వెండితెరపై రాజకీయ సినిమాలు సందడి చేస్తున్నారు. ఒకప్పుడు బయోపిక్‌లు వచ్చేవి. ఇప్పుడు రాజకీయ సంఘటనలతో సినిమాలు సందడి చేస్తున్నాయి. మొన్న `యాత్ర2` థియేటర్లోకి వచ్చింది. ఇది పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఇప్పుడు `రాజధాని ఫైల్స్` అంటూ మరో సినిమా వచ్చింది. అమరావతి రైతుల పోరాటం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. దర్శకుడు భాను అన్నీ తానై ఈ మూవీని రూపొందించారు. వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు గురువారం(ఫిబ్రవరి 15)న విడుదలైంది. రియలిస్టిక్ సంఘటనతో రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్ ని అలరించేలా ఉందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
అరుణప్రదేశ్(ఆంధ్రప్రదేశ్)లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. స్టేట్‌లో రాజధానిని ఐరావతి(అమరావతి)గా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాజధాని నిర్మాణం కోసం భూములు కావాల్సి ఉంటుంది. అధికారులు ఊరూర తిరిగి భూములను సేకరిస్తుంది. వారి రైతు నాయకుడు(వినోద్ కుమార్) రాజధాని గొప్పదనం, ప్రత్యేకత, తమకు వచ్చే ఉద్యోగ అవకాశాలు, జరిగే అభివృద్ధిని వివరించడంతో భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరిస్తారు. దాదాపు ముప్పై ఊళ్ల ప్రజలు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారు. చకచకా రాజధాని నిర్మాణ పనులు జరుగుతాయి. కట్ చేస్తే నెక్ట్స్ ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కొత్త సీఎం(విశాల్ పట్నీ) నాలుగు రాజధానుల పేర్లని తెరపైకి తీసుకొస్తాడు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఆయన నాలుగు రాజధానుల పేర్లని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. గత ప్రభుత్వ నాయకులు భూములు, వారి కులం వాళ్ల భూములు అరుణావతిలో ఉన్నాయని, వాళ్లు స్థాపించిన రాజధానిని మనం పూర్తి చేయడమేంటీ? అని పీకే సలహాల మేరకు సీఎం ఈ నాలుగు ప్రభుత్వాలను తెరపైకి తీసుకొస్తాడు. దీంతో రాజధాని పనులు ఆగిపోతాయి. రైతులు రోడ్డున పడతారు. దీంతో అరుణావతినే రాజధానిగా చేయాలని రైతు నాయకుడి సమక్షంలో నిరసన తెలియజేస్తుంటారు. వారి నిరసనను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. అంతా పీకే సమక్షంలోనే సీఎం నిర్ణయాలు తీసుకుంటాడు. సీఎం అనుచరులు అరాచకాలకు పాల్పడుతుంటారు. వారి అరాచకాలు చూసి రైతు నాయకుడు కొడుకు గౌతమ్ కూడా జనంతో కలుస్తాడు. తమ నిరసనలను జనాలకు తెలియకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్న నేపథ్యంలో తన టెక్నాలజీని ఉపయోగించి జనాలకు తమ బాధని, పోరాటాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాడు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా రియాక్షన్ సీరియస్‌గా ఉంటాయి. రైతులను ఇబ్బందులు హింసకి గురి చేస్తూనే ఉంటారు. మరి దాన్ని గౌతమ్, రైతు నాయకుడు, రైతులు కలిసి ఎలా ఎదుర్కొన్నారు, ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఏం చేశారు? పీకేతో కలిసి సీఎం వేసిన ఎత్తుగడలేంటి? చివరికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి? రాజధాని విషయంలో దర్శకుడు ఇచ్చిన పరిష్కారం ఏంటి అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
సినిమాలో పేర్లు మార్చినా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి, రాజధాని అంశంపై తీసిన సినిమా అని అర్థమవుతుంది. అమరావతి రాజధానిని కాదని నాలుగు రాజధానులను వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుని, తదనాంతరం చోటు చేసుకున్న పరిణామాలు, రాజధాని రైతుల పోరాటం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు భాను. ఉమ్మది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత 13 జిల్లాలతో కొత్త ఆంధ్రప్రదేశ్ అవతరించింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం నిర్ణయం మేరకు రైతులు రాజధాని నిర్మాణం కోసం, తమ బతుకులు బాగుపడతాయి, రాజధాని ప్రపంచం మెచ్చేలా కడతారని ఎన్నో ఆశలతో భూములు ఇస్తారు రైతులు. నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఐదేళ్లు గడవడం కొత్త ప్రభుత్వం రావడంతో అన్ని పనులు ఆగిపోతాయి. నాలుగు రాజధానుల అనే కొత్త బిల్లుని కొత్త ప్రభుత్వం తెరపైకి తీసుకురావడంతో రాజధాని రైతులు రోడ్డుమీదకు వచ్చి చేసే పోరాటం, దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన కుట్రలను, జనాలను ఇబ్బంది పెట్టడం వంటి సన్నివేశాలను ఇందులో చూపించారు దర్శకుడు.
