అంజలి 'గీతాంజలి మళ్లీ వచ్చింది' రివ్యూ

First Published | Apr 11, 2024, 1:10 PM IST

ఈ జానర్లో వచ్చిన సినిమాలు నచ్చితే ఆడియెన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. అలాగే బడ్జెట్ కూడా ఎక్కువ కాకపోవడంతో సినిమాలు యావరేజ్ గా నిలిచినా ...

Geethanjali Malli Vachindi Review

హారర్ కామెడీ అంటే చిన్న బడ్జెట్ లోనే సినిమాలు తీస్తూ హిట్ కొట్టేసే అవకాసం అని గత పదేళ్లుగా మన దర్శక,నిర్మాతలు నమ్మి ఆ తరహా సినిమాలు తీస్తున్నారు.   హారర్ కామెడీ.. ఉంటే కొద్దిగా హారర్ ఉండాలి.. మరికొంత  కామెడీ ఉండాలి..  ఈ రెండిటిని సరిగ్గా సరైన పాళ్లలో కలిపి  మిక్స్ చేసి సినిమాలు చేసి హిట్ కొడుతున్నారు. అయితే హారర్ కామెడీ జానర్ లో వచ్చి హిట్ అయిన సినిమాలు వేళ్ల మీద లెక్క కట్టచ్చు. ఈ జానర్ లో వచ్చిన చాలా  సినిమాల థియేటర్స్  మొదటి రోజు మార్నింగ్ షో కే జనావాసం లేని  దెయ్యాల కొంపల్లా మారిపోతున్నాయి. జనాలు వాటిని చూసి భయపడి దూరంగా ఉంటున్నారు. అయితే ప్రతీ సారి అలా జరుగుతుందని కాదు..చాలా సార్లు అలాగే జరుగుతోంది. కానీ సినిమాలు చేసే వాళ్లు ఆగటం లేదు. చూసేవాళ్లు హిట్ టాక్ వస్తే థియేటర్ కు వెళ్లాం లేకపోతే ఓటిటిలో చూసుకుందాం లే అని ఫిక్సైపోతున్నారు. ఆ క్రమంలో వచ్చిన ఈ సినిమా ఓ సీక్వెల్ కూడా కావటం విశేషం. ఇంతకీ హిట్ హారర్ కామెడీకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది...వర్కవుట్ అవుతుందా..జనం నవ్వుతున్నారా వంటి విషయాల్లోకి వెళితే...
 

స్టోరీ లైన్.. 

డైరక్టర్ శ్రీను (శ్రీనివాస్ రెడ్డి), రైటర్స్ ఆరుద్ర (షకలక శంకర్), ఆత్రేయ (సత్యం రాజేష్)లు కృష్ణానగర్ బ్యాచ్ . సినిమా ఛాన్స్  లు కోసం ఎక్కే ఆఫీస్, దిగే ఆఫస్ అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే తన  సినిమా 'గీతాంజలి' సక్సెస్  తర్వాత దర్శకుడు శ్రీను (శ్రీనివాస రెడ్డి) వరుసగా మూడు ఫ్లాపులు ఇస్తాడు. దాంతో అతనితో సినిమా చేయడానికి ఎవరూ ధైర్యం చేయరు.  ఇక మరో ప్రక్క అయాన్ (సత్య) హీరో అవుతానని పగటి కలలు కంటూంటాడు. దాంతో అతన్ని తమ ఆదాయ వనరుగా పెట్టుకుని  ఫ్రెండ్స్ అయిన శ్రీను, ఆరుద్ర, ఆత్రేయలు నాకేస్తూంటారు.  'దిల్' రాజు సినిమా చేయడానికి ఓకే చేసాడని, నువ్వే హీరో అని చెప్పి లక్షలకు లక్షలు లాగేస్తారు. అయితే ఓ రోజు మోసం బయిటపడిపోతుంది. ఇంక మన వల్ల కాదు...దేకలేం ఇంటికి వెళ్లిపోదాం అనుకున్న టైమ్ లో  ఊటీలోని విష్ణు రిసార్ట్స్ ఓనర్ విష్ణు (రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా (శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి ఫోన్ వస్తుంది. శ్రీనుకు డైరక్షన్ ఛాన్స్ ఇస్తానంటాడు. 

