండు సుదర్శన్, ప్రియా కీలక పాత్రలు పోషించారు. శ్రీను కంబాల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా, అనిల్ యెర్నేని సహ నిర్మాతగా వ్యవహరించారు.
సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ, సింజిత్ యెర్రమిల్లి సంగీతం, శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(నవంబర్ 13)న విడుదలైంది. మరి సినిమా ఆకట్టుకుందా? మౌళి నవ్వించాడా? హాట్రిక్ హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
ఈశ్వర్ (మౌళి) బీటెక్ మధ్యలోనే ఆపేసి జీవితంలో పెద్దగా బాధ్యతలు లేకుండా తిరుగుతూ, డబ్బు సంపాదించాలనే ఆశతో ఉంటాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ముఖ్యంగా ఇంట్లోనే కన్నెం పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. అతడికి డబ్బు మీద వ్యామోహం ఒకవైపు అయితే మరోవైపు తల్లిదండ్రులతో గొడవలు, స్నేహితుడితో సరదాలు, ప్రేయసితో ప్రేమ వ్యవహారాలు మరోవైపు నడుస్తుంటాయి. చేసేవన్నీ ఎదవ పనులే.
ఈ క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన ఈశ్వర్ డబ్బులు పోగొట్టుకుంటాడు. లోన్ యాప్స్ ద్వారా అప్పులు చేయడంతో పాటు ప్రేయసి దగ్గర కూడా డబ్బులు తీసుకుంటాడు. ఈ వ్యవహారం ఆమె తండ్రికి తెలియడంతో సమస్యలు మొదలవుతాయి. అప్పులు తీర్చడానికి స్నేహితుడితో కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంటాడు. ధనవంతుల ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు ప్లాన్ చేస్తారు.
అయితే ఓ జ్యూవెల్లరీ దొంగతనంతో కథ మొత్తం మారిపోతుంది. అది ఈశ్వర్ కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టింది? తాను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు? జ్యూవెల్లరీ షాప్ దొంగతనం వెనుక ఉన్న కథేంటి? ఇందులో గుండు సుదర్శన్, రఘుబాబు, ప్రియా, భద్రంల పాత్రలు ఏంటి? చివరికి ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనేది సినిమా.
కామెడీని ప్రధానంగా చేసుకొని చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ అందులో ఆకట్టుకునేవి, నిజంగా నవ్వించే సినిమాలు చాలా తక్కువ. అవి 10-20శాతం మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. కామెడీ పేరుతో ఓవరాక్షన్ చేయడం, సినిమాని లౌడ్‌గా, గోల గోలగా మార్చేస్తున్నారు. చివరికి అది కామెడీ కాదు కిచిడి అవుతుంది. సరిగ్గా `దొంగ నా కొడుకు` సినిమాకి అదే జరిగింది. కామెడీ తక్కువ గోల ఎక్కువ అనేలా మారింది.
సినిమాలో కథ లేదు. డైలాగ్ కామెడీ, సిచ్చువేషన్ కామెడీని నమ్ముకొని రూపొందించిన చిత్రమిది. జ్యూవెల్లరీ షాప్‌లో రాబరీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ దొంగతనం చేసిందెవరనేది అసలు కథ. అది హీరో చుట్టూ తిరుగుతుంది. అందులో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంది. చాలా ట్విస్ట్ లు పెట్టడంతో కథనం కన్ఫ్యూజన్ గా మారింది. అదే సమయంలో ఒక్క ట్విస్ట్ కూడా వాహ్ అనిపించలేదు. డబ్బుల కోసం హీరో పడే బాధలు, అతను చేసే దొంగ చేష్టలు కొంత వరకు నవ్విస్తాయి.
లవ్ ట్రాక్ కొంత వరకు మెప్పిస్తుంది. డైలాగ్ కామెడీ అక్కడక్కడ బాగుంది. కానీ సందర్భానుసారంగా క్రియేట్ చేసే కామెడీ, కన్ఫ్యూజన్, ఇన్నోసెంట్ తో చేసే కామెడీ సీన్లు మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు. నవ్వించలేదు కదా, ఇరిటేషన్ తెప్పిస్తాయి.
సినిమాలో ఫస్టాఫ్ కొంత వరకు బెటర్. అక్కడక్కడ కామెడీ సీన్లు బాగానే అనిపిస్తాయి. నవ్విస్తాయి. డబ్బుల కోసం ఆయనపడే పాట్లు, లోన్ యాప్‌ల వాళ్లు ఫోన్లు చేయడం, అందులో వాళ్ల పేరెంట్స్ ని ఇరికించడం వంటి సీన్లు ఫన్నీగా ఉంటాయి. ప్రారంభంలో కామెడీ బాగానే అనిపిస్తుంది. కానీ అదే పదే పదే రిపీట్ అవుతుంటాయి. అలాంటి సీన్లే కంటిన్యూ అవుతుండటంతో కామెడీ కాస్త ఇరిటేషన్‌గా మారుతుంది.