రాజధాని అంశం ప్రధానంగానే ఈ మూవీ సాగుతుంది. కొత్త సీఎం, ఆయన సలహాదారు పీకే సారధ్యంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజలను ఎలాంటి ఇబ్బందులు పెట్టాయనేది ఇందులో చూపించారు. ఉమ్మడిగా రైతులు ఆత్మహత్యలను, పోలీసులు చేసే అరాచకాలను కూడా ఇందులో టచ్ చేశాడు. కొద్దిపాటు పేర్ల మార్పుతో దాదాపు అందరికి అర్థమయ్యే పాత్రలనే పెట్టారు. అదే సమయంలో ప్రభుత్వం అనేక అరాచకాలు చేసినట్టుగా చూపించారు. ఈ ప్రభుత్వానికి బుద్ది ఎలా చెప్పాలనేది, రాజధాని నిర్మాణం ఎలా చేయాలనేది సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ ఈ రియల్ ఇన్సిడెంట్స్ ని సినిమాగా మలచడంలో ఆయన సక్సెస్ కాలేకపోయాడు. సినిమాలో మెయిన్‌గా సోల్ లేదు. కేవలం సన్నివేశాలు మాత్రమే ఉన్నాయి. ఎమోషన్స్ పండలేదు. మెయిన్‌గా ఎమోషన్స్ ని క్యారీ చేయడంలో విఫలమయ్యాడు. సినిమా ప్రారంభం నుంచి కేవలం సన్నివేశాలుగానే కనిపిస్తుంది. కానీ వాటిలో ఏమాత్రం సహజత్వం లేదు. అదే సమయంలో రియల్‌గా జరిగిన సన్నివేశాలను రీల్‌లో అంతే ఎఫెక్టీవ్‌గా చూపించలేకపోయాడు, అలాగని ఫిక్షన్‌గానూ చూపించలేకపోయాడు. రెండింటిని మిక్స్ చేయడంతో అసహజంగా మారిపోయింది. కొన్ని పాత్రలు అర్థం కావు. మేకింగ్ పరంగా చాలా వీక్‌గా ఉంది ఈ మూవీ. చాలా లాజిక్స్ ని వదిలేశాడు. చిన్న చిన్న లాజిక్స్ విషయంలోనూ కేర్ తీసుకోలేకపోయారు.
సినిమాలో సీఎంని విలన్‌గా కాకుండా పీకేని విలన్‌ని చేశాడు. పీకే ఆడించిన బొమ్మగా సీఎంని చూపించాడు. పీకే అన్ని ప్లాన్ చేస్తుంటే సీఎం పబ్జీ ఆడుకుంటూ కూర్చునే సీన్లు, ఐటెమ్ సాంగ్‌లో ఓ ఎమ్మెల్యే హవాభావాలు, అలాగే అసెంబ్లీలో అతని కామెంట్స్ కొంత వాహ్ అనేలా ఉంటాయి. కానీ మిగిలిన ఏ సీన్ తెరపై పండలేదు. సినిమాగా చేసినప్పుడు సన్నివేశాలు పండాలి, ఎమోషన్స్ క్యారీ అవ్వాలి. సినిమాతో ఆడియెన్స్ ట్రావెల్ కావాలి. కానీ ఇందులో డిస్ కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. రైతుల సమస్య విషయంలో ఆ సమస్యలను ఫేస్ చేసిన వాళ్లు, వాటికి ఫాలో అయినవాళ్లకి, దాన్ని సపోర్ట్ చేసే వారికి సినిమా నచ్చే అవకాశం ఉంది. కానీ సాధారణ ఆడియెన్స్ కి మాత్రం ఇది కనెక్ట్ కావడం కష్టం.
నటీనటులు, టెక్నీషియన్లు..
రైతు నాయకుడిగా వినోద్ కుమార్ ఒదిగిపోయాడు. చాలా రోజులు తర్వాత ఆయన తెరపై మెప్పించాడు. ఆయన భార్యగా రైతు నాయకురాలిగా వాణి విశ్వనాథ్ మెప్పించింది. పాత్రని పండించింది. ఇక వారి కొడుకుగా గౌతమ్ పాత్రలో అఖిలన్ పుష్పరాజ్ బాగా చేశాడు. చాలా సహజంగా చేశాడు. ఆయన పాత్ర బాగా హైలైట్ అవుతుంది. ఇక ఐశ్వర్యగా వీణ నటించి మెప్పించింది. సీఎంగా విశాల్ పట్నీ అదరగొట్టాడు. ఇతర పాత్రల్లో అజయ్ రత్నం, అమృత చౌదరి, షణ్ముఖ్, మధు, పవన్ ఇతర పాత్రల్లో మెప్పించారు. కెమెరా వర్క్, ఎడిటింగ్ గొప్పగా లేవు. మ్యూజిక్ జస్ట్ ఓకే. బీజీఎం కూడా రొటీన్‌గానే ఉంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఓకే. చెప్పాలనుకున్న విషయం ఓకే, కానీ దాన్ని సినిమాగా మలచడంలో మెప్పించలేకపోయాడు.
ఫైనల్‌గాః `రాజధాని ఫైల్స్` అమరావతి రాజధానిని సపోర్ట్ చేసే వారికే.
రేటింగ్‌ః 2