Latest Videos


Geethanjali Malli Vachindi

తను సినిమా తీస్తానని అయితే అదే ఊర్లో ఉన్న సంగీత్ మహల్‌లో షూట్ చేయాలని  చెప్తాడు. అంతేకాకుండా తనే ఓ  కథను కూడా అందిస్తాడు. అలాగే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కాలంటే  అక్కడే కాఫీ హోటల్‌ను నడుపుతున్న అంజలి (అంజలి)ని తన సినిమాలో  హీరోయిన్‌గా ఒప్పిస్తేనే సినిమా తీస్తానని అంటాడు.  అప్పుడు అసలే కరువు మీద ఉన్న  శ్రీను రంగంలోకి దిగి ఆ మాట ఈ మాట చెప్పి అంజలిని ఒప్పిస్తాడు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంటుంది. సంగీత్ మహల్‌లో శాస్త్రి (రవిశంకర్), ఆయన భార్య (ప్రియా) ఆత్మలు ప్రతి ఆగస్టు 8కి ప్రేమికుల మీద పగ తీర్చుకుంటాయని ఆ ఊరి జనం  నమ్మకం. అప్పుడు ఏమైంది..శ్రీనుకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది... ఆ  సంగీత్ మహల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంజలికి ఆ మహల్ కు లింకేంటి..   దెయ్యాలు శ్రీను అండ్ టీమ్ ని ఎలా ఆడుకున్నాయి? ప్రొడ్యూసర్  విష్ణు ఎవరు?  గీతాంజలి ఆత్మ మళ్లీ తిరిగి ఎందుకు రావాల్సి వచ్చింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Geethanjali Malli Vachindi

ఎనాలసిస్ ...

 మొదటి సారి 'గీతాంజలి' మళ్లీ వచ్చింది..అనగానే ఒక్కసారిగా మణిరత్నం గీతాంజలి మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారేమో అనిపించింది. అయితే ఇది రీరిలీజ్  ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ వచ్చిన సినిమా కాదు... సీక్వెల్ ట్రెండ్ ని పట్టుకుని వచ్చింది ...చిన్న సినిమాలకు, అదీ హీరోయిన్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమాలకు కూడా సీక్వెల్స్ రావటం గొప్ప విషయమే అని అర్దమై ఆనందం వేసింది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సినిమాలో కామెడీ టీంని ఉంచి.. వాళ్లతో జబర్దస్త్ స్కిట్ లు లాంటి సీన్స్ చేసి  భయపెడుతూనే నవ్విద్దామనుకున్నారు కానీ ...  ప్రేక్షకులకు కావాల్సిన మోతాదులో మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయారనే చెప్పాలి. కామెడీ సినిమాలో మినిమం ఓ ఇరవై నిముషాలైనా పడీ పడీ నవ్వుకుంటేనే అవి వర్కవుట్ అవుతాయి. లేకపోతే అవన్నీ ఓం భీమ్ బుష్ లే. 

Geethanjali Malli Vachindi

దెయ్యాలు ఉన్న భవంతిలోకి ఓ సినిమా డైరక్టర్ సినిమా తీద్దామని అడుగు పెట్టడం దాకా  ఐడియా లెవిల్లో ఈ కథ బాగుంది. అయితే ఆ ఐడియా విస్తరణలోనే ఎంగేజింగ్ గా ,ఎక్సైటింగ్ గా నేరేట్ చేయలేకపోయారు. ఈ కథ చదివితే మీకు అర్దమవుతుంది. ఇందులో అంజలి ప్రమేయం ఏమి లేదు.. సినిమా క్రూ మాత్రమే నిజమైన దెయ్యాలు వల్ల ఇబ్బంది పడతారని. దాంతో అంజలి ప్రధాన పాత్ర అనుకుని వెళ్లినవాళ్లు మొదటి డిజప్పాయింట్మెంట్. 

