Mangalavaram Movie Review: `మంగళవారం` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Nov 17, 2023, 7:15 AM IST

`ఆర్‌ఎక్స్ 100` తర్వాత అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌ కాంబినేషన్‌లో రూపొందిన `మంగళవారం` మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

`ఆర్‌ఎక్స్ 100` చిత్రంతో ఒక్కసారిగా స్టార్స్ అయిపోయాడు హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌, దర్శకుడు అజయ్‌భూపతి, హీరో కార్తికేయ. అయితే ఈ ముగ్గురికి మళ్లీ హిట్‌ పడలేదు. ఎన్నోప్రయత్నాలు చేసినా నిరాశే ఎదురయ్యింది. ఈనేపథ్యంలో తాజాగా దర్శకుడు అజయ్‌, హీరోయిన్ పాయల్ మరోసారి కలిశారు. హిట్ కొట్టాలని డిసైడ్‌ అయ్యారు. తాజాగా `మంగళవారం` అనే సినిమాతో వస్తున్నారు. ఇందులో పాయల్‌తోపాటు నందితా శ్వేత, రవీంద్ర విజయ్‌, శ్రీతేజ్‌, అజయ్ ఘోస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. స్వాతిరె్డి గునుపాటి, ఎం సురేష్‌ వర్మ, అజయ్‌ భూపతి నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(నవంబర్‌ 17)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
మహాలక్ష్మిపురం అనే గ్రామంలో అర్థరాత్రి భయానక శబ్దాలు వస్తుంటాయి. ఓ లేడీ తన నెత్తిన బోనాలు ఎత్తుకుని ఊరంతా తిరుగుతుంటుంది. మరోవైపు చిన్నప్పట్నుంచి శైలజ(పాయల్‌ రాజ్ పుత్‌), రవి(చైల్డ్ ఆర్టిస్ట్) మంచి స్నేహితులు. శైలజ అమ్మ చనిపోవడంతో నాన్న రెండో పెళ్లి చేసుకుంటుంది. దీంతో అమ్మమ్మ వద్ద పెరుగుతుంటుంది. తనకు అన్ని రకాలుగా అండగా ఉన్న రవి, వాళ్ల నాన్న మంటల్లో చనిపోతారు. దీంతో శైలజ ఒంటరైపోతుంది. కట్‌ చేస్తే పదేళ్ల తర్వాత.. మంగళవారం రోజున ఆ ఊర్లో గోడపై ఓ జంట మధ్య అక్రమ సంబంధం ఉందని రాసి ఉంటుంది. ఇది చూసి అంతా షాక్‌ అవుతారు. కట్‌ చేస్తే ఆ ఇద్దరు ఊరు అవతల బావి వద్ద ఆత్మహత్య చేసుకుని కనిపిస్తారు. ఆ ఊరు కట్టుబాట్ల ప్రకారం, జమిందారు ప్రకాషం బాబు(చైతన్య కృష్ణ) ఆదేశాలప్రకారం చనిపోయిన వారికి పోస్ట్ మార్టం చేయడానికి లేదు. అయితే మరో మంగళవారం కూడా అలాంటిదే గోడపై రాస్తారు,ఆ జంట ఆత్మహత్య చేసుకుంటారు. రంగంలోకి దిగిన ఎస్‌ఐ మీనా(నందితా స్వేత) ఇది హత్యలే అని నిర్థారిస్తుంది. పోస్ట్ మార్టం నిర్వహిస్తుంది. అదే సమయంలో ఊర్లో ఆర్‌ఎంపీ డాక్టర్‌ విశ్వనాథం.. ఊరు చివరన ఉన్న బావి వద్ద  దెయ్యం రూపంలో శైలజని చూసినట్టు చెబుతాడు. దీంతో రకరకాలు రూమర్లు ఊపందుకుంటాయి. ఎవరో కావాలనే ఈ హత్యలు చేస్తున్నారని, మంగళవారం రోజు గోడలపై ఈ అక్రమసంబంధాల పేర్లు రాస్తూ వారిని చంపేస్తున్నారని ఊరుజనం భావిస్తారు. వారిని పట్టుకోవాలని రాత్రిళ్లు కాపలా కాస్తుంటారు. మరి వారికి తెలిసిన నిజాలేంటి? విశ్వనాథం చెప్పినట్టు ఊర్లో దెయ్యం ఉందా? గోడలపై పేర్లు రాస్తున్నది ఎవరు? వారిని చంపుతున్నది ఎవరు? శైలజ ఏమైంది? శైలజ ఫ్రెండ్ రవి ఎవరు? మంగళవారం రోజునే ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? జమిందార్‌ భార్యకి దీనికి సంబంధం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.  
 


