Love Guru Movie Review: `లవ్‌ గురు` మూవీ రివ్యూ రేటింగ్‌..

First Published | Apr 11, 2024, 12:51 AM IST

విజయ్‌ ఆంటోని గతేడాది `బిచ్చగాడు2`తో అలరించారు. ఇప్పుడు `లవ్‌ గురు`తో వస్తున్నారు. ఈ గురువారం ఈ మూవీ రిలీజ్‌ అయ్యింది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

విజయ్ ఆంటోనీ `బిచ్చగాడు` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించారు. కానీ విజయాలు దక్కలేదు. గతేడాది  `బిచ్చగాడు 2`తో మరో హిట్‌ని అందుకున్నాడు. దీంతో తెలుగులో ఆయనకంటూ ఓ మార్కెట్‌ క్రియేట్ అయ్యింది. తన సినిమాలను తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన `లవ్‌ గురు` అనే సినిమాలో నటించారు. దీన్ని తనే స్వయంగా నిర్మించారు.మృణాళిని రవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి వినాయకన్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో `రొమియో`గా రూపొందిన ఈ మూవీని  `లవ్‌ గురు` పేరుతో మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు రిలీజ్‌ చేస్తున్నారు. ఈ గురువారం(ఏప్రిల్‌ 11న) సినిమా విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
అరవింద్‌(విజయ్‌ ఆంటోనీ) చిన్నప్పుడే ఓ టౌన్‌లో జరిగిన అల్లర్లలో తన చెల్లిని కోల్పోతాడు. ఆ ప్రమాదం తనని తరచూ వెంటాడుతుంటుంది. కట్‌ చేస్తే మలేషియాలోనే ఓ పెద్ద కంపెనీలో ఆయన వర్క్ చేస్తుంటారు. లైఫ్‌ కూల్‌గా సాగుతుంది. 35ఏళ్లు  వచ్చినా పెళ్లి కాదు. పెళ్లి సంబంధాల కోసం ఇండియా రప్పిస్తారు పేరెంట్స్. ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తే రిజెక్ట్ చేస్తుంటాడు. అమ్మాయిని చూస్తే లవ్ పుట్టాలని, మనసులో ఆ ఫీలింగ్‌ వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెబుతుంటాడు. సడెన్‌గా తమ బంధువుల్లో ఓ వృద్ధుడు చనిపోతాడు. అక్కడ లీలా(మృణాళిని రవి)ని చూసి పడిపోతాడు. తనకు కావాల్సిన అమ్మాయి ఆమెనే అని ఫిక్స్ అవుతాడు. లీలా హీరోయిన్‌ కావాలని కలలు కంటుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ ప్రయత్నాల్లో ఉంటుంది. కానీ ఇంట్లో మాత్రం తాను సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌ చేస్తున్నట్టుగా అబద్దం చెబుతుంది. లీలాని చూసినప్పుడు అరవింద్‌ అదోలా ప్రవర్తించడం చూసిన అమ్మ.. వాళ్ల నాన్నకి చెప్పి సంబంధం మాట్లాడమంటుంది. ఆ సంబంధం ఖాయమవుతుంది. లీలా పెట్టిన కండీషన్‌కి అరవింద్‌ కూడా ఓకే చెప్పడంతో ఇద్దరికి పెళ్లి అవుతుంది. హైదరాబాద్‌కి వచ్చేస్తారు. వచ్చే ముందు తన ఫ్రెండ్స్ ని కూడా తెచ్చుకుంటుంది లీలా. అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. తనకు అరవింద్‌ అంటే ఇష్టం లేదనే విషయాన్ని ఆమె మ్యానేజ్‌ చేయలేక, వెంటనే విడాకులు అడుగుతుంది. అతనితో ఏమాత్రం ఫ్రీగా ఉండదు. దీంతో అరవింద్‌ అయోమయంలో ఉంటాడు. ఆమెకి దగ్గరయ్యేందుకు  లవ్‌ గురు(యోగిబాబు) సహాయంతో ఓ ప్లాన్‌ వేస్తాడు. మరి ఆ ప్లానేంటి? అది ఎలా పనిచేసింది?. లీలా జీవితంలో ఉన్న విక్రమ్‌ ఎవరు? హీరోయిన్‌ కావాలనే ఆమె కోరిక నెరవేరిందా? అరవింద్‌, లీలా దగ్గరయ్యారా? విడిపోయారా? అరవింద్‌ జీవితంలోని ట్విస్ట్ ఏంటి? అనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః 
విజయ్‌ ఆంటోనీ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తారు. ఏదో ఒక సందేశాన్ని ఆయన అంతర్లీనంగా అందిస్తుంటారు. ఆయన సక్సెస్‌ ఫుల్‌ మూవీస్‌ అన్నింటిలోనూ ఆ ఎలిమెంట్లు ఉంటాయి. చివరగా ఆయన నటించిన `బిచ్చగాడు 2`లోనూ సంపన్నులు, పేదలు అనే అసమానతలను చర్చించారు. సిస్టర్‌ సెంటిమెంట్‌ని హైలైట్ చేశారు. ఇలా ఎమోషన్స్, సెంటిమెంట్‌, కమర్షియల్‌ అంశాలను బ్యాలెన్స్  చేస్తూ సినిమాలు తీస్తూ సక్సెస్‌ కొడుతున్నాడు. ఇప్పుడు నటించిన `లవ్‌ గురు`లోనూ అలాంటి అంశాలకు పెద్దపీట వేశారు. పూర్తి క్లీన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించడం విశేషం. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయి భర్తతో ఉండలేక ఇబ్బంది పడితే, ఆమెకి దగ్గరయ్యేందుకు భర్త చేసే ప్రయత్నం ఏంటనేది `లవ్‌ గురు` అసలు కథ. దీన్ని ఎలా నడిపించాడు, ఎంత ఎంటర్టైనింగ్‌గా తీసుకెళ్లాడు అనేది ఇందులో మెయిన్‌ పార్ట్, ఆ విషయంలో కొంత వరకు సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. 
 