Geethanjali Malli Vachindi Review

 ప్లస్ లు 
అంజలి ఫెరఫార్మెన్స్
సత్య కామెడీ

మైనస్ లు 

రొటీన్ అయ్యినట్లు అనిపించే కామెడీ
డెప్త్ ,ఎమోషన్ లేకుండా సీన్ బై సీన్ వెళ్లిపోవటం
దెయ్యాలు ఎక్కడా థ్రిల్ చేయకపోవటం
ప్లాష్ బ్యాక్ వీక్ గా ఉండటం

Geethanjali Malli Vachindi Review

నటీనటులు విషయానికి వస్తే...

ఈ  రొటీన్ హారర్ కామెడీని చివరిదాకా  నిలబెట్టగలిగింది నటీనటుల ఫెరఫార్మన్సే. అంజలిపాత్రలో డెప్త్ లేకపోయినా ఆమె  సహజంగా చేసి నిండుతనం ఇచ్చింది. అయినా సినిమా మొత్తం శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, సునీల్, అలీ ఇలా అందరూ ఆక్రమించేసారు. కామెడీ కూడా సత్య చేసిందే బాగుంది. అలాగే  శ్రీనివాసరెడ్డి తనటీమ్ ని కాపాడుకోవాలని తాపత్రయపడే సన్నివేశాలు బాగున్నాయి.  దిల్ రాజు కనపడింది కొద్ది సేపే అదీ తన నిజ జీవిత పాత్రలో. 
 


టెక్నికల్ గా..

 సినిమా అద్బుతం కాదు కానీ బాగుంది. స్క్రిప్టు తప్పించి మిగతా క్రాప్ట్ లు బెస్ట్ ఇవ్వటానికే ట్రై చేసాయి. ప్రొడక్షన్ లో  పరిమితులు ఉన్నా తమ టాలెంట్ తో దాటటానికే ట్రై చేసారు. ఒక భవంతి చుట్టూ సినిమాని నడిపేయటంతో ....  కొన్ని సన్నివేశాలు రిపీట్ గా అనిపిస్తాయి. సౌండ్ డిజైనింగ్ బాగా చేసారు. కానీ పాటలు ఏమీ గుర్తుండవు. కెమెరాకు మంచి మార్కులు పడతాయి.  దర్శకుడు అనుకున్నది తెరపైకి సమర్దవంతంగా ఎక్కించాడు కానీ స్క్రిప్టు కలిసి రాలేదు. ఉన్నంతలో  ఇంకాస్త స్టోరీ ఐడియాకు ఇంకాస్త భావోద్వేగం, వాస్తవికత, తర్కం కలిపి ఉంటే  ప్రహసనం లాంటి కామెడీ సీన్స్  తగ్గించి వుంటే సినిమా ఇంకాస్త మెరుగ్గా వుండేది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండి డ్రాగ్ అవుతున్న సీన్స్ లేపేసి  ఉంటే ప్రేక్షకులు థాంక్స్ చెప్పుకునేవారు. 

ఫైనల్ థాట్...

అన్యాయానికి గురైన ఆత్మ లేదా దెయ్యం  కథ లతో వచ్చే హారర్ సినిమాలన్నీ ఒకే సెటప్,సెట్  లోనే వుంటాయి.అవి వేరేగా ఉండాలనుకోవటం మన అత్యాశ. అత్యాశ మనిషిని అత్యంత బాధకు గురి చేస్తుంది కాబట్టి ...చూసి చూడనట్లు వెళ్లిపోవటం మన ఆత్మకు, సినిమాలో ఆత్మలకు శాంతి.

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.25

click me!