విశ్లేషణః
`మంగళవారం` సినిమా టీజర్‌, ట్రైలర్లని బట్టి చూస్తే ఇదొక హర్రర్, థ్రిల్లర్‌గా అనిపిస్తుంది. కానీ ఇందులో మంచి సందేశం ఉంది. గూస్‌బంమ్స్ తెప్పించే థ్రిల్లింగ్ ఎలిమెంట్లు ఉన్నాయి. సినిమాలో గ్రామ దేవత, థ్రిల్లర్‌ ఎలిమెంట్ల బ్యాక్‌ డ్రాప్‌లో అదిరిపోయే అక్రమ సంబంధాల కథని చెప్పాడు దర్శకుడు అజయ్‌ భూపతి. ఊహించని విషయాలను పలు ట్విస్ట్ ల రూపంలో వెల్లడించారు. దీంతోపాటు ఇప్పటి వరకు సినిమాల్లో చర్చకు రాని అతిగా శృంగార కోరికలు అనే అంశాన్ని కూడా టచ్‌ చేశాడు. ఓ రకంగా ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకోవడం ఓ ఛాలెంజ్‌ అయితే, ఆ పాత్ర చేయడం మరో ఛాలెంజింగ్‌, దాన్ని అంతే డేర్‌గా వెండితెరపై ఆవిష్కరించడం సైతం పెద్ద సవాల్‌తో కూడుకున్న అంశం. అయితే ఆ ఛాలెంజ్‌ విషయంలో దర్శకుడు, అలాంటి పాత్ర చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌ సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. దీనికి `కాంతార` ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం, ఆర్‌ఆర్ తోడయ్యింది. బ్యాక్‌ బోన్‌లా నిలిచింది. అయితే ఇదొక హీరో, హీరోయిన్‌, విలన్‌ తరహా సినిమా కాదు. ఓ డిఫరెంట్‌ మూవీగా ఇది నిలుస్తుంది. హీరో విలన్‌ అనే కాన్సెప్ట్ ని బ్రేక్ చేసిన మూవీ అవుతుంది, కథే హీరోగా నడిచే మూవీగా నిలుస్తుంది. 
 

సినిమా 1986లో ప్రారంభమవుతుంది. శైలజ, రవి స్నేహితులుగా ఎస్టాబ్లిష్‌ చేసి, శైలజ చిన్నప్పట్నుంచి ఎంతటి ఒంటరి తనాన్ని అనుభవిస్తుంది, తను ఎంతటి అవమానాలను ఫేస్‌ చేస్తుందనే విషయాలను చూపించారు. అదే సమయంలో చిన్నప్పుడే చైల్డ్ అబ్యూజింగ్‌ వంటి అంశాలను తను ఫేస్‌ చేసి చూపించి కథని ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. అదే సమయంలో చాలా అంశాలను సస్పెన్స్ తో నడిపించాడు. ఆ సీన్‌లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠని ఆడియెన్స్ లో కలిగించేలా చేశాడు. అదే టెంపోని సినిమా మొత్తం మెయింట్‌ చేశాడు. మొదటి భాగంలో ఊర్లో రాత్రి ఓ మహిళ దేవతలా పరిగెత్తే అంశాలు, కుక్క మొరుగుతూ ఊరంతా తిరగడం, రకరకాల శబ్దాలు థ్రిల్‌కి గురి చేస్తుంటాయి. ఏం జరుగుతుందో అనే ఉత్కంఠని రేకెత్తిస్తుంటాయి. ఈ క్రమంలో గోడలపై అక్రమసంబంధాలకు సంబంధించిన పేర్లు రాయడం వాళ్లు ఆత్మహత్య చేసుకోవడం, ఏవో సస్పెన్స్ అంశాలను చూపించడం వంటి ఆద్యంతం ఎంగేజింగ్‌గా అనిపిస్తుంటుంది. మొదటి భాగం ఎక్కడ ఆగకుండా పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఇంటర్వెల్‌ వరకు సినిమాని పరుగులు పెట్టించారు. ఇంతటి ఉత్కంఠ పరిస్థితుల్లోనూ అజయ్‌ ఘోష్‌ పాత్రలో కామెడీని పండించాడు. ఎంటర్‌టైన్‌ చేశారు. 
 