కెరీర్‌కి ప్రయారిటీ ఇస్తూ ప్రేమ వంటి ఆనందాలను పక్కన పెట్టి లైఫ్‌లో సెటిల్‌ అయ్యే సరికి అబ్బాయిలకు ఏజ్‌ అయిపోతుంది. ఏజ్‌ పెరిగాక అమ్మాయిలను ఇచ్చేందుకు ముందుకు రారు, తనకు నచ్చిన అమ్మాయి దొరకడం కష్టం. ఈ క్రమంలో తన యంగ్‌ ఏజ్‌లో మిస్‌ అయిన ప్రేమని పొందేందుకు హీరో లేట్‌ వయసులో తపించడం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మరోవైపు సినిమా హీరోయిన్‌ కావాలనుకునే అమ్మాయి ఇంట్లో నిజం చెప్పలేక, నచ్చని పని చేయలేక హీరోయిన్‌ ప్రయత్నాల్లో ఉన్న అమ్మాయి జర్నీ నేటి తరం అమ్మాయిల ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. ఇలా రెండు కోణాలను, రెండు రకాల మనస్తత్వాలను కళ్లకి కట్టినట్టు చూపించారు `లవ్‌ గురు`లో. అదే సమయంలో పెళ్లి చేసుకున్న అమ్మాయికి తనంటే ఇష్టం లేదని తెలిసి ఆమెకి దగ్గరయ్యేందుకు హీరో చేసే ప్రయత్నాలు ఆలోచింప చేస్తాయి. అమ్మాయి ప్రేమని పొందేందుకు మగవారు ఎంత దూరం అయినా వెళ్తారని, ఏమైనా చేస్తారనేదానికి ఈ మూవీ నిదర్శనంగా నిలుస్తుంది. 
 

సినిమా మొదటి భాగం సరదాగా సాగుతుంది. ఫన్నీ వేలో వెళ్తుంది. సినిమా ప్రభావం, సిటీ కల్చర్‌ కారణంగా అమ్మాయి చాలా అడ్వాన్స్ గా ఉన్న తీరుకి, హీరో అమాయకత్వానికి, ఆమె చేష్టలకు ఆయన రియాక్ట్ అయిన తీరు ఆద్యంతం ఫన్నీగా ఉంటాయి, నవ్వులు పూయిస్తాయి. పెళ్లై సిటీలో ఇంటికి వచ్చాక చోటు చేసుకునే సన్నివేశాలు నవ్వులు పూయించేలా ఉంటాయి. కొంత సాగదీతగా ఉన్నా, మధ్య మధ్యలో వచ్చే ఈ సన్నివేశాలు అలరిస్తాయి. ముఖ్యంగా హీరో తమ పేరెంట్స్ లవ్‌ స్టోరీ సీన్లు బయటపెట్టడం హిలేరియస్‌గా ఉంటాయి. సెకండాఫ్‌ మొత్తం కాస్త ఎమోషనల్‌ సైడ్‌ తీసుకుంటుంది. భార్యకి దగ్గరయ్యేందుకు తను చేసే ప్రయత్నాలు, అతను వేసే ప్లాన్‌, ఈక్రమంలో కొన్ని దొరికిపోయేలా ఉండే సీన్లు నవ్వులు పూయించినా రొటీన్‌ డ్రామాగా మారింది. ఇలాంటి సీన్లు తెలుగు సినిమాల్లో తరచూ చూస్తేనే ఉంటాం. మరోవైపు సిస్టర్‌ సెంటిమెంట్‌ కూడా రొటీన్‌గానే ఉంటుంది. `బిచ్చగాడు2`లోనూ అదే సెంటిమెంట్‌, ఇందులోనూ అలాంటిదే వాడటంతో ఆయా సీన్లు తేలిపోయాయి, రొటీన్‌ ఫీలింగ్‌ కలుగుతాయి. చివర్లో ఎమోషనల్‌ సైడ్‌లో తీసుకుని, వచ్చే ట్విస్ట్ ఫర్వాలేదనిపిస్తుంది. కానీ వాహ్‌ అనేలా ఉండవు. మొదటి భాగం కాస్త స్లోగా సాగడం, సెకండాఫ్‌ అంతా డ్రామా వైపు తీసుకోవడం సినిమాకి మైనస్‌. అలానే సరదాగా తీసుకెళ్లి, చివర్లో ఎమోషనల్‌గా ముగింపు పలికితే బాగుండేది. ల్యాగ్‌ సీన్లు, స్లో నెరేషన్‌, చాలా చోట్ల ఫన్‌ వర్కౌట్‌ కాకపోవడం, లవ్‌లో డెప్త్ లేకపోవడం, చివర్లో వచ్చే ట్విస్ట్ పెద్దగా పేలకపోవడంతో సినిమా యావరేజ్‌గా నిలిచింది. 
 