హీరోయిన్‌తో లవ్ లో పడే సీన్లు, ఆమె రింగులను కొట్టే సీన్లు ఆకట్టుకుంటాయి. ఫన్నీగా ఉంటాయి. ఈ క్రమంలో వచ్చే డైలాగ్ కామెడీ బాగానే ఉంటుంది. కానీ తర్వాత మాత్రం కామెడీ కోసం చేసిన ప్రతి సీన్లు, యాక్షన్ మిస్ ఫైర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇరికించిన కామెడీగా ఉంటుంది. అదే సినిమాకి పెద్ద మైనస్.
ఇక జ్యూవెల్లరీ రాబరీ, అందులో తానే దొంగ అనుకోవడం, పోలీసుల విచారణ, గుండు హనుమంతారావు ఎంట్రీ సీన్లు, ఈ క్రమంలో డ్రామా ఏమాత్రం ఆకట్టుకోలేదు. బోరింగ్‌గా అనిపిస్తుంది. గోల గోలగా ఉంటుంది. ఇక సెకండాఫ్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. క్లైమాక్స్ లో వరుస ట్విస్ట్ లు చిరాకు, కన్ఫ్యూజన్ తెప్పిస్తాయి. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కామెడీ కోసం చేసిన ప్రతి ప్రయత్నం విఫలమయ్యింది.
అదే సమయంలో రైటింగ్ చాలా వీక్. ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. కొన్ని పాత్రలను బలవంతంగా పెట్టిన ఫీలింగ్ ఉంటుంది. ఏం చేసినా నవ్వుతారనే ధైర్యంతో సినిమా తీశారా అనిపిస్తుంది. కామెడీ, ట్విస్ట్ లను సరిగ్గా బ్లెండ్ చేస్తే సినిమా అదిరిపోయేది. కానీ ఇప్పుడు మిస్ ఫైర్ అయ్యిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
మౌళి నటుడిగా మెప్పించాడు. కామెడీతో కొంత వరకు నవ్వించాడు. ఈశ్వర్ పాత్రలో యువతకు కనెక్ట్ అయ్యే బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో కనిపించాడు. లవర్‌తో సీన్లు, దొంగతనం సీన్లు, ఫ్రెండ్ తో వచ్చే సీన్లలో అదరగొట్టాడు. కానీ తన మార్క్ కామెడీని పంచడంలో విఫలమయ్యాడు.
సుష్మిత శెట్టి అమాయకమైన ప్రేయసి పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలీ, రజిత తల్లిదండ్రులుగా కనిపి మెప్పించారు. అలీ పాత్ర అక్కడక్కడ నవ్విస్తుంది. రఘుబాబు, గుండు సుదర్శన్, ప్రియా, భద్రం ఉన్నంతలో మెప్పించారు. మిగిలిన వాళ్లు ఓకే అనిపించారు. హీరో ఫ్రెండ్‌గా చేసిన కుర్రాడు ఇరగదీశాడు. అతనికి మంచి ఫ్యూచర్ ఉంది.
సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి విజువల్ ఫీల్ తీసుకొచ్చింది. ఫ్రేమ్స్ కలర్ఫుల్గా బాగున్నాయి. సింజిత్ యెర్రమిల్లి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం వినోదాత్మక సన్నివేశాలకు సపోర్ట్ గా ఉంటుంది. మ్యూజిక్, ఆర్ఆర్ బాగుంది. శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ ఇంకా బాగా చేయాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు మరో ఆకర్షణ.
దర్శకుడు శ్రీను కంబాల ఈ మూవీని కామెడీ ఎంటర్టైనర్గా ప్లాన్ చేశారు. కానీ కథ లేకపోవడంతో కథనం ఆసక్తికరంగా సాగలేదు. అంతే కాదు, ఇలాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. అదే బలం, కానీ ఇందులో అదే పెద్ద మైనస్. కొన్ని కామెడీ సీన్లని బాగా రాసుకున్నారు. లౌడ్ కామెడీకి, సిచ్చువేషన్ కామెడీ కోసం చేసిన ప్రయత్నం ఓవర్‌డోస్ అయ్యింది. ఓవర్ బోర్డ్ గా మారింది. చివరికి గోల గోల గా మారింది.
దొంగ నా కొడుకు మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. కొన్ని డైలాగ్ కామెడీ సీన్లు తప్ప, మూవీలో ఏం లేదు. కామెడీ కోసం చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. చివరికి కామెడీ కాదు కిచిడి అనే పరిస్థితి నెలకొంది. అంతిమంగా దొంగ నా కొడుకు నవ్వించడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు.
రేటింగ్ : 2