ఇంటర్వెల్‌ లో పాయల్‌  పాత్రకి సంబంధించిన ట్విస్ట్ ని రివీల్‌ చేస్తూ సెకండాఫ్‌పై ఆసక్తిని రేకెత్తించాడు. సెకండాఫ్‌ పాయల్‌ పాత్ర కథని చెబుతాడు. ఆమె ఎలా పెరిగింది? ఎలాంటి అవమానాలు ఫేస్‌ చేసింది, ఆమె ప్రేమలో విఫలం కావడం, ఊరంగా ఆమెని హేళన చేసిన కొట్టడం, అలాగే ఆమెలోని అతి శృంగార కోరికలు అనేఅంశాలను రివీల్‌ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాడు దర్శకుడు. అయితే సెకండాఫ్‌ మొత్తం పాయల్‌ ఫ్యామిలీ అంశాలు, లవ్‌ ఫెయిల్యూర్‌ అంశాలను చాలా ఎమోషనల్‌గా, నటకీయంగా ఆవిష్కరించారు. దీంతో సినిమా వేగాన్ని తగ్గించాయి. మొదటిభాగం మాదిరిగా రేసిగా సాగలేదు. చివరి ఇరవై నిమిషాల వరకు పాయల్‌ క్యారెక్టర్‌లోని సంఘర్షణని, ఆమె పడ బాధలపై ప్రధానంగా ఫోకస్‌ చేశాడు. అవి హృదయ విదారకంగా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ ని మాత్రం నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. ఒక్కో ట్విస్ట్ ని పరిచయం చేస్తూ, షాకింగ్‌ విషయాలను వెల్లడిస్తుంటే గూస్‌ బంమ్స్ వస్తుంటాయి. అయితే సినిమా మొత్తం సినిమాకి అజనీష్‌ లోక్‌ నాథ్‌ సంగీతం పెద్ద అసెట్‌. ఇంకా చెప్పాలంటే గూస్‌బంమ్స్ తెప్పించే ఆర్‌ఆర్‌ సినిమాని ఆద్యంతం పరుగులు పెట్టించింది. సినిమాకి అజయ్‌భూపతి కథ, టేకింగ్‌ ఒక ఎత్తైతే, అజనీష్‌ బీజీఎం రెండు ఎత్తులుగా నిలిచిందని చెప్పాలి. సినిమాకి అదే హైలైట్‌. సాధారణ సీన్‌ని కూడా ఎలివేట్‌ చేసిన తీరు అదిరిపోయింది. మంచి థ్రిల్లింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఉండటం సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్. సినిమాలో కొన్ని ఎలిమెంట్లు లాజిక్‌కి అందని విధంగా ఉన్నాయి. సినిమాలో ఆర్‌ఆర్‌ ఎఫెక్ట్ తప్ప పెద్దగా కథ లేదు. హీరోయిన్‌ పాత్ర తాలుకూ ఎలిమెంట్లని, ఊర్లో భయానక పరిస్థితులకు అంతగా సింక్‌ కుదరలేదు. హీరోహీరోయిన్‌ అనే ఎలిమెంట్లు లేకపోవడం కొంత మైనస్‌గా చెప్పొచ్చు. పాయల్‌లోని కామ విషయాలను మరి శృతిమించినట్టుగా, బోల్డ్ గా చూపించడం కన్విన్సింగ్‌గా లేదు. ఓవర్‌డోస్‌ అనిపిస్తుంది.
 