నటీనటులుః 
అరవింద్‌ పాత్రలో విజయ్‌ ఆంటోనీ బాగా సూట్‌ అయ్యాడు, బాగా చేశాడు. ఏజ్‌కి తగ్గ పాత్రతో అలరించారు. తన మామయ్య పాత్రతో, పేరెంట్స్ పాత్రలతో ఆయన చేసే కామెడీ అదిరిపోయింది. మృణాళిని రవి చాలా వరకు సీరియస్‌గా కనిపిస్తుంది. ప్రారంభంలో కాస్త ఫన్నీగా చేసింది. ఇలా విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె మెప్పించింది. యోగిబాబు కనిపిస్తే హిలేరియస్‌ కామెడీ వస్తుంటుంది. కానీ ఇందులో ఆయన్నుంచి కామెడీని పిండుకోలేకపోయాడు దర్శకుడు. ఆ విషయంలో ఫెయిల్‌ అయ్యాడు. ఇక హీరో మామయ్యగా వీటీవీ గణేష్‌ పాత్ర నవ్వులు పూయిస్తుంది. ఆయన పాత్ర సినిమాకి పెద్ద రిలీఫ్‌. మరోవైపు తలైవాసల్‌ విజయ్‌ హీరోయిన్‌ తండ్రిగా బాగా చేశాడు. ఒదిగిపోయాడు. హీరోయిన్‌ ఫ్రెండ్స్ గా నటించిన ముగ్గురు బాగా చేశారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. 
 

టెక్నీషియన్లుః
భరత్‌ ధనశేఖర్‌ మ్యూజిక్‌ సినిమాకి కీలక పాత్ర పోషిస్తుంది. బీజీఎం బాగుంది. పాటలు అంతగా ఎక్కేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగుంది. చాలా సీన్లని ఎలివేట్‌ చేయడంలో కీలక భూమిక పోషించింది. ఫరూక్‌ జే బాష కెమెరా వర్క్ బాగుంది. విజువల్‌గా ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్‌ కొంత కట్‌ చేయాల్సింది. స్లో నరేషన్‌ తీసేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. విజయ్‌ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌ రాజీపడకుండా నిర్మించింది. దర్శకుడు వినాయక్‌ వైద్య నాథన్‌..కిది తొలి చిత్రమైనా బాగా చేశాడు. అనుభవం ఉన్న దర్శకుడిలా ఆయన పనితనం కనిపిస్తుంది. చాలా సీన్లని బాగా రాసుకున్నారు. కానీ వెండితెరపై ఆవిష్కరించడంలో కొంత డిఫరెంట్స్ వచ్చింది. డైలాగ్‌లు, సీన్లు చాలా వరకు ఆకట్టుకునేలా ఉన్నాయి. 
 

ఫైనల్‌గాః `లవ్‌ గురు`..జస్ట్ ఓకే గురు
రేటింగ్‌ః 2.75 

నటీనటులుః విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి, వీటీవీ గణేష్‌, తలైవాసల్‌ విజయ్‌, ఇళవరస, సుధ, శ్రీజ రవి తదితరులు. 

దర్శకత్వంః వినాయక్‌ వైద్యనాథన్‌, 
కెమెరాః ఫరూక్‌ జే బాష
మ్యూజిక్ః భరత్ ధనశేఖర్‌
ఎడిటింగ్‌ః విజయ్‌ ఆంటోని
నిర్మాత విజయ్‌ ఆంటోనీ
బ్యానర్‌ః విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌
 

Latest Videos

click me!