నటీనటులుః

శైలజ పాత్రని ఎంచుకోవడంలోనే పాయల్ రాజ్‌పుత్‌ సక్సెస్‌ అయ్యింది. ఇలాంటి టిఫికల్ రోల్‌ని, అరుదైన పాత్రని చేయడమంటే చాలా గట్స్ కావాలి. ఎంత పెద్ద నటి అయినా ఇలాంటి రోల్స్ చేయడానికి సాహసం చేయరు. ఆ విషయంలో పాయల్‌ గట్స్ కి మొక్కాల్సిందే. అయితే `ఆర్‌ఎక్స్ 100` లో కాస్త ఇలాంటి టచ్‌ ఉన్న పాత్ర చేయడంతో ఇందులో ఆమె పర్‌ ఫెక్ట్ యాప్ట్ గా నిలిచింది. పాత్రలో జీవించింది. అద్బుతమైన నటనతో మెప్పించింది, అలరించింది, భావోద్వేగానికి గురిచేసింది, గుండెల్ని పిండేసింది. అయ్యో అనేలా చేసింది. మరోవైపు అజయ్‌ ఘోష్‌ సైతం ఊర్లో బలాదూర్‌ తిరుగుతూ బాతకానీ కొట్టే పాత్రలో అకట్టుకున్నాడు,నవ్వులు పూయించాడు. జమిందార్‌గా చైతన్య కృష్ణ అలరించాడు. ఏజ్‌కి మించిన పాత్ర అయినా ఓకే అనిపించాడు. ఎస్‌ఐగా నందిత శ్వేత అదరగొట్టింది. డాక్టర్‌ విశ్వనాథంగా రవీంద్ర విజయ్‌ నటన సూపర్‌. ఆయన పాత్రలోని ట్విస్ట్ మైండ్‌ బ్లోయింగ్‌ అనిపిస్తుంది. శ్రీతేజ, శ్రవణ్‌ రెడ్డి లు సైతం మెప్పించారు. లక్ష్మణ నవ్వులు పూయించాడు. జమిందార్‌ భార్యగా దేవి పిళ్లై పాత్రలోని ట్విస్ట్ బాగుంది. ఆమె కూడా అదరగొట్టింది. ఇందులో నటన పరంగా ఎవరికీ వంక పెట్టడానికి లేదు. అంత బాగా చేశారు.
 

టెక్నీషియన్లుః 

సినిమాకి మ్యూజిక్‌ పెద్ద బ్యాక్‌ బోన్‌. అజనీష్‌ లోక్‌నాథ్‌ మరోసారి రెచ్చిపోయాడు. ఆర్‌ఆర్‌తో పిచ్చెక్కించాడు. ఈ రేంజ్‌లో బీజీఎం లేకపోతే సినిమా ఇంత క్రేజీగా ఉండేది కాదని చెప్పొచ్చు. సౌండింగ్‌ మాత్రం గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంటుంది. సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మ్యూజిక్‌ డైరక్టర్‌. దాశరథి శివేంద్ర కెమెరా వర్క్ సినిమాకి మరో హైలైట్‌. కెమెరా యాంగిల్స్ కూడా క్రేజీగా ఉన్నాయి. ఇందులో రామ్‌గోపాల్‌ వర్మ కెమెరా యాంగిల్స్ ఎక్కువగా కనిపించాయి. ఎడిటింగ్‌ పరంగా ఓకే అనిపించింది. ఇక డైరెక్షన్‌ సినిమాకి మరో అసెట్‌. అజయ్‌ భూపతి తీసిన షాట్స్ వాహ్‌ అనేలా ఉన్నాయి. సీన్లో ఏం లేకపోయినా ఆ ఎఫెక్ట్స్ తో ఉత్కంఠకి గురి చేయడం విశేషం. అయితే పాత్రలోని ఎమోషన్‌ని, ఆమె సమస్యని అవసరానికి మించి చూపించినట్టుగా అనిపిస్తుంది. ఆ విషయంలో దర్శకుడు బ్యాలెన్స్ తప్పాడనే ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ రెండున్నర గంటలు ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేయడంలో మాత్రం ఆయన సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. 
 

ఫైనల్‌గాః `మంగళవారం` థ్రిల్‌ చేసే మూవీ. అక్రమసంబంధాలపై సందేశం బాగుంది. దాన్ని ఓవర్‌ డోస్‌లో చెప్పినట్టుంది.

రేటింగ్‌ః 3

నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్, లక్ష్మణ్, దేవి పిళ్లై తదితరులు . 
మాటలు: తాజుద్దీన్ సయ్యద్ & రాఘవ్
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్
రసంగీతం: అజనీష్ లోక్‌నాథ్
నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అజయ్ భూపతి
విడుదల తేదీ: నవంబర్ 17, 2023  

Latest Videos